– రిపబ్లిక్ డే సహా జాతీయ పండుగలకు అదే శాశ్వత వేదిక – పదివేల మంది కూర్చొనేలా ఏర్పాట్లు – తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటాలి – అవసరమైన ఏర్పాట్లకు సీఎం ఆదేశం – ఖిల్లాకు వచ్చి.. స్థలం ఎంపిక చేసిన కేసీఆర్ – కోటలోని రాణి మహల్ సమీపంలో ఉన్న తారామతి మజీద్‌కు పైభాగంలో.. బాలా-ఈ-హిస్సార్ కింద పతాకావిష్కరణ – కవాతు, శకటాల ప్రదర్శన కోట పక్కనే ఉన్న అఠారా చిడీల వద్ద…

పంద్రాగస్టు వేడుకలే కాకుండా గణతంత్ర దినోత్సవాలను కూడా ఏటా గోల్కొండ కోటలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గోల్కొండ కోట చరిత్ర, సాంస్కృతిక నేపథ్యాలను ప్రజలకు చాటిచెప్పేందుకే ఇక్కడ జాతీయ పండుగలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
అన్ని రాష్ట్ర స్థాయి వేడుకలను ఇక నుంచి ఇక్కడే నిర్వహించేందుకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సోమవారం స్వయంగా ఖిల్లాకు వచ్చారు. కోటలో కలియ తిరిగిన ముఖ్యమంత్రి, పతాకావిష్కరణకు అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు. రాణి మహల్ సమీపంలో ఉన్న తారామతి మజీద్‌కు పై భాగంలో బాలా-ఈ-హిస్సార్ కింద పతాకావిష్కరణ చేయాలని నిర్ణయించారు. తారామతి మజీద్‌కు ఎదురుగా ఉన్న విశాలమైన పచ్చిక బయలులో ఆహ్వానితులు కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ ప్రాంతంలో 10 నుంచి 12 వేల మంది కూర్చోవచ్చునని అధికారులు సీఎంకు తెలిపారు. పతాకావిష్కరణ చేసే సమయంలో చుట్టు పక్కల బురుజులు, ఎత్తైన కట్టడాలపై నుంచి కళారూపాలను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పూర్తిగా కోట లోపలి భాగంలోనే నిర్వహించనున్నారు. పోలీసుల గౌరవ వందనాన్ని కూడా అక్కడే స్వీకరిస్తారు. పోలీసు కవాతు, శకటాల ప్రదర్శనకు విశాల ప్రాంతం కావాల్సి ఉండడంతో కోట పక్కనే ఉన్న అఠారా చిడీల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. దీనిని పూర్తిగా చదును చేసి 2015 జనవరి 26 నాటికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఢిల్లోని ఎర్రకోట తరహాలోనే గోల్కొండ కోట వద్ద జరిగే పంద్రాగస్టు వేడుకలను ప్రపంచమంతా ఆసక్తిగా చూడాలని సీఎం అన్నారు. ముఖ్యమంత్రి గోల్కొండ కోటను పరిశీలించిన సమయంలో ఆయనతో పాటు మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, నగర మేయర్ మాజీద్ హుస్సేన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రభుత్వ సలహాదారు పాపారావు, డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎంకే మీనా ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
ముందే పరిశీలనకు వచ్చిన అధికారులు గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించాలని సీఎం ఆదివారం తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం ఉదయం అధికారులు ఖిల్లాకు వచ్చి పరిశీలన జరిపారు. వేడుకల నిర్వహణకు అనువైన స్థలాలు అన్వేషించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మీనా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఇందుకోసం గోల్కొండలో పర్యటించారు. గోల్కొండలోని ఆర్మీ స్టేడియం, దర్గా పక్కన ఖాళీ స్థలంతో పాటు, గోల్కొండ కోటలోని గార్డెన్, దర్బార్ హాల్‌కు వెనక వైపు గల అట్టారా చిడీలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ప్రందాగస్టు వేడుకల్లో ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననుండడంతో సెక్యురిటీ, పార్కింగ్ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని అనువైన స్థలం కోసం అన్వేషించారు.
నాలుగు ప్రాంతాల్లోకి విశాలమైన ప్రాంతంగా అట్టారా చిడీ ఖాళీ స్థలంపై ప్రాథమికంగా అవగాహనకు వచ్చారు. సీఎం వచ్చిన తర్వాత వేడకల నిర్వహణ స్థలం ఖరారు కావడంతో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో మరమ్మతులు ప్రారంభించారు. స్వాతంత్య్ర దినోత్సవానికి కొద్ది రోజులే ఉండడంతో తక్కువ సమయంలో ఏర్పాట్లు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
పంద్రాగస్టు నాడు ప్రదర్శనకు 22 శకటాలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పతాకావిష్కరణ అనంతరం శకటాల ప్రదర్శన కోసం 22 శాఖలు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాల్లో శకటాలు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను ప్రతిబింబించేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. దీంతో వివిధ శాఖల అధికారులు శకటాలను అందంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. తాము తయారు చేసిన నమూనా శకటాలను సోమవారం సచివాయలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అధికారులు చూపించారు. దేవాదాయ శాఖ, ఉద్యానవన శాఖ, పోలీసు శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ, విద్యుత్ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, నీటి పారుదల శాఖ, విద్యా శాఖ, సాంస్కృతిక శాఖల నమూనా శకటాలను సీఎంకు చూపించారు. ఇందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.