Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇంటివద్దకే ఇసుక

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తామని భారీ నీటిపారుదల, మైనింగ్, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకు ఇసుకను ఇంటివద్దకే చేరవేసేలా నూతన పాలసీని రూపొందిస్తున్నట్లు చెప్పారు. వాల్టా నిబంధనలకు లోబడి రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లను గుర్తించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో మైనింగ్‌శాఖ అధికారులతో మంత్రి విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Harish-Rao-review-meet-on-Sand-allocations

-సర్కారు ఆధ్వర్యంలోనే అమ్మకాలు -మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బాధ్యతలు -అక్రమాలకు చెక్ పెట్టేలా నూతన ఇసుక విధానం -మీసేవ, ఈసేవ కేంద్రాల ద్వారా ఇసుక అమ్మకాలు -మైనింగ్‌శాఖ సమీక్షలో మంత్రి టీ హరీశ్‌రావు ఐదు లక్ష్యాలతో కొత్త ఇసుక పాలసీని తీసుకొస్తున్నట్లు తెలిపారు. అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో 1.30 కోట్ల క్యూబిక్ మీటర్లు, నల్లగొండ జిల్లాలో 3 లక్షల క్యూబిక్ మీటర్లు, కరీంనగర్‌లో 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక రీచ్‌లను గుర్తించినట్లు చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో దళారులు టన్నుకు రూ.1900 నుంచి రూ.2100 వరకు వసూలు చేస్తున్నారని, అందువల్ల మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే ఇసుక అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు హరీశ్‌రావు తెలిపారు. ఇసుక లభించే ప్రాంతం ఆధారంగా టన్ను ఇసుక ధరను కనిష్టంగా రూ. 400 నుంచి గరిష్టంగా రూ.1,100 వరకు నిర్ణయించనున్నట్లు చెప్పారు.

ఇసుక రీచ్ నుంచి డంపింగ్‌యార్డు వరకు ఇసుక స్టాక్‌ను చేరవేయడానికి టెండర్లు పిలిచామని, శనివారం వీటిని తెరవనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఇసుక ధరలను నిర్ణయించే అధికారం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీలకు అప్పగించినట్లు వివరించారు. మార్కెట్‌లో పారదర్శకతతో ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

రాత్రివేళల్లో రవాణా బంద్ రోడ్డు ప్రమాదాలు, రోడ్ల ధ్వంసం, ఇసుక మాఫియా ఆగడాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా ఇసుక పాలసీని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఓవర్‌లోడ్ రవాణా వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని గుర్తించినట్లు చెప్పారు. లారీల ద్వారా ఇసుక రవాణా రాత్రి వేళల్లో జరగడంతో పెద్దఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు రాత్రివేళల్లో ఇసుక రవాణాను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా చేపడుతుందని తెలిపారు. ఇప్పటివరకు సీనరేజీ ఆదాయం స్థానిక సంస్థలకు చేరడం లేదు.

గత ప్రభుత్వాలు సీనరేజీ నిధులను జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు జమచేయలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఇసుక పాలసీ ద్వారా స్థానిక సీనరేజ్ ఆదాయాన్ని ఆ జిల్లా, మండల, గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని నిర్ణయించాం. కొత్త ఇసుక పాలసీ అమలుకు 3నెలల సమయం పడుతుంది. ఇది అమలులోకి వచ్చేవరకు ప్రజల ఇసుక అవసరాల గుర్తించి ప్రస్తుతం అమలులో ఉన్న పట్టాభూముల్లో ఇసుక రీచ్‌ల నుంచి రవాణాను మరో 45 రోజులు కొనసాగించాలని నిర్ణయించాం అని మంత్రి తెలిపారు.

జిల్లాల్లో 2లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నామని, దానిని రెండు రోజుల్లో మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా విక్రయించనున్నట్లు తెలిపారు. మీ-సేవా, ఈ-సేవా కేంద్రాల్లో ఫిబ్రవరి 20 నుంచి ఆన్‌లైన్ ద్వారా ఇసుక కొనుగోలు కోసం ప్రజలు బుక్‌చేసుకునే సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఇసుక అమ్మకం సక్రమంగా జరిగేలా చూసేందుకు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక భత్యాలు కూడా కేటాయిస్తామని చెప్పారు. ప్రతి జిల్లాలో విజిలెన్స్ టీంలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ టీంలు కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని ఇసుక ఇతర రాష్ర్టాలకు తరలకుండా, ఇతర రాష్ర్టాల ఇసుక రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ ఇసుక మాఫియాపై జిల్లా కలెక్టర్ నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామన్నారు.

సామాజిక బాధ్యతగా మిషన్ కాకతీయ -ఇరిగేషన్ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణలో మంత్రి హరీశ్‌రావు -మిషన్ కాకతీయకు ఇరిగేషన్ ఉద్యోగుల ఒకరోజు జీతం విరాళం తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్యోగులు వృత్తి ధర్మంతోపాటు సామాజిక బాధ్యతగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి ముందుకు రావడం హర్షించదగిన విషయమని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో రూపురేఖలు కోల్పోయి, అన్యాక్రాంతమైన చెరువులను పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన మిషన్ కాకతీయ పథకం చాలా గొప్ప కార్యక్రమమని కొనియాడారు.

శుక్రవారం సచివాలయంలోని డీ-బ్లాక్‌లో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఇరిగేషన్‌శాఖ ఉద్యోగుల డైరీని ఆందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్‌తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. మిషన్ కాకతీయ వంటి గొప్ప పథకం మొదలుపెట్టిన సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగులందరూ సెలవు రోజున శ్రమదానం చేస్తామని టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రకటించిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తుచేశారు. శ్రమదానం చేయడమే కాకుండా, ఒక రోజు వేతనాన్ని మిషన్ కాకతీయ పథకానికి విరాళంగా ఇస్తామని ముందుకురావడం అరుదైన విషయమని మంత్రి పేర్కొన్నారు.

అంతకముందు టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ఉద్యోగ సంఘాలు కరీంనగర్ జిల్లాలో రూ.10 లక్షలతో నిర్మించిన స్థూపాన్ని ఈనెల 19న ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో నేతలు కారం రవీందర్‌రెడ్డి, రేచల్, ఇరిగేషన్ ఉద్యోగుల సంఘం నేతలు జగదీశ్వర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మిషన్ కాకతీయ పథకానికి రాష్ట్ర ఇరిగేషన్, మైనింగ్‌శాఖ ఉద్యోగులు తమ ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.