
-మళ్లొచ్చేసారి విమానంల దిగుతా.. -రెండేండ్లలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీళ్లు -పంట పొలాలను పచ్చగా మార్చే బాధ్యత నాది -డిచ్పల్లి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
డిచ్‌పల్లిలో వచ్చే రెండేండ్లలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరందిస్త. మీకు హామీ ఇస్తున్న ఇక్కడ పంట పొలాలను పచ్చగా మార్చే బాధ్యత తీస్కుంటున్న అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. దానికి ఫికర్ చేయొద్దని మనవి చేస్తా ఉన్నా అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. బాజిరెడ్డి గోవర్ధన్ మంచిపరిణితి, అనుభవం ఉన్న నాయకుడు. పోయినసారి మీరు ఆదరించి గెలిపించినందుకు బ్రహ్మాండంగా సేవలు చేశాడు. ఇప్పుడు ఒకకోరిక కోరినాడు. మాకు అన్ని వచ్చినయ్.. అన్ని మంచిగనే ఉన్నయ్.. సాగుకు నీళ్లు కావాలన్నడు. మీ బిడ్డగా.. వ్యవసాయంలో సాగునీళ్ల బాధేందో మీ అందరికన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తిగా హామీఇస్తా ఉన్నా.. రెండేండ్లలోపల నియోజకవర్గంలో 1.10 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాదని మనవిచేస్తున్న.. దాంతోపాటు ప్రత్యేకంగా జక్రాన్‌పల్లిలో ఎయిరోడ్రోమ్ కాదుగని.. ఎయిర్‌స్ట్రిప్ వస్తది మీకు.. విమానాలు దిగే ప్రదేశం కూడా వస్తది. దేవుడు మన్నిస్తే మరో తాప వచ్చి విమానంలోనే దిగుత..ఆ పని కూడా జరుగుతది.
డిచ్‌పల్లిలో 65,700 మందికి ఆసరా పింఛన్లు.. ఈ సభను చూస్తుంటే ఒక నియోజకవర్గం సభలాగా లేదు.. గింత యాల్ల పొద్దుగాల్లా గింతమంది రారు. ఇంకా రోడ్డుమీద శానమంది ఉన్నరు. దీన్నిబట్టి బాజిరెడ్డి గోవర్ధన్ చాలా పెద్దమెజార్టీతో గెలుస్తున్నడని తెలుస్తా ఉంది. మరి గెల్వాలె.. రెండే ముచ్చట్ల మీద గెల్వాలె.. మీ నియోజకవర్గంలో 65,700 మందికి ఆసరాపథకం కింద నెలకు వెయ్యిరూపాయలు వస్తున్నయ్.. ఒక డిచ్‌పల్లిలోనే 50 తండాల్లో గిరిజనులు సర్పంచులు కాబోతా ఉన్నరు. గిరిజన యువకులు ఆలోచన చేయాలె. ఎన్నోఏండ్లు మీరు కొట్లాడినారు. ఎవరూ చేయలె. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోతే ఒకటే నెలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతయ్. లంబాడా బిడ్డలు తండాలకు సర్పంచులై రాజ్యమేల్తరని మనవి చేస్తా ఉన్న. అట్లనే తెలంగాణ వ్యాప్తంగా 3,500 మంది గిరిజన బిడ్డలు సర్పంచులు అయితరు.
సుడిగాలిలాంటి టీఆర్ఎస్ వేవ్ ఉంది నిన్నగాక మొన్ననే సర్వేరిపోర్టు వచ్చింది. నిజంచెప్తున్న ఈమాట ఒక భయంకరమైన సుడిగాలిలాంటి వేవ్ ఉంది రాష్ట్రంలో. ఏ మూలకుపో.. ఉత్తరం పో.. పడమర పో.. ఖమ్మం పో.. మహబూబ్‌నగర్ పో.. నల్లగొండకు పో.. యాడికన్న పో.. ఒక్కొక్క సభలో 70వేల మంది.. మీ సభలో ఎంతమంది ఉన్నరో మీరే చూస్తున్నరు. పోయిన తాపకూడా ఈడికే వచ్చిన గింతమంది లేరు అప్పుడు. పోయినసారి కంటే డబల్ మంది ఇప్పుడున్నరు. గోవర్ధన్ కూడా డబుల్ మెజార్టీతో గెలుస్తా ఉన్నడు. అర్థమైపోతాంది. గిట్లనే ఎక్కడికిపోయినా 70 నుంచి 80 వేల మందికిపైగా ఉన్నరు. దేవరకద్ర చిన్నఊరు అక్కడ కూడా 70వేల మందితో సభ జరిగింది. ఒక పాజిటివ్ ఓట్, ఒక వేవ్ కనబడుతుంది. తెలంగాణ మొత్తంలో నేను మొదటిసారి చెప్పిన్నో వందస్థానాల్లో గెలుస్తమని.. వందకు పైగా స్థానాల్లో గెలుస్తమని సర్వే రిపోర్టులు చెప్తా ఉన్నయ్.