Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇక మాటలు లేవు.. చేతలే

ఇక మాటలు చెప్పడం ఉండదు.. చేతలే ఉంటాయి. అభివృద్ధిలో దూసుకుపోదాం. నాలుగున్నరేండ్లలో తెలంగాణలో కరువు భూతాన్ని తరుముదాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. గజ్వేల్‌కు అధికారులనే తీసుకువచ్చి అభివృద్ధిపై మాట్లాడతానని చెప్పినా.. తీసుకుని వచ్చిన అని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గంలో మరో మూడు 132కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సరిపడే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను అందించాలని సీపీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని ఆదేశించారు.

-విద్యుత్ సమస్యల పరిష్కారానికి పవర్ డే -రూ. 411 కోట్లతో గజ్వేల్ రోడ్లకు మహర్దశ -రూ.250 కోట్లతో 606 చెరువుల పునరుద్ధరణ -మొక్కల పెంపకంలో ఆదర్శ గ్రామాలకు రూ.10 లక్షలు -ఉద్యాన వర్సిటీ, అటవీ కళాశాల, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైను ఏర్పాటు -రూ.250 కోట్లతో గ్రీన్‌హౌస్ కల్టివేషన్ -గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి సమీక్షలో సీఎం కేసీఆర్ CM-KCR-at-Medak

గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రయోగాత్మకంగా పవర్ డే పెట్టుకోవాలని ఆదేశించారు. ఆ రోజు జిల్లా స్థాయి విద్యుత్ అధికారులంతా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లి వేలాడుతున్న విద్యుత్ తీగలను, వంగిన విద్యుత్ స్తంభాలను సరిచేయడంతో పాటు శిథిలావస్థలో ఉన్నవాటిని మార్చాలి.

ఈ కార్యక్రమం ఉద్యమ రూపంలో జరగాలి. ఆ రోజు నేను కూడా వస్తా. ఏదో ఒక ఊరిలో వంగిన విద్యుత్ స్తంభాన్ని సరిచేస్తా అని అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల రహదారులకు మహర్దశ వచ్చిందని ముఖ్యమంత్రి కేసీర్ పేర్కొన్నారు. గత సమైక్య పాలకులు నిధులు ఇవ్వకపోవడంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని.. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లన్నీ పూర్తి స్థాయిలో బాగుచేస్తామన్నారు. ఇందుకు రూ.411కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో సమస్యలు తెలుసుకోవడానికి త్వరలోనే పట్టణంలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో డబుల్ రోడ్డు, స్ట్రీట్ లైట్లు వేయాలని అధికారులను ఆదేశించారు.

CM-KCR-at-Medak1

రైతుల జాతకాలే మారుతాయి.. అన్నదాతకు ఆధారమైన చెరువులను 11వ శతాబ్దంలోనే కాకతీయ రెడ్డిరాజులు అద్భుతంగా నిర్మించారని.. గత సమైక్య పాలకులు వాటిని నాశనం చేశారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. చెరువుల్లోకి నీళ్లు వచ్చిన రోజున రైతుల జాతకాలు పూర్తిగా మారిపోతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 45వేల చెరువులున్నాయని కాకతీయ మిషన్‌లో భాగంగా అన్ని చెరువులను మరమ్మతు చేయన్నుట్లు వెల్లడించారు. చెరువుల పునరుద్ధరణతో తెలంగాణలో కరువుభూతాన్ని తరిమివేద్దామని, ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. గజ్వేల్ నియోజకవర్గంలో 1,212 చెరువులకు గాను 50శాతంగా 604 చెరువులను రూ.250కోట్లతో మరమ్మతు చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి తానే స్వయంగా శంఖుస్థాపన చేస్తానని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన ప్రాణహిత-చేవేళ్ల ద్వారా గజ్వేల్ నియోజవకర్గంలో 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నదని.. ఇందుకు గజ్వేల్ నియోజకవర్గంలోని పాములపర్తి వద్ద రూ.5వేల కోట్లతో 21టీఎంసీలు, సిద్దిపేట నియోజకవర్గంలోని తడ్కపల్లి వద్ద 30టీఎంసీల సామర్థ్యంతో భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం వెల్లడించారు. నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయే వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రీన్‌హౌస్ కల్టివేషన్‌కు రూ.250 కోట్లు కేటాయించామన్నారు.

పొలాల దగ్గరికే శాస్త్రవేత్తలు.. గోదావరి నీళ్లున్నా మనల్ని కరువు వెంటాడుతున్నదని, హైదరాబాద్ వంటి మహానగారానికి ఇతర రాష్ర్టాల నుంచి కూరగాయాలు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు కేవలం 10 శాతం కూరగాయలే వస్తున్నాయని చెప్తూ.. ఇక మీద ఆ పరిస్థితి ఉండొద్దన్నారు. గజ్వేల్‌లో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని.. కూరగాయ రైతులకు ఇదో వరం అన్నారు. శాస్త్రవేత్తలు ఇక మీదట పంట పొలాలకే వచ్చి రైతులకు సూచనలు ఇస్తారని పేర్కొన్నారు. రానున్న మూడేండ్లలో రూ.1100 కోట్లతో 240 కోట్ల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామం లో ఏడాదికి 40 వేల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించామని, నర్సరీలు కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొక్కల పెంపకంలో నంబర్‌వన్‌గా నిలిచిన గ్రామ సర్పంచ్‌కు ఆ గ్రామ అభివృద్ధికి రూ.10 లక్షలు ఇస్తామని సీఎం ప్రకటించారు. గజ్వేల్‌కు అటవీ కళాశాల మంజూరైందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో నంబర్‌వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతోనే మనోహారాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ పనులు కాలేదని, తమ ప్రభుత్వం అధికా రం చేపట్టిన ఆరునెలల్లోనే నిధులు మంజూరు చేసిందన్నారు.

కులమతాలకతీతంగా వైకుంఠధామం గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రయోగాత్మకంగా బస్‌షెల్టర్ నిర్మాణం చేపట్టనున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తన కోటాలోంచి ఇందు కు నిధులు ఇవ్వాలని కోరడంతో.. అక్కడే ఉన్న ప్రభాకర్‌రెడ్డి తన ఎంపీ కోటానుంచి రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, అవసరమనుకుంటే గజ్వేల్ డిపోకు కొత్త బస్సులు పంపిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎక్కడాలేని విధంగా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కులమతాలకతీతంగా సామూహిక వైకుంఠధామం (శ్మశానవాటిక)లు నిర్మాణం చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఇందుకోసం ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డిని తన కోటాలోని నిధులు ఇవ్వాలని కోరడంతో.. ఆయన రూ.50లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో చెత్త డంప్‌యార్డ్ నిర్మాణం చేపట్టి అపరిశుభ్రతను పారదోలాలని కేసీఆర్ ఆదేశించారు.

ఇందుకోసం గ్రామాల వారిగా భూమిని గుర్తించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 108 వాహనాల సంఖ్య పెంచామని, ప్రతి మండలానికి 104 వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో కోకాకోలా, ఐటీసీ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలతో పాటు మరో 5 ప్రతిష్టాత్మక పరిశ్రమలు రానున్నాయని కేసీఆర్ వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి మండల కేంద్రాలకు రూ.50లక్షలు, గ్రామానికి రూ.25లక్షలు, మదిర గ్రామాలకు రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి గజ్వేల్‌ను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని వంద శాతం పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించనున్నదని, అన్ని గ్రామాలకు డాంబర్‌రోడ్లు, చెరువులు కొత్త రూపు సంతరించుకోనున్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.