Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇక సత్వరన్యాయం

-నూతన ఒరవడిలో రాష్ట్ర న్యాయవ్యవస్థ
-ప్రత్యేక హైకోర్టుతో తెలంగాణ విభజన సంపూర్ణం
-రాష్ట్రంలో కమర్షియల్ కోర్టుల ఏర్పాటుకు లైన్‌క్లియర్
-హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచుకునే అవకాశం
-కొత్తజిల్లాల్లో న్యాయవ్యవస్థల ఏర్పాటు
-సత్వర న్యాయంతో మారనున్న సామాన్యుల జీవితాలు
-నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎంపీ వినోద్‌కుమార్

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకావడంతో రాష్ట్ర విభజన సంపూర్ణమైందనే భావన కలుగుతున్నదని ప్రముఖ న్యాయవాది, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన 2014లో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు విభజితమైనా, న్యాయవ్యవస్థ విభజన పూర్తికాకపోవడంతో ఆ లోటు కనిపించేదని అన్నారు. ఈ ఏడాది జనవరి ఒకటిన ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుతో రాష్ట్ర విభజన పూర్తిస్థాయిలో జరిగిందని తెలిపారు. రాష్ట్ర విభజన ఉద్యమంతోపాటు, హైకోర్టు ఏర్పాటు అంశంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీల్లో ఒకరైన వినోద్‌కుమార్ నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే..

సుదీర్ఘ పోరాటం
కేంద్రన్యాయశాఖ మంత్రిగా సదానందగౌడ ఉన్నప్పుడు హైకోర్టు విభజన గురించి అనేక సార్లు పార్లమెంట్‌ను స్తంభింపజేశాం. ప్రధానమంత్రిని 15 సార్లు, న్యాయశాఖ మంత్రిని 25 సార్లు కలిశాం. రెండుసార్లు ప్రైవేటు మెంబర్ బిల్లులు పెట్టాం. ఉమ్మడి హైకోర్టు జడ్జిమెంట్‌పై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వంతో రివ్యూ పిటిషన్ వేయించాం. అనంతరం జనవరి 1లో గా వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పుఇచ్చింది. సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు, కేంద్ర న్యాయశాఖ మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చింది. ఇక రాష్ట్ర విభజన సంపూర్ణమైనట్టే.

న్యాయమూర్తుల సంఖ్య పెంచుకుంటాం
తెలంగాణ హైకోర్టులో ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 24. ప్రస్తుతం 13 మంది ఉన్నారు. త్వరలోనే మిగతా జడ్జీలు కూడా వస్తారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అవకాశం ఉన్నదా? అని ఈనెల రెండున నేను లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించా. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 1.87 లక్షల కేసులు, ఏపీ హైకోర్టులో 1.70 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలహాబాద్‌లో వంద మంది, బాంబే, అహ్మదాబాద్ తదితర హైకోర్టుల్లో కూడా 70-100 మంది న్యాయమూర్తులున్నారు. మనం కూడా సంఖ్యను పెంచుకుంటే బాగుంటుంది. మా అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం దిగువ కోర్టుల్లో జడ్జీల సంఖ్య చాలాతక్కువగా ఉన్నది. న్యాయ నియామకాలతోపాటు జిల్లా న్యాయవ్యవస్థ ఏర్పాటు, ఇతర మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపడుతున్నది. రాష్ట్రంలో న్యాయవ్యవస్థను నూతన ఒరవడిలో నడిపించే దిశగా సీఎం కేసీఆర్ దృష్టిసారిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ స్థానికులకు న్యాయవ్యవస్థలో అవకాశాలు లభించలేదు. ఇప్పటినుంచి చాలా అవకాశాలు, ఉద్యోగాలు దక్కుతాయి.

సామాన్యులకు సత్వర న్యాయం
హైకోర్టు విభజన వల్ల సామాన్యులకు సత్వర న్యాయం లభిస్తుంది. ఆవేశంలో చిన్నచిన్న గొడవల్లో పాల్గొన్నవారి కేసుల విచారణ ఏండ్ల తరబడి జరుగుతున్నది. గొడవ పడినవారు మర్చిపోయినా కేసులు అలాగే ఉంటున్నాయి. ఇలాంటి వాటికి సత్వర పరిష్కారం దొరుకుతుంది. ఇది సామాజిక జీవితంపై ప్రభావం చూపుతుంది. అన్నిరంగాల్లో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఏ విధంగా ఆదర్శంగా ఉన్నదో.. న్యాయం విషయంలో కూడా మొదటిస్థానంలో నిలిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రతిభావంతులైన న్యాయవాదులకు ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించి, న్యాయవ్యస్థను బలోపేతం చేసేవిధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.

దర్యాప్తులో విప్లవాత్మక మార్పులు.. సీఆర్‌పీసీకి సవరణలు
రాష్ట్రంలో పోలీస్ ప్రాసిక్యూటర్ల వ్యవస్థను పటిష్ఠంచేయాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం పోలీస్‌స్టేషన్లలోని స్టేషన్‌హౌస్ ఆఫీసర్లు కేసు విచారణ జరిపి చార్జిషీట్ దాఖలుచేస్తున్నారు. కేసు విచారణకు వచ్చేసరికి వారు బదిలీపై వెళ్లిపోతున్నారు. దీంతో పాతకేసులపై పోలీసు అధికారులకు ఆసక్తి ఉండటంలేదు. కాబట్టి మూడు లేదా నాలుగు పోలీస్‌స్టేషన్లకు కలిపి ఒకే దర్యాప్తు అధికారి ఉండాలి. ఈ స్టేషన్ల పరిధిలోని నేరాలపై దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు వంటి అంశాలను సదరు అధికారి చూస్తారు. దీనివల్ల శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసులపై దర్యాప్తుచేసే భారం తగ్గుతుంది. శాంతిభద్రతలు, దర్యాప్తు అధికారులు వేర్వేరుగా ఉండాలి. దీనివల్ల చాలా తక్కువకాలంలో నేరనిర్ధారణ జరుగుతుంది. ఈ మేరకు సీఆర్‌పీసీకి సవరణలు తెచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది.

పునర్విభజన చట్టంలో అస్పష్టత వల్లే జాప్యం
రాజ్యాంగంలోని 214 ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పడేవరకు హైదరాబాద్ హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం -2014లోని సెక్షన్లు 30, 31 చెప్తున్నాయి. అయితే హైకోర్టు విభజనకు స్పష్టమైన తేదీని పేర్కొనలేదు. తద్వారా పదేండ్ల వరకు జాప్యంచేసినా అడిగే పరిస్థితి లేదు. పంజాబ్-హర్యానా హైకోర్టు తరహాలో హైదరాబాద్ హైకోర్టును ఉమ్మడిగా ఉంచాలనే ఆలోచన కూడా చేశారు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి హైకోర్టు విభజనపై చిత్తశుద్ధిలేదు. మేం ఎన్నిసార్లు చెప్పినా.. హైకోర్టు విభజనకు నిర్దిష్టమైన సమయాన్ని పేర్కొనలేదు.

రాష్ట్ర న్యాయవ్యవస్థలో విప్లవాత్మకమార్పులు
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుతో రాష్ట్ర న్యాయవ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కోర్టులు, జిల్లా ప్రిన్సిపల్ జడ్జీలు, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీలు వస్తారు. ప్రతిజిల్లాకు న్యాయవ్యవస్థలు ఏర్పడుతాయి. కేసుల పరిష్కారం వేగవంతమవుతుంది. జిల్లా కోర్టుల ఏర్పాటుతో జిల్లాల విభజనలో కచ్చితత్వం వస్తుంది. విభజనకు సార్ధకత ఏర్పడుతుంది. వ్యాపార, వాణిజ్య వివాదాల పరిష్కారానికి రాష్ట్రంలో కమర్షియల్ కోర్టులు ఏర్పాటవుతాయి. వ్యాపార వివాదాలను వేగంగా పరిష్కరించడంలో బాంబే హైకోర్టుకు మంచి గుర్తింపు ఉన్నది. తెలంగాణకు అదే తరహాలో మంచి పేరు వస్తుంది. అంతర్జాతీయస్థాయిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకుల్లో మొదట పరిగణనలోకి తీసుకునేది దేశంలోని న్యాయవ్యవస్థ ఎలా ఉన్నదనే అంశాన్నే. దురదృష్టవశాత్తూ ఈ విషయంలో భారత్ చాలా వెనుకబడి ఉన్నది. ముంబై, బెంగళూరు తదితర నగరాల్లో మల్టీనేషనల్ కంపెనీలు రావడానికి అక్కడి న్యాయవ్యవస్థలు కూడా కారణం. మన వద్ద ఉమ్మడి హైకోర్టు ఉండటం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకావడం వల్ల సత్వరన్యాయం అందుతుంది. కమర్షియల్ కోర్టులతో వ్యాపార వివాదాలకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. వ్యాపార, వాణిజ్యాలకు రాష్ట్రం స్వర్గధామంగా మారుతుంది. కొత్తజిల్లాల్లో ఏర్పడే కుటుంబ న్యాయస్థానాలతో వివాదాలకు సత్వర పరిష్కారం అభిస్తుంది. శిక్షలు విధించే శాతం పెరుగడం వల్ల నేరాలు చేయడానికి భయపడుతారు. తద్వారా నేరాల సంఖ్య కూడా భారీగా తగ్గుతుంది. ప్రజాప్రతినిధుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా కోర్టులు ఏర్పాటుచేయడంతో వివాదాల్లో తలదూర్చడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది.

హైకోర్టు ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తాం
ఉమ్మడి హైకోర్టు విభజనలో కొందరు తెలంగాణ ఉద్యోగులను ఏపీకి కేటాయించారని తెలిసింది. సీనియార్టీని ప్రాతిపదికగా తీసుకోవడంతో అన్యాయానికి గురైన తెలంగాణకు చెందిన హైకోర్టు ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తాం. దీనిపై అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌తోను చర్చిస్తాం. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్‌ను కలిసి విజ్ఞప్తిచేస్తాం. న్యాయవాదుల శిక్షణ కోసం ప్రత్యేకంగా ట్రస్టును ఏర్పాటుచేసి నల్సార్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలకు చెందిన జూనియర్ న్యాయవాదులకు ైస్టెఫండ్ అంశాన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా చూస్తాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.