-రాష్ర్టావతరణ దినోత్సవాల సందర్భంగా నగరంలో లక్ష మంది పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ హైదరాబాద్ నగరంలోని రెండు లక్షలమంది పేదలకు సొంత ఇండ్లు కట్టించి తీరుతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విస్పష్టంగా ప్రకటించారు. ఈ విషయంలో ఎవరికీ భయపడనని, పేదలకు న్యాయం చేసే విషయంలో వెనుకకుపోయే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. పేదలకు ఇండ్లు కట్టించడానికి యూనివర్సిటీల స్థలాన్ని ఉపయోగించి తీరుతామని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను రాజకీయ పార్టీలు రెచ్చగొడుతున్నాయని కేసీఆర్ ఆరోపించారు. ఓయూలో పేదల ఇండ్లకోసం తీసుకుంటున్నది కేవలం 11 ఎకరాలు మాత్రమేనన్న విషయాన్ని గుర్తు చేశారు. తాను మొండి మనిషినని, అనుకున్నది సాధించేదాక వదిలిపెట్టేది లేదని సహజ శైలిలో ప్రకటించారు. ప్రజలుకూడా ధర్మం, న్యాయంవైపు నిలబడాలని కోరారు.
-నేను మొండి మనిషిని.. అనుకున్నది సాధించేదాకా వెంటపడుతా -పేదలకు న్యాయంచేసే విషయంలో వెనుకకుపోను -ఓయూ స్థలంలో పేదలకు ఇండ్లు -విద్యార్థులను రాజకీయ పార్టీలు రెచ్చగొడ్తున్నాయి -వర్సిటీలకు వందల ఎకరాల అవసరం లేదు -నగరంలో సేకరించే చెత్తతో 50 మెగావాట్ల విద్యుత్ -హైదరాబాద్‌ను హైదరాబాదీలే మార్చుకోవాలి -గత పాలకులు గలీజుగా మార్చి.. డబ్బా కొట్టుకున్నారు -స్వచ్ఛ హైదరాబాద్‌లో సీఎం చంద్రశేఖర్‌రావు -20వేల మంది సఫాయి కర్మచారీలకు ఇండ్లు కట్టిస్తామని వెల్లడి ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తి గొప్పదని, సంఘటిత శక్తిలో చాలా బలముందని అన్నారు. స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నాలుగో రోజైన మంగళవారం ముఖ్యమంత్రి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఎల్‌ఎన్‌నగర్, ఈశ్వరీబాయినగర్, బౌద్ధనగర్, ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్ బస్తీ, జూబ్లీహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో పర్యటించారు. ప్రజలతో ముఖాముఖి సంభాషించారు. సికింద్రాబాద్ బస్తీల్లో పర్యటించిన సందర్భంగా ప్రజలతో కేసీఆర్ మాట్లాడుతూ ఒక పని మొదలుపెట్టిన తర్వాత మధ్యలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను మొండి మనిషిని. అనుకున్నది సాధించేదాకా దాని వెంబడి పడుతా.
దాని కథో, నా కథో తేలాలి అని చెప్పారు. గత పాలకులు రేస్ కోర్సులకు, గోల్ఫ్ కోర్టులకు వందల ఎకరాలు ఇచ్చారు. పేదల ఇండ్లకు భూమి వద్దా? పేదలకోసం ఖాళీగా ఉన్న భూములను సేకరించి ఇండ్లు కట్టించాలనుకుంటున్నాం. అందుకోసం ఉస్మానియా యూనివర్సిటీకీ చెందిన 11 ఎకరాల భూమిని తీసుకోవాలని అనుకున్నాం. దీనికి విద్యార్థులు నా దిష్టిబొమ్మను కాలబెడుతున్నరు. రాజకీయ పార్టీల నాయకులు వారిని రెచ్చగొడుతున్నరు. చిల్లర రాజకీయాలు చేస్తున్నరు అని సీఎం విమర్శించారు.
అప్పటి పాలకులు అగ్రికల్చర్ యూనివర్సిటీకీ 5వేల ఎకరాలు, ఉస్మానియా యూనివర్సిటీకీ 2800 ఎకరాల భూమిని కేటాయించారు. ఓయూ భూమి ఇప్పటికే అన్యాక్రాంతమై 1847 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఇందులోనుంచి 11 ఎకరాలు మాత్రమే పేదల ఇండ్లకోసం తీసుకోవాలనుకుంటున్నాం. ఇది కేవలం సికింద్రాబాద్ నియోజకవర్గ పేద ప్రజల కోసమే అని సీఎం చెప్పారు. వాస్తవానికి యూనివర్సిటీలకు అంత జాగా అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం హర్టీకల్చర్ యూనివర్సిటినీ తెలంగాణకు కేటాయిస్తున్నామని తెలియజేస్తూ.. 500 ఎకరాల భూమి కావాలని అడిగారు.
యూనివర్సిటీకీ అంత అవసరం లేదని, 50 ఎకరాలు సరిపోతుందని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకే చెప్పాను. ఆయన కూడా నిజమే అన్నడు. ఇది మహరాజుల కాలం కాదు. ప్రజలు పెరుగుతున్నారు. భూమి పెరుగదు. పట్టణ ప్రాంతాల్లోని ప్రతి అంగుళం భూమినీ సమర్ధవంతంగా వినియోగించుకోవాలి అని కేసీఆర్ చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా ప్రజలు అధికారుల దృష్టికి తెచ్చిన సమస్యలపై చర్చించేందుకు 22న హెచ్‌ఐసీసీలో ఐఏఎస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సీఎం ప్రకటించారు.
కేసీఆర్ ఉఫ్ అని ఊదేస్తే జాగా పుట్టుకురాదు స్వచ్ఛ హైదరాబాద్‌లో బస్తీలు తిరుగుతుంటే ప్రజలు అనేక సమస్యలు చెబుతున్నారు. చాలామంది పేదలకు ఇండ్లు కట్టియ్యాలి. హస్పిటల్స్, కాలేజీలు కట్టియ్యాలి. గరీబోళ్లకు కనీస సౌకర్యాలు కల్పించాలి. ఇవన్నీ చేయాలంటే జాగా కావాలే. కేసీఆర్ ఉఫ్ అని ఊదేస్తే జాగా పుట్టుకురాదు. ఎక్కడో ఉన్న చోటనుంచి సర్దాలి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏదో మాట్లాడుతరు. రాజకీయ పార్టీలు వాటిని భుజానికెత్తుకుని మోస్తున్నరు. నా దిష్టిబొమ్మలు తగులబెడుతున్నరు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పేదలను పట్టించుకోలేదు. ఇప్పుడుకూడా గట్లనే ఉండాలే అనుకుంటున్నరు. పేదల జీవితాల్లో మార్పు రావడం వారికిష్టం ఉండదు అని కేసీఆర్ ప్రతిపక్షాల తీరును దుయ్యబట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ భూమిని కేసీఆర్‌కో, మంత్రి పద్మారావు ఇండ్లు కట్టించుకోవడానికో అడుగడం లేదు. పేదలైన బీసీ, ఎస్సీ, మైనారిటీ ప్రజలకోసం తీసుకుంటాం. ఇటువంటి సమస్యను ప్రజలు ఎదుర్కోవాలే. మనకెందుకులే అనుకుంటే పనికాదు అని చెప్పారు.
నగరాన్ని మనమే బాగు చేసుకోవాలి సిమెంట్ బంగ్లాలు కట్టి, చెట్లు పెంచక, తెలివితక్కువతనంతో హైదరాబాద్‌ను అనారికంగా తయారుచేశారు. ఈ నగరాన్ని బాగు చేసుకోవాల్సిన అక్కర ఉంది. ఎవరి ఇల్లును వారే శుభ్రపర్చుకున్నట్లు హైదరాబాద్‌ను హైదరాబాదీలే మార్చుకోవాలి. ఒక్క ముఖ్యమంత్రితోనే, మంత్రులతోనే, ఎమ్మెల్యేలతోనే ఇది సాధ్యంకాదు. ప్రభుత్వం ప్రజలకు ప్రేరణ ఇస్తుంది. నిధులు మంజూరుచేస్తుంది. అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రజలదే అని సీఎం చెప్పారు. తప్పు జరిగితే ప్రశ్నించే బాధ్యత ప్రజలపై ఉంది. ప్రజలు ప్రేక్షకుల్లా ఉంటే అభివృద్ధి సాధ్యంకాదు. అభివృద్ధి పనుల్లో ప్రజల సహకారం కావాలి. ప్రజల సంఘటిత శక్తిలో ఎనలేని బలం ఉంది. పిడికిలి బిగించి పట్టుపట్టితే విజయం సాధించవచ్చు అంటూ ప్రజల్లో స్ఫూర్తి నింపారు. తప్పు చేస్తే నిలదీయండి. తెలంగాణ ప్రభుత్వం ఓపెన్‌గా ఉంది. గత ప్రభుత్వాలు వాస్తవ దృక్పథంతో పనిచేయక సుందరమైన హైదరాబాద్‌ను గలీజు చేశాయి. అనాగరికంగా మార్చాయి. అభివృద్ధి చేశామని డబ్బా కొట్టుకున్నాయి. అమెరికావంటి దేశాల నేతలు వస్తే మెయిన్ రోడ్లు చూపించారు. పేదల బస్తీల్లో మార్పు తేలేదు. అందుకే ఈ పరిస్థితి. ప్రపంచస్థాయి నగరమైన హైదరాబాద్‌ను ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లాలి. ఇప్పటిదాకా ఇట్లా గడిచింది. మన పిల్లల బతుకులు ఇట్లా ఉండద్దు. ప్రపంచంతో పోటీపడే పాఠాలు కావాలి. మనం అదే విద్య నేర్పాలి అని చెప్పారు. దేశంలో ఎక్కడ చూసిన చైనా వస్తువులే. టపాకాయలనుంచి సెల్‌ఫోన్ల వరకు చైనా వస్తువులు మన మార్కెట్‌ను ముంచుతున్నాయి. ఈ పరిస్థితి పోవాలె. మన వస్తువులు మనమే తయారు చేసుకునే స్థాయికి ఎదగాలే.
దేశంలోనే ఐదు అత్యంత సురక్షిత నగరాల్లో హైదరాబాద్ ఒకటి. నేపాల్‌లో మాదిరిగా భూకంపాలు రావు. సముద్ర తీర ప్రాంతాల్లో మాదిరిగా ఇక్కడ ఇబ్బందులు ఉండవు. సమశీతోష్ట వాతావరణం ఉన్న గొప్ప నగరం. ఇటువంటి గొప్ప నగరాన్ని ఖాళీ జాగా లేకుండా కాంక్రీటు కట్టడాలతో నింపేశారు. పచ్చదనం కరువైంది. హైదరాబాద్‌ను పరిశుభ్రమైన, ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి. అందుకోసం కష్టపడుదాం అని పిలుపునిచ్చారు.
పేదలు అలాగే గడపాల్నా? వాళ్లు కూడా మనలాగే పుట్టిన మనుషులే. అదృష్టం బాగా లేక పేదలుగా పుట్టిండ్రు. వాళ్లు బతుకంతా అలాగే గడపాల్నా? వారి దుఃఖానికి ముగింపు అవసరం లేదా? మన సంస్కృతి, సంస్కారం ఎక్కడ బోయింది? మన నాగరికత ఏమైంది? వేదాల్లో నక్సలిజం కన్నా గొప్ప సూత్రం ఉంది. అన్నం తింటున్నప్పుడు ఆకలితో వచ్చిన వ్యక్తికి రెండు ముద్దలు పెట్టాలని వేదాలు చెప్తున్నాయి. ఈ సంస్కారం ఏమైంది? ఉగాది పోయింది. జనవరి ఫస్టున టపాకాయలు కాల్చి వేడుక చేసుకుంటున్నాం. ఇలాపోతే మన జాతి ఏమవుతుంది? నాగరికత పరిస్థితి ఏంటి? దీనిని పెద్దలు సరిదిద్దాలి అని సీఎం చెప్పారు.
సికింద్రాబాద్‌కు ఆపరేషన్ అవసరం గతంలో సూరత్ పరిస్థితి హైదరాబాద్‌లా ఉండేదని, వారు చేసిన తప్పిదాలవల్ల ఆ నగరం చిన్నాభిన్నమై ప్లేగు వ్యాధి వచ్చిందని కేసీఆర్ గుర్తుచేశారు. ఎవరూ ఉండలేని పరిస్థితి. అక్కడ కమిషనర్‌గా పనిచేసిన తెలుగువాడైన ఎస్‌ఆర్‌రావు చొరవతో పరిస్థితిలో మార్పు వచ్చింది. మనంకూడా అలాగే మన నగరాన్ని మార్చుకోవాల్సిన అక్కర ఉంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తుంటే విచిత్రమైన పరిస్థితి కనబడుతున్నది. ఎక్కడ చూసినా స్థలం లేకుండా ఇండ్లు కట్టి ఉన్నాయి. చిలుకలగూడ నాలా లోపలకూడా ఇండ్లు కట్టారు. దండం పెట్టాలి. ఇటువంటి బిల్డింగ్‌లను కూలగొట్టాలే. ఇది చాలా మందికి నచ్చదు. అయినా చేయాలే. మంచి డాక్టర్ వద్దకు వెళ్తే రోగిని పరీక్షించి మొదట రెస్ట్ తీసుకోమంటడు. తర్వాత డైట్ మెయింటెన్ చెయ్యమని చెబుతడు. మళ్లీపోతే ట్యాబ్లెట్లు ఇస్తడు.
తగ్గకపోతే ఇంజక్షన్ ఇస్తడు. ఇంకా గట్టి రోగం అంటే ఎక్స్‌రే తీసి ఆపరేషన్ చేస్తడు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది! సమస్య ఉంది. భయపడి పారిపోతే కుదరదు. పరిష్కరించుకోవాలి అని సీఎం చెప్పారు. ఇక్కడ వై జంక్షన్ అడిగారు. మంజూరుచేస్తాను. నెలకు నాలుగుసార్లు మీ నియోజకవర్గానికి వస్తా. అవసరమనుకుంటే పదిమంది పెద్దమనుషులతో నియోజకవర్గ సమస్యలపై సమావేశమవుతా. వందకోట్లు కాదు అవసరమైతే నగరంకోసం రూ.400 కోట్లు ప్రభుత్వం ఇస్తుంది అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
20వేల మంది సపాయి కర్మచారీలకు ఇండ్లు నగరంలో పనిచేస్తున్న 20వేల మంది సఫాయి కర్మచారీలకు ఇండ్లు కట్టిస్తమని, వందశాతం జీతాలు పెంచిస్తమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్ కాలనీలో ముఖ్యమంత్రి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాత్రే అధికారులతో మాట్లాడి నిర్ణయం చేస్తం. సపాయి కర్మచారీ కాలనీ నిర్మిస్తం. అందరి వాసనను దూరంగా పారేసే సఫాయి కర్మచారీలు మనకు గౌరవనీయులే. వారు కూడా పేదలే. వారికి మంచి ఇండ్లు, మంచి జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేస్తం అని చెప్పారు.
ఇందిరానగర్‌లో ఆరు అంతస్తుల భవనాలు ఇందిరానగర్ కాలనీ వాసులకు సీఎం వరాల జల్లు కురిపించారు. వారికి అక్కడ ఆరు అంతస్తుల్లో ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరానగర్ బస్తీ అంత తిరిగిన. అక్కడ ఎట్ల కాపురముంటున్నరు? ఎపుడు కూలిపోతయో తెల్వదు. ఇరుకు గల్లీలు ఉన్నాయి. మీ అందరికీ 176 ఇండ్లు కట్టించి, ఆరు అంతస్తులతో నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెడుత. మీరు ఎంత తొందరగా ఖాళీచేసి ఇస్తే అంతే తొందరగా ఇండ్లు కట్టిస్తం. ఈ ప్రాంతంలో ఎకరంన్నర జాగ ఉందట. దీంట్లోనే 176 కుటుంబాలకు 6 అంతస్తుల్లో ఇండ్లు కట్టిస్తం. పేదలకు పేదోళ్లే సహకారం అందించుకోవాలే. గత సర్కార్ డబ్బా ఇండ్లు కట్టిచ్చింది. ఒక బెడ్‌రూం 340 ఫీట్లు ఉన్నది. ఇపుడు అట్లగాదు. 560నుంచి 570ఫీట్లవరకు విశాలమైన రెండు బెడ్‌రూంలు, ఒక హాలు, వంటగది రెండు బాత్‌రూంలు కట్టిస్తం. వాటి ఖర్చు 9నుంచి 10లక్షల వరకు అయితంది. పై అంతస్తులకు వెళ్లేందుకు లిఫ్టు కూడా పెట్టిస్తం.
కిందిభాగంలో కొన్ని షాపింగ్ మడిగెలు పెడ్తం. వాటితో వచ్చే ఆదాయంతో కరెంట్ బిల్లు కట్టచ్చు. మళ్లీ నేనే వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేస్త. నాలుగైదు నెలల్లో కొబ్బరికాయ కొట్టి ఇళ్లళ్లకు పంపిస్త. మంచిగ వెలుతురు, గాలి వచ్చే విధంగ కడ్తం. ఇంటింటికీ నల్లా పెడ్తం. అందరికీ నీళ్లు పైనే వచ్చే విధంగా చేస్తం. ఇగ ఇండ్లు కట్టినంక కింద, మీద అనే లొల్లి వద్దు మనకు. మధ్యలో అధికారుల పెత్తనంలేకుండా మీకు మీరే ఓ చిన్నపిల్లోని చేతులతో లాటరీలు తీయించి, ఎవరికి ఎక్కడ వస్తె అక్కడ తీసుకోండ్రి. (ఈ సమయంలో మంచిగున్నదా? అని ముఖ్యమంత్రి ప్రజలను అడుగడంతో వారంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు.)
మంచి దావత్ ఇయ్యాలే కొత్త ఇళ్లకు పోయేటప్పుడు మాకు దావత్ ఇయ్యాలే అని ముఖ్యమంత్రి నవ్వుతూ అడుగడంతో బస్తీ ప్రజలు సంతోషంగా ఒప్పుకున్నారు. కొందరు మహిళలు దావత్‌తోపాటు కల్లుకూడా పోస్తామనడంతో ముఖ్యమంత్రి నవ్వి.. ఇదంతా మీకు ఖర్చు ఎందుకు? మీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఉన్నరు. ఆయననే దావత్ ఇస్తరు అని చెప్పారు. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. అదే మాకు భాగ్యం.. తప్పనిసరిగా దావత్ ఇస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సలీం, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, స్వచ్ఛ హైదరాబాద్ నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
కళ్లలో గిర్రున నీళ్లు తిరిగినయి నగరంలోని పేదల బస్తీల్లో ఇండ్లను చూస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందర్‌నగర్ అనే బస్తీలో తాను చూసిన పరిస్థితులను ప్రస్తావించారు. నిన్న నిజంగానే ఏడ్చినా ఒక బస్తీలో. మనిషన్నోడు ఎవడైనా ఏడుస్తడు. నాకళ్లల్ల గిర్రున నీళ్లు తిరిగినయి. ముఖ్యమంత్రిగా ఉండి ఏడుస్తే పెద్ద కథ అని సముదాయిచుకున్నా. అంత బాధ కలిగింది. ఒక ఇల్లు ఆరు ఫీట్లుపై 5 ఫీట్లు ఉంది. ముస్లిం సోదరులు. పాపం.. ఆ ఇంట్లో ఉండేది ఏడు ఎనిమిది మంది.
ఎట్ల ఉండాలి? ఏమి బతుకు? అదో జీవితమా? ఇంత నరకం అనుభవించడానికే భూమి మీద పుట్టినమా? అని ఆవేదనతో అన్నారు. ఎక్కడికిపోయినా ఇదే సమస్య ఉందని చెప్పారు. ఇండ్లు లేనటువంటి పేదలు దాదాపు 2 లక్షల పైచిలుకు ఉన్నరు హైదరాబాద్‌లో. నేను చెప్పినటువంటి డబ్బా ఇండ్లళ్ల ఉండుకుంట! హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఒక ఇల్లుంటది. నా గాశారం బాగ లేక దసరానాడు చూసిన! ఐడీహెచ్ కాలనీకి ఫౌండేషన్‌వేసి వస్తుంటే, వాళ్లు చేయిపెట్టి అపితే పోయినం. ఆ ఇల్లు కూడా ఏడు ఫీట్లు బై ఎనిమిది ఫీట్లు ఉంది. చాలా దారుణమైన పరిస్థితులున్నయి. దీనికి అంతమేంది? ఇంత కాలం రాజులు వేరే ఉండే.. రాజ్యం వేరే ఉండే. వాళ్లకు గంత కడుపునొప్పి మనమీద లేకుండే.
ఇవ్వాళ మన రాష్ట్రం.. మనమే ఉన్నం. అప్పుడు ఈ పరిస్థితి ఎందుకు ఉండాలి? ఆరు నూరైనా సరే మారాలే. ఆకాశం.. భూమి బద్దలైనా సరే మారాలే.. మారి తీరాలే. మారితెనే వచ్చిన తెలంగాణకు ఒక అర్థం అని కేసీఆర్ చెప్పారు. ఈ 2 లక్షల మంది పేదలకు రాబోయే రెండున్నర మూడేండ్లలో వందకు వందశాతం కచ్చితంగా ఇండ్లు కట్టి తీరుతాం. అది కూడా డబ్బాలాగా ఒక రూమ్ కట్టే ఇంట్రెస్ట్ లేదు. ఒకటే రూమ్ కట్టి అల్ల బతుకుపో అంటె ఎట్ల? ఒక మంత్రిని తీసుకువచ్చి ఉంచుదాం.. మంత్రి ఉంటడా? ఎమ్మెల్యే ఉంటడా? ఎంపీ ఉంటడా? మరి ప్రజలెట్ల ఉంటరు? ఒకటే రూము ఉంటే ఆ ఇంటి ఆడబిడ్డలు స్నానం చేసి బట్టలు ఏడ మార్చుకోవాలి? ఎంత ఆత్మన్యూనత? అది నరకం! అనుభవిస్తే తప్ప తెలియదు ఆ బాధ! ఆ పరిస్థితి మారాలి అని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా ఎన్‌బీటీ నగర్ ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
రోజు ఉదయం 7 గంటలకే మంచినీళ్లు అర్థరాత్రి 2 గంటలకు మంచినీళ్లు వస్తున్నాయని, దీంతో తమకు నిద్ర ఉండడం లేదని సీఎం కేసీఆర్‌కు ఎన్‌బీటీ నగర్ ప్రజలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. వాటర్ బోర్డు అధికారులతో చర్చించి, కారణాలు తెలుసుకున్నారు. శుక్రవారం నుంచి ఉదయం 7 గంటలకే మంచినీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. నీటి ఒత్తిడి సామర్థ్యం పెంచేందుకు అవసరమైన పైపుల కోసం రూ.3 కోట్లు ఇక్కడే మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. ఈ బస్తీలో మెప్మా కింద వంద మహిళా గ్రూపులు ఉన్నాయని, మహిళా భవనం కావాలని అడిగారని చెప్పిన సీఎం.. పక్కనే వేయి గజాల స్థలం ఉందని, అందులో రూ.30, రూ.35 లక్షలతో బ్రహ్మాండమైన భవనం కట్టిస్తానని హామీ ఇచ్చారు. అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు. ఒకటి రెండు రోజుల్లో శంకుస్థాపన చేయాలన్నారు.
ఈ భవనం మీటింగ్‌లకే కాకుండా కంప్యూటర్లతో పిల్లలకు శిక్షణ ఇచ్చే విధంగా కూడా ఉపయోగపడేలా ఉండాలన్నారు. మహిళా గ్రూపులకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని సీఎం చెప్పారు. ఎవరికైనా రుణం రాకపోతే మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళితే ఇప్పిస్తారని తెలిపారు. బస్తీలో ఉన్న హనుమాన్ వ్యాయామశాల భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఇందులో మోడరన్ జిమ్ ఏర్పాటుకు ఎంతకావాలో అంత మంజూరుచేస్తానని తెలిపారు. బస్తీ యువకులు ఉచిత వైఫైతోపాటు లైబ్రరీ కూడా కావాలని అడుగడంతో సమ్మతి తెలిపారు. దోబీ ఘాట్‌ల గురించి మాట్లాడుతూ వీలైనంత త్వరగా వాటిని నిర్మించి వారికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. బస్తీలో హైటెన్షన్ వైర్లు తొలగించి అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడానికి రూ.1.27 కోట్లు మంజూరు చేస్తున్నానన్నారు.
ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్లు వాటర్ గ్రిడ్ ద్వారా హైదరాబాద్ మినహా అన్ని గ్రామాలు, పట్టణాల్లో నల్లాల ద్వారా మంచినీళ్లు ఇవ్వడానికి ప్రణాళిక తయారు అయిందని సీఎం కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో కూడా ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచినీరు సరఫరా చేసే కార్యక్రమం తీసుకున్నామని తెలిపారు. నగరంలో లక్ష మందికి ఇండ్ల పట్టాల పంపిణీ రాష్ర్టావతరణ దినోత్సవం సందర్భంగా జీవో 58 కింద హైదరాబాద్‌లో లక్ష మంది పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. జూన్ రెండవ తేదీనుంచి వారం పాటు జరిగే ఉత్సవాల్లో ఈ పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. అలాగే వివిధ సంస్ధలకు చెందిన భూముల్లో ఉన్న దరఖాస్తులకు కూడా పట్టాలు ఇస్తామని, కాకపోతే ఆ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత ఆలస్యమవుతుందని వివరించారు.
ఫొటోలకోసం రాలేదు.. ఎన్నికలు లేవు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ఒక్క రోజు చేయి ఊపి పోయేది కాదు. ఫోటో సెషన్స్‌కోసం రాలేదు. పరిస్థితిలో మార్పు వచ్చేవరకు పనిచేస్తాం. వచ్చే నాలుగేండ్లు నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు ఎన్నికలు లేవు. మురుగునీరు, తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, మార్కెట్ వ్యవస్థ, శ్మశానవాటికలు, బస్‌బేలు, టాయిలెట్స్ సమగ్రంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాం అని సీఎం తెలిపారు. ఇండ్లు లేని వారి వివరాలు సేకరించేందుకు మూడు, నాలుగు రోజుల్లో అధికారులు ప్రతి ఇంటికీ వస్తారు. వివరాల అధారంగా ప్రతీ పేదవాడికీ డబుల్ బెడ్ రూం ఇంటిని ప్రభుత్వం అందిస్తుంది. ఇవన్నీ చేయాలంటే కొంత సమయం కావాలి.
ఇండ్లకోసం ఏడున్నర వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలిస్తాను. ముఖ్యమంత్రి స్వయంగా మీ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉండటం వరంలాంటిది. ఇంటింటికీ నెల, నెల పదిహేను రోజుల్లో రెండు ప్లాస్టిక్ బుట్టలు అందచేస్తం. నగరానికి 2 వేల హైడ్రాలిక్ ట్రాలీలు తెస్తాం. చెత్త నింపుకొని నేరుగా లారీల్లో డంప్ చేస్తే అవి చెత్తను తీసుకెళ్తాయి. డంపింగ్ యార్డులు ఉండవు. ఇక సఫాయి కార్మికులను ఎవరూ కసురు కోవద్దు. అవసరమైతే టీ తాగించండి. క్షేమ సమాచారాలు అడగండి. సఫాయిల పుణ్యంవల్లే నగరం ఆరోగ్యంగా ఉంది అని చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఫిష్ మార్కెట్‌లలో దుకాణాలను మత్య్సకారులైన సోదరసోదరీమణులకు కేటాయిస్తాం. నగరంలో సేకరించే చెత్తతో 50 మెగావాట్ల విద్యుత్ తయారు చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ సమావేశంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పరిస్థితి ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీలా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఉన్న ఈ సక్కదనాల హైదరాబాద్‌ను ఒకడు నేను కట్టించానంటే ఇంకొకడు నేనే కట్టించానని అంటాడు. ఇలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన పనిలేదు అని సీఎం చెప్పారు. హైదరాబాద్‌ను నేను, మీరు అందరం కలిసి బాగు చేసుకోవాలని, ఇది అందరి పనని అన్నారు. ఇళ్లనుంచి చెత్తను విడివిడిగా సేకరించడానికి తడి చెత్తకు వేరుగా, పొడిచెత్తకు వేరుగా ప్లాస్టిక్ డస్ట్‌బిన్‌లను జీహెచ్‌ఎంసీనే ఇస్తుందని సీఎం తెలిపారు. హైదరాబాద్‌లో 20 లక్షల ఇండ్లకు 40 లక్షల చెత్తబుట్టలు కావాలన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ప్లాస్టిక్ కంపెనీల వాళ్లు ఇంత పెద్ద ఎత్తున చెత్తడబ్బాలను సరఫరా చేయలేమన్నారని, ఎక్కడ దొరికితే అక్కడ నుంచి ఆర్డ్‌ర్ చేసి రెండు నెలల్లో ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు చెప్పానని సీఎం అన్నారు.ఇండ్లు కట్టించి తీరుతా
vv