Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

డాక్టర్లు భేష్‌

-కరోనా కట్టడికి రేయింబవళ్లు శ్రమిస్తున్నారు
-మంత్రి, అధికారులు, సిబ్బంది కృషి ప్రశంసనీయం
-కరోనాపై రాజకీయాలు తగవు
-ప్రపంచానికి దిక్సూచి మన ఫార్మా
-త్వరలోనే ఆరోగ్య తెలంగాణ: మంత్రి కేటీఆర్
-మహబూబ్‌నగర్‌లో వైద్యకళాశాల నూతన భవన ప్రారంభోత్సవం
-దేశంలోనే అతి పెద్ద ఎకోపార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో కొవిడ్‌-19ను నియంత్రించడానికి వైద్య సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గారితో పాటు కిందిస్థాయి వరకు ప్రాణాలకు తెగించి గొప్పసేవ చేస్తున్నారన్నారు. రూ.450 కోట్లతో మహబూబ్‌నగర్‌లో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాన్ని సోమవారం మంత్రి కేటీఆర్‌.. వైద్య, ఆరోగ్యశాఖమంత్రి ఈటల, క్రీడలు, ఆబ్కారీశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఫార్మారంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన ఉన్నదని తెలిపారు.

మన ఫార్మారంగం ప్రపంచానికి మార్గం చూపిస్తున్నదన్నారు. ప్రతి విపత్తులోనూ ఒక అవకాశం ఉంటుందన్న కేటీఆర్‌.. కిందపడిన ప్రతిసారి లేచి విజయం సాధించాలని సూచించారు. రానున్న రోజుల్లో రాష్ట్రం సంపూర్ణ ఆరోగ్య తెలంగాణగా మారుతుందని అన్నారు. దేశంలోని ఔషధరంగంలో 35 నుంచి 40 శాతం మందులు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు కేసీఆర్‌ కిట్‌ అమలు తర్వాత రాష్ట్రంలో మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయని, ప్రభుత్వ దవాఖానల్లో 40 నుంచి 50 శాతం వరకు ప్రసవాలు పెరిగాయని తెలిపారు. ప్రజారోగ్యంపట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తున్నదని పేర్కొన్న మంత్రి.. కంటివెలుగుతో ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించామని గుర్తుచేశారు. సామాన్యుడికి వైద్యం ఖర్చు తడిసి మోపెడవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వ దవాఖానలపై నమ్మకాన్ని పెంచామని చెప్పారు. ఈ విశ్వాసాన్ని మరింత ఇనుమడింపజేసే బాధ్యత వైద్యరంగంలో పనిచేసే పెద్దలు, అధికారులపై ఉన్నదన్నారు.

కరోనాపై ప్రాణాలకు తెగించి పోరాటం: మంత్రి కేటీఆర్

కొవిడ్‌-19 కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇలాంటి సందర్భాల్లో అందరూ సమిష్టిగా పనిచేయాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. ఈ సమయంలో రాజకీయాలు తగవని విపక్షాలకు హితవు చెప్పారు. ప్రస్తుతం నాలుగేండ్లపాటు ఎలాంటి ఎన్నికలు లేవని, ఈ సమయంలో రాజకీయాలకు తావేలేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులలో భారత్‌ మూడోస్థానంలో ఉన్నదన్న కేటీఆర్‌.. దీనికి ప్రధాని మోదీ వైఫల్యంగా భావించాలా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు అర్థంలేని రాజకీయాలు చేయకుండా నిర్మాణాత్మక సూచనలివ్వాలని కోరారు.

కరోనా పరీక్షల నిర్వహణపై ప్రతిపక్షాలు అనవసరంగా నోరు పారేసుకొంటున్నాయని మంత్రి విమర్శించారు. ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టంచేశారు. వైరస్‌ కట్టడికోసం సర్కారు ఎంతో కృషిచేస్తున్నదని చెప్పారు. ప్రజలకు సేవచేయడానికి పరుగెడుతున్న వారి కాళ్లలో కట్టెలు పెట్టడం మంచిదికాదని అన్నారు. వైద్యశాఖ మంత్రికి అర్ధరాత్రి ఫోన్‌చేసినా కరోనా రోగికి అప్పటికప్పుడు వైద్యం అందిస్తున్న ఘనత మనదేనని పేర్కొన్నారు. వైరస్‌ సోకినవారిలో 2 శాతం మంది మాత్రమే మరణిస్తున్నారని, 98% మంది కోలుకొంటున్నారని తెలిపారు. 2శాతంగా ఉన్న మరణాలపై దృష్టి సారించే బదులు 98% కోలుకొంటున్న వారి అంశాన్ని హైలైట్‌ చేయాలని సూచించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, కాంగ్రెస్‌ నేత వీ హన్మంతరావు వంటి పెద్దలు కూడా కరోనాపై పోరాడి విజయంసాధించారని గుర్తుచేశారు.

వైద్యరంగంలో మూడోస్థానం: మంత్రి ఈటల రాజేందర్

అతి తక్కువ సమయంలో మహబూబ్‌నగర్‌లో వైద్య కళాశాలను పూర్తిచేయడం అభినందనీయమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రశంసించారు. సమైక్య రాష్ట్రంలో ఒక్క మెడికల్‌ కళాశాల కూడా రాలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు మెడికల్‌ కళాశాలలు వచ్చాయని చెప్పారు. వైద్యరంగంలో కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ మూడోస్థానంలో ఉన్నదని వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించడంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకొన్నామని, భవిష్యత్తులో కూడా సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు. మహబూబ్‌నగర్‌ వైద్యకళాశాలలో ప్రైవేట్‌ దవాఖానకు దీటుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. కొవిడ్‌కు వంద పడకల దవాఖానతోపాటు టెస్టింగ్‌ సౌకర్యాన్ని కూడా ఏర్పాటుచేస్తామని తెలిపారు.

హైదరాబాద్‌ పోయే తిప్పలు తప్పాయి: మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

గతంలో వైద్యంకోసం ప్రతి చిన్న విషయానికి హైదరాబాద్‌ వెళ్లాల్సివచ్చేదని, మెడికల్‌ కళాశాల ఏర్పాటు తర్వాత అలాంటి తిప్పలు తప్పాయని క్రీడలు, ఆబ్కారీశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. వైద్యకళాశాల ప్రారంభించిన పదేండ్లలో రావాల్సిన పీజీ కోర్సులు కేవలం మూడేండ్లలోనే వచ్చాయన్నారు. పాలమూరు అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు జిల్లావాసులు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు.

అతి పెద్ద ఎకోపార్కుకు శ్రీకారం

పాలమూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం మంత్రి కేటీఆర్‌ శ్రీకారంచుట్టారు. దేశంలోనే అతి పెద్ద అర్బన్‌ ఎకోపార్కును మంత్రి ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని అప్పన్నపల్లి రిజర్వ్‌ పార్కు పరిధిలో 2087 ఎకరాల్లో విస్తరించిన ఈ పార్కుకు కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్కుగా నామకరణంచేశారు. ఇప్పటివరకు కోల్‌కతాలో వెయ్యి ఎకరాల్లో విస్తరించిన మెయిడెన్‌ పార్కు దేశంలో అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందింది. జెంషెడ్పూర్‌లో 500 ఎకరాల్లోని జూబ్లీ పార్కు, లక్నోలో 376 ఎకరాల్లోని జ్ఞానేశ్వర్‌ మిశ్రా పార్కులు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లోని కేసీఆర్‌ ఎకో అర్బన్‌పార్కు ఏకంగా 2087 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఈ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. పాలమూరులో పర్యాటకానికి మంచిరోజులు వచ్చాయన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకంటే మహబూబ్‌నగర్‌ అగ్రగామిగా ముందుకుపోతుందనటంలో సందేహంలేదని తెలిపారు. మహబూబ్‌నగర్‌ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దటంలో కీలకపాత్ర పోషించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అభినందించారు.

గూడులేని వారందరికీ డబుల్‌ ఇండ్లు

రాష్ట్రంలో గూడులేని నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అందిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ముగింపు ఉండదని.. ఇది నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోని వీరన్నపేట ప్రాంతంలో నిరుపేదలకోసం నిర్మించిన 660 ఇండ్లను మంత్రి ప్రారంభించారు. కౌసల్య అనే ఒంటరి మహిళకు మంత్రి కేటీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇంటి పత్రాలను అందించారు. అన్నం ఉడికిందా, లేదా అన్నది ఒక మెతుకును పట్టుకొంటే తెలిసిపోతుందని, డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపులో ప్రభుత్వం ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నదో ఒంటరి మహిళను అడిగితే చాలని మంత్రి చెప్పారు.

‘తప్పుచేసిన వారు.. మా వెంట ఉన్నప్పటికీ జైలుకు పంపిస్తాం. పారదర్శకతకు నిలువుటద్దంలా పనిచేస్తాం’ అని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. అనంతరం బైపాస్‌రోడ్డు ఎనుగొండలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి.. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు పది లక్షల మొక్కల పంపిణీకార్యక్రమాన్ని ప్రారంభించారు. బస్టాండ్‌ సమీపంలో చిరువ్యాపారులకోసం కొత్తగా ఏర్పాటుచేసిన షెల్టర్లను ప్రారంభించి నియామక పత్రాలను అందించారు. జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్న కార్యక్రమాల్లో సహచర మంత్రులు ఈటల, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎంపీ మన్నే శ్రీనివాస్‌రెడ్డి, మండలి విప్‌ దామోదర్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు బాద్మి శివకుమార్‌, గట్టు తిమ్మప్ప, గ్రంథాలయాల చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అంజయ్యయాదవ్‌, నరేందర్‌రెడ్డి, బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, ఎస్పీ రెమా రాజేశ్వరి, వైద్యకళాశాల డైరెక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, డీపీఆర్వో కృష్ణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ సునంద, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, జనరల్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ రామ్‌కిషన్‌, డీసీసీబీ చైర్మన్‌ నిజాం బాషా, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

సంక్షేమం ఆగదు

కొవిడ్‌ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఏ ఒక్క సంక్షేమపథకం ఆగకుండా చర్యలు తీసుకొన్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటుచేసిన రుణమేళాలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌.. రూ.145 కోట్ల రుణాలను పంపిణీచేశారు. ఈ రుణాల వల్ల 82,745 మంది లబ్ధి పొందారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ఉదండాపూర్‌, కరివెన రిజర్వాయర్లను త్వరితగతిన పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.