-గూగుల్ ట్రెండ్స్‌లో వెల్లడి.. వెనుకబడ్డ చంద్రబాబు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులిద్దరిలో ఇంటర్‌నెట్ హీరో కేసీఆరేనని గూగుల్ ట్రెండ్స్ స్పష్టం చేసింది. 2004 -2014 మధ్య పదేండ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షకులు తమ సెర్చ్ ఇంజన్‌లో కేసీఆర్ గురించిన సమాచారాన్ని అన్వేషించారని గూగుల్ ప్రకటించింది.

తద్వారా ఇంటర్‌నెట్ ప్రపంచంలో చంద్రబాబు కన్నా కేసీఆరే పాపులర్ అని తెలిపింది. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ పాపులారిటీలో పోటీ పడ్డా.. స్పష్టమైన ఆధిక్యం కేసీఆర్‌కే దక్కిందని వివరించింది. వాస్తవానికి చంద్రబాబు ఎప్పుడు ఐటీ, ఇంటర్‌నెట్, హైటెక్ వంటి పదజాలం విరివిగా వాడుతుంటారు. హైదరాబాద్‌ను హైటెక్‌సిటీగా తానే రూపొందించానని చెప్పుకుంటారు.
సీమాంధ్ర పత్రికలు సైతం ఐటీకి బాబును పర్యాయపదంగా ప్రచారం చేస్తాయి. అదంతా ఉత్తిత్తిదేనని తాజా ఫలితాలతో వెల్లడైంది. సీఎం కేసీఆర్ ఎక్కువగా తెలంగాణ, ప్రజల గురించి మాట్లాడుతారు. కేసీఆర్‌కు మాటల మాంత్రికుడనే పేరుంది తప్ప ఆయన పేరు ఐటీతో జత కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఈ లెక్కన సహజంగా ఇంటర్‌నెట్‌లో చంద్రబాబుకే ప్రాచుర్యం ఉండాలి. కానీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. గూగుల్ సెర్చ్‌లో వివిధ వ్యక్తుల కోసం జరిపిన మొత్తం అన్వేషణల్లో 5 నుంచి 6 శాతం కేసీఆర్ సాధించగా, చంద్రబాబును సెర్చ్ చేసింది కేవలం అందులో సగమే. ఏమైనా ఒకనాడు హైటెక్ సీఎం అంటూ భారీ ప్రచారం జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు ఇంటర్‌నెట్ ప్రాచూర్యంలో తన ప్రాభవం కోల్పోయారు.