హైదరాబాద్ నగరాన్ని భారతదేశ ఐటీ రాజధానిగా మారుస్తామని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణలోని అత్యుత్తమ విద్యా, మౌలిక సదుపాయాలతో బహుళజాతి కంపెనీలకు, ఐటీ పరిశ్రమకు అవసరమైన మానవ వనరులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయని, పరిశ్రమ మరింత అభివృద్ధి చెందేందుకు ఇది అవకాశమిస్తున్నదని తెలిపారు. నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశోధనలకు ముందుకురావాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల వర్గాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బెంగళూరులో తెలంగాణ ఐటీశాఖ నిర్వహించిన ఐటీ రోడ్ షో కార్యక్రమంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వర్గాలతో మంత్రి బుధవారం సమావేశమయ్యారు.

-దేశంలో ఐటీకి అత్యంత అనుకూల నగరం -లక్ష కోట్ల ఐటీ ఎగుమతులే లక్ష్యం -ఐటీ నిపుణులను 10 లక్షలకు పెంచుతాం -రాష్ర్టాభివృద్ధికి ఐటీ పరిశ్రమే ఇంజిన్ -పెట్టుబడులు, పరిశోధనలకు ముందుకు రండి -బెంగళూరు ఐటీ రోడ్డు షోలో మంత్రి కేటీఆర్ హోటల్ మారియట్‌లో జరిగిన కార్యక్రమంలో భారీగా హజరైన పెట్టుబడిదారులు, కంపెనీల ప్రతినిధులను హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకున్న చర్యలు, హైదరాబాద్ నగరంలోని సౌకర్యాలను మంత్రి వివరించారు. రూ.లక్ష కోట్ల ఐటీ ఎగుమతులే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఐటీలో ప్రస్తుతం ఉన్న 3.25 లక్షల ఉద్యోగుల సంఖ్యను పది లక్షలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, డెల్, మోటరోలా, డెలాయిట్, కన్వర్జీస్, యూబీఎస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ, హనీవెల్, సిమెన్స్, జేపీ మోర్గాన్, యునైటెడ్ హెల్త్ గ్రూప్, ఫేస్బుక్ వంటి ఫార్చ్యున్ 500 జాబితాలోని కంపెనీలు అత్యధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని కేటీఆర్ తెలిపారు. దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్, ఐగేట్ సొనాటా, ఇన్ఫోటెక్ కంపెనీలు సైతం హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఇన్ని కంపెనీలున్న నగరంలో అత్యుత్తమ విద్య, పరిశోదన అవకాశాల కోసం ఐఎస్బీ, జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ, ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, డీఆర్డీవో సంస్థలున్నాయని, వీటి ద్వారా పరిశ్రమలకు కావల్సిన విధంగా విద్యుర్థులు సిద్ధమవుతున్నారని కేటీఆర్ తెలిపారు.
దేశంలో ఎక్కడికైనా రెండు గంటల్లో వెళ్లే వీలుండటం హైదరాబాద్‌కున్న ప్రత్యేకత అని వివరించారు. నగరంలోని మౌలిక వసతులపై ఖర్చు ఇతర నగరాలతో పోలిస్తే చాలా తక్కువ ఉందని పారిశ్రామికవేత్తలకు మంత్రి గుర్తుచేశారు. నగరాభివృద్ధిపై తమ ప్రభుత్వానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలున్నాయని, రాబోయేరోజుల్లో ఈ-లెర్నింగ్, ఈ-హెల్త్‌కేర్ వంటి కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు చేపడతామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ పరిశ్రమ అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధికి ఇంజిన్‌గా గుర్తించిందని, ఉద్యోగాల కల్పన రంగంగా దీనిని గుర్తించి పరిశ్రమ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఐటీ ఉత్పత్తులను పెంచేందుకు రూ.2,19,440 కోట్లతో 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐటీఐఆర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రూ.580 కోట్ల అంచనా వ్యయంతో 602 ఎకరాల్లో ఈ-సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మహేశ్వరంలో రూ.360 కోట్ల పెట్టుబడితో 310 ఎకరాల్లో చేపట్టే ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లో 35 వేల మందికి ప్రత్యక్షంగా, 2.1లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలను పోత్సహించేందుకు దేశంలోనే 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత పెద్దదైన టీ-హబ్ ఇంక్యుబేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఉపాధి శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, రహేజా కార్ప్ డెవలపర్స్ ఆఫ్ మైండ్‌స్పేస్ సంస్థ చైర్మన్ నీల్ రహేజా, జోన్స్‌లాంగ్ లాస్లే ఎండీ సందీప్ పట్నాయక్, సీబీఆర్ఈ రాంచందాని పాల్గొన్నారు.