– వైద్యసిబ్బందిపై మంత్రి ఈటల రాజేందర్ మండిపాటు – టైంపాస్ ఉద్యోగం చేయవద్దంటూ మందలింపు – సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక – స్వైన్ఫ్ల్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచన

ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటించడం లేదు. కొంతమంది టైంపాస్‌కు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వంతో వైద్యులు భాగస్వాములై ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నించాలే తప్ప, బద్నాం చేసే ప్రక్రియకు పూనుకోవద్దు.
అటువంటివారిపై కఠిన చర్యలుంటాయి. ఉద్యోగం చేయడం ఇష్టం లేకుంటే నేరుగా వెళ్లిపోవచ్చు అని అర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ గట్టిగా హెచ్చరించారు. గురువారం కరీంనగర్‌లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో స్వైన్‌ఫ్లూపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నాయని, అశించిన ప్రయోజనాలు మాత్రం రావడం లేదన్నారు. ప్రజలకు ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం పోతున్నదని, వైద్యులు దవాఖానల్లో ఉండకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ఏ డాక్టర్ ఏసమయానికి ఉంటారో తెలియని పరిస్థితి ఉందని, కొంతమంది టైంపాస్‌కు ఉద్యోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే వైద్యులను గుర్తించి ఉద్యోగం నుంచి తొలగించడానికి నోటీసులు జారీచేయాలని జిల్లా వైద్యాధికారిని అదేశించారు. ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నదని, నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునే ప్రశ్నేలేదని హెచ్చరించారు. స్వైన్‌ఫ్లూపై సమరం చేస్తున్నామని, ప్రజల్లో అవగాహన వచ్చేలా విసృత ప్రచారం చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో ఖర్చుకు వెనుకాడవద్దని, ప్రాథమిక దవాఖానల్లో సౌకర్యాల మెరుగు కోసం ఎమ్మెల్యే నియోజకవర్గ నిధులు సైతం కేటాయిస్తామని స్పష్టంచేశారు. వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించి స్వైన్ఫ్ల్లూను కట్టడిచేయాలని చెప్పారు. గతంలో మాదిరిగా మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వ వైద్యం అందకపోవడంతోనే ప్రజలు ప్రైవేట్ దవాఖానలను అశ్రయించి అప్పుల పావుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం దవాఖానలకు పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే, వైద్యులు భాగస్వాములవ్వాలే తప్ప, బద్నాం చేస్తే కఠిన చర్యలుంటాయని స్పష్టంచేశారు. జిల్లాలో స్వైన్‌ఫ్లూ నివారణ కోసం చేపట్టిన చర్యలను మంత్రికి కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ వివరించారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ చైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో స్వైన్‌ఫ్లూ వార్డును మంత్రి ఈటల తనిఖీ చేశారు.
జిల్లాల్లో కదిలిన యంత్రాంగం స్వైన్‌ఫ్లూ విజృంభణ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, దవాఖానల్లో సౌకర్యాలను పరిశీలించేందుకు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కదిలింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన చర్యలు చేపట్టేందుకు ప్రతి జిల్లాకు నియమించిన ఒక్కో అధికారి గురువారం పర్యటించారు. దవాఖానల్లో స్వైన్‌ఫ్లూ వార్డులను తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
అనంతరం జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. స్వైన్‌ఫ్లూ నివారణ, అవగాహన కోసం చేపడుతున్న చర్యలపై చర్చించారు.స్వైన్‌ఫ్లూ బారిన పడకుండా ముందుజాగ్రతలు, వ్యాధి సోకితే సకాలంలో చికిత్స పొందడానికి ప్రజల్లో విస్తృ త ప్రచారం కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు ఫోన్‌చేస్తే సిబ్బందిని పంపుతామని తెలిపారు. వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్కరూ మృతిచెందే పరిస్థితి రావొద్దని, ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సిబ్బంది సెలవులు పెట్టకుండా ఆయా దవాఖానల్లో సేవలు అందజేయాలని సూచించారు.
స్వైన్‌ఫ్లూపై ప్రభుత్వ స్పందన భేష్ నమస్తే తెలంగాణ ప్రతినిధి, ఖమ్మం: స్వైన్‌ఫ్లూపై ప్రభుత్వం స్పందించిన తీరు బాగుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ పేర్కొన్నారు. గురువారం ఖమ్మంలో ఆయన మాట్లాడారు. స్వైన్‌ఫ్లూ నివారణకోసం సీఎం కేసీఆర్ చేపడుతున్న చర్యలను అభినందిస్తున్నట్లు చెప్పారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు.
గాంధీ దవాఖానలో వైద్య సిబ్బం ది 40 శాతమే ఉన్నారని, భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు. స్వైన్‌ఫ్లూ పరీక్ష నిర్ధారణ కేంద్రం నారాయణగూడలో ఒకటి మా త్రమే ఉందన్నారు. రోజుకు కేవలం 70 వ్యాధి నిర్ధారణ పరీక్షలే చేస్తుండటంతో మరణాల సంఖ్య పెరుగుతున్నదన్నారు. ప్రతి జిల్లాకు ఒక స్వైన్‌ఫ్లూ పరీక్ష నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.