Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జలదృశ్యం నుంచి ఎల్‌బీ స్టేడియం దాకా..

-14 ఏండ్ల అలుపెరుగని ప్రస్థానం -నిన్న తెలంగాణ కోసం.. ఇవాళ బంగారు తెలంగాణ కోసం -నేడు టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశం

KCR announcing TRS Party

వందల గంటల మేథోమథనంలోంచి ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తన లక్ష్యమైన తెలంగాణ రాష్ర్టాన్ని ముద్దాడి, ప్రభుత్వ పగ్గాలు అందుకుని ఇవాళ మరో మేథోమథనం కోసం ప్లీనరీ నిర్వహించుకుంటున్నది. ఎన్నో ఇబ్బందులు, మరెన్నో ఆటంకాలు-అడ్డంకులను అధిగమిస్తూ సుమారు పదకొండు నెలల ప్రభుత్వాన్ని జనరంజకంగా నడుపుకున్న సంతృప్తిని ఆస్వాదిస్తూనే ఇటు పార్టీ అటు ప్రభుత్వ విధానాలను సమీక్షించుకుని భవిష్యత్తు వ్యూహానికి పదును పెట్టబోతున్నది. 36 వేల మంది ప్రతినిధులు భాగస్వాములు కానున్న ఈ మేథోమథనం రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించబోతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం, పరిణామం, ఉత్థాన పతనాలు, మహాశక్తిగా మారిన తీరు చర్చనీయాంశంగా మారుతున్నది.

ఇవాళ 36 వేల మంది ప్రతినిధులు కొలువుతీరుతున్న ఎల్బీ స్టేడియంకు కూతవేటు దూరంలోనే.. హుస్సేన్‌సాగర్ ఒడ్డున జలదృశ్యంలో 14 ఏండ్ల క్రితం 2001 ఏప్రిల్ 27న కేవలం వందలమంది ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఊపిరిపోసుకున్నది. నాటి కార్యక్రమంలో పాల్గొన్నవారిలో అత్యధికులు 1969నాటి ఉద్యమకారులు,విద్యావంతులు, కొందరు మేధావులు తప్ప మెయిన్‌స్ట్రీం రాజకీయ నాయకులు లేరు. ఒక రకమైన గంభీరమైన వాతావరణం. నమ్మకం-అపనమ్మకాల మధ్య తెలంగాణ ఆకాంక్ష మాత్రమే రాజ్యమేలిన ఘట్టం. తెలంగాణ ఉద్యమప్రస్థానంలో మరో నూతన రాజకీయపార్టీ ప్రారంభ ప్రకటన వెలువడింది. గత ఉద్యమపంథాకు భిన్నంగా పార్లమెంటరీ పంథాలోనే రాష్ట్రసాధన లక్ష్యంగా ప్రకటించారు. హింసకు తావివ్వకుండా గాంధేయ మార్గంలో ఉద్యమ పంథాను నిర్దేశించారు. ఆ వేదిక మీద ఉద్యమనేత కేచంద్రశేఖర్‌రావు డిప్యూటీ స్పీకర్, శాసనసభ సభ్యత్వాలను త్యాగం చేస్తూ చేసిన ప్రకటన ఉద్యమానికి ప్రాణప్రతిష్ట చేసింది. పవిత్రతను రంగరించింది. నాటి సభలో కేసీఆర్ ప్రసంగం, పదవీ త్యాగం, భవిష్యత్తు కార్యక్రమంగా కరీంనగర్ సింహగర్జన ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పాయి. దశాబ్దాలుగా అణచిపెట్టుకున్న తెలంగాణ ఆకాంక్ష పెల్లుబికింది. 20 రోజుల వ్యవధిలో కరీంనగర్‌లో సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్టు ప్రకటించి ముందున్నదంతా ఉద్యమ ప్రస్థానమేనని సంకేతమిచ్చారు.

KCR with Sharadh Pawar 01

భావ వ్యాప్తి.. కరీంనగర్ సభ టీఆర్‌ఎస్‌కు ఊపునే కాదు తెలంగాణ సందేశం మూలమూలకు చేర్చాల్సిన ఆవశ్యకత ఉందని సందేశాన్ని కూడా ఇచ్చింది. తెలంగాణ జెండా అందుకోవడం కోసం ప్రజలు ఎదురుతెన్నులు చూస్తున్నారన్న వాస్తవాన్ని కండ్లకు కట్టింది. జూన్ 1వ తేదీనుంచి భావజాల ప్రచారయాత్ర రూపుదిద్దుకుంది. మొదటి అడుగు పల్లెపల్లెలో పల్లేర్లు మొలిచిన పాలమూరు. హైదరాబాద్‌నుంచి మహబూబ్‌నగర్‌దాకా జనప్రవాహం. ఎక్కడికక్కడ మంగళహారతులతో స్వాగతాలు. తెలంగాణను నిండా ముంచుతూ ఆంధ్రలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనుకున్న నాటి ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టుల్లో పారేది తెలంగాణ నెత్తుటి ప్రవాహాలేనని పాలమూరు వేదికగా గట్టి హెచ్చరిక పంపారు. మరుసటి రోజు చందమామల వంటి పిల్లల జీవితాలను ఫ్లోరైడ్ మహమ్మారి చిదిమేసిన నల్లగొండ జిల్లాలో సభ. సాగర్ కెనాల్ మీద ఆంధ్రలో లిప్టుల నిర్వహణ ప్రభుత్వం తీసుకుని తెలంగాణ నిర్వహణ వ్యయాన్ని తెలంగాణ రైతులమీద రుద్దుతున్న సర్కారు దుర్ణీతిని బట్టబయలు చేసింది. 4వ తేదీ తెలంగాణకు గర్వకారణమైన బోధన్ చక్కెర బతుకులకు చేదు మిగిల్చిన నిజామాబాద్ జిల్లా. ఆహ్వానం అపూర్వం. ప్రాణాలైనా అర్పిస్తామన్న నినాదాలు మిన్ను ముట్టిన స్ఫూర్థి. అక్కడినుంచి విషజ్వరాలతో పిట్టల్లా రాలుతున్న ఆదివాసీల పురిటిగడ్డ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణం. గిరిజన గూడాల్లో గుడిసెల మీద గులాబీ జెండాలు రెపరెపలాడిన సందర్భం. 21వ తేదీన వరంగల్లు. పాలకుల గుండెలు ఝల్లుమనిపించే రీతిలో జనప్రవాహం. యావత్ తెలంగాణకు ఇచ్చిన సందేశం.. తెలంగాణ సాధించాలి.. సాధించి తీరాలన్న సంకల్పం.

KCR with devegowda

ఎన్నికల రాజకీయాల్లో తొలిఅడుగు.. జూలై నెలలో స్థానిక ఎన్నికలు వచ్చాయి. అప్పటికే రాష్ట్ర వ్యాప్త పర్యటన పూర్తికావడం తెలంగాణ సందేశం ప్రజల్లోకి చేరడంతో ఈ ఎన్నికల్లో అది ప్రతిఫలించింది. వంద ఎంపీపీలు, 85 జెడ్పీటీసీలతో పాటు 9 జెడ్పీలకు గానూ రెండు జెడ్పీలను టీఆర్‌ఎస్ అలవోకగా కైవసం చేసుకుంది. వరంగల్, మెదక్ తదితర జిల్లాల్లో గణనీయ స్థానాలు గెలుచుకున్నది. ఆ తర్వాత ఆగస్టులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మూడువేలమంది సర్పంచులను, 12వేల మంది వార్డు సభ్యులను కూడా గెలుచుకుంది.

పోరాట దశ.. 2002 టీఆర్‌ఎస్‌కు కీలక సంవత్సరం. అంతదాకా తెలంగాణ భావజాల వ్యాప్తిపైనే అధికంగా దృష్టి పెట్టారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ శంఖారావం దాకా అది కొనసాగింది. పార్టీ తొలి ఆవిర్భావ సదస్సు నల్లగొండలో జరిగింది. ఏడాది కాలంలో ఉద్యమ స్వరూప స్వభావాలు సమీక్షించి దాన్ని మరింత విస్తృత పరచాలని నిర్ణయించారు. ప్రజాసమస్యలపై పోరాటాలకు దిశానిర్దేశం చేశారు. మొట్టమొదటి కార్యక్రమం పల్లెబాట. నెలల తరబడి ఈ కార్యక్రమం సాగింది. అనేక ప్రజాసమస్యలు తీసుకుని పాదయాత్రలు నిర్వహించారు.

బాబుకు అడ్రస్ చెప్పిన జింఖాన సభ.. తర్వాత కాలంలో కొంత స్తబ్దత. రాజకీయంగా ఒడిదుడుకులు. తెలంగాణ ఉద్యమం చల్లబడిందంటూ మీడియా దుష్పచారాలు. టీఆర్‌ఎస్సా..అది ఉందా… దాని అడ్రస్ ఎక్కడుంది? అంటూ చంద్రబాబు ఎకసక్కాలు. బదులు చెప్పాలని పార్టీ నిర్ణయించింది. 2003 జనవరి 6 హైదరాబాద్ నగరాన్ని జనప్రవాహం ముంచెత్తింది. రాజకీయ పార్టీలేవీ సభలు పెట్టడానికి సాహసించని జింఖానా మైదానంలో టీఆర్‌ఎస్ సభ. రాంవిలాస్ పాశ్వాన్ సహా పలువురు జాతీయనాయకుల ఆసీనులై ఉన్న వేదిక మీద కేసీఆర్ నిప్పులు కురిపించే ప్రసంగంతో తెలంగాణ దద్దరిల్లింది. చంద్రబాబూ…టీఆర్‌ఎస్ అడ్రస్ ఎక్కడుందో కనిపిస్తున్నదా? అంటూ కేసీఆర్ వేసిన ప్రశ్నకు జవాబు ఇచ్చే దమ్ములేక టీడీపీ నాయకులు మీడియాకు ముఖం చాటేశారు.

KCR hungerstirke

తెలంగాణవాదానికి ప్రాణప్రతిష్ఠ.. ఎంపీ పదవికి రాజీనామా చేయడం ద్వారా తెలంగాణవాదానికి ప్రాణప్రతిష్ఠ చేయాలని కేసీఆర్ సంకల్పించారు. కరీంనగర్ ఉప ఎన్నిక తెలంగాణవాదాన్ని హిమాలయం మీద నిలిపింది. 2006లో తెలంగాణ భవన్ ఏర్పాటైంది. మరుసటి సంవత్సరమే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించారు. తెలంగాణ ధూంధాం ఆటపాటలతో దద్దరిల్లాయి. 2008లో పరేడ్ గ్రౌండ్స్‌లో 7వ వార్షికోత్సవం, 2009లో సిద్దిపేటలో ఉద్యోగుల సభ జరిగాయి.

ఎదురుదెబ్బలు.. ఘన విజయాలు తెలంగాణకు నో అనే పార్టీ ఉండరాదనే ఎత్తుగడతో 2009లో టీడీపీతో పొత్తుకు టీఆర్‌ఎస్ ఓకే చెప్పింది. ఎన్నికల్లో టీడీపీయే స్వయంగా వెన్నుపోట్లకు దిగడంతో చేదుఫలితాలు వచ్చాయి. మళ్లీ ఒక స్తబ్దత. కొంతకాలం వ్యూహాత్మక మౌనాన్ని పాటించాల్సి వచ్చింది రోశయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టాక హైదరాబాద్ ఫ్రీజోన్ అంశం ముందుకు వచ్చింది. తెలంగాణ బిడ్డలకు చెప్రాసీ పోస్టులు కూడా దక్కకుండా చేసే కుట్ర. తెలంగాణ రాష్ట్రం రావడమే ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం అన్న కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష ప్రకటించారు. డిసెంబర్ 5న కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆందోళన చెందిన కేంద్రం ముందుకు కదిలింది. సచివాలయంలో అఖిలపక్షంలో అన్ని పక్షాలు తెలంగాణకు ఓకే చెప్పాయి. 9 డిసెంబర్ అర్దరాత్రి తెలంగాణ ప్రకటన వెలువడింది. 24 గంటల్లోనే సీమాంధ్ర నాయకుల కుట్రలతో ఆ ప్రకటన వెనక్కిపోగా డిసెంబర్ 23న తెలంగాణ రాజకీయ జేఏసీ ఆవిర్భవించింది. టీఆర్‌ఎస్ జేఏసీతో మమేకమై ఉద్యమ పంథా అనుసరించింది. 2010జూలైలో జరిగిన ఉపెన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు చరిత్రలో కనివిని ఎరుగని మెజార్టీలతో గెలిచారు. కాంగ్రెస్ టీడీపీలు డిపాజిట్లు కోల్పోయాయి. మిలియన్ మార్చ్‌లు, సాగరహారాలు, సకలజనుల సమ్మెలు ఆందోళన ఏదైనా టీఆర్‌ఎస్ అగ్రభాగాన నిలిచింది. చివరకు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను చేపట్టింది. ఆరు దశాబ్దాల కల ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 14 ఏండ్లు అవిశ్రాంతంగా శ్రమించిన టీఆర్‌ఎస్‌ను ప్రజలు గుండెకు హత్తుకున్నారు. భారీ మెజార్టీతో అధికారాన్ని అప్పగించారు. రాష్ట్రంలోని 9 జెడ్పీలతో పాటు మున్సిపాలిటీలు, పంచాయతీల్లో టీఆర్‌ఎస్ జెండా రెపరెపలాడింది.

మహాశక్తిగా.. ఇవాళ టీఆర్‌ఎస్ మిగిలిన పార్టీలేవీ అందుకోనంత ఎత్తుకు ఎదిగింది. సమీప భవిష్యత్తులో ఇంకేపార్టీ పోటీపడే అవకాశం కూడా ఇవ్వలేనంతగా బలపడింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వాల్లో అరకోటి మార్కు దాటిపోవడం ఇదే సూచిస్తున్నది. అటు ప్రభుత్వంగా జనం గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నది. సమర్థ నాయకత్వం, అంకితభావం కలిగిన కార్యకర్తల బలం, బంగారు తెలంగాణ రూపశిల్పిగా ప్రజలు విశ్వసిస్తున్న తీరు పార్టీకి సుదీర్ఘ ఆయువును ప్రోది చేస్తున్నది.

మొదటి అడుగు… తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపుతిప్పింది టీఆర్‌ఎస్ బలాన్ని బలగాన్ని చాటింది కరీంనగర్ సింహగర్జన సభనే. తమది ఒంటరి పోరాటం కాదన్న సందేశంతో నాటి సభకు ముఖ్యఅతిథిగా శిబూసొరేన్‌ను ఆహ్వానించారు. 2001 మే 17న నిర్వహించిన నాటి సభకు ప్రజలు లక్షల సంఖ్యలో తరలివచ్చిన తీరు మహామహా రాజకీయ విశ్లేషకులను నివ్వెర పరిచింది. ఎడ్లబండ్లనుంచి మొదలుకుని లారీల దాకా ప్రజలే స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో వాహనాలు మాట్లాడుకుని ప్రవాహంలా కదిలివచ్చారు. ఆ వేదిక మీదే పలువురు మెయిన్ స్ట్రీం రాజకీయవాదులు గులాబీ జెండాను అందుకున్నారు. తెలంగాణ చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు అన్ని అంశాలను స్పృశిస్తూ ఉద్యమంలో మమేకం కావాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపు ప్రజల గుండెల్లోకి నేరుగా దూసుకువెళ్లింది. ఉద్యమ పంథా లోతు, నాయకత్వ పరిణితిపై ప్రజల్లో విశ్వాసం పాదుగొల్పింది.

CM KCR

మరో పరీక్ష.. మూడు నెలల్లో మరో పరీక్ష వచ్చింది. కేసీఆర్ రాజీనామా చేసిన సిద్దిపేట స్థానానికి సెప్టెంబర్‌లో ఉప ఎన్నిక. టీఆర్‌ఎస్ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నిక. చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని డబ్బులు కుమ్మరించినా కేసీఆర్ రికార్డులు బద్దలు కొట్టి విజయం సాధించారు. ప్రజాక్షేత్రంలోని తెలంగాణ నినాదం శాసనసభకు చేరింది.

ఉద్యోగుల సమస్యలు.. యువత రైతుల తర్వాత ఉద్యోగుల మీదకి టీఆర్‌ఎస్ దృష్టి మరల్చింది. జూన్ నెలలో 610 జీవో అంశం మీద మొదటి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కేసీఆర్ ప్రతిష్ట రాష్ట్రం పరిధిదాటి దేశవ్యాప్తమైంది. ఢిల్లీలో నేషనల్ ఫోరం ఫర్ న్యూస్టేట్స్ ఏర్పాటైంది. కేసీఆర్‌ను కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. సెప్టెంబర్ నెలలో మరో ప్రచారయాత్ర. ఈసారి జిల్లా కేంద్రాలనుంచి ఇతర ప్రధాన పట్టణాలను ఎంచుకున్నారు. నాగర్ కర్నూల్ నగారా మార్మోగింది. టీడీపీ నేతలనుంచి మొదటిదాడి ఈ సందర్భంగానే నమోదైంది. ఆ పార్టీ కార్యకర్తలు విసిరిన రాయి నాటి జెడ్పీ చైర్మన్ సంతోష్ రెడ్డిని గాయపరిచింది. తర్వాత సింగూర్ సింహగర్జన. పాలమూరు గర్జన. నిజామాబాద్‌లో ఇందూరు సింహగర్జన. జనగాంలో ఓరుగల్లు వీరగర్జన. సిరిసిల్లలో కరీంనగర కదనభేరి.. ఇలా ద్వితీయశ్రేణి నగరాలను టీఆర్‌ఎస్ ప్రభంజనం చుట్టేసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.