– ఐటీతో ప్రజలకు మరింత మేలు కలుగాలి – మంత్రి కేటీఆర్‌తో గవర్నర్ నరసింహన్ – గవర్నర్‌తో మంత్రి సుదీర్ఘ భేటీ – ఐటీ పథకాలపై వివరణ

రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీరంగం విస్తరణకు ప్రభుత్వం రూపొందించిన ఐటీ విజన్ అద్భుతంగా ఉందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశంసించారు. ఐటీరంగం ప్రజలకు ఉపయోగపడేలా విస్తృతపర్చేందుకు మరింత మెరుగైన టెక్నాలజీని అందుబాటులోకి తేవాల్సి ఉందన్నారు. రాజ్‌భవన్‌లో పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్, ఐటీశాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి అమలు గురించి గవర్నర్‌కు వివరించారు.
రాష్ట్రంలో ఐటీరంగ విస్తరణకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఐటీఐఆర్ ప్రాజెక్టు, ఇంక్యుబేటర్, టీ హబ్, గేమ్‌సిటీ, టాస్క్ లాంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, వాటి ప్రాముఖ్యాన్ని గవర్నర్‌కు తెలిపారు. ప్రపంచంలో గేమ్సిటీకి 224 బిలియన్ డాలర్ల నెట్వర్క్ ఉండగా, భారత్‌లో కేవలం 4 బిలియన్ డాలర్ల నెట్వర్క్ మాత్రమే ఉన్నదని, ఈ తేడాను పూరించేందుకు హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ గేమ్హబ్గా మార్చేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల నుంచి ఏటా లక్షల మంది పట్టభద్రులు బయటకొస్తున్నా ఉపాధి అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమవుతున్న విషయాన్ని ఈ సమావేశంలో గవర్నర్ ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పరిస్థితిని మార్చేందుకు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచే చర్యలు చేపడుతున్నామని, అందుకోసం టాస్క్ (టెక్నాలజీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ నాలెడ్జ్ సెంటర్) పథకాన్ని రూపొందించినట్లు కేటీఆర్ వివరించారు. మండలస్థాయి ప్రభుత్వ పాలనలో డిజిటల్ టెక్నాలజీని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో వై-ఫై టెక్నాలజీకి అంతర్జాతీయస్థాయి ప్రమాణాలున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్‌కు కేటీఆర్ వివరించారు.
హైదరాబాద్‌ను కేవలం సాఫ్ట్వేర్, హర్డ్‌వేర్ రంగాలకే పరిమితం చేయకుండా ప్రజలందరికీ అత్యుత్తమ జీవనం అందించేందుకు హ్యాపెనింగ్ హైదరాబాద్ పేరుతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన సదుపాయాలను అందించేందుకు ఈ-పంచాయతీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశం అనంతరం రాజ్‌భవన్ వద్ద మంత్రి మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌తో సుమారు గంటపాటు జరిగిన సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలను, ప్రాధాన్యాలను వివరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి గవర్నర్ పలు నిర్ణయాత్మక సలహాలు ఇచ్చారని, వాటి ఆధారంగా రాబోయేరోజుల్లో ప్రభుత్వం మరింత మెరుగైన కార్యక్రమాలను చేపడుతుందన్నారు. విలువైన సూచనలు చేసినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు.