రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతంగా చేపట్టిన తెలంగాణ జలహారం పథకాన్ని నిర్దిష్ట సమయంలో పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన అనుమతులను ఏమాత్రం జాప్యం లేకుండా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నదని ఆయన చెప్పారు.

-అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలి -బ్లాంకెట్ పర్మిషన్లతో ముందుకుసాగాలి -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపు -మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష -నేటినుంచి రంగంలోకి మంత్రులు -ఫిబ్రవరిలో ఇన్‌టేక్ బావుల నిర్మాణాలు -56 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు -త్వరలో రైట్ ఆఫ్ వే- రైట్ ఆఫ్ యూజ్ చట్టం జలహారం పథకంపై ఆదివారం బేగంపేటలోని కాకతీయ హోటల్లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకం నిర్మాణంలో వివిధ శాఖల మధ్య సమన్వయంపై రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదల, విద్యుత్, అటవీ, రోడ్డు-భవనాలు, హెచ్ఎండబ్ల్యూ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, మంత్రులు, అధికారులకు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వివిధ పనుల్లో అనుమతులపేరిట కాలహరణం చేయకుండా బ్లాంకెట్ పర్మిషన్ జారీ చేయాలని ఆదేశించారు. ఈ దిశగా సోమవారం నుంచే మంత్రులంతా కార్యరంగంలోకి దిగాలని సూచించారు.
ఫిబ్రవరి నెలలోనే ఇన్‌టేక్‌వెల్స్ నిర్మాణం చేపట్టాలని, సమాంతరంగా విద్యుత్ స్టేషన్ల నిర్మాణం స్తంభాల ఏర్పాటు పనులు పూర్తి చేయాలన్నారు. జలహారంలో కీలకమైన పైప్లైన్ల నిర్మాణం కోసం ప్రైవేటు వ్యక్తుల భూమి వినియోగించే విషయంలో త్వరలో ఆర్డినెన్స్ తెస్తామని ప్రకటించారు. పనులన్నీ సమన్వయం చేసి ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వివిధ శాఖల కార్యదర్శులతో ఒక కమిటీ వేస్తామని చెప్పారు.
గ్రిడ్‌పై అవగాహన కల్పించి క్షేత్రస్థాయిలో వచ్చే ఇబ్బందులను తొలగించడానికి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహిస్తానని సీఎం తెలిపారు. జలహారం (వాటర్ గ్రిడ్) పథకం చాలా సాహసోపేతమైన నిర్ణయమని సీఎం అన్నారు. అందువల్ల పనులు చేపట్టే క్రమంలో ఏ కారణంతో కూడా జాప్యం చేయరాదని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతోపాటు, రెవె న్యూ, అటవీ, రోడ్డు-భవనాలు తదితర శాఖలనుంచి అనుమతుల్లో జాప్యం జరకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం మంత్రులు, అధికారులకు తగిన సూచనలు చేశారు.
ప్రథకం పనుల్లో పైపులైన్ల నిర్మాణం కీలకమైందని అంటూ పైపులైన్లు వేసే క్రమంలో ప్రభుత్వ భూములుంటే బ్లాంకెట్ పర్మిషన్ ఇస్తామని చెప్పారు. రోడ్లకున్న రైట్ ఆఫ్ వే విడ్జ్లో పైప్‌లైన్ వేయాలని, అక్రమణల తొలగింపుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రహదారుల వెంట పైప్‌లైన్ నిర్మించేటప్పుడు ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
పైప్‌లైన్ నిర్మాణం లేదా కరెంట్ స్తంభాలు వేయడానికి అటవీ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తకుండా అటవీ శాఖ అధికారులు బ్లాంకెట్ పర్మిషన్ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రైవేట్ భూముల్లో పైప్‌లైన్ వేయడానికి తలెత్తే ఇబ్బందులు తొలగించేందుకు రైట్ ఆఫ్ వే- రైట్ ఆఫ్ యూజ్చట్టం తేవాలని నిర్ణయించారు.ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున.. ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టం తేవాలని సమావేశంలో నిర్ణయించారు.
సమన్వయం నిర్దిష్టకాలంలో పనులను పూర్తి చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.జలహారం పనులను ఆర్డబ్ల్యూఎస్ శాఖ చేపడుతున్నా, అనేక ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యంతో పనిచేయాల్సి ఉందన్నారు. ప్రతి రోజు ఏ పనులు చేయాలి?ఏఏ ప్రభుత్వ శాఖలు ఏఏ పనులు చేయాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? అనే విషయంపై సమావేశంలో సీఎం స్పష్టత ఇచ్చారు. మంత్రులు, అధికారులు తమ తమ బాధ్యతలను, చేయాల్సిన పనులను సమావేశంలో గుర్తించారు. సోమవారం నుంచే శాఖల వారీగా కార్యరంగంలో దిగాలని మంత్రులు నిర్ణయించారు.
ఫిబ్రవరిలో ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణం.. గ్రిడ్ల కోసం ఫిబ్రవరిలో ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎం సూచించారు. వీటి నిర్వహణకు కావాల్సిన విద్యుత్ అందించే పనులను కూడా సమాంతరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హైడ్రాలిక్ పర్మిషన్, ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణం, పవర్ స్టేషన్ల నిర్మాణం కోసం ప్రభుత్వం బ్లాంకెట్ పర్మిషన్ ఇస్తుందని తెలిపారు. వెల్స్ వద్ద సబ్స్టేషన్ల నిర్మాణానికి, పంపింగ్, లిఫ్టింగ్, వాటర్ ట్రీట్మెంట్ కోసం అవసరమయ్యే విద్యుత్ అందించడానికి విద్యుత్ శాఖ అధికారులు సమావేశంలో సంసిద్ధతను వ్యక్తం చేశారు.
కరెంట్ స్తంభాల ఏర్పాటుకు రైట్ ఆఫ్ వే కోసం బ్లాంకెట్ పర్మిషన్ ఇస్తామని సీఎం చెప్పారు. వెల్స్ నిర్మాణానికి, సబ్స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అప్పగించడానికి నీటి పారుదల శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీని కోసం కూడా ఒకే ఉత్తర్వుతో అనుమతులు ఇవ్వనున్నారు. సబ్స్టేషన్లకు డెడికేటెడ్ విద్యుత్ లైన్లు వేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.
56 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు.. రాష్ట్రంలో మొత్తం 56 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. వరంగల్ జిల్లా జనగామ, పాలకుర్తి, నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరు, మెదక్ జిల్లా గజ్వేల్, దుబ్బాక, రంగారెడ్డి జిల్లా మేడ్చల్ వంటి నియోజకవర్గాలకు ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి నీరు అందించాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రిడ్‌కు సంబంధించి తలెత్తే సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకొని, నిర్ణయాలు తీసుకునేందుకు సంబంధిత శాఖల కార్యదర్శులతో ఓ కమిటీ వేయాలని సీఎం నిర్ణయించారు.
సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కే తారక రామారావు, టీ హరీష్‌రావు, జోగు రామన్న, తుమ్మల నాగేశ్వర్ రావు, సీ లకా్ష్మరెడ్డి, ఎంపీలు కే కేశవరావు, జితేందర్ రెడ్డి, బాల్క సుమన్, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్-ఇన్-చీఫ్ బీ సురేందర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు బాబురావు, చక్రపాణి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.