Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇక పింఛన్ల పంపిణీ

ఈనెల 15లోపు అర్హులైనవారందరికీ ఆసరా పింఛన్లను జారీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే ఆలస్యమైందన్న సీఎం ఇకనైనా త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అలాగే రాష్ట్రంలో పేదలందరికీ జనవరి 1 నుంచి పెంచిన కోటా ప్రకారం బియ్యం అందించాలని సూచించారు. -15కల్లా పింఛన్లు -31లోపు ఆహార భద్రతాకార్డుల జాబితా -జనవరి ఒకటి నుంచి కొత్త రేషన్ కోటా -సమన్వయంతో వాటర్‌గ్రిడ్ పనులు -కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశం

KCR Review on Pension

సచివాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పింఛన్ల పంపిణీ, ఆహారభద్రత కార్డుల జారీ, వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, హరితహారం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, రహదారులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గతంలో రూ. 200 ఉన్న పింఛన్‌ను ఐదింతలు పెంచి రూ.1000 చేశామని, దీనివల్ల ఎంతో మంది పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ఎంపికలో జాప్యంతో అనవసర ఆందోళన పెరిగిపోతున్నదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

నెలాఖరులోపు ఆహార భద్రతా కార్డుల జాబితా గ్రామీణ ప్రాంతాలలో లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరినీ పేదవారిగానే గుర్తించాలని సీఎం సూచించారు. పరిమితిలోపు ఆదాయం కలిగిన వారు అంగన్‌వాడీ కార్యకర్తలైనా, ప్రైవేటు ఉద్యోగస్తులైనా, ఇతరులైనా వారిని పేదలుగానే పరిగణించి పింఛన్లు, ఆహార భద్రతకార్డులు అందివ్వాలన్నారు. డిసెంబర్ 15లోగా పింఛన్లను పూర్తిచేయాలని, 31లోపు ఆహార భద్రతా కార్డుల జాబితా సిద్ధం చేయాలన్నారు. జనవరి 1 నుంచి కొత్త సంవత్సరంలో కొత్త కార్డులు, కొత్త పింఛన్లు అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. ఇందుకోసం నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. అర్హులు మిగిలిపోతే, దరఖాస్తులు తీసుకొని విచారణ జరిపి వారికి కూడా న్యాయం చేయాలన్నారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠినచర్యలు ప్రతి జిల్లాలో ఎంతో విలువైన ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయని, వాటి వివరాలు సేకరించి హద్దులు నిర్ణయించి, స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సూచించారు. జిల్లాల్లో చాలాచోట్ల ఆర్ అండ్ బీ, ఐబీ, ఫారెస్టు గెస్టుహౌస్‌లు నిరుపయోగంగా ఉన్నాయని, వాటికి కేటాయించిన స్థలం ఉపయోగంలో లేకపోవడంతో ఆ స్థలాలు, ప్రదేశాలు కబ్జాలకు గురవుతున్నాయన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్న అలాంటి స్థలాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ఆ భూములనే ఆదాయ వనరులుగా మార్చుకుని ఆయా జిల్లాల్లో అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టాలన్నారు.

ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్, జూరాల తదితర ప్రాజెక్టుల నిర్మాణం కోసం కూడా ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు, ఇతర అవసరాలకు చాలా భూమి కేటాయించారని, అవి కూడా కబ్జాలకు గురవుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. వాటి వివరాలు కూడా సేకరించి అక్రమాలు అరికట్టాలన్నారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మించే అవకాశాలను పరిశీలించాలని, అలా వీలుకాకుంటే కనీసం రెండు చోట్ల నిర్మించాలన్నారు. అవసరమైతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని పరిశ్రమల కోసం రిజర్వు చేయాలన్నారు. రైల్వే ట్రాక్‌లు, జాతీయ రహదారులు, ఇతర ముఖ్యమైన రహదారుల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని పరిశ్రమల స్థాపనకు అనువుగా తీర్చిదిద్దాలని చెప్పారు.

వాటర్‌గ్రిడ్ పనులు వేగవంతం ప్రతి ఇంటికీ మంచినీరు అందించాలన్న వాటర్‌గ్రిడ్ కార్యక్రమానికి కలెక్టర్లు సహకరించాలని సీఎం కేసీఆర్ కోరారు. ప్రాజెక్టు రిజర్వాయర్లలో 10 శాతం నీటిని గ్రిడ్ కోసం కేటాయించినందున, నీటిని తీసుకునేందుకు వీలుగా రిజర్వాయర్లలో ఇంటేక్‌వెల్స్ నిర్మించాలన్నారు. లిఫ్ట్ కమ్ గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించినందున, దీనికి అనుగుణమైన కొండప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంతాన్ని గ్రిడ్ కోసం అప్పగించాలని సూచించారు.

గ్రిడ్ కోసం పైపులైన్లు వేయడానికి అవసరమైన రైట్ ఆఫ్ వే ఇవ్వాలని చెప్పిన సీఎం ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిర్మించడం కోసం అవసరమైన స్థలాన్ని కేటాయించాలన్నారు. ఇంటేక్‌వెల్, ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతున్నందున పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సూచించారు. గ్రిడ్ కోసం సర్వే నిర్వహించే సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు.

కబ్జాలపై రాజీ వద్దు రాష్ట్రంలో చాలా చెరువులను రియల్టర్లు మింగేశారని, ఆక్రమణలు జరిగాయని, ఇప్పటికైనా చెరువుల భూముల రక్షణకు కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. చెరువు భూములను కబ్జా చేసిన వారి విషయంలో రాజీ పడొద్దన్నారు. ఫీడర్ చానెల్స్ (కట్టు కాలువ) కూడా చాలావరకు దురాక్రమణకు గురయ్యాయని, ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరించి కట్టు కాలువలను పునరుద్ధరించాలని సీఎం చెప్పారు. చెరువుల్లో నీరు ఖాళీ అవ్వగానే, పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని, ఏ చెరువు ముందు ఖాళీ అయితే ఆ పనులే ముందు చేపట్టాలన్నారు.

చెరువు మట్టితో పాడుబడిన బావులను నింపాలని, పొలాలకు తరలించాలని సూచించారు. చెరువు భూముల విషయంలో కోర్టు వివాదాలు ఉన్న నేపథ్యంలో వాటిని సమీక్షించాలని, కార్యదర్శుల కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏక్‌సాలా, ఏక్ ఫజలా పట్టాలపై కూడా ప్రభుత్వం త్వరలోనే స్థిరమైన నిర్ణయం తీసుకోనుందని సీఎం చెప్పారు. చెరువు అందాన్ని పెంచేందుకు చెరువు చుట్టూ సిల్వర్ ఓక్ చెట్లను పెంచాలన్నారు. ఈ బాధ్యతలను నీటిపారుదలశాఖ చేపట్టాలని కేసీఆర్ సూచించారు. ఇప్పటి వరకు ఎన్ని నర్సరీలు పెట్టారు? అక్కడ మొక్కల పెంపకం ఎలా ఉందో పరిశీలించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.

హరితహారంపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని, రోడ్ల పక్కన ఆకర్షణీయమైన పూలచెట్లను నాటాలన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వినియోగించుకోవాలని, మెటీరియల్ కాంపోనెంట్ నుంచి మట్టిని తొలగించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, రహదారుల పక్కన మొక్కలను విరివిగా పెంచాలన్నారు. పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఏర్పాటు చేసి మొక్కలకు నీరు అందించాలని పేర్కొన్నారు. రహదారుల నిర్మాణం, మరమ్మతు, మెరుగుదల పనులను పెద్దఎత్తున చేపట్టి వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రహదారుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీంచాలని చెప్పారు.

రోడ్ల కోసం పెద్దఎత్తున కంకర అవసరమవుతున్నందున, కొత్త స్టోన్ క్రషర్లకు అనుమతి ఇచ్చే అధికారాన్ని కలెక్టర్లకు బదిలీ చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న కొండ ప్రాంతాలను స్టోన్ క్రషర్ కోసం కేటాయించాలని, దీని వల్ల భూ ఉపరితలం చదునవడంతోపాటు ఆ భూమి పరిశ్రమల కోసం కేటాయించడం సులువవుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్‌తోపాటు వివిధశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.