Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జై తెలంగాణ.. జై వరంగల్

-వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి -మరో మూడు ప్రాజెక్టులకు కూడా.. -పంచాయతీలుగా గూడేలు.. తండాలు -నాలుగువేల కొత్త పంచాయతీలు -రానున్న అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ సవరణ బిల్లు -వలసల వాపసే లక్ష్యం -భూములిచ్చిన రైతులకు కేఎంటీపీలో ఉద్యోగమిస్తాం -దేశంలో 50 అభివృద్ధి కార్యక్రమాలు ఏకకాలంలో -అమలు చేస్తున్నది మనమే: సీఎం కేసీఆర్

తెలంగాణలో నిజమైన గ్రామస్వరాజ్యాన్ని స్థాపించే దిశగా కీలక చర్యలు తీసుకొంటున్నామని, త్వరలోనే రాష్ట్రంలోని గిరిజన గూడేలు, లంబాడా తండాలు, గోండు గూడేలను గ్రామపంచాయతీలుగా మార్చబోతున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందుకోసం రానున్న అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్ట సవరణబిల్లును ప్రవేశపెడుతామని తెలిపారు. ఇతర రాజకీయపార్టీల మాదిరిగా పారిపోకుండా నిర్దేశిత సమయానికే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఆయన తేల్చిచెప్పారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ అనతికాలంలోనే దేశానికే తలమానికమైన మహానగరంగా ఆవిర్భవించనుందని సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయపరంగా, పారిశ్రామికంగా, విద్యాపరంగా కూడా వరంగల్ సుసంపన్నం అవుతుందని అన్నారు. బంగారు తెలంగాణకంటే ముందుగా బంగారు వరంగల్ సాకారమవుతుందని చెప్పారు. జై తెలంగాణ.. జై వరంగల్ అంటూ ఆయన నినదించారు. వరంగల్ గ్రామీణ జిల్లాలోని గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీలో దేశంలోనే అతిపెద్ద వస్త్రనగరి కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్కు (కేఎంటీపీ)కు ఆదివారం మధ్యాహ్నం శంకుస్థాపన చేసిన ఆయన.. భవిష్యత్తులో రాజధాని హైదరాబాద్‌ను తలదన్నేలా వరంగల్ అభివృద్ధి చెందుతుందని అన్నారు.

కేఎంటీపీతోపాటు వరంగల్ రూపురేఖల్ని సమూలంగా మార్చివేసే ఔటర్ రింగ్‌రోడ్డు, మడికొండ ఐటీ పార్కులోని ఇంక్యుబేషన్ సెంటర్ రెండోదశ పనులకు, కాజీపేటలో సమాంతర రైలురోడ్డు వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కేఎంటీపీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో అశేషంగా హాజరైన జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ పార్కు నూటికి నూరుశాతం ప్రపంచ ప్రఖ్యాతి చెందుతుందని అన్నారు. వచ్చే జూలైలో కాళేశ్వరం నుంచి వరంగల్‌కు నీళ్లను పారించి బంగారు తెలంగాణ కంటే ముందు బంగారు వరంగల్ స్వప్నం నిజం చేస్తామని చెప్పారు. పోరుగల్లు ఓరుగల్లునుంచి పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి అత్యంత కీలకమైన ప్రకటనను ఆయన ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 8684 గ్రామ పంచాయతీలకు అదనంగా మరో నాలుగు నుంచి అయిదువేల కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేస్తామన్నారు. 600 జనాభా ప్రాతిపదికన పంచాయతీల ఏర్పాటు ఉంటుందని ఆయన వివరించారు. అన్ని గ్రామాలకూ నిర్దిష్టంగా నిధులుఇచ్చేవిధంగా బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు కేటాయిస్తామని సీఎం పేర్కొన్నారు. గ్రామస్వరాజ్యానికి కొత్త అర్థం ఇచ్చే రీతిలో పంచాయతీరాజ్ చట్టానికి సమూల మార్పులు చేసి రాష్ట్రంలో గ్రామసీమలను స్వర్గసీమలుగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుపై చర్చిస్తామన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

ప్రపంచం అబ్బురపడేలా కేఎంటీపీ మూతపడ్డ ఆజంజాహి మిల్లును తలదన్నేరీతిలో వరంగల్‌లో కాకతీయ మెగాటెక్స్‌టైల్‌పార్కు (కేఎంటీపీ)కు భూమిపూజ చేసుకున్నం. కాకతీయుల పేరుతోనే మన ప్రాంతానికి బర్కతి ఉంటుందని ఈ పార్కుకు వాళ్ల పేరు పెట్టుకొన్నం. ఇది దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌పార్క్‌గా రూపుదిద్దుకోబోతున్నది. గత పాలకుల నిర్లక్ష్యానికి ఆజంజాహి మిల్లు ఆనవాళ్లు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కోసం సూరత్, భీవండి, షోలాపూర్ ప్రాంతాలకు వలసలు వెళ్లిన నేతన్నల్లారా మీరంతా ఆత్మగౌరవంతో స్వరాష్ర్టానికి తిరిగి రావాలె. మీకు మన గడప దగ్గరే ఉపాధి దొరుకుతుంది. పరాయిరాష్ట్రంలో ఇక కష్టాలు పడాల్సిన అవసరం లేదు. మీ బిడ్డగా చెప్తున్న.. వలసలు వెళ్లిన నేతన్నలంతా సొంతూరులోనే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలె. తెల్ల బంగారానికి (పత్తి పంట) నెలవైన వరంగల్ జిల్లాలో సూరత్, షోలాపూర్, తిర్పూర్ వస్త్రపరిశ్రమల కలబోతగా భారీ వస్త్రనగరికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉన్నది. 700 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ బట్టలు అవసరం. ఆ అవసరాలకు తగ్గట్టుగా నూలుపోగు నుంచి రెడీమేడ్ వస్ర్తాల వరకు అన్ని రకాల వస్ర్తాలను తయారుచేసే కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్కు దేశంలోనే పెద్దది. దీనికి శంకుస్థాపనచేసిన రోజే 22 సంస్థలు రూ.3,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నయి. వీటివల్ల 25 వేలమందికి ప్రత్యక్షంగాను, మరో 50వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. వలసలు వాపసు రావాలనే సంకల్పంతో చేపట్టిన ఈ టెక్స్‌టైల్‌పార్కు ఏర్పాటుకు సహకరించి భూములిచ్చిన రైతుల కుటుంబాలకు పార్కులోనే ఒక్కో ఉద్యోగం తప్పక ఇస్తం. నూటికి నూరుశాతం ఆత్మవిశ్వాసంతో చెప్తున్న.. ఈరోజు శంకుస్థాపన చేసుకున్న టెక్స్‌టైల్‌పార్కు తప్పక ప్రపంచస్థాయి గుర్తింపు సాధిస్తుందన్న నమ్మకం నాకున్నది.

మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ టెక్స్‌టైల్ పార్కుకు విదేశీ వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు వచ్చేందుకు వీలుగా పక్కనే ఉన్న మామునూరు విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పునరుద్ధరిస్తం. పూర్తిస్థాయి విమానాశ్రయంగా కాకపోయినా, పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల రవాణాకు అనువైన సౌకర్యం కల్పిస్తం. రైల్వేమార్గంలో ఉత్తర, దక్షిణ భారత దేశాలకు కేంద్రమైన కాజీపేట రైల్వే జంక్షన్ ఉండటం టెక్స్‌టైల్‌పార్కు అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఇప్పుడు ఉన్న సౌకర్యాలకు తోడు మరిన్ని కొత్త మార్గాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకొస్తున్నది. ఔటర్ రింగురోడ్డుతో వరంగల్ రూపురేఖలే మారిపోతయి.

కొత్త విద్యాసంస్థలన్నీ వరంగల్‌కే ఇప్పటికే వరంగల్ విద్యాహబ్‌గా మారింది. హైదరాబాద్‌లో విద్యాసంస్థలు పెరిగిపోయాయి. ఇకపై వచ్చే విద్యాసంస్థలన్నీ సాధ్యమైనంతవరకూ వరంగల్‌లోనే నెలకొల్పుతాం. గిరిజన విద్యాసంస్థలతో సహా ఇప్పటికే మంజూరైన మరిన్ని విద్యాసంస్థలను వరంగల్‌లోనే ఏర్పాటు చేస్తం. పర్కాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎప్పట్నుంచో అడుగుతున్న పర్కాల రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తం. పర్కాల అభివృద్ధికి రూ.50 కోట్లు ప్రత్యేకంగా మంజూరుచేస్తున్న.

టీఎస్ ఐపాస్‌తో అద్భుత ఫలితాలు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామికవిధానం టీఎస్ ఐపాస్ అద్భుత ఫలితాలు సాధిస్తున్నది. పరిశ్రమలకోసం దరఖాస్తులు చేసుకొన్న పారిశ్రామికవేత్తలకు రూపాయి లంచం లేకుండా, కార్యాలయాల చుట్టూ తిరుగకుండా పనులు జరుగుతున్నయి. కేవలం 15రోజుల్లోనే 57 రకాల అనుమతులు వస్తున్నయి. ఆన్‌లైన్‌విధానం ద్వారా ఇప్పటివరకు 5,017 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినం. లక్షా 7వేల కోట్ల పెట్టుబడులను సమీకరించినం. ఇదంతా చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తున్న మంత్రి రామారావు, ఆయన యంత్రాంగం వల్ల సాధ్యమైంది. వారందరికీ సెల్యూట్ చేస్తున్న. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు, మహబూబ్‌నగర్‌లో ఫార్మాసిటీ వచ్చినయి. రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు జరుగుతయి.

సంక్షేమంలో ముందడుగు దేశంలో ఎక్కడా లేనివిధంగా 50 అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నం. కులవృత్తులు ఆగమైపోయిన పరిస్థితుల్లో వాటి అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తున్నది. 35 లక్షల గొల్ల, కురుమల అభివృద్దికి రూ.5వేల కోట్లతో గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టినం. రోజుకు 650లారీల గొర్రెలు దిగుమతి చేసుకుంటున్నం. ఈ పరిస్థితి పోవాలనే ఇప్పటివరకు యాదవ సమాజానికి 25లక్షల 80వేల గొర్రెలను పంపిణీ చేసినం. 40లక్షల జనాభా ఉన్న ముదిరాజ్, గంగపుత్రుల అభివృద్ధ్ది కోసం రూ.1000కోట్ల అభివృద్ధి నిధులు కేటాయించినం. చేనేత కార్మికుల కోసం 50శాతం సబ్సిడీతో యంత్రపరికరాలు, నూలు, రసాయనాలు అందజేస్తున్నం. దేశంలో ఎక్కడాలేనివిధంగా అత్యంత వెనుకబడిన వర్గాలకోసం వెయ్యి కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేసినం. ప్రభుత్వం మానవతా దృక్పథంతో పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్ల్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలుచేస్తున్నం. ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల విదేశీవిద్య కోసం ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లను తీసుకొచ్చి రూ.20లక్షలు అందిస్తున్నం. రాష్ట్రంలో 504 గురుకుల విద్యాలయాలు నెలకొల్పినం. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితం చేసేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేసినం. రైతు పెట్టుబడులకు ఎకరానికి ఏటా రెండుపంటలకు రూ.8 వేలు చెల్లించబోతున్నం. భూ రికార్డుల ప్రక్షాళనను దిగ్విజయంగా పూర్తి చేస్తున్నం. గర్భిణులకు కేసీఆర్ కిట్లు అందిస్తూ రూ.12 వేలు నగదు ప్రోత్సాహకం అందిస్తున్న సర్కారు దేశంలో మనది మాత్రమే. మృతదేహాల తరలింపులో ప్రభుత్వం మానవతను చాటుతున్నది. ఆటో, వ్యవసాయ ట్రాక్టర్లకు పన్నులు మినహాయించినం. ట్రాఫిక్ పోలీసులకు బేసిక్‌లో 30శాతం రిస్క్ అలవెన్సు అందిస్తున్నం. ఏ పట్టుదలతో రాష్ర్టాన్ని సాధించుకున్నమో అదే స్ఫూర్తితో ముమ్మాటికీ బంగారు తెలంగాణను సాధిస్తం అంటూ సీఎం కేసీఆర్ ప్రసంగం ముగించారు. చివరలో జై తెలంగాణ నినాదంతోపాటు జై వరంగల్.. అంటూ ముఖ్యమంత్రి నినదించారు. సీఎం నినాదాన్ని ప్రజలు సైతం అందుకుని జై కొట్టారు.

మెగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు.. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు, కాజీపేట ఆర్వోబీ, ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రం రెండోదశ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా భూమి పూజచేశారు. పక్కనే ఉన్న టెక్స్‌టైల్‌పార్కు పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. నాలుగు వేర్వేరు శిలాఫలకాలను ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధుల సమక్షంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనసభాపతి మధుసూదనాచారి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, చేనేత, జౌళి శాఖ మంత్రి కే తారకరామారావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లుతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, బోయినపల్లి వినోద్‌కుమార్, పసునూరి దయాకర్, సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆరూరి రమేశ్, శంకర్‌నాయక్, రెడ్యానాయక్, దాస్యం వినయ్‌భాస్కర్, వొడితెల సతీశ్, కొండా సురేఖ, రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, కొండా మురళి, శంభీపూర్ రాజు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పెద్ది సుదర్శన్‌రెడ్డి, పేర్వారం రాములు, గాంధీనాయక్, కిషన్‌రావు, గుండు సుధారాణి, బొల్లం సంపత్‌కుమార్, రాజయ్యయాదవ్, వాసుదేవరెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు తదితర పార్టీ ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

వద్దనేదాకా కాళేశ్వరంతో సాగునీళ్లు పాత వరంగల్ జిల్లాలోని 10 గ్రామీణ నియోజకవర్గాల్లో 10లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. వచ్చేఏడాది జూన్, జూలై నాటికి వరంగల్ ప్రాంతానికి కాళేశ్వరంద్వారా సాగునీళ్లు ఇస్తాం. రైతాంగం వద్దనేదాకా నీళ్లు ఇవ్వబోతున్నం. దమ్మున్న రైతులెవరైనా ఉంటే మూడుపంటలు పండించుకోవచ్చు. బంగారు పంటలతోనే బం గారు తెలంగాణ సాధ్యమవుతుంది. బంగారు తెలంగాణ కంటే ముందు బంగారు వరంగల్‌తోనే ఆ స్వప్నం సాకారం కాబోతున్నది. దేవాదుల ద్వారా కరువు ప్రాంతమైన జనగామకు నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపినం. అక్కడి రైతాంగం రెండుపంటల్ని సంబురంగా పండించుకుంటున్నది. ఉద్యమ సమయంలోనే వరంగల్ ప్రజలు నాకు స్ఫూర్తినిచ్చారు. దేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రం, మన సంపదను మనమే వినియోగించుకోవాలని ఆ సమయంలో ఉద్యమ గురువు జయశంకర్‌సార్ తరచూ గుర్తుచేసేవారు. ఇప్పుడా కల సాకారం అవుతున్నది. విద్య, వైద్య, పారిశ్రామిక, సాగునీటి రంగాలలో వరంగల్‌ను ముందుకు తీసుకొనిపోయి బంగారు వరంగల్‌గా మారుస్తం.గత పాలకుల నిర్లక్ష్యానికి మూతపడ్డ ఆజంజాహి మిల్లును తలదన్నేరీతిలో వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు భూమిపూజ చేసుకున్నం. కాకతీయుల పేరుతోనే మన ప్రాంతానికి బర్కతి ఉంటుందని ఈ పార్కుకు వాళ్ల పేరు పెట్టుకొన్నం. ఇది దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్‌టైల్ పార్క్‌గా రూపుదిద్దుకోబోతున్నది. పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కోసం సూరత్, భీవండి, షోలాపూర్ప్రాంతాలకు వలసలు వెళ్లిన నేతన్నల్లారా మీరంతా ఆత్మగౌరవంతో స్వరాష్ర్టానికి తిరిగి రావాలె. మీకు మన గడుప దగ్గరే ఉపాధి దొరుకుతుంది. – సీఎం కేసీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.