Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

20వేల కోట్లతో సిగ్నల్ ఫ్రీ సిటీ

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతోపాటు 300 ఏండ్ల కాస్మోపాలిటన్ చరిత్ర ఉన్న ఈ నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్‌గా, శాంతియుత హైదరాబాద్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పించారు. ఇందుకోసం స్వయంగా ముఖ్యమంత్రి, గవర్నర్ సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు నడుం బిగించనున్నారు.

KCR addressing in Swacbharath programme

-స్వచ్ఛ హైదరాబాద్ కోసం ప్రతినబూనుదాం: ముఖ్యమంత్రి కేసీఆర్ -మల్చుకుంటే స్వర్గం.. విస్మరిస్తే నరకం -అనాగరిక జీవనం నుంచి విముక్తి కావాలి – హైదరాబాద్‌ది 300 ఏండ్ల కాస్మోపాలిటన్ చరిత్ర – దేశంలోని ఆరు ముఖ్యనగరాల్లో ఒకటి – నగర ప్రత్యేకతను నిలబెడదాం – చెరువుల్లో మురుగునీరు ఎక్కడ కలుస్తున్నదో గుర్తించండి: సీఎం -స్వచ్ఛత కోసం స్థానిక అవసరాలకు 200 కోట్లు -బలహీనవర్గాల ఆత్మగౌరవానికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు -స్వచ్ఛ హైదరాబాద్ కోసం మీడియా ప్రచారం నిర్వహించాలి -త్వరలో పత్రికలు, చానళ్ల ప్రతినిధులతో సమావేశం -స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్ సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్నగరాన్ని 400 భాగాలుగా విభజించి.. గవర్నర్, సీఎం, మంత్రులు, స్పీకర్, మండలి చైర్మన్, ప్రజాప్రతినిధులు, ముఖ్య అధికారులు, సైనికాధికారులు, సైనికులతో సహా ప్రజలందరినీ భాగస్వాములను చేయనున్నారు. నవాబుల కాలంలోనే ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన హైదరాబాద్ ప్రఖ్యాతిని తిరిగి సాధించిపెట్టేదిశగా.. రాష్ట్ర సాధనకు ఏ స్థాయిలో ఉద్యమాన్నైతే చేశారో.. అదే స్ఫూర్తితో స్వచ్ఛ హైదరాబాద్ కోసం ఉద్యమించేందుకు సమాయత్తం చేస్తున్నారు. కేవలం అధికారులకు దిశానిర్దేశాలు చేసి.. బాధ్యతలు పంచడం కాకుండా.. సమిష్టి భాగస్వామ్యంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం విశేషం.

ఈ నెల 16 న ప్రారంభమయ్యే స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమ నిర్వహణపై బుధవారం మధ్యాహ్నం హెచ్‌ఐసీసీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో అక్రమార్కులకు, అస్తవ్యస్థ విధానాలకు కళ్లెంపడాలని స్పష్టంచేసిన సీఎం.. మాస్టర్ ప్లాన్ ప్రకారం సిటీని అందంగా, పరిశుభ్రమైన నందనవనంగా మార్చుకుందామని చెప్పారు. నగరాన్ని రూ.20వేల కోట్లతో సిగ్నల్ ఫ్రీ సిటీగా తయారు చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే మూడేండ్లలోనే మార్పు వస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. దేశంలోని ఆరు ముఖ్య నగరాలలో హైదరాబాద్ ఒకటి. మల్చుకుంటే ఇది స్వర్గం.. విస్మరిస్తే నరకం అవుతుంది! లక్ష కిలో మీటర్ల ప్రయాణమైనా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది. ప్రపంచం ఈ స్థితిలో ఉందంటే దానికి ఆశావహ దృక్పథమే మూలం. మనుషులు సహజంగా మార్పును కోరరు. కానీ అభ్యుదయంగా ఆలోచించే వారు మార్పుకు సాధకులవుతారు.

KCR 01

మనమిప్పుడు అనాగరిక జీవితం గడుపుతున్నాం. చెత్తాచెదారం వచ్చి పడుతున్నది. ఈగలు, దోమలు వాలుతున్న మాంసాన్నే కొనుక్కొని తింటున్నాం. మురికి కుప్పలున్న రోడ్లపై అపరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయలు అమ్ముతున్నారు.

స్వచ్ఛమైన అహారం తినడం లేదు.. స్వచ్చమైన నీరు తాగడం లేదు. కలుషిత అహారం తింటున్నాం.. కలుషిత నీరు తాగుతున్నాం. దీనినుంచి మనం విముక్తి కావాలి. అందరం ఎవరికి వారు అనుకుంటే ఏమీ కాదు.. అందరం కలిసి అనుకుంటే మార్పు సాధ్యమే! దానికి తెలంగాణ రాష్ట్రమే ఉదాహరణ. నా జీవితంలో నాకే సంభవించింది.

రాష్ట్రంలో చిమ్మచీకట్లు అలముకున్న సమయంలో.. అయ్యేదా పోయేదా అనే పరిస్థితిలో నేను ఒక్కడినే ముందుకు పోయిన! నిజానికి తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినప్పుడు నేను ఒక్కడినే ఉన్న! పక్కన పదిమంది కూడా లేరు. ఉద్యమం ప్రారంభించిన! తెలంగాణ రాష్ట్రం కల సాకారమైంది. హైదరాబాద్ లేని తెలంగాణ కావాలనుకుంటే ఎప్పుడు ఏడేండ్ల కిందనే వచ్చేది. కానీ తెలంగాణ ప్రజల రక్తంతో నిర్మించిన హైదరాబాద్‌ను వదులుకోబోమని చెప్పిన.

తెలంగాణ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. 200 ఏండ్ల క్రితమే పరిశ్రమలు వచ్చాయి. హైదరాబాద్‌కు అనేక హంగులు, అవకాశాలు ఉన్నాయి. తెలంగాణకు అద్భుత పారిశ్రామిక విధానం తయారైంది. అంబానీలాంటి స్థాయి ఉన్న పారిశ్రామికవేత్తలు మన పారిశ్రామిక విధానాన్ని మెచ్చుకుంటున్నారు. దేశవిదేశాలనుంచి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. మన పిల్లలకు మంచి ఉపాధి దొరుకుతుంది. అందుకోసం హైదరాబాద్‌ను సిద్ధం చేయాలి. హైదరాబాద్‌ను పరిశుభ్రంగా మార్చుకుందాం. మీ అందరిలో ఒక్కడిగా ఉంటా. స్వచ్ఛ హైదరాబాద్ కార్యకర్తగా.. మీలో ఒక్కడిగా మాట్లాడుతున్నా.

నేను మీతోనే ఉంటా అనే విశ్వాసం ప్రజల్లో కల్పించాలి హైదరాబాద్ విషయంపై మొదట క్యాబినెట్ మినిస్టర్స్‌తో మాట్లాడి అంతా వారికి వివరించాను. ఆ తరువాత గవర్నర్‌ను కలిసినప్పుడు ఈ విషయం మాట్లాడాను. ప్రోగ్రామ్ అంతా వివరించాను. అంతావిని.. కార్యక్రమం బాగుందన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌కోసం నగరాన్ని 400 ముక్కలుగా చేస్తున్నామని చెప్పాను. తాను ఒక ముక్కకు ఇన్‌చార్జిగా ఉంటానని గవర్నర్ నాతో అన్నారు. గవర్నర్, నాతోపాటు మంత్రులు, స్పీకర్, మండలి చైర్మన్, ముఖ్యఅధికారులు తలా ఒక్క ముక్క బాధ్యత తీసుకుంటారు. మనమందరం కలిసి పనిచేస్తే ఏదైనా సాధ్యం.

సంఘటిత శక్తిలో గొప్ప బలముంది. ఆ శక్తితో ఏమైనా సాధ్యమే. సీఎంగా కాదు.. స్వచ్ఛ హైదరాబాద్ కార్యకర్తగా మాట్లాడుతున్నా. 600 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం ఉన్న నగరంలో ఒక్కొక్క టీమ్‌కు ఒకటిన్నర చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వస్తుంది. 35,833 మంది ఇందులో భాగస్వాములం అవుతాం. ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తాం. ఈ నెల 16నుంచి కార్యరంగంలోకి దిగుతాం. అంతకుముందే ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారి వివరాలు తీసుకోవాలి. విస్త్రృత ప్రచారం కూడా కల్పిస్తాం. సారథి కళాకారులు ప్రచారం చేస్తారు.

ముందే ఆ ప్రాంతంపై అవగాహన కలిగి ఉండాలి. ప్రాథమిక సమాచారం సేకరించుకోవాలి. ఏం ఉందో, ఏం లేదో తెలుసుకోవాలి. స్వయంగా తిరిగితేనే మంచి ఫలితం ఉంటది. మీతోనే ఉంటాం అనే విశ్వాసం ప్రజల్లో కల్పిస్తే వారు కూడా స్ఫూర్తి పొంది భాగస్వాములవుతారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. ఈ నెల 16నుంచి 20వరకు బృందాలు బస్తీల్లో తిరుగుతాయి. చెత్త ఎత్తి వేయడానికి అవసరమైన సామాగ్రి, వాహనాలు జీహెచ్‌ఎంసీ సమకూరుస్తుంది. 800 వాహనాలను జీహెచ్‌ఎంసీ సిద్ధంచేసింది.

క్లీనింగ్ మిషన్లు రెడీగా పెట్టారు. మనం పోయి మున్సిపల్ అధికారులతో చేయించడమే కాకుండా బస్తీ ప్రజలు పాల్గొనేలా చేయాలి. 16నుంచి 20వరకు పనులు చేయడంతోపాటు తర్వాత బస్తీలను బాగా చేసుకునే బాధ్యతలను బస్తీవాసులే నిర్వహించేలా వారిని సిద్ధంచేయాలి. ఆ కార్యక్రమం చేయడానికే మనం పోతున్నాం.

ప్రజల్లో వందశాతం మంచి ఉంటుంది- తట్టి లేపాలి ప్రజల్లో వందశాతం మంచి ఉంటుంది. దాన్ని తట్టి లేపేవారు కావాలి. స్వచ్ఛ హైదరాబాద్, శాంతియుత హైదరాబాద్ కావాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. అప్పుడే మనకు వృత్తిపరమైన సంతృప్తి ఉంటుంది. సూరత్‌లో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు కూడా ఎస్‌ఆర్ రావు అనే కమిషనర్ చొరవతో నగరమంతా శుభ్రంగా మార్చుకున్నారు. రియోడిజనీరో కూడా ఒక గొప్ప నగరంగా మారింది. మనంకూడా వాటిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి.

3-4 ఏళ్లలో 2 లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బలహీనవర్గాల వారు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల ఆలోచన చేశాను. ఐడీహెచ్ కాలనీని మొన్ననే చూశాం. అక్కడి ప్రజలు చాలా సంతోషపడ్డారు. గతంలో సింగిల్ రూమ్ ఇండ్లవల్ల చాలా గోసపడ్డారు. అందుకే హైదరాబాద్‌లో రెండు లక్షలమందికి 3-4 ఏండ్లలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టుకుందాం.

నగరంలో 3 కోట్ల మొక్కలు నాటాలి జూలైలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం తీసుకుంటాం. నగరంలో 3 కోట్ల మొక్కలు నాటాలి. దీనికోసం కూడా బస్తీల వారీగా ప్రణాళికలు సిద్ధంచేయాలి. ఎన్ని మొక్కలు పెట్టగలుగుతాం? ఎలాంటి మొక్కలు కావాలి? అనే అంచనాలు తయారుచేయాలి. బహిరంగ ప్రదేశాలు, ఖాళీ జాగాలు, ప్రార్థనా మందిరాలను గుర్తించాలి. బస్తీలకు వెళ్లిన సందర్భాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. విప్రో చైర్మన్ అజీంప్రేమ్‌జీ ఇటీవల నన్ను కలిశారు.

బెంగళూరులో పరిస్థితి బాగాలేదు.. హైదరాబాద్‌లో సంస్థను విస్తరిస్తున్నాం.. అని చెప్పారు. బెంగళూరులో పరస్థితి బాగా లేదు. హైదరాబాద్‌కూడా అలా కావద్దని చూస్తున్నాం. రూ.20 వేల కోట్లతో త్వరలో సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ సిస్టమ్ తయారుచేస్తాం. రాబోయే మూడేళ్లలో మార్పు వస్తుంది. హైదరాబాద్‌లో అక్రమార్కులకు, అస్తవ్యస్థానికి కళ్లెంపడాలి. సిటీని అందంగా తీర్చిదిద్దుదాం. మాస్టర్ ప్లాన్ ప్రకారం తయారుచేద్దాం. ఇక్కడ కూర్చున్న వాళ్లు పట్టుబడితే మార్పు సాధ్యం. నగరాన్ని పరిశుభ్రంగా నందనవనంగా మారుద్దాం.

సమర్థంగా నేల వినియోగం మనుషులు పెరుగుతారు.. వాళ్ల అవసరాలు పెరుగుతాయి. కానీ భూమి పెరగదు. కాబట్టి ఈ నేలను సమర్థవంతంగా వినియోగించుకుందాం. ప్రతిజ్ఞ తీసుకుందాం. ఏడాదిలో గుణాత్మక మార్పును తీసుకు వద్దాం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సన్నాహక సమావేశంలో పాల్గొన్న వేయి మంది ప్రతినిధుల చేత స్వచ్ఛ హైదరాబాద్ ప్రతిజ్ఞ చేయించారు.

కేసీఆర్ స్వయంగా ప్రతిజ్ఞాపత్రాన్ని చదువుతూ అందరి చేత చదివించారు. ఆ తరువాత స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఆస్కి డైరెక్టర్ జనరల్ రవికాంత్, సమర్థనీటి వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక టాయ్‌లెట్లు తదితర అంశాలపై అస్కి ప్రొఫెసర్ శ్రీనివాసచారి పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యాచరణపై జరిగిన సన్నాహక సమావేశంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని, పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్‌రావు, పద్మారావు, చందూలాల్, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, వీ సతీష్ పాల్గొన్నారు.

హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు 400 భాగాలుగా విభజించగా, వాటికి మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు, ఇతర ముఖ్య అధికారులు ఒక్కో విభాగానికి ఒక్కొక్కరు ఇన్‌చార్జీలుగా ఉన్నారు. వీరంతా సమావేశంలో పాల్గొన్నారు.

స్థానిక అవసరాల కోసం రూ.200 కోట్లు హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రతిపనిని ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకుందాం. బృందాలు బస్తీలకు వెళ్లే సందర్భంలో స్థానిక అవసరాలకోసం రూ.50 లక్షలవరకు ఒక్కోచోట ఖర్చు పెట్టవచ్చు. ఇందుకోసం రూ.200 కోట్లు కేటాయిస్తున్నాం. బస్తీలో 15 మందితో కమిటీ వేసుకోవాలి. అలా ఆరువేల మంది చేంజ్ ఏజెంట్స్‌ను తయారు చేసుకుంటాం. అందులో 50 శాతం మహిళలు ఉండాలి.

సీఎం కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్‌పై వివరించిన కొన్ని విషయాలు పాయింట్ల వారీగా.. -300 ఏండ్ల కాస్మోపాలిటన్ చరిత్ర ఉన్న హైదరాబాద్ నగర ప్రత్యేకతను నిలబెట్టాల్సి ఉంది. -స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో సైనిక అధికారులు, సైనికులు, పోలీస్ అధికారులు, పోలీసులు పాల్గొంటారు. -నగరంలోని ప్రతి ఇంటికీ రెండు చెత్త బుట్టలను ప్రభుత్వమే అందిస్తుంది. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలి. -బస్తీ వాసులు, టీమ్ సభ్యులకు టీషర్ట్స్, టోపీలు సమకూరుస్తం. -త్వరలోనే పత్రికలు, చానళ్ల ప్రతినిధులతో సమావేశం అవుతాం. మీడియా సంస్ధలు ప్రచారం నిర్వహించాలని విజ్ఞప్తి. -ఆరువేల మంది చేంజ్ ఏజెంట్స్ నంబర్లు సేకరించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలి. -స్వచ్ఛ హైదరాబాద్‌కోసం మొబైల్ యాప్ కూడా రూపొందించారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లో కూడా ఈ కార్యక్రమం సమాచారం ఇచ్చిపుచ్చుకునే అవకాశం. -స్వచ్ఛ హైదరాబాద్ బృందాలు బస్తీలకు వెళ్లినప్పుడు ప్రభుత్వంనుంచి సహాయం అవసరమైన విద్యార్థులు, క్రీడాకారులు, రోగగ్రస్తులను గుర్తించాలి. పెన్షన్‌లాంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందని అర్హులు ఉంటే వారి వివరాలు తీసుకోవాలి. ఇండ్లు లేని పేదలను గుర్తించాలి. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరచాలి. బస్తీలో ధనవంతులను ప్రోత్సహించి, వారి ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలి. -నగరంలోని చెరువుల్లో మురుగునీరు కలిసే ప్రాంతాలను గుర్తించాలి. మురుగునీరు చెరువుల్లో కలువకుండా చర్యలు చేపట్టాలి.

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం షెడ్యూల్ ఇదీ.. -6వ తేదీ అవగాహన కార్యక్రమం. -7నుంచి 10వ తేదీ వరకు సన్నాహక పనులు. -11,12 తేదీలలో శిక్షణ, టీమ్‌ల ఏర్పాటు. -13,14 తేదీలలో స్వచ్ఛ యూనిట్లు కేటాయించిన ఏరియాలలో ప్రాథమికంగా పర్యటించాలి. -15వ తేదీన స్వచ్ఛ హైదరాబాద్ రిపోర్టు సిద్ధం చేయాలి. -16వ తేదీన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభం. -17నుంచి 20వ తేదీ వరకు స్వచ్ఛ హైదరాబాద్‌పై టీమ్ సభ్యులు తమకు కేటాయించిన యూనిట్లలో ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రచారం చేయాలి. -22వ తేదీన ముగింపు కార్యక్రమం, సీఎంతో కలిసి మధ్యాహ్న భోజనం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.