Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇండ్ల దళారులను నమ్మొద్దు

-అర్హులందరికీ పారదర్శకంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు
-1.20 లక్షల మందికి ఇండ్ల పట్టాలిచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే
-సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం
-ఈసారి మరింత అద్భుతంగా బతుకమ్మ చీరెలు
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్
-సిరిసిల్లలో 3,052 మంది పేదలకు ఇండ్ల పట్టాలు

రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్నామని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతున్నదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు పేర్కొన్నారు. మధ్య దళారీలను నమ్మి మోసపోవద్దని, ఎవరికీ నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతన్నల కల నెరవేరబోతున్నదని, ఇంటింటికీ సీంఎ ఫొటో పెట్టుకునేలా అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు. బతుకమ్మ చీరల తయారీతో సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి గుర్తింపు పొందడం హర్షణీయమన్నారు.

బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. సిరిసిల్ల పట్టణం, మం డలంలోని రగుడు గ్రామంలో శుభకార్యాలకు హాజరయ్యారు. అనంతరం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటుచేసిన ఇండ్ల పట్టాల పంపిణీకి హాజరయ్యారు. బీడీ, నేత కార్మికులకు నివేశన స్థలాల పట్టాలు పంపిణీచేశారు. అనంతరం మాట్లాడుతూ 1979లో అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాలకు పట్టాల కోసం 40 ఏండ్లుగా ఎదురుచూస్తున్న పేదల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను స్ఫూర్తిగా తీసుకొని అనేక రాష్ర్టాలు అదే బాటలో నడువడం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ కార్యదక్షత, ప్రత్యేక చొరవతో.. గూడులేని నిరుపేదలందరికీ ఇండ్లు కట్టిస్తున్నామని చెప్పారు. సమగ్ర సర్వే ప్రకారం ఇల్లులేని వారి జాబితా ప్రభుత్వం వద్ద ఉన్నదని, దాని ప్రకారమే అందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని వివరించారు.

ఆడబిడ్డలు తలుచుకునేలా బతుకమ్మ చీరెలు
ఈసారి బతుకమ్మ చీరెలు అద్భుతంగా తయారుచేస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. చీరెలు గతంలోకన్నా నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిపారు. ప్రతి ఆడబిడ్డ నేతన్నల నైపుణ్యాన్ని తలుచుకునేలా అందమైన డిజైన్లతో రూపొందిస్తున్నామని చెప్పారు. సిరిసిల్లను రాష్ట్రంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేసి, అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టంచేశారు. రూ.200 కోట్లతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తున్నామన్నారు. అపెరల్ పార్కు ద్వారా 10వేల మంది మహిళలకు ఉపాధి శిక్షణ ఇచ్చి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలకు నెలకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు, నేతన్నలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఆదాయం వచ్చేలా చూస్తామన్నారు. కాళేశ్వరం 9వ ప్యాకేజీ ద్వారా చేపడుతున్న ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎగువ మానేరు నింపి జిల్లాలోని రెండులక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, వైస్‌చైర్మన్ తవుటు కనకయ్య, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

3,052 మందికి పట్టాలు పంపిణీ
సిరిసిల్లలోని బీవైనగర్, ఇందిరానగర్, సుందరయ్యనగర్, పద్మానగర్ వార్డుల్లోని 3,052 మందికి బుధవారం పట్టాలు అందజేశారు. ఇండ్లపట్టాల కోసం నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పేదలు.. కల సాకారం కావడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కేటీఆర్ చేతులమీదుగా పట్టాలు అందుకున్న వారి కండ్లల్లో ఆనందం వ్యక్తమైంది. పట్టాలు తీసుకుంటూ ప్రతి ఒక్క రూ కేటీఆర్‌కు చేతులెత్తి దండం పెడుతూ కృతజ్ఞతలు తెలిపారు. పట్టాలు ఇచ్చేందుకు మొత్తం పది కౌంటర్లు ఏర్పాటుచేశారు. జిల్లాలోని 13 మండలాలకు చెందిన తహసీల్దార్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. పలువురు వినతిపత్రాలు అందించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కేటీఆర్ వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని సమస్యలను శ్రద్ధగా విన్నారు. వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు.

అంజన్న కుటుంబానికి అండగా ఉంటా..

గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట మాజీ సర్పంచ్ అంజాగౌడ్ కుటుంబానికి టీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా ఇచ్చారు. దమ్మన్నపేట మాజీ సర్పంచ్, టీఆర్‌ఎస్ నాయకులు అన్నం అంజాగౌడ్ గుండె పోటుతో గత శనివారం మృతి చెందగా బుధవారం బాధిత కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. అంజాగౌడ్‌కు కొడుకులు లేనందున డిగ్రీ చదువుకుంటున్న ఒకే ఒక కూతురు భావనకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అంజాగౌడ్ పేరు మీద గల భూమిని విరాసత్ ద్వారా కుటుంబ సభ్యుల పేర్ల మీద భూమి మార్పిడి చేయాలని పక్కనే ఉన్న కలెక్టర్‌కు ఆదేశించారు. రైతు బీమా ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల బీమా చెక్కును బాధిత కుటుంబ స భ్యులకు కేటీఆర్ అందజేశారు. టీఆర్‌ఎస్ సభ్యత్వం ఉన్నందున పార్టీ విధానాల ప్రకా రం త్వరలో బీమా డబ్బులు అందిస్తానన్నారు. ఆయన వెంట కలెక్టర్ వెంకట్రామరెడ్డి, డీఏవో రణధీర్, తహసీల్దార్ సుమ, ఏవో పూర్ణిమ, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు లింగన్నగారి దయాకర్‌రావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రాజేందర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కొమిరిశెట్టి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.