Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇక్కడి రైతులేం కావాలి?

తెలంగాణకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన కరెంటును ఇవ్వని ఏపీ ప్రభుత్వం, సాగర్ నీటికోసం గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. మాకు కరెంటు ఇవ్వరుగానీ.. మీకు మాత్రం మా రైతులను ఎండబెట్టి నీళ్లివ్వాలా? అని ఆయన నిలదీశారు. అసలు ఏపీ ఇప్పటికే తన వాటాను మించి నీటిని వాడుకున్నదని ఆయన స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ డ్యాం వద్ద నీటి విషయమై జరిగిన వివాదంపై శుక్రవారం సాయంత్రం మంత్రి హరీశ్‌రావు సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏ రాష్ట్ర రైతు అయినా నష్టపోవద్దనే తమ విధానమని, ఏపీ ప్రభుత్వం ఎంత నీరు కావాలో లిఖితపూర్వకంగా ఇస్తే మానవతా దృక్పథంతో వ్యవహరించేందుకు సిద్ధమని చెప్పారు. తెలంగాణ అప్పుడూ ఇప్పుడూ న్యాయబద్ధమైన వాటాలు వాడుకుందామనే చెబుతున్నది, ఏపీ మాత్రం చట్టాలు, న్యాయాలు అన్నీ బలాదూర్… అడిగినన్ని నీళ్లు ఇస్తారా? చస్తారా? అన్నట్లుగా ఏపీ సర్కారు వ్యవహరిస్తుంది అన్నారు.

Harish-Rao-press-meet

-మీ వాటా ఎప్పుడో అయిపోయింది -సాగర్ ఖాళీ చేస్తే తాగునీటికి ఇబ్బంది -లిఖితపూర్వకంగా అడిగితే 10 టీఎంసీలిస్తాం -డ్యాం కూలుస్తామంటే ఊరుకోం -రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టీకరణ తెలంగాణ ప్రభుత్వం ఏపీ రైతులకేదో అన్యాయం చేస్తున్నదన్న భ్రమ కల్పించేందుకు యత్నిస్తూ రెండు రాష్ర్టాల్లోని రైతులను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిలో చుక్క నీరు కూడా మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు న్యాయపరంగా నీటిని వాడుకుందామని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. నీటి వినియోగంపై ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌రావు అనేకసార్లు ఏపీ ఈఎన్‌సీ మొదలు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చివరకు ఇరిగేషన్ శాఖ మంత్రితో కూడా మాట్లాడారని తెలిపారు. అసలు సాగర్‌లో ఎన్ని నీళ్లున్నాయి? ఇప్పటివరకు ఎవరెన్ని వాడుకున్నారు? ఆంధ్రప్రదేశ్ వైఖరి ఎలా ఉందనే వివరాలను వెల్లడించారు.

ఇదీ… నీటి లెక్క.. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణాజలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు వస్తాయని హరీశ్‌రావు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు కూడా ఇదే చెప్పిందని.. అందుకే బచావత్ అవార్డు, సుప్రీం కోర్టు తీర్పుకు లోబడి తాము 299 టీఎంసీల నీటిని వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. రివర్ షేర్ ప్రకారం తెలంగాణ 41.60 శాతం, ఆంధ్రప్రదేశ్ 58.40 శాతం మేర నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏ విధానమైనా సరే. తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది… అని చెప్పారు. సాగర్‌లో ఉన్నవి 63 టీఎంసీలే…

List

నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 63 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని మంత్రి తెలిపారు. వేసవిలో తాగునీటి అవస రాలకు హైదరాబాద్‌కు ఎనిమిది టీఎంసీలు, ఏపీ తాగునీటికి కుడి కాల్వ ద్వారా ఐదు, సాగర్ ఎడమ కాల్వ ద్వారా ఎనిమిది టీఎంసీలు, ఏఎమ్మార్పీ ద్వారా 2-3 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు మూడు టీఎంసీ లు… ఇలా రెండు రాష్ర్టాల్లో తాగునీటి అవసరాలకు మొత్తంగా 25 టీఎంసీలు పోతాయని వివరించారు. ఇపుడున్న 63 టీఎంసీల్లో తాగునీటి అవసరాలకు పోతే మిగిలేది కేవలం 45 టీఎంసీలేనని ఆయన చెప్పారు. ఇపుడు ఏపీ అడుగుతున్న ప్రకారం సాగర్‌లో ఉన్న నీళ్లన్నీ వారికే ఇస్తే రేపు తెలంగాణకు ఏం ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పంటలన్నీ ఎండబెట్టి, ఏపీకి నీళ్లి వ్వడం సాధ్యం కాదని అన్నారు. సమైక్య రాష్ట్రంలో నీటి వాటాలు బుల్డోజ్ చేశారని ఇపుడుకూడా అలాగే చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు.

లిఖితపూర్వకంగా ఇస్తే కచ్చితంగా సహకరిస్తాం… ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అదనంగా 43.13 టీఎంసీల నీటిని వాడుకుంది..అయినా సరే… మా ప్రాంత రైతుల పంటల్ని కాపాడాలంటే మాకిన్ని నీళ్లు కావాలని లిఖితపూర్వకంగా ఇవ్వండి. మేం మానవతా దృక్పథంతో స్పందిస్తాం..అని హరీశ్‌రావు అన్నారు. చంద్రబాబునాయుడు కరెంటు ఇచ్చే అవకాశమున్నా…తెలంగాణ రైతుల పంటల్ని ఎండబెట్టాలనే బుద్ధితో న్యాయపరంగా కృష్ణపట్నంలో తెలంగాణకు ఇవ్వాల్సిన కరెంటును అడ్డుకున్నారని అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఐదు టీఎంసీలో, పది టీఎంసీలో కావాలని అడిగితే కచ్చితంగా సహకరిస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం దబాయిస్తే కుదరదని మంత్రి స్పష్టం చేశారు.

ధర్నాలు చేస్తాం… డ్యాంను పగులగొడతాం అని తీవ్ర వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేం డిమాండు చేస్తున్నం. సాగర్ డ్యాం ఒక్కరి సొత్తు కాదు. మేం చూస్తూ ఊరుకోలేం..అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే రెండు రాష్ర్టాలు నీటిని వాడుకోవాలని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌రావు అన్నారు. పంటల్ని కాపాడుకునేందుకు 5-10 టీఎంసీలు కావాలని ఏపీ సర్కారు లిఖితపూర్వకంగా ఇస్తే ప్రభుత్వం సహకరిస్తుందని ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి అన్నారు.

ఇప్పటిదాకా ఎవరెన్ని వాడారు?… ఆంధ్రప్రదేశ్ తనవాటా 322.611 టీఎంసీల్లో ఇప్పటివరకు ఏపీ 365.75 టీఎంసీలు వాడుకుంది. అంటే అదనంగా 43.13 టీఎంసీల కృష్ణాజలాల్ని ఇప్పటికే వాడుకుంది. తెలంగాణకు 229.90 టీఎంసీల నీటి హక్కు ఉంది. ఇప్పటివరకు 140.40 టీఎంసీలు వాడింది. ఇంకా 89.511 టీఎంసీల హక్కు ఉంది. కరెంటు ఉత్పత్తి ద్వారా విడుదలయ్యే నీటికి సంబంధించిన గేట్లు వారి ఆధీనంలో ఉన్నాయి. దీంతో కరెంటు ఉత్పత్తి పేరిట ఎక్కువ నీటిని వాడుకున్నారని అన్నారు. ఈ విషయాన్ని మేం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం, కృష్ణా యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకుపోతూనే ఉన్నాం. అయితే సాగర్‌లో 532 టీఎంసీల నీటిమట్టం రాగానే హైడల్ పవర్ జనరేషన్ ఆగిపోతుంది. దీంతో ఇప్పుడు అదనంగా వాడుకున్న నీరు కాకుండా ఇంకా 45 టీఎంసీలు కావాలని అడుగుతున్నారని అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.