Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇండస్ట్రియల్ పాలసీతో పెట్టుబడుల వెల్లువ

-సీఎం కేసీఆర్ ధీమా -12న టీఎస్ ఐపాస్ ప్రకటన -10-12రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు -ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రతినిధులతో ముఖ్యమంత్రి

KCR-meeting-with-ISB-students-and-delegates001

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు అత్యంత సులభంగా, ప్రశాంతంగా వ్యాపారం చేసుకునేలా ప్రభుత్వం ఈనెల 12న ఇండస్ట్రియల్ పాలసీ(టీఎస్ ఐపాస్)ని ప్రకటించనున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన 56 మంది ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రతినిధులతో శుక్రవారం ఆయన ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగింది.ప్రభుత్వం తెచ్చే పాలసీతో తెలంగాణ రాష్ర్టానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతుల జారీ, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, దరఖాస్తుల పరిశీలనకు సీఎంవోలో చేజింగ్ సెల్, 10-12 రోజుల్లోనే దరఖాస్తుల ప్రాసెస్ పూర్తి చేసి, తన చేతుల మీదుగానే ప్యాకెట్ రూపంలో అన్ని అనుమతుల పత్రాలను అందించడం జరుగుతుందని కేసీఆర్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు 1.70లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, అధికారులు చాలావేగంగా పనిచేస్తున్నారని, అందరికృషి తెలంగాణ అభివృద్ధి పర్చడంవైపే సాగుతోందని తెలిపారు. కొత్త రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని వాటిని క్రమంగా పరిష్కరిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు నెలలపాటు ఆర్థిక అవసరాలను ఎలా భర్తీ చేసుకోవాలనే అంశంపై దృష్టి పెట్టామని, ఫైనాన్స్ కమిషన్ కూడా తమ ప్రభుత్వం చేసిన పనులను అభినందించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు.

KCR-meeting-with-ISB-students-and-delegates0002

మిగులు బడ్జెటే కాదు.. మిగులు విద్యుత్ కూడా.. తెలంగాణ కేవలం మిగులు బడ్జెట్ రాష్ట్రమే కాకుండా మిగులు విద్యుత్ రాష్ట్రం కూడానని ముఖ్యమంత్రి వారితో చెప్పారు.త్వరలోనే తాము మిగులు విద్యుత్‌లోకి రాబోతున్నామని అన్నారు. ఈ సంవత్సరాంతానికి రాష్ట్రంలో 7వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరుకుంటామని, 2018నాటికి 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధిస్తామని వెల్లడించారు. దామరచర్లలో ఆల్ట్రా పవర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, రెండున్నర నెలల్లోనే ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుండి రికార్డు స్థాయిలో అనుమతులు సాధించామని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిపై తమ ప్రభుత్వం రూ.91,500కోట్లు వెచ్చిస్తోందని, 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుస్తామని అన్నారు.

పోలీస్‌శాఖ ఆధునీకరణకు రూ.400కోట్లు పోలీస్ విభాగాన్ని ఆధునీకరించేందుకు రూ.400 కోట్లు ఖర్చు పెట్టామని, శాంతిభద్రతలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కేసీఆర్ తెలిపారు. ఈవ్‌టీజింగ్‌ను నిరోధించేందుకు షీటీమ్స్‌ను కూడా ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

సీఎంకు తెలంగాణ వార్షికోత్సవ అభినందనలు తెలంగాణ రాష్ట్రం మొదటి వార్షికోత్సవాన్ని పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏడాదిలోనే ఎన్నో సామాజిక కార్యక్రమాలను రూపొందించి అమలు చేసిందని, వాటర్ గ్రిడ్, ఫార్మాసిటీ, స్మార్ట్ సిటీ, వైఫై సిటీ వంటి కార్యక్రమాలు, గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడకు రావడం చాలా గొప్ప విజయాలని కొనియాడారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ వేగంగా అభివృద్ధి బాటలో సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీఎం అదనపు ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, పరిశ్రమలు, విద్యుత్ శాఖల ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, సీఎం సెషల్ సెక్రెటరీ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

చదువుతోపాటు వృత్తి నైపుణ్యం ఉండాలి: సీఎం కేసీఆర్ -ముఖ్యమంత్రిని కలిసిన ఆస్ట్రేలియా స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ప్రతినిధులు -పాలమూరు జిల్లాలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని వెల్లడి విద్యార్థులు చదువుతోపాటు వృత్తి నైపుణ్యం కూడా అలవర్చుకునే విధంగా విద్యా విధానం ఉండాలని, అలాంటి విద్యా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆస్ట్రేలియన్ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారితో సీఎం మాట్లాడుతూ.. నైపుణ్యం పెంచే విషయంలో స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలను కూడా భాగస్వాములుగా చేస్తామన్నారు. ఆస్ట్రేలియా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు అవసరమయ్యే వృత్తి నైపుణ్యం అందించడానికి తమ సంస్థ ప్రయత్నిస్తున్నదని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య, స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ప్రతినిధులు సెంథిల్‌కుమార్, కరిక్యులమ్ హెడ్ డేవిడ్ కానల్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.