-కాల్చి చంపిన కాంగ్రెస్సే కన్నీరు కార్చడమా?
-ఆదివాసీ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి
-ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే పర్మినెంట్ జైలే
-చీకటి ఒప్పందాల పొలిటికల్ బ్రోకర్ రేవంత్
-దళిత, గిరిజనులకు క్షమాపణ చెప్పాలి
-పోడుభూముల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారు
-మంత్రులు వేముల, ఇంద్రకరణ్‌రెడ్డి
-ఇంద్రవెల్లి గాయంపై రేవంత్ కారం

ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే పర్మినెంట్‌గా జైల్లో ఉంటావ్.. రేవంత్ ఖబడ్దార్ అని రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. మంగళవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి వేముల మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏండ్ల క్రితం ఇంద్రవెల్లిలో ఆదివాసీలను పిట్టల్లా కాల్చిచంపిన కాంగ్రెస్ మారణకాండను ఎవరూ మరిచిపోలేదని తెలిపారు. అదేచోట సభపెట్టి ఆదివాసీ అమరుల స్మారకచిహ్నం నిర్మిస్తామని రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ఆదివాసీల శవాలమీద పేలాలు ఏరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ చేసిన మోసానికి ఇప్పటికీ ఆదివాసీల గుండెలు మండుతున్నాయని.. ఆ గాయం మీద రేవంత్‌రెడ్డి కారం చల్లారని విమర్శించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ చంద్రబాబు మోచేతినీళ్లు తాగుతున్న రేవంత్ చీకటి ఒప్పందాల పొలిటికల్ బ్రోకర్ అని మండిపడ్డారు.
టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను తెలంగాణ బలిదేవత అని చెప్పిన రేవంత్.. ఇప్పుడు తెలంగాణ తల్లి ఎలా అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి సభలో తనను నమ్మండి అంటున్నాడు.. ఏ రేవంత్‌ను నమ్మాలి? ఏబీవీపీ రేవంత్‌నా? టీడీపీ రేవంత్‌నా? కాంగ్రెస్ రేవంత్‌నా? ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌నా? ఏ రేవంత్‌ను నమ్మాలి? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తేగానే తమ కాళ్లకింద నేల కదిలిపోయి డ్రామా కంపెనీలా ఇంద్రవెల్లిలో సభపెట్టారని.. ఆ సభలో రేవంత్ డ్రామా ఆర్టిస్ట్‌గా మారాడని ధ్వజమెత్తారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరన్న సత్యాన్ని తెలుసుకోవాలని హితవుపలికారు. సీఎం కేసీఆర్‌పై బుడ్డరఖాన్‌లా మాట్లాడుతున్నారని, టీఆర్‌ఎస్‌పై, మంత్రులపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే పర్మినెంట్‌గా జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. పూటకోమాట.. రోజుకో పార్టీని మార్చే ఆయనను ప్రజలు విశ్వసించరని చెప్పారు. దమ్ముంటే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.
పైరవీలు చేసి పదవి తెచ్చుకున్న దొంగ: మంత్రి అల్లోల
రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. పైరవీలు చేసి, చంద్రబాబు దగ్గర లాబీచేసి పీసీసీ పదవిని తెచ్చుకున్న దొంగ అని మండిపడ్డారు. రేవంత్‌ను నమ్మితే కాంగ్రెస్ పార్టీ నట్టేట మునిగినట్టేనని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని యావత్‌దేశం హర్షిస్తున్నదని, వ్యాపారవేత్తలుగా మారాలన్న సదుద్దేశంతో సీఎం తెచ్చిన పథకంపై దళితులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఆదివాసీ, గిరిజన పోడుభూముల సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని అన్నారు. ఇప్పటికే జైలులో చిప్పకూడుతిన్న రేవంత్.. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవుపలికారు.
ఒళ్లు దగ్గర పెట్టుకో: విప్ గువ్వల బాలరాజు
రేవంత్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని ప్రభుత్వవిప్ గువ్వల బాలరాజు హెచ్చరించారు. దళితజాతి శాశ్వతంగా తలెత్తుకొని నిలబడే విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొస్తే.. కండ్లుకుట్టి నోరుపారేసుకుంటున్నారని విమర్శించారు. భూమికి జానెడులేని నీవు మాట్లాడితే 60 లక్షల మంది టీఆర్‌ఎస్ కుటుంబసభ్యులు ఊరుకుంటారు అనుకోకు.. మేం తలచుకుంటే నువ్వెక్కడుంటావో గుర్తించుకో అని మండిపడ్డారు. దళితబంధును ఆపాలని కుట్రలు చేస్తే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీ గూడెల్లో రక్తపుటేరులు పారించిన కాంగ్రెస్‌కు ఆదివాసీల గురించి మాట్లాడే నైతికహక్కులేదని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివాసీలు తలుచుకుంటే ఆదిలాబాద్ నుంచి అశ్వారావుపేటదాకా కాంగ్రెస్ తిరగలేదని హెచ్చరించారు. ఆదివాసీలకు రేవంత్ క్షమాపణ చెప్పాలని మాజీఎంపీ జీ నగేశ్ డిమాండ్ చేశారు. ఆదివాసీ జాతి ఉన్నంతకాలం కాంగ్రెస్‌ను విశ్వసించరని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఎస్ భరత్‌కుమార్ పాల్గొన్నారు.