Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జల దృశ్యం నుంచి..సుజల దృశ్యం దాకా..

కేసీఆర్‌ గారు 2001లో పార్టీ స్థాపించేనాటికి కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉన్నది. దేశవ్యాప్తంగా బీజేపీ బలం పుంజుకుంటున్నది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వందేండ్ల చరిత్ర గల కాంగ్రెస్‌ కూడా ఇటు రాష్ట్రంలో, అటు జాతీయస్థాయిలో బలంగానే ఉన్నది. ఇక రాష్ట్రంలో చంద్రబాబు ప్రాభవం నడుస్తున్న కాలం అది. అప్పుడు రాష్ట్రంలో పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేదు. 1950ల్లో ఒకసారి, 1969లో ఒకసారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది. తొలిసారి ఢిల్లీ లాబీయింగులో ఓడిపోయిన తర్వాత 1969లో మరోసారి ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉధృత ఉద్యమం తీరానికి చేరలేదు. వందల మంది యువతీయువకులు బలిదానాలు చేసినా రాష్ట్రం సాకారం కాలేదు. దీంతో ఈ ప్రాంత యువత తీవ్ర నిరాశానిస్పృహలో కూరుకుపోయారు. అందుకే 1990ల్లో అక్కడక్కడా కొన్ని ప్రజాసంఘాలు తెలంగాణ ఉద్యమాన్ని రాజేసే ప్రయత్నం చేసినా దానికి ప్రజల నుంచి పెద్దగా ప్రతిస్పందన రాలేదు.

జల దృశ్యం నుంచి..సుజల దృశ్యం దాకా..
ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో వేల రాజకీయ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. అందులో అనేకం మఖలో పుట్టి పుబ్బలో మాయమైపోగా, కొన్ని మాత్రమే సుదీర్ఘకాలం ప్రజాక్షేత్రంలో మనగలిగినయి. రాష్ట్ర సాధన కోసమే ఒక రాజకీయపార్టీని స్థాపించి, పద్నాలుగేండ్లు ప్రజా ఉద్యమాన్ని ముందుండి నడిపి, తన ప్రాణాలే పణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించి, స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన అనితర సాధ్యమైన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికే స్వంతం. ఆయన మానసపుత్రిక తెలంగాణ రాష్ట్ర సమితి ఇవ్వాళ 20వ వార్షికోత్సవం జరుపుకుంటున్నది.

ఒక ప్రాంతీయ రాజకీయపార్టీ చరిత్రలో 20 ఏండ్లు అనేది కీలక మైలురాయి. మనిషి జీవితంతో పోలిస్తే బాల్యం, కౌమారం దాటుకొని యవ్వనంలోకి అడుగుపెట్టినట్టు. తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుక నుంచి తొలి పద్నాలుగేండ్ల ప్రస్థానం నిప్పుల మీద కవాతు వంటిదే.

నిజానికి కేసీఆర్‌ గారు స్థాపించింది ఒక రాజకీయపార్టీని మాత్రమే కాదు. అది మూడున్నర కోట్ల మంది ప్రజలను ఒక్కతాటి మీదికి తీసుకొచ్చిన మహోద్యమం. ఒక మనిషి తన జీవితకాలంలో ఇంతమంది ప్రజల జీవితాలను మార్చివేసిన అద్భుత సన్నివేశాలు మానవజాతి చరిత్రలో చాలా అరుదుగా జరిగాయి.

2001 ఏప్రిల్‌ 27 నాడు పార్టీ స్థాపించడానికి రెండు మూడేండ్ల ముందునుంచే దానికి అవసరమైన కసరత్తు మొదలుపెట్టారు కేసీఆర్‌ గారు. వివిధ రాజకీయ నేతలు, మేధావులు, బుద్ధిజీవులు, పాత్రికేయులతో రోజులు, వారాల తరబడి చర్చోపచర్చలు జరిపారు. కేసీఆర్‌ గారు మేధోమథనంలో గత ఉద్యమాల అనుభవాలు అన్నీ కూలంకషంగా అధ్యయనం చేశారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకూడదని దృఢంగా భావించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎదురవుతున్న వివక్ష గురించి ప్రజలకు వివరించి, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత గురించి అవగాహన కల్పించి, ఒక విస్తృత, శాంతియుత ప్రజాఉద్యమాన్ని నిర్మించి, ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు ద్వారా చట్టసభల్లో తమ వాణి వినిపిస్తేనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని ఆయన బలంగా విశ్వసించారు. రాజకీయ మార్గం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని కేసీఆర్‌ చెప్పిన మాటల అసలు అర్థం అదే! గాంధీజీ నమ్మిన శాంతియుత ప్రజాఉద్యమం, అంబేడ్కర్‌ చెప్పిన బోధించు, సమీకరించు, పోరాడు అనే ఆశయాల స్ఫూర్తిగా కేసీఆర్‌ తుది దశ తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

పార్టీ పెట్టిన నాడు కేసీఆర్‌ గారు పెద్దగా చరిష్మా ఉన్న లీడర్‌ కాదు, రాజకీయ వారసత్వం లేదు, సినిమా గ్లామరో, డబ్బు సంచు లో లేవు. ఉన్నదల్లా తెలంగాణ ప్రజల మీద న మ్మకం, తాను ఎంచుకున్న లక్ష్యం పట్ల నూటికి నూరు శాతం నిబద్ధత. అందుకే జలదృశ్యంలో తొలి సభలోనే డిప్యూటీ స్పీకర్‌ పదవికి, ఎమ్మె ల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ బరిలోకి దిగిండు. రాష్ట్రం సా ధించేవరకూ విశ్రమించనని, ఒకవేళ ఎత్తిన జెం డా దించితే తనను రాళ్లతో కొట్టి చంపండని తొలిరోజే ప్రజలకు మాట ఇచ్చిన చరిత్ర ఆయనది.

కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమంలో ఒక్కో ఇటుక పదిలంగా పేర్చుకుంటూ వెళ్లారు. ముందుగా తెలంగాణలో అనేకమంది రాజకీయ నాయకులను కలిసి ఉద్యమంలో కలిసిరమ్మని కోరారు. తొలిరోజుల్లో అనేకమందికి ఈ పార్టీ మనుగడ సాగించగలదా, రాష్ట్రసాధన సాధ్యమేనా అనే అనుమానాలు ఉండేవి. కానీ కేసీఆర్‌ గారు మాత్రం చాలా బలంగా తెలంగాణ సాధించగలం అనే నమ్మికతో ఉండేవారు.

పార్టీ స్థాపించిన ఒక నెలలోనే తెలంగాణ ప్రాంతంలో ఆరు భారీ బహిరంగసభలను నిర్వహించి వెంటనే కేసీఆర్‌ గారు సంచలనం సృష్టించారు. ప్రతి సభకూ జనం పోటెత్తారు. దీంతో ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష బలంగా ఉన్నదని స్పష్టమైంది. 2001 జులైలో వచ్చిన జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో, ఆగస్టులో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకొని పార్టీకి ఒక గట్టి పునాది వేయగలిగింది. అదే ఏడాది సెప్టెంబర్‌లో తన రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ గారు భారీ మెజారిటీతో విజయం సాధించి ఈ ప్రాంతం మొత్తం తన వెంటే ఉన్నదని నిరూపించారు.

జల దృశ్యం నుంచి..సుజల దృశ్యం దాకా..
ఉద్యమ స్ఫూర్తి నిత్యం ప్రజ్వలితం అయ్యేలా అనేక పోరాట రూపాలు ఎంచుకుంటూ 2002-2003 సంవత్సరాల్లో పార్టీ ప్రస్థానం కొనసాగించారు. 2003 మార్చిలో ఢిల్లీకి చేసిన కార్ల ర్యాలీ జాతీయస్థాయిలో అనేకమంది నాయకులను ఆకర్షించింది. తెలంగాణ ఉద్యమం గెలుపు తీరాలకు చేరాలంటే ఢిల్లీలో లాబీయింగ్‌ కూడా చేయవలసిన అవసరం ఉంటుందని కేసీఆర్‌కు స్పష్టత ఉన్నది. అందుకే జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో నిరంతరం సంప్రదింపులు జరిపేవారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రోజురోజుకూ ఉధృతమవుతున్న ఉద్యమాన్ని గమనించిన కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు 2004 ఎన్నికల్లో పొత్తుకు ప్రతిపాదన పంపారు. ఒక జాతీయపార్టీతో పొత్తు ఉంటే అది రాష్ట్ర సాధనకు ఉపకరిస్తుందని నమ్మిన కేసీఆర్‌ గారు పొత్తుకు సరేనన్నారు. ఆ ఎన్నికల్లో గెలిచాక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు దోహదపడుతుందని కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ భాగస్వామిగా చేరింది. కామన్‌ మినిమం ప్రోగ్రాం, రాష్ట్రపతి ప్రసంగం, ప్రధానమంత్రి ప్రసంగాల్లో తెలంగాణ ఏర్పాటు గురించి ప్రకటనలు వచ్చాయి. కానీ యూపీఏ ప్రభుత్వం ఏండ్ల తరబడి తాత్సారం చేయడంతో రెండుచోట్లా ప్రభుత్వాల నుంచి వైదొలగి మళ్లా ఉద్యమబాట పట్టారు కేసీఆర్‌ గారు. మధ్యలో అనేక ఎదురుదెబ్బలు తగిలినా, కొన్నిసార్లు ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఎత్తిన జెండా దించలేదు. 2009 నవంబర్‌లో కేసీఆర్‌ గారుమొదలుపెట్టిన ఆమరణ నిరాహారదీక్షను భగ్నం చేయడానికి, ఆయనను పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించడంతో ఉద్యమం ఊపందుకున్నది. పదిరోజుల అనంతరం కేసీఆర్‌ గారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలుసుకున్న కేంద్రం, డిసెంబర్‌ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి, మళ్లా 14 రోజులకే సీమాంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిడితో ఆ ప్రకటన నుంచి వెనక్కి వెళ్లింది. అప్పుడు కేసీఆర్‌ గారు తెలంగాణ జేఏసీని ఏర్పాటుచేసి సబ్బండవర్గాల మద్దతుతో ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేశారు. జేఏసీకి వెన్నెముకగా, తొలినుంచి చివరివరకూ క్రియాశీలకంగా ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీనే.

మన యాస-భాషలను, సంస్కృతిని, పండుగలను ఉద్యమంలో భాగం చేసి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలు వేశారు కేసీఆర్‌ గారు. తెలంగాణ రాజకీయ నాయకత్వం అంటే ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టి టీఆర్‌ఎస్‌ నాయకత్వం అంటే ఎనలేని విశ్వాసం కలిగించేందుకు కేసీఆర్‌ చేసిన మొక్కవోని పోరాటం దోహదపడింది.

ఉద్యమం తొలినాళ్ల నుంచి మొదలుపెట్టి పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకూ ప్రతి దశలో అత్యంత నేర్పుతో, సంయమనంతో, పట్టువిడుపులు ప్రదర్శించారు కేసీఆర్‌గారు. గొప్ప స్థితప్రజ్ఞతతో అటు ప్రజలకు, ఇటు పార్టీ కార్యకర్తలకు, ద్వితీయశ్రేణి నాయకత్వానికి భరోసా ఇ స్తూ ఒక సవ్యసాచిలా తెలంగాణ నావను తీరం చేర్చారు.

ప్రజామోదంతో తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేసీఆర్‌ గారు అనతికాలంలోనే తాగు, సాగునీటి, కరంటు సమస్యలను, రైతాంగం సమస్యలను తీర్చారు. తెలంగాణను ఐటీ నుంచి అగ్రికల్చర్‌ వరకూ అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలిపి రెండోసారి మరింత ఎక్కువ ప్రజాదరణతో గెలుపొందారు.

స్వరాష్ట్రంలో తెలంగాణ పౌరులు తలెత్తుకొని సగర్వంగా జీవించేలా చేసినా, అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మూడేండ్లలోనే పూర్తిచేసి తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దినా, కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను దేశపు ధాన్యాగారంగా మార్చినా, డబ్బు ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న నల్లగొండ ఫ్లోరోసిస్‌ సమస్యను తీర్చినా, పాలమూరు వలసలు వాపసయ్యేలా చేసినా.. అది కేసీఆర్‌ గారి నాయకత్వం వల్లనే సాధ్యమైంది.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత నేను ఒక సమావేశంలో అప్పటి కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీని కలిసినప్పుడు ఆయన ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన నాయకులు చాలాసార్లు పరిపాలనలో విఫలమవుతుంటారు, కానీ ఆశ్చర్యకరంగా కేసీఆర్‌ గారు అటు ఉద్యమకారుడి నుంచి అనతికాలంలోనే ఒక మంచి పరిపాలనాదక్షుడిగా రూపాంతరం చెందిన నేత అని కితాబిచ్చారు.

ఈ ఇరవయ్యవ వార్షికోత్సవం వేళ అనేక త్యాగాలు చేసి, పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యకర్తల సంక్షేమమే పరమావధిగా టీఆర్‌ఎస్‌ ఎప్పటికీ పనిచేస్తదని వారికి భరోసా ఇస్తున్నాను.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సర్‌ చెప్పినట్టు తెలంగాణకు ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష. మన పెద్దలు అన్నట్టు మంటి పనికైనా ఇంటోడే ఉండాలి. మిగతా రాజకీయపార్టీలకు ఉండే సవాలక్ష ఎజెండాల్లో తెలంగాణ ఒకటి, కానీ టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తది అని గత రెండు దశాబ్దాల చరిత్ర నిరూపిస్తున్నది.

ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ గారి సారథ్యంలో కనీసం మరో రెండు దశాబ్దాలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం ఇలాగే కొనసాగుతుంది అన్న నమ్మకం నాకున్నది.

మన యాస-భాషలను, సంస్కృతిని, పండుగలను ఉద్యమంలో భాగం చేసి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలు వేశారు కేసీఆర్‌ గారు. తెలంగాణ రాజకీయ నాయకత్వం అంటే ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టి టీఆర్‌ఎస్‌ నాయకత్వం అంటే ఎనలేని విశ్వాసం కలిగించేందుకు కేసీఆర్‌ చేసిన మొక్కవోని పోరాటం దోహదపడింది.

– టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.