Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇన్నిన్ని పథకాలు ఎక్కడున్నాయ్‌!

-కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా?
-దేశానికే మార్గదర్శిగా తెలంగాణ పథకాలు
-ఆత్మగౌరవ ప్రతీక డబుల్‌ బెడ్రూం ఇండ్లు
-లబ్ధిదారులందరికీ త్వరలో రేషన్‌కార్డులు
-కేసీఆర్‌ పాలనపై యువ ఐఏఎస్‌లకు పాఠాలు
-ఐటీ,పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్‌
-సమర్థమైన నేత కేటీఆర్‌ : మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

కేసీఆర్‌ వయసును కూడా చూడకుండా బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు కొందరు దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్లు వ్యక్తిగతంగా ఎంత దూషించినా మాకు జరిగే నష్టమేమీ లేదు. కేసీఆర్‌ తెలంగాణ ప్రేమికుడు.. తెలంగాణను ఆయన ప్రేమించినంతగా ప్రపంచంలో మరెవ్వరూ ప్రేమించలేరు. కేసీఆర్‌మీద గెలవాలంటే ఆయనలా తెలంగాణను ప్రేమించగలగాలి కానీ.. ఆయనను తిడితే గెలవలేరు.
-మంత్రి కేటీఆర్‌

ఇన్నిన్ని పథకాలు ఎక్కడున్నాయ్‌!
దేశంలో ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణలో ఉన్నన్ని పథకాలు అమలవుతున్నాయా? ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నారా? రైతుబంధులాంటి పథకాన్ని అమలు చేస్తున్నారా? రైతుల కోసం వేలకోట్లు అందిస్తున్నారా? దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు సమాధానం చెప్పాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఐదువేల ఎకరాలకు ఒక అధికారిని నియమించి, రైతులకు మెళకువలు నేర్పించి వారిని రాజును చేయాలనే ఆలోచన కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా వచ్చిందా? అని నిలదీశారు. ఉద్యమం సమయంలో ఇచ్చినమాట ప్రకారం లక్షల విలువచేసే స్థలాల్లో పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన డబుల్‌బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని తెలిపారు. ఇది పేదల ప్రభుత్వమని, పేదల మోములో చిరునవ్వు చూడాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్‌, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి ప్రసంగించారు.

ఇన్నిన్ని పథకాలు ఎక్కడున్నాయ్‌!
-రైతు వేదికల్లో చైతన్య జ్వాలలు
రైతు చనిపోతే ఆ కుటుంబానికి వారంరోజుల్లో రూ.5 లక్షలు అందించే రైతుబీమా పథకం తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలోనైనా ఉన్నదా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. పేదింటి అడబిడ్డ పెండ్లికి రూ.1,00,016 అందించే సంస్కారం మీరు పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా ఉన్నదా? చెప్పాలని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు సవాల్‌ విసిరారు. కరోనా పరిస్థితుల్లో దేశంలో ఎక్కడైనా ధాన్యం కొనుగోళ్లు జరిగాయా? అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలకు వారివద్ద సమాధానాలు ఉండవని, కేసీఆర్‌ను అనుచితంగా తిడుతూ పిచ్చి ప్రేలాపనలు చేయడమే వీళ్లకు తెలుసని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా ఎంత దూషించినా తమకు జరిగే నష్టమేమీ లేదని అన్నారు. కేసీఆర్‌ తెలంగాణ ప్రేమికుడని, తెలంగాణను ఆయన ప్రేమించినంతగా ప్రపంచంలో మరెవ్వరూ ప్రేమించ లేరని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ‘మీరు కేసీఆర్‌ మీద గెలవాలంటే ఆయనలా తెలంగాణను ప్రేమించాలిగాని తిడితే గెలవలేరు’ అని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు హితవు పలికారు. కేసీఆర్‌ వయసును, ఆయన నాయకత్వంలో తెలంగాణ వచ్చిన విషయాన్ని కూడా మర్చిపోయి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఇలాంటి విషయాలపై ఎప్పటికపుడు చర్చ పెట్టాలని ప్రజలకు సూచించారు. రైతుల్లో నిత్య చైతన్య జ్వాలలు రగలాలని, అందుకు రైతువేదికను వేదికగా మార్చాలని సీఎం కేసీఆర్‌కు ఎప్పటినుంచో కల ఉన్నదని, రైతులు సమన్వయంతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించాలని ఆయన ఆకాంక్షిస్తుంటారని తెలిపారు. రైతులు వినూత్న పంటలు పండించాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఆయిల్‌పాం పండించేందుకు రైతులు ముందుకురావాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీఇచ్చారు.

ఇన్నిన్ని పథకాలు ఎక్కడున్నాయ్‌!
-కాంగ్రెస్‌ కట్టిన ఇండ్లు గుజ్జన గూళ్లు
కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టించిన ఇండ్లు గుజ్జన గూళ్లని.. కుటుంబమంతా ఒక్కటే అరలో ఉండాలంటే ఎంతో ఇబ్బందిగా ఉండేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఆ పరిస్థితిని చూసే సీఎం కేసీఆర్‌ పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల్లు కట్టిస్తానన్న హామీ ఇచ్చి.. ఇప్పుడు మాట నిలబెట్టుకొంటున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో రూ.లక్షల విలువ చేసే స్థలంలో 560 ఎస్‌ఎఫ్‌టీతో అపార్ట్‌మెంట్‌ తరహాలో ఇండ్ల నిర్మాణం పూర్తవుతున్నదని తెలిపారు. పైసా ఖర్చు కాకుండా అర్హులందరికీ ఇల్లు, రేషన్‌కార్డులు ఇస్తామని.. ఎవరూ రంది పెట్టుకోవద్దని సూచించారు. కరోనా సమయంలో ఆక్సిజన్‌ కోసం ఇబ్బంది పడ్డామని.. పిల్లల భవిష్యత్‌ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేటలో మోడ్రన్‌ రైతుబజార్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. అలాగే, ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి నిధులు ఇవ్వాలని రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్‌ను కోరగా అందుకు స్పందించిన ఆయన రూ.కోటి ఇస్తామని హామీఇచ్చారు.

తెలంగాణ వాటర్‌ జంక్షన్‌గా సిరిసిల్ల
రైతులు ఏది చెప్పినా చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. చిన్నప్పుడు తమ అమ్మమ్మ గ్రామమైన కొదురుపాకలో ఈ ప్రాంతమంతా నడుచుకుంటూ తిరిగానని.. నాడు దుర్భిక్షంగా ఉండేదని నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని చెప్పడానికి ఈ ప్రాంతమే ఉదాహరణ అని అభివర్ణించారు. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో అత్యంత వెనుబడిన ప్రాంతంగా ఉన్న సిరిసిల్ల జిల్లాలో 26 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టు ఇపుడు తెలంగాణకు గుండెకాయగా మారిందని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. తెలంగాణ వచ్చాక ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించే వాళ్లకు వాటర్‌ జంక్షన్‌గా మారిన సిరిసిల్లను చూపించవచ్చని చెప్పారు. సిరిసిల్ల, కరీంనగర్‌ మధ్య రూ.21 కోట్లతో చేపట్టిన రహదారిని కామారెడ్డి వరకు అక్కడి నుంచి పిట్లం దాకా నిర్మిస్తామని తెలిపారు. వచ్చే రెండేండ్లలో సిరిసిల్ల, వేములవాడ మీదుగా కరీంనగర్‌ వరకు రైల్వేలైన్‌ వస్తుందని చెప్పారు. మిడ్‌మానేరు, వేములవాడ రాజన్న ఆలయాన్ని కలిపి పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని పేర్కొన్నారు.

కేసీఆర్‌ పాలనపై ఐఏఎస్‌లకు పాఠాలు
తీవ్ర కరువు ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్‌ చేపట్టిన వాటర్‌ మేనేజ్‌మెంట్‌తో భూగర్భ జలాలు ఏకంగా 6 మీటర్లు పైకి వచ్చాయని చెప్పారు. ఈ అంశంపై హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ శాస్త్రి అకాడమీలో యువ ఐఏఎస్‌లకు పాఠాలు చెప్తున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాధించిన విజయాలను ఆదర్శంగా చూపుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ పాలనకు ఇది మచ్చుతునకగా అభివర్ణించారు.

దేశంలోనే టాప్‌ లీడర్‌ కేటీఆర్‌: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
పెద్ద పెద్ద కంపెనీలతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టించి ఫార్మా హబ్‌గా తీర్చి దిద్దుతున్న మంత్రి కేటీఆర్‌ దేశంలోనే టాప్‌లీడర్‌ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశంసించారు. 19 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుతో వేలమంది నిరుద్యోగులకు ఉపాధి లభించేలా అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. అలాంటి సమర్థ నాయకుడు సిరిసిల్లకు ఎమ్మెల్యే కావడం ఈప్రాంత ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.67 లక్షల ఇండ్లను నిర్మించాలని సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని.. ఇందులో 1.67 లక్షల ఇండ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇందుకోసం రూ.10 వేల కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్‌ వెంట ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, టీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య పాల్గొన్నారు.

-రాజన్న సిరిసిల్లలో మంత్రి
-కేటీఆర్‌ ప్రారంభించిన పనులు
-ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేట, రాచర్లబొప్పాపూర్‌, రాచర్ల గొల్లపల్లిలో డబుల్‌బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం
-సిరిసిల్లలో రోడ్లుభవనాలశాఖ అతిథి గృహానికి శంకుస్థాపన
-సిరిసిల్లలో ఆర్డీవో కార్యాలయం ఆవరణలో డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు ప్రారంభోత్సవం
-వేములవాడ దవాఖానలో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల వితరణ
-బోయినపల్లి మండలం కొదురుపాక జంక్షన్‌ వద్ద రోడ్డ విస్తరణ పనులకు శంకుస్థాపన
-కొదురుపాకలో తన అమ్మమ్మ తాతయ్య లక్ష్మమ్మ-కేశవరావు పేరిట నిర్మించిన రైతువేదికకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవం.
-కేడీసీసీ బ్యాంకు భవనం ప్రారంభం.

ఒకప్పుడు రాష్ట్రంలో అత్యంత వెనుబడిన ప్రాంతంగాఉన్న సిరిసిల్ల జిల్లాలో 26 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మిడ్‌మానేరు ప్రాజెక్టు ఇపుడు తెలంగాణకే గుండెకాయగా మారింది. రాష్ట్రం రాకుంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగేదే కాదు. తెలంగాణ వచ్చాక ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించేవాళ్లకు వాటర్‌ జంక్షన్‌గా మారిన సిరిసిల్లను చూపిస్తేచాలు.
-మంత్రి కేటీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.