Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జలసంకల్పం.. జనహితం

-సాగునీటి రంగంలో కేసీఆర్ చొరువ అద్భుతం
-దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు
-వివాదరహిత కాళేశ్వరం ఒప్పందమే నిదర్శనం
-నదుల పునర్జీవానికి సాగుతున్న ఉద్యమంలో కేసీఆర్ వంటి నాయకుడితో దేశానికి ప్రయోజనం
-వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ వ్యాఖ్యలు

నేలపై పడిన ప్రతి చినుకును ఒడిసిపట్టాలనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జల సంకల్పం ఎంతో గొప్పదని వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిచెందిన రాజేంద్రసింగ్ కొనియాడారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు మిషన్ కాకతీయతో చిన్న నీటి వనరులకు ఊపిరిపోశారని ప్రశంసించారు. జనహితం కోసం జల సంకల్పంతో పనిచేస్తున్న సీఎం కేసీఆర్, నదుల పునర్జీవం కోసం జరుగుతున్న ఉద్యమంలో ముందు వరుసలో నిలిస్తే దేశానికి మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. సాగు, తాగునీటికోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నందునే, ప్రజలు రెండోసారి గెలిపించారని వివరించారు. ఒక పర్యావరణవేత్తగా నీటి వనరుల పునరుద్ధరణకు చాలా కృషిచేస్తున్నారు. మీ దేశంలో ప్రభుత్వాలు ఏం చేయడంలేదా? అని అంతర్జాతీయ మీడియా ఓ సందర్భంలో తనను ప్రశ్నిస్తే.. ఎందుకు చేయడం లేదు? మా దేశంలో తెలంగాణ ప్రభుత్వం మిషన్‌కాకతీయ ద్వారా 46 వేల చెరువులను పునరుద్ధరిస్తున్నది అని సమాధానమిచ్చానని తెలిపారు. రాజేంద్రనగర్‌లోని వాలంతరీలో యువ ఇంజినీర్లతో నిర్వహించిన కార్యక్రమంలో రాజేంద్రసింగ్ ప్రసంగించారు. దేశంలోని నదుల పునర్జీవంతోపాటు తెలంగాణ ప్రభుత్వం సాగునీటిరంగంలో చేస్తున్న విశేషకృషిపై సుదీర్ఘంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే…

ప్రజల భాగస్వామ్యానికి మిషన్‌కాకతీయ గొప్ప వేదిక
ఇది నా ఊరు, ఇది నా చెరువు అనే చైతన్యాన్ని ప్రజల్లో తెచ్చేందుకు మిషన్‌కాకతీయ మంచి వేదిక. తెలంగాణ ప్రభుత్వం నాలుగేండ్లుగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా చారిత్రక సంపదను పునరుద్ధరించుకోవడంతోపాటు సంస్కృతికి జీవం పోసినట్టవుతుంది. ఇప్పటివరకు దేశంలో నాలుగు పెద్ద చెరువులే పునరుద్ధరించారు. కానీ తెలంగాణలో 46వేల చెరువులు పునరుద్ధరిస్తున్నారు. దశాబ్దాలపాటు పట్టించుకోకపోవడంతో చెరువుల్లో 9-10 మీటర్ల పూడిక తొలిగించాలంటే యంత్రా ల వినియోగం అనివార్యం. అయినా రైతులను భాగస్వాములను చేయడం సంతోషం. యాభై ఎకరాల్లోపు ఆయకట్టున్న చిన్న చెరువులనూ పునరుద్ధరించాలి. యంత్రాల్లేకుండా ప్రజల భాగస్వామ్యంతో లేదా ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు చేపడితే ప్రపంచవ్యాప్తంగా మిషన్‌కాకతీయ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది. ఇదేమీ ఆషామాషీగా చెప్పడం లేదు. చెరువుల పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయికి వెళ్లిచూశా. చెరువులు పూర్వవైభవాన్ని సంతరించుకోవడాన్ని చూసిన ఆనందంతో నర్సంపేట పరిధిలోని ఒక చెరువు దగ్గర గతంలో నా పుట్టిన రోజు జరుపుకొన్నాను.

కాళేశ్వరాన్ని చూసి ఆశ్చర్యపోయా
కాళేశ్వరం పనులను స్వయంగా చూశా. మేడిగడ్డ బరాజ్‌తో తాగు, సాగునీటి అవసరాలు తీరడంతోపాటు కిలోమీటర్లకొద్దీ గోదావరి సజీవంగా ఉంటుంది. రాష్ర్టాల మధ్య జలవివాదాలు అనేకమున్నాయి. మహానదిపై ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మధ్య, కావేరీపై కర్ణాటక-తమిళనాడు మధ్య వివాదం ఉన్నది. కాళేశ్వరం విషయంలో బేసిన్‌లోని ఎగువ, దిగువ రాష్ర్టాలకు ఇబ్బంది, వివాదం లేకుండా అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని సీఎం కేసీఆర్ పూర్తిచేయడం గొప్ప విషయం. కేసీఆర్‌లోని చతురతకు ఆశ్చర్యపోయా. ఆయన డైనమిక్ లీడర్. అందుకే ప్రజలు మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించారు.

ఆల్మట్టిపై చర్చించాం
ఇటీవల పుణెలో జరిగిన కృష్ణా పరివార్ మూడో సదస్సులో ఆల్మట్టి ఎత్తు పెంపు అంశంపైనా చర్చించాం. ట్రిబ్యునల్‌కు లోబడి కృష్ణాజలాల్లో కర్ణాటక తన వాటాను వినియోగించుకోవడంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. కృష్ణా పరివార్ కూడా దీన్ని అంగీకరిస్తుంది. ఆల్మట్టి ఎత్తు పెంపు ద్వారానే సంపూర్ణ వినియోగం అనేది మంచిదికాదని కర్ణాటక ప్రజలు కూడా భావిస్తున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచి లక్షల ఎకరాలను ముంచడం కంటే, ఎగువన చిన్న బరాజ్‌లు, చెక్‌డ్యాంలు, లిఫ్టులు ఏర్పాటుచేసి కర్ణాటక తన వాటా వినియోగించుకుంటే మంచిదని అక్కడి ప్రజలు కూడా సూచిస్తున్నారు. ఈ అంశంలో కృష్ణా పరివార్ మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడుతుంది. కృష్ణా పరివార్‌ను ముందుకు తీసుకుపోవడంలో తెలంగాణ జల వనరుల సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్‌రావు కీలకభూమిక పోషిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌పై ఆ నమ్మకముంది
నదుల పునర్జీవంలో భాగంగా తెలంగాణలోని మూసీ నదిని ఆరోగ్యకరంగా తయారుచేయడం కీలకమైనది. మూసీకి పూర్వవైభవం తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించింది. మూసీ ఆరోగ్యంగా ఉంటే తెలంగాణ ఆరోగ్యంగా ఉంటుంది. మూసీ నీటిని రీసైక్లింగ్ చేసి తిరిగి వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. ఈ క్రతువును సీఎం కేసీఆర్ విజయవంతంగా పూర్తిచేస్తారనే నమ్మకం నాకుంది. ఇది ప్రశంస కోసం చెప్పడం లేదు.. సాగునీటి రంగంలో ఆయన చేస్తున్న కృషిని చూస్తున్న వ్యక్తిగా చెప్తున్నా.

హరితహారం మరింత విజయవంతం కావాలి
సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం గురించి విన్నాను. 230 కోట్ల మొక్కలు నాటాలనే సంకల్పం గొప్పది. నాటిన మొక్కలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. నదులకు సంబంధించి మూడు భాగాలుంటాయి. నది ప్రవహించే మార్గాన్ని బ్లూజోన్‌గా, నదీతీరాన్ని గ్రీన్‌జోన్‌గా, వందేండ్లలో వచ్చే గరిష్ఠ ప్రవాహ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా పరిగణిస్తారు. బ్లూజోన్‌లో మొక్కలు నాటి నేల కోతను నివారించవచ్చు. గ్రీన్‌జోన్‌లో దక్షిణం వైపు నదిపై కొమ్మలు పరుచుకునేలా మొక్కల్ని నాటి నీటి ఆవిరిని తగ్గించవచ్చు. రెడ్‌జోన్‌లో విస్తారంగా మొక్కలు నాటడం వల్ల రెడ్‌హీట్‌ను గ్రీన్‌హీట్‌గా మార్చుకోవచ్చు.

కేసీఆర్ వంటి నేతతో దేశానికి మేలు
సాగునీటిరంగంలో సీఎం కేసీఆర్ చొరవ, కృషి దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయడం లేదు. సాగునీటిరంగానికి కేంద్రం కేటాయిస్తున్న బడ్జెట్ ఒక ఎత్తయితే, తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న బడ్జెట్ ఒక ఎత్తు. ఇంతటి జల సంకల్పాన్ని మరే ముఖ్యమంత్రిలోనూ చూడలేదు. నదుల పునర్జీవం కోసం కొనసాగుతున్న ఉద్యమంలో కేసీఆర్ వంటి నాయకుడు ముందుంటే దేశానికి ప్రయోజనం. బేసిన్ రాష్ర్టాలతో కలిసి ఏర్పాటుచేస్తున్న కృష్ణా, గోదావరి పరివార్ (కుటుంబాలు)ను ఆయన ముందుకు తీసుకెళ్లాలి. బేసిన్ రాష్ర్టాలతో సదస్సు నిర్వహించాలి. నదుల పునర్జీవానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన నేతృత్వంలో ఏర్పాటయ్యే వేదికపై చర్చ జరిగితే బాగుంటుంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.