Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇక సమూల ప్రక్షాళన

-అవినీతి జాడ్యం వదులాలి
-వ్యవస్థలను మార్చాల్సిందే
-శాఖల్లో అక్రమాలు, అవినీతిపై వేలల్లో ఫిర్యాదులు
-కొద్దిమంది ఉద్యోగుల వల్ల ఇతరులకు ఇబ్బంది
-కొత్త చట్టాల ఆవశ్యకతను ప్రజలకు వివరించాలి
-రాష్ట్రంలో 32 జెడ్పీలనూ గెలువబోతున్నాం
-16 లోక్‌సభాస్థానాల్లోనూ గులాబీ జెండా
-పరిషత్ అభ్యర్థుల ఎంపిక,గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలదే
-పాత కొత్తలను కలుపుకొని పనిచేయాలి
-సిట్టింగ్ ఎమ్మెల్యేందరికీ మళ్లీ టిక్కెట్లు
-నాయకులందరికీ పదవులు వస్తాయి
-వచ్చే విస్తరణలో ఖమ్మంజిల్లాకు అవకాశం
-ఆసిఫాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా కోవ లక్ష్మి
-టీఆర్‌ఎస్‌లోకి అనేకమంది వస్తామంటున్నారు
-జూన్ మూడు లేదా నాలుగోవారంలో మున్సిపోల్స్
-అవికూడా ముగిస్తే ఇక పరిపాలనపై పూర్తి దృష్టి
-ప్రతి గ్రామ పంచాయతీ అద్దంలా మెరిసిపోవాలి
-విధులను సరిగా నిర్వర్తించని సర్పంచ్‌లను ఉపేక్షించం
-టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-తెలంగాణభవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం
-రెవెన్యూ, మున్సిపల్‌కు కొత్త చట్టాలు
-ఆమోదానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

రాష్ట్రంలో అవినీతిని అంతమొందించాలని, దీనికోసం వ్యవస్థలను ప్రక్షాళనచేయాల్సిన అవసరం ఉన్నదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అవినీతిపై ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, వీటన్నింటికీ పరిష్కారంగా రెవెన్యూ, మున్సిపల్‌కు కొత్త చట్టాలు తీసుకురానున్నామని తెలిపారు. పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలే తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 32 జెడ్పీలను గెలువబోతున్నామని, 16 ఎంపీ స్థానాలు మనవేనని ధీమా వ్యక్తంచేశారు. పార్టీ క్యాడర్‌లో పాత కొత్తలను కలుపుకొని పనిచేయాలన్న సీఎం.. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టిక్కెట్లు వస్తాయని హామీ ఇచ్చారు. తెలంగాణభవన్‌లో సోమవారం పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలుగా పోటీచేసినవారు, రాజ్యసభ సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ దాదాపు రెండుగంటలసేపు ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం మొదలైననాటి నుంచి ఇప్పటివరకు ఉన్న పరిస్థితులను వారికి వివరించారు. భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

ఎమ్మెల్యేలదే బాధ్యత
జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత స్థానిక ఎమ్మెల్యేదే. వారే అభ్యర్థులను ఎంపికచేసుకోవాలి.. వారే గెలిపించాలి. తమకు ఇష్టమైనవారని, దగ్గరివారని కాకుండా.. గెలిచేవారినే ఎంపికచేయాలి. కొందరు తమకు దగ్గరివారని ఎంపికచేస్తారు. కానీ గెలిచేవారు వేరే ఉంటారు. అలా జరుగకూడదు. ఎమ్మెల్యేలు ఈగోలు వదిలివేయాలి. పాత కొత్తల కలయికగా పార్టీ ఉండాలి. పాతవారిని గుర్తించాలి. మొత్తంగా అన్నిస్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపొందాలి. జెడ్పీ చైర్మన్ ఎంపికలో జిల్లా ఇంచార్జి, మంత్రులు సమయన్వయం చేసుకోవాలి. దళిత కాలనీల్లో పర్యటించాలి. ఎమ్మెల్యేలుగా మళ్లీ మీరే కొనసాగుతారు. మీకే మళ్లీ అవకాశమిస్తాం. మీరే దీర్ఘకాలికంగా ఉంటారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు దగ్గరగా ఉండాలి. వారి సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రజలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. దానిని ఉపయోగించుకోవాలి. ఖమ్మంజిల్లా నుంచి రాబోయే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తాం. పరిషత్ ఎన్నికలకు బీ ఫారాలను జారీచేసే అధికారాన్ని ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్‌రెడ్డికి అప్పగిస్తాను.

గ్రామాలు అద్దాల్లా మెరవాలి
ప్రతి గ్రామ పంచాయతీ అద్దంలా మెరిసిపోవాలి. రాబోయే మూడునెలల్లో గ్రామాల స్వరూపం మారాలి. వీధుల్లో చెత్త ఉండొద్దు. మురుగుకాల్వలు శుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వాటిని క్లీన్‌చేయాలి. గ్రామాలకు కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం అంతే నిధులను మ్యాచింగ్ గ్రాంట్‌గా ఇస్తుంది. స్థానికంగా వారికి ఆదాయం వస్తుంది. ఇలా మూడురకాల నిధులతో గ్రామాలను పరిశుభ్రంగా మార్చుకోవాలి. అభివృద్ధి చేసుకోవాలి. ప్రతిగ్రామంలో నర్సరీ ఏర్పాటుచేస్తున్నాం. కొత్తగా తొమ్మిదివేల మంది గ్రామ కార్యదర్శులను నియమించుకున్నాం. ప్రతి గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి ఉంటారు. అనేక దశాబ్దాలుగా డిమాండ్ ఉన్న తండాలను పంచాయతీలుగా ఏర్పాటుచేసుకున్నాం. దాదాపు మూడువేల మంది గిరిజనులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ఈ డిమాండ్‌ను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. ప్రతి గ్రామంలో శ్మశానవాటికలను ఏర్పాటుచేసుకోవాల్సి ఉన్నది. విధులను సరిగా నిర్వర్తించని, నిధులను దుర్వినియోగం చేసే సర్పంచ్‌లను ఉపేక్షించేదిలేదు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేయాలి.

అవగాహన పెంచుకుని అభివృద్ధి దిశగా..
2001లో తెలంగాణపై ఆశపోయిన తరుణంలో ఉద్యమాన్ని ప్రారంభించాను. నా రాజకీయ భవిష్యత్ లెక్కచేయకుండా ఉద్యమంలోకి దిగాను. అనేక పోరాటాలతో అంతాకలిసి తెలంగాణ తెచ్చుకున్నాం. 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరుణంలో మొదటి ఏడెనిమిది నెలలు ఐఏఎస్‌లు లేరు. కేంద్రంలో కూడా బీజేపీ కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చింది. అధికారుల విభజన ఆలస్యమైంది. రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై అంచనాకు రావడానికి సమయం పట్టింది. ఆనాడు ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి జీఆర్ రెడ్డిని పిలిపించుకొని చర్చించాను. ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహనకు వచ్చాక రాష్ట్రంలో ఎలాంటి పథకాలు చేపట్టాలో నిర్ణయించాం. మొదట విద్యుత్ సమస్య తీర్చాం. ఆ తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయను చేపట్టాం.ఇతర సంక్షేమ పథకాలు వరుసగా ప్రవేశపెట్టుకుంటూ వచ్చాం. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టడంతో వాటన్నింటినీ స్వయంగా చూసిన అనుభవంలోకి రావడంతో ప్రజలు మనల్ని రెండోసారి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని గెలిపించారు. కులవృత్తులకు పథకాలను ప్రవేశపెట్టాం. అసెంబ్లీ ఎన్నికల్లో 102-103 స్థానాలకు పైగా గెలుచుకుంటామని అనుకున్నాం. కానీ ఖమ్మంజిల్లాలో అంతర్గత విభేదాలతో ఓడిపోయాం. లేకుంటే అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకునేవాళ్లం. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు ఎమ్మెల్యేలను మాత్రమే మార్చాం. వారిపై విపరీతమైన వ్యతిరేక నివేదికలు, సర్వేలు రావడంతో మార్చాల్సి వచ్చింది. మార్చిన ఏడు స్థానాల్లోనూ తిరిగి టీఆర్‌ఎస్ గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ 16 స్థానాల్లో గెలవబోతున్నది. రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ కష్టపడండి.. అన్ని జెడ్పీలను మనమే కైవసం చేసుకుంటాం.

మంత్రులు జాగ్రత్తగా పనిచేయాలి
రాష్ట్ర మంత్రులు జాగ్రత్తగా పనిచేయాలి. ఏం పనిచేస్తున్నాం? ఎలాంటి పనులు చేయాలి? అనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలి. మంత్రికాగానే చాలామంది వస్తుంటారు. జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్లు పిలిచే అన్ని కార్యక్రమాలకు వెళ్లడం కాకుండా ఎంతవరకు అవసరమనేది పరిశీలించుకోవాలి. హడావుడిగా కాకుండా ఇబ్బంది లేకుండా పనిచేయాలి. దేశంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన నిధులపై ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇంకా వారు వెనుకబడి ఉన్నారు. ఎమ్మెల్యేలు దళితుల కాలనీలకు వెళ్లాలి. వారి సమస్యలు వినాలి.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎన్నికలే నిదర్శనం
రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ అనేకమంది లేఖలు రాస్తున్నారు. ఇటీవల ప్రపంచబ్యాంకు కూడా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలపై లేఖ రాసింది. దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా మనదగ్గర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పక్కరాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో అనేక అల్లర్లు, హత్యలు, గొడవలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన తీరుపై చాలామంది ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో చెప్పటానికి ఇది నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్థానాల్లో డిపాజిట్లు రాని బీజేపీ నాయకులు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. రేపే ప్రధానమంత్రి, కేంద్రమంత్రి అయినట్టు మాట్లాడుతున్నారు. వాళ్లు మనకు దరిదాపుల్లో కూడా లేరు. కానీ వారి హడావుడి ఎక్కువగా ఉంది. టీఆర్‌ఎస్‌లోకి ఇంకా అనేకమంది వస్తామంటున్నారు.

అందరికీ పదవులు వస్తాయి
పార్టీలోకి కొత్తగా వచ్చినవాళ్లు తొందరడపడొద్దు. అందరికీ పదవులు వస్తాయి. చాలా పదవులున్నాయి. పాత కొత్త అనే తేడా లేకుండా అందరినీ సముచితంగా గౌరవించుకుందాం. కేంద్రంలో మనకు అనుకూలమైన ప్రభుత్వం వస్తుంది. కేంద్రంలో ఏన్డీయేకు 150 సీట్లకంటే ఎక్కువరావు. కేంద్రంలో మనం నిర్ణయాత్మకపాత్ర పోషించబోతున్నాం. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. మరో 34 శాసనసభ స్థానాలు, పది ఎమ్మెల్సీ స్థానాలు పెరుగుతాయి. నాలుగైదు మంత్రి పదవులు కూడా పెరుగుతాయి. వీటితోపాటు కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లాస్థాయి చైర్మన్లు, డీసీఎంఎస్, ఓడీసీఎంఎస్ చైర్మన్.. ఇలా అనేక పదవులున్నాయి. వీటన్నింటినీ భర్తీచేసుకుందాం. అందరికీ అవకాశాలు కల్పిద్దాం. కొత్తవారు పాతవారు కలిసి పనిచేయండి. పార్టీలో కొత్తవారిని పాతవారు కలుపుకొని పనిచేయాలి. ఎవరినీ విస్మరించవద్దు. ఉద్యమం నాటి నుంచి ఉన్నవారందరికీ ప్రాధాన్యం ఇవ్వాలి.

ఎన్నికలు ముగిస్తే పరిపాలనపై దృష్టి
ఎన్నికలన్నీ పూర్తిచేస్తే రాబోయే రోజుల్లో పరిపాలనపై దృష్టిపెట్టవచ్చు. మున్సిపల్ ఎన్నికలు మినహా అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ మూడు, నాలుగోవారంలో మున్సిపల్ ఎన్నికలు కూడా పెట్టుకుందాం. నీళ్లులేని గ్రామం లేకుండా చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. మహబూబ్‌నగర్ జిల్లాలోనే 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. రైతుబంధు పరిమితి తగ్గించమని గతంలో చాలామంది చెప్పారు. మహబూబ్‌నగర్ లాంటి జిల్లాల్లో 50-70 ఎకరాలు ఉన్నా వారు కూడా కూలీ పనిచేసుకొని బతుకున్నారు.

ఆసిఫాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా కోవ లక్ష్మి
రాష్ట్రంలో 32 జెడ్పీలను మనమే గెలుచుకోబోతున్నాం. ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మన పార్టీపట్ల వారు అభిమానంతో ఉన్నారు. జెడ్పీ చైర్మన్లను మంత్రులు, ఇంచార్జిలు ఎంపిక చేసుకోవాలి. నేను మాత్రం చొరవ తీసుకొని ఆసిఫాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని ఎన్నుకోవాలని సూచిస్తున్న. మిగిలిన జిల్లాలో మీరు ఎంపిక చేసుకోండి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కోవ లక్ష్మి అతి తక్కువ మెజార్టీతో ఓటమిపాలయ్యారు. గిరిజన మహిళకు మంచి అవకాశం ఇద్దామని నిర్ణయించాం.

వ్యవస్థలను మార్చకుంటే ప్రజలు క్షమిం చరు
రాబోయే రోజుల్లో కొన్ని కఠిననిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలను పట్టిపీడిస్తున్న అవినీతిని అంతంచేయాల్సిన అవసరం ఉన్నది. వ్యవస్థ ఇదేవిధంగా ఉంటే ప్రజలు మనల్ని క్షమించరు. కొందరికోసం ప్రభుత్వం ఎందుకు బద్నాంకావాలి? లంచాలకోసం ప్రజలను కొందరు పీడిస్తున్నారు. అవినీతి తగ్గాలి. రెవెన్యూ వ్యవస్థ తప్పులతడకగా ఉన్నది. వ్యవస్థలను ప్రక్షాళన చేస్తాననగానే కొందరు నాపై, ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్టు ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడుతున్నరు. యూనియన్‌లు అడ్డుపడుతుంటయి. మనం చేయకుంటే ఎవరు చేస్తారు? ఐఏఎస్‌లు పట్టించుకోరు. ఎమ్మెల్యేలు ఐఏఎస్‌ల కంటే పెద్దవారు. మనమే పట్టించుకోవాలి. వ్యవస్థను బాగుచేయాలి. రెవెన్యూ, మున్సిపల్ కొత్తచట్టాలను తీసుకొస్తున్నాం. వీటిల్లో ఎందుకు మార్పు తీసుకురావాల్సి వచ్చిందో ప్రజలకు మీరు వివరించాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. తెలంగాణ వచ్చాక పోలీసుశాఖలో అవినీతి తగ్గింది.అయితే రెవెన్యూశాఖలో ఇప్పటికీ బాగా ఉన్నది. దీనికోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తున్నాం. కొత్త చట్టాల ఆమోదానికి రెండుమూడు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటుచేసుకుందాం. ఇటీవల ఒక రైతు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌పై నేను స్పందిస్తే వేలమంది సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆ రోజు నేను చెప్పిన ఫ్యాక్స్ నంబర్‌కు వేల ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం అడ్రస్‌కు రోజూ వందల ఫిర్యాదులు అందుతున్నాయి. అందుకే ఈ వ్యవస్థ మారాలి. బాగుపడాలి. పారదర్శకత రావాలి. (ఈ సందర్భంగా పరిపాలన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందా? లేదా? అని సీఎం ప్రశ్నించడంతో.. ఉంది.. అంటూ సమావేశానికి హాజరైనవారంతా చేతెలెత్తి నినదించారు) ప్రజలకు మంచి జరుగాలి. ఉద్యోగుల్లో కొద్దిమందివల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలి. ప్రజల్ని పీడించే వ్యవస్థ పోవాలి. దీనిపై ప్రజలల్లో చైతన్యం తీసుకురావాలి. వారిలో అవగాహన పెంచాలి.

పరిషత్ ఎన్నికలకు ఇంచార్జిలు వీరే
పరిషత్ ఎన్నికల కోసం జిల్లాలవారీగా ఇంచార్జులను టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. వీరిలో రాష్ట్ర మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులున్నారు. కొందరిని రెండుమూడు జిల్లాలకు ఇంచార్జిగా నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు ఇద్దరు మినహా మిగిలిన వారందరికీ బాధ్యతలు అప్పగించారు. పరిషత్ ఎన్నికల ప్రచారం వ్యూహం, జిల్లా ఎమ్మెల్యేలు, నాయకుల మధ్య సమన్వయం బాధ్యతలను వీరు నిర్వర్తించనున్నారు. రాబోయే రోజుల్లో కొన్ని కఠిననిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలను పట్టిపీడిస్తున్న అవినీతిని అంతంచేయాల్సిన అవసరం ఉన్నది. వ్యవస్థ ఇదేవిధంగా ఉంటే ప్రజలు మనల్ని క్షమించరు. కొందరికోసం ప్రభుత్వం ఎందుకు బద్నాంకావాలి? లంచాలకోసం కొందరు ప్రజలను పీడిస్తున్నారు. అవినీతి తగ్గాలి. రెవెన్యూ వ్యవస్థ తప్పులతడకగా ఉన్నది.
-పార్టీ నేతలతో సీఎం కేసీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.