Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇవీ తెలంగాణ వెలుగులు

-తాడిచర్ల బొగ్గు గని మళ్లీ మన చేతికి.. -కాంగ్రెస్ నిర్వాకంవల్ల ఆనాడు రద్దయిన కోల్‌మైన్.. -నేడు ఫలించిన కేసీఆర్ కృషి -ప్రభుత్వరంగ సంస్థలకే పవర్‌ప్రాజెక్టులు -నిర్మాణ పనులు ప్రభుత్వ రంగ సంస్థలకే -ప్రభుత్వ సంస్థలనుంచే రుణసేకరణ -టెక్నోక్రాట్లకే పూర్తి అధికారాలు -అతి తక్కువ ధరకే విద్యుదుత్పత్తి

KCR తెలంగాణ వెనుకబడిన రాష్ట్రం కాదు.. వెనుకపడేయబడిన రాష్ట్రం…. స్వరాష్ట్ర పోరు సాగుతున్న కాలంలో ఉద్యమనేత కేసీఆర్ పదేపదే చెప్పిన మాట ఇది. ఇక్కడ పుష్కలమైన వనరులున్నై. కష్టించే ప్రజలున్నరు. మేధావులు, ఉద్యోగులున్నరు. తెలంగాణ రాష్ట్రం కడుక్కతాగడానికి అడుగుతలేము.. మావద్ద ప్రణాళికలున్నయి.. రేయింబగళ్లు పనిచేస్తం.. బంగారు తునుకలాగా మార్చుకుంటం అని నిండైన ఆత్మవిశ్వాసంతో ఆనాడే ప్రకటించారు. ఆ ప్రకటనల కార్యాచరణ ఇప్పుడు విద్యుత్ రంగంలో కనబడుతున్నది. తెలంగాణ సీఎం ఫైళ్లు పట్టుకుని అమెరికా వీధుల్లో తిరగలేదు. ఆ దేశాధ్యక్షుడిని హైదరాబాద్‌కు తెచ్చి క్యాట్‌వాకులు చేయించలేదు. ప్రపంచబ్యాంకు ముందు మోకరిల్లి, వాడు సబ్సిడీలు పీకమంటే.. చార్జీలు పెంచమంటే జీహుజూర్ అనలేదు. ప్రపంచం మారుతున్నది.. అంటూ ప్రైవేటు రంగానికి దర్వాజాలు బార్లా తెరవలేదు. ఇదే అభివృద్ధి.. ఇదే బ్రహ్మాండం అంటూ ప్రచారం చేసుకోలేదు. హుస్సేన్‌సాగర్ ఒడ్డున సచివాలయం దాటకుండానే రాష్ట్రం విద్యుత్ సామర్థ్యాన్ని రెప్పవాల్చేంత సేపు కూడా కోతలు ఉండని దిశగా తీసుకువెళ్లేందుకు నిరంతర సమీక్షలు చేశారు. ప్రణాళికలు రచించారు. టాటాలు-అంబానీలనుంచి జపాన్- అమెరికా సంస్థలదాకా పెట్టుబడులు పెడతామంటూ వచ్చినా ఒక్క యూనిట్‌కూడా ప్రైవేటు కంపెనీలకు ఇవ్వలేదు… అంతా ప్రభుత్వరంగ సంస్థలకే. ఒక్కపైసా ప్రైవేటువాడినుంచి అప్పు తేలేదు.. అన్నీ ప్రభుత్వ ఆర్థికసంస్థలు ఇచ్చినవే.

అనుభవజ్ఞులకు అధికారాలిచ్చారేగాని.. ఐఏఎస్‌ల చేతుల్లో అధికారాలు పోయలేదు. నిర్మాణాల్లో ప్రైవేటు నిర్మాణ సంస్థల ప్రమేయం లేదు..ఖర్చు పెట్టే ప్రతిపైసా బీహెచ్‌ఈఎల్, సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలకే చేరుతుంది. కాంగ్రెస్ నిర్వాకం వల్ల చేజారిపోయిన తాడిచర్ల బ్లాకును కూడా పట్టుబట్టి తిరిగి సాధించారు. ఇపుడు చార్జీల మీద ప్రపంచబ్యాంకు ఆదేశాలుండవు. మనమే నిర్ణయించుకుంటాం. జెన్‌కో- ట్రాన్స్‌కోలదే సర్వాధికారం. ప్రైవేటువాడి పీపీఏల లిటిగేషన్ల పీటముడులు ఉండవు. కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయం. నియమించే ప్రతి కొలువూ తెలంగాణవాడిదే. ప్రతి యూనిట్ చార్జీలో ఏ ప్రైవేటువాడికీ కమీషన్లు ఉండవు. లాభమైనా నష్టమైనా అంతా ప్రజలదే..ప్రజలకే! అభివృద్ధి అంటే కొందరికి ప్రపంచబ్యాంకు సర్టిఫికెటు, లగడపాటి, రాధాకృష్ణలకు పవర్ ప్రాజెక్టులు కట్టబెట్టడం కావచ్చు. కానీ మనకు జెన్‌కో-ట్రాన్స్‌కోలు, సింగరేణి, బీహెచ్‌ఈఎల్ వంటి ప్రజల, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు బలోపేతం చేయడం. ఇది తెలంగాణ అభివృద్ధి ఫార్ములా!

డంబాచారాల ఉమ్మడి విధానాలు: సమైక్యపాలనలో ఈ రాష్ర్టాన్ని చాలా మంది మహామహులు పాలించారు. విజనరీలమని డప్పు కొట్టుకున్నారు. మూడు గంటల నిద్రే అన్నారు. ముందుచూపు సిద్ధాంతాలు ముందుకు తెచ్చుకున్నారు. బ్రహ్మాండం ఏదో బద్దలు చేస్తున్నామనేంత ప్రచారాలు చేసుకున్నారు. నాణ్యమైన కరెంటునినాదాలు తెచ్చారు. అంతా చేసి వారు సాధించింది.. నాలుగువేల మెగావాట్లు. దానికి ప్రపంచబ్యాంకుల అప్పులు. వాళ్ల పెత్తనాలు, నిర్దేశాలు. సబ్సిడీ ఎత్తేశారు. చార్జీలు పెంచేశారు. జెన్‌కోలు ట్రాన్స్‌కోలను ఫైళ్ల మోతగాళ్ల స్థాయికి తెచ్చారు. ఏ విషయంలో వారి ప్రమేయం ఉండేది కాదు. నిపుణులు, నిష్ణాతులను దూరం పెట్టారు. అంతా ఐఏఎస్‌లదే పెత్తనం. ప్రపంచం మారిపోతున్నది… ఇపుడంతా ప్రైవేటు రంగమే అన్నారు. రష్యాలు, చైనాలు కూడా మారిపోయాయి అంటూ దబాయించారు. ప్రభుత్వరంగ సంస్థలు నష్టజాతక సంస్థలని అన్నారు. భారీ నష్టాలు ప్రజలకే భారమని వాదించారు. విద్యుత్ రంగాన్ని తీసుకువెళ్లి ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టారు. సింగరేణి బొగ్గునుంచి కేజీ బేసిన్ సహజవాయువుదాకా సహజవనరులన్నీ ప్రైవేటు సంస్థలకు ధారపోశారు. పీపీఏల పేరిట ప్రజాధనం చేతికి ఎముకలేకుండా అర్పించారు. వాడు ఉత్పత్తి చేసినా చెల్లింపులే.. చేయకున్నా చెల్లింపులే. చార్జీలమీద ప్రభుత్వ అదుపు గాలికి వదిలేశారు. ప్రైవేటువాడు నష్టపోకుండా విద్యుత్‌చార్జీల ధరలను నిర్ణయించే పద్ధతులు వచ్చాయి. ఉద్యోగాలు ఏవీ స్థానికులకు దక్కలేదు. ఏటేటా చార్జీలు పెరుగుతూ పోయాయి. చివరకు బిల్లులు చెల్లించని రైతులను జైల్లో పెట్టే సంప్రదాయం కూడా రాష్ట్రం చవిచూసింది.

చిత్తశుద్ధితో తెలంగాణ ముందడుగు.. కానీ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే దేనినైనా సాధించవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తున్నది. తెలంగాణలో తీవ్ర విద్యుత్‌సమస్య ఉంటుందని ఎన్నికల సమయంలోనే ప్రకటించిన కేసీఆర్ పదవి చేపట్టిన రెండో రోజే విద్యుత్‌శాఖపై సమీక్ష నిర్వహించారు. తక్షణ, స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు ఎంచుకున్నారు. నిపుణులను ఏరికోరి పిలిపించి అప్పగించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో బాధ్యతలను డీప్రభాకర్‌రావుకు, రెండు డిస్కమ్‌లను జీ రఘుమారెడ్డి(ఎస్పీడీసీఎల్), కే వెంకటనారాయణ(ఎన్పీడీసీఎల్)లకు బాధ్యతలు అప్పగించారు. విద్యుత్‌లోటు అవకాశంగా బయట ప్రతిపక్షాలు ఎంత బీభత్సాలు చేస్తున్నా చెక్కుచెదరకుండా లక్ష్యంమీద దృష్టి కేంద్రీకరించారు. ఎన్నో సమస్యలు.. ఎన్నో అవాంతరాలు. జూరాల యూనిట్ నీట మునిగింది. సీలేరు విద్యుత్‌ను మనకు కాకుండా చేశారు. ఏపీ విద్యుత్‌కు బాబు గండి కొట్టారు. శ్రీశైలం విద్యుత్‌కు అడ్డునిలిచారు. కేంద్రం చేతులెత్తేసింది. అయినా కొద్దినెలల్లోనే పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చుకున్నారు. మరోవైపు విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుపై భారీ లక్ష్యాలు ఏర్పరుచుకుని నిరంతర కృషి జరిపారు. తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్రంలో 24వేల మెగావాట్ల పవర్‌ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. నిప్పులు చెరిగే ఎండాకాలంలో కోతలు లేని విద్యుత్‌సరఫరా చేసి చూపించారు. తెలంగాణ ఆత్మతో పనిచేసే నాయకుడివల్లనే ఇది సాధ్యమైందని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యనించారు.

ప్రభుత్వ రంగం సంస్థలకు పునరుజ్జీవం.. ప్రపంచమంతా సంస్కరణల పేరుతో ప్రయివేటు రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న రోజుల్లో ప్రభుత్వ రంగం తెల్ల ఏనుగు అని సర్వత్రా భావిస్తున్న కాలంలోఆ సంస్థలకు పునరుజ్జీవనం పోసే రీతిలో తెలంగాణ సర్కారు విద్యుత్ ఉత్పత్తి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇపుడు సర్వత్రా చర్చగా మారింది. మొత్తం 24 వేల మెగావాట్ల ఉత్పత్తిని జెన్‌కో, బీహెచ్‌ఇఎల్, ఎన్టీపీసీలకు అప్పగించారు. ప్రస్తుతం కేవలం 2,282 మెగావాట్ల సామర్ధ్యం కలిగి ఉన్న జెన్‌కోకు వచ్చే మూడేండ్లలో అదనంగా ఆరువేల మెగావాట్ల సామర్థ్యం సమకూరుతున్నది. విభజన చట్టంలో పేర్కొన్నట్టు ఎన్టీపీసీ ద్వారా నాలుగువేల మెగావాట్ల విద్యుత్‌ప్రాజెక్టుల ఏర్పాటుకు మౌలికసదుపాయాలను ప్రభుత్వం శీఘ్రగతిని కలిగిస్తున్నది.వీటితో పాటు సింగరేణి సంస్థ ద్వారా నిర్మాణంలో ఉన్న 1200 మెగావాట్ల విద్యుత్‌ప్రాజెక్టుకు అదనంగా మరో 600 మెగావాట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి మార్గం సుగమమం చేశారు. ఈనెల 29న భద్రాద్రి పవర్‌ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారు.

KCR

వచ్చే నాలుగేళ్లలో విద్యుత్ పెట్టుబడులు

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొత్తం రూ. 15 వేల కోట్లు రుణాలు ఇస్తున్నది. ఇందులో మణుగూరులో 1080 యూనిట్ల ప్రాజెక్టు, దామరచర్లలో 600,800 మెగావాట్ల రెండు యూనిట్లు కలిపి 2480 మొగావాట్లు ఉత్పత్తి జరుగనుంది. ఇక కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ 24 వేల కోట్లు రుణం ఇస్తున్నది. ఇందులో దామరచర్లలోని రెండు యూనిట్లకు సంబంధించి 3000 మెగావాట్ల ప్రాజెక్టు, కేటీపీఎస్ విస్తరణలో 800 మెగావాట్ల ప్రాజెక్టు ఉన్నాయి. ఇక టీఎస్ జెన్‌కో 6280 మొగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టుల కోసం 42వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నది. సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో 600 మెగావాట్లు విద్యుదుత్పత్తికి 4వేల కోట్లు పెట్టుబడులు, ఎన్టీపీసీ 4000 మెగావాట్లకు 24వేల కోట్లు, సౌరవిద్యుత్ రంగంలో వెయ్యి మెగావాట్లకు 6500 కోట్లు ట్రాన్స్‌మిషన్ రంగంలో 15వేల కోట్లు పెట్టబడులు సమకూరుతున్నాయి. ఇవన్నీ కలిసి వచ్చే నాలుగేండ్లలో తెలంగాణ విద్యుత్‌రంగంలో 11,880 మెగావాట్లకు 91,500 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి.

KCR vision 02

సంవత్సరాల వారీగా అందుబాటులోకి వచ్చే విద్యుత్

ఫిబ్రవరి 2015 నాటికి అందుబాటులో ఉన్న విద్యుత్ 4300 మెగావాట్లు. 2015 చివరినాటికి పూర్తయ్యే ప్రాజెక్టులనుంచి వచ్చే 2959 మెగావాట్లు కలుపుకుంటే 7279 మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. 2016 చివరికి పూర్తయ్యే ప్రాజెక్టులనుంచి వచ్చే 3230 మెగావాట్లతో మొత్తం 10509 మెగావాట్లు సమకూరుతాయి. 2017 చివరికి మరో 836 మెగావాట్లతో మొత్తం 11345 మెగావాట్లు, 2018 చివరికి వచ్చే 9288 మెగావాట్లతో మొత్తం 20633 మెగావాట్లు థర్మల్ విద్యుత్తు సమకూరుతుంది. దీనికి జలవిద్యుత్తు ద్వారా 2442 మెగావాట్లు, సౌరవిద్యుత్ వెయ్యి మెగావాట్లు కలిపి 2018 చివరికి మొత్తం 24,075 మెగావాట్లకు చేరుకుంటాం. వ్యవసాయ రంగానికి గరిష్ఠంగా అవసరమ్యే విద్యుత్ 3000 మెగావాట్లు. ఆపైన ఉపయోగించే ప్రతి యూనిట్ విద్యుత్‌కు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం ట్రాన్స్‌కో, జెన్‌కోలకు వస్తుంది. అంటే ప్రభుత్వరంగ సంస్థలకే వస్తుంది. ప్రజలకు వస్తుంది.

ఉమ్మడి విద్యుత్ ఎంతెంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు తొమ్మిది సంవత్సరాల తెలుగుదేశం హయాంలో 4,576 మెగావాట్ల అదనపు విద్యుత్ సామర్థ్యం పెంచగా, 2004లో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఎనిమిది సంవత్సరాల్లో 5,346 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని మాత్రమే పెంచింది. వాటిల్లో తెలంగాణకు దక్కింది 2,282 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రతిపాదించిన ఎన్నో విద్యుత్ ప్రాజెక్టులు రాకుండాపోయాయి. బొగ్గు, నీరు లేని రాయలసీమలో ఆర్టీపీపీ పూర్తిచేశారు. మణుగూరులో కట్టాల్సిన ప్రాజెక్టును తరలించి విజయవాడ వద్ద వీటీపీఎస్ పూర్తిచేశారు. తెలంగాణలో 1400 మెగావాట్ల శంకరపల్లి గ్యాస్ పవర్ ప్రాజెక్టు పదేళ్ళుగా పడకేసింది. అన్నీ అనుమతులున్న నేదునూరులో 2,100మెగావాట్ల గ్యాస్ పవర్ ప్రాజెక్టు ఇప్పటికీ అతీగతి లేదు. సత్తుపల్లిలో 600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు, కాంతనపల్లి 450 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు ఆచరణలోకి రాలేదు. గ్యాస్ కేటాయింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపాయి. జెన్‌కో ప్రాజెక్టులను కాదని జీవీకే(ఎక్స్‌టెన్షన్), గౌతమి, కోనసీమ, వేమగిరి ప్రాజెక్టులకు(1,499 మెగావాట్లు) గ్యాస్ కేటాయింపులు చేశారు. తెలంగాణలో వ్యవసాయరంగం భూగర్భజలాలపై అధారపడి బోరుబావుల ఆధారితంగా ఉండడంతో నీటిని తోడేందుకు కరెంటు తప్పనిసరి అవుతుంది. ఇక్కడ దాదాపు 20 లక్షలకుపైగా వ్యవసాయ పంపుసెటు ఉన్నాయి. అయితే తెలంగాణ జిల్లాలకు నిర్దేశించిన దానిని మించిన విద్యుత్ కోతలు విధించేవారు. తెలంగాణ డిస్కమ్‌లకు ఇవ్వాల్సిన దానిలో కోతలు విధించడం, సీమాంధ్ర డిస్కంలకు కోటానుమించి సరఫరా చేయడం జరిగేది. కాంగ్రెస్ పార్టీ ఉత్పత్తిని గాలికి వదిలి ఓట్ల వేటలో సబ్సిడీలను భారీగా ప్రకటించి విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. కరెంటు చార్జీల పేరిట వడ్డనల పేరుతో తెలంగాణ ప్రజల నడ్డివిరిచింది. తెలంగాణ లో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, పవర్ లూమ్స్, బొమ్మల తయారీ, విస్తరాకుల పరిశ్రమ, షుగర్ క్రషింగ్ యూనిట్లపై పెంపు భారం భారీగా పడింది.

కారిడార్ సాకుతో కాసుల వేట రాష్ట్రంలో విద్యుత్ లోటుకు కారిడార్ లేకపోవడమే కారణమని నాటి ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి. అంతేతప్ప కారిడార్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేయలేదు. దేశంలో అనేక రాష్ర్టాలు కారిడార్ సాధించినా అస్మదీయుల పవర్‌ప్రాజెక్టుల మేలు కోసం గత పాలకులు ఆ దిశగా బలమైన కృషి చేయలేదు. కారిడార్ సమస్య కొనసాగడం ఇక్కడున్న ప్రయివేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు లాభసాటిగా మారాయి. లోటు సాకుతో ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ముచేసుకున్నాయి. ఉత్తర భారతదేశంలో విద్యుత్ కొనుగోలు ధర రూ.2ల నుంచి రూ.3ల వరకు ఉంటుంది. ఇక అర్ధరాత్రి సమయంలో అయితే యూనిట్ ధర కేవలం రూ.1.50లే. ఉమ్మడిరాష్ట్రంలో మాత్రం యూనిట్‌కు రూ.6ల నుంచి రూ.8ల వరకు ప్రయివేటు సంస్థల నుంచి కొన్నారు.

తాడిచర్ల మనకే.. కరీంనగర్‌జిల్లా మంథని డివిజన్‌లోని తాడిచర్ల-1 కోల్ బ్లాక్‌ను తెలంగాణ ప్రభుత్వం తిరిగి సాధించింది. ఆ బ్లాకును తెలంగాణ జెన్‌కోకు కేటాయిస్తూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మంగళవారం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి తాడిచర్ల కోల్ బ్లాక్‌ను కేంద్రం 2005 డిసెంబర్ 6వ తేదీననే భూపాలపల్లి పవర్ ప్రాజెక్టుకు కేటాయించింది. బ్లాక్ తవ్వకాల కోసం భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం జెన్‌కో దాదాపు రూ.170 కోట్ల కూడా వెచ్చించింది. అయితే బొగ్గు స్కాం కేసులో 1999-2010 మధ్య కేంద్రం జరిపిన 214 కోల్‌బ్లాక్ కేటాయింపులన్నీ సుప్రీంకోర్టు 2014 ఆగస్టులో రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడంతో తాడిచర్ల కూడా రద్దు అయ్యింది. ఆ తర్వాత ప్రభుత్వరంగ సంస్థల కోసం 43 కోల్ బ్లాక్‌లు కేటాయించాలని కేంద్రం నిర్ణయించడంతో తెలంగాణ దరఖాస్తు చేసుకోగా, ఏపీ జెన్‌కో కూడా పోటీకి దిగింది. భౌగోళికంగా తెలంగాణలో ఉన్న తాడిచర్లను తమకే కేటాయించాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు కేంద్రానికి మూడు లేఖలు రాశారు. ఫలితంగా తాడిచర్ల తెలంగాణకే సొంతమైంది. దీనితో భూపాలపల్లి 600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు బొగ్గు కేటాయింపు సమస్య తీరింది. ఇదిలా ఉండగా, మంగళవారం నాటి కేటాయింపుల్లో కేంద్రం ఎన్టీపీసీకి నాలుగు బ్లాక్‌లు కేటాయించింది. తెలంగాణలో తలపెట్టిన నాలుగువేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు అందులో ఒకటి దక్కే అవకాశముందని తెలిసింది.

KCR vision
MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.