Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జన సునామీ!

-87 సభలతో కోటిమందిని కలిసిన సీఎం కేసీఆర్
-జిల్లాస్థాయి సభలను తలపించిన నియోజకవర్గసభలు
-కాంగ్రెస్, టీడీపీలను చీల్చి చెండాడిన కేసీఆర్
-పాలమూరు ఎత్తిపోతలకు అడ్డంపడిన చంద్రబాబు
-ప్రాజెక్టు కట్టవద్దని కేంద్రానికి 35 లేఖలురాసిండు
-అటువంటి చంద్రబాబును కాంగ్రెస్ మోసుకొస్తున్నది
-నాగం సహా మరో ముగ్గురు పాలమూరుపై కోర్టుకెళ్లారు
-పాలమూరు దరిద్రం వదలాలంటే ఈ దరిద్రులను వదిలేయాలి
-కాంగ్రెస్‌కు చీమునెత్తురు ఉన్నయా?
-బలిదానాలు, పోరాటాలతో సాధించిన తెలంగాణను చంద్రబాబుకు అప్పజెప్తరా?
-మీరా తెలంగాణను కాపాడెటోళ్లు?
-ప్రజా ఆశీర్వాదసభల్లో సీఎం కేసీఆర్ నిప్పులు
-వికారాబాద్‌ను చార్మినార్ జోన్‌లో కలుపుతం
-ఉమ్మడి పాలమూరులో అన్ని సీట్లూ టీఆర్‌ఎస్‌కే
-రాష్ట్రంలో 98 నుంచి 108 సీట్లలో గెలువబోతున్నం
-టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటును ఎవరూ ఆపలేరు
-గోల్‌మాల్ చేసేందుకు డూప్లికేట్ సర్వే
-అదొక లంగ సర్వే.. పట్టించుకునే అవసరం లేదు

జనం.. జనం.. ప్రభంజనం! కడలి పోటెత్తినట్టు.. జనసునామీని తలపిస్తూ.. ప్రజాకోటి! ఇక్కడా.. అక్కడా అనిలేదు.. ఏ నియోజకవర్గంలోనైనా అదే హోరు! చారిత్రాత్మక కొంగరకలాన్ సభ తదుపరి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన ప్రజాఆశీర్వాదసభలు.. బుధవారం గజ్వేల్ సభతో ముగియనున్నాయి. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 87 సభల్లో కోటిమందికిపైగా ప్రజలను సీఎం కలుసుకున్నారు. రాష్ట్ర ప్రగతిని తెలియజేయడంతోపాటు.. ఆ ప్రగతిని అడ్డుకునేందుకు జరిగిన కుట్రలను.. రాబోయే రోజుల్లో ప్రతీపశక్తులుఅధికారం చేపడితే కలుగబోయే దుష్పరిణామాలను ప్రజలకు వివరించారు. ప్రతి సభలోనూ వేలసంఖ్యలో ప్రజలు హాజరై టీఆర్‌ఎస్ గెలుపును ఖాయం చేశారు. మంగళవారంనాటి అలంపూర్, గద్వాల, మక్తల్, కొడంగల్, వికారాబాద్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాదసభలకు సైతం ప్రజలు పోటెత్తారు. ఆయా సభల్లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్, టీడీపీలను చీల్చి చెండాడారు. పోరాటాలు, ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణను మళ్లీ చంద్రబాబుకు, ఆంధ్రోళ్లకు అప్పగించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబుతో పొత్తు కలిసిన కాంగ్రెస్‌కు చీమునెత్తురు ఉన్నాయా? అని నిలదీశారు.

యాభై ఎనిమిదేండ్ల నుంచి కండ్లల్లో నీళ్లు.. దుఃఖం! కండ్లముందే కృష్ణానది పారుతున్నా.. మంచినీళ్లు దొరకని దుస్థితి. సాగునీరు లభించని దుర్గతి! ఇంత దగా జరిగినకాడ.. సిగ్గులేకుండా తెలుగుదేశం మద్దతుతో కాంగ్రెసోళ్లు ఓట్లు అడుగుతరా? వీళ్లా తెలంగాణను కాపాడెటోళ్లు అని నిలదీశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపిన చంద్రబాబు లాంటి మనిషిని గెలిపిస్తమా? గంత పౌరుషం లేకుంట ఉన్నమా? రాష్ట్రం తెచ్చుకుని గౌరవంగా బతుకుతున్న తెలంగాణలో మళ్లీ చంద్రబాబు పెత్తనం అవసరమా? అని ప్రశ్నించారు. చేతులతోకాదు.. ఓటు దెబ్బతో చూపించాలని ప్రజలను కోరారు. మామూలుగా గెలిస్తే తనకు సంతోషం లేదన్న సీఎం.. ఇంకోపక్క నిల్చున్నోళ్లను మళ్లా మర్రి చూస్తే భయపడేటట్టు కొట్టాలె. తెలంగాణల నడువది ఆట అని కొట్టాలె అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 98 నుంచి 108 సీట్లలో గెలువబోతున్నామని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటును ఎవరూ ఆపలేరని సీఎం చెప్పారు.

పాలమూరు జిల్లాలో అన్ని సీట్లూ టీఆర్‌ఎస్‌వేనని స్పష్టంచేశారు. మోసపోతే గోసపడుతామన్న సీఎం.. చంద్రబాబు గెలిస్తే నీళ్లు బందైతే దరఖాస్తు తీసుకుని విజయవాడకు పోవాల్సి వస్తుందన్నారు. మనకేమన్నా పరువు ప్రతిష్ఠ ఉంటుందా? ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు. మంచైనా చెడ్డయినా మనవాడే ఉండాలి.. మట్టిపనికైనా ఇంటోడు ఉండాలన్నరు పెద్దోళ్లు.. బయటోని అక్కర ఉన్నాది మనకు? అని ప్రశ్నించారు. ఉమ్మడిరాష్ర్టాన్ని 58 ఏండ్లపాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ కూటమి ఒకవైపు, పదిహేనేండ్లు కొట్లాడి రాష్ట్రం సాధించి, నాలుగున్నరేండ్లుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలుచేస్తున్న టీఆర్‌ఎస్ ఒకవైపు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావాల్సిన పనిలేదన్న సీఎం.. కాంగ్రెస్, టీడీపీ ఏం చేశాయో, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏంచేసిందో గమనించి ఓటేయాలని కోరారు. ప్రపంచమంతా అబ్బురపడేలా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశామన్నారు. వికారాబాద్‌ను చార్మినార్ జోన్‌లో కలుపుతానని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్
1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టారు. ఏపీలో కలిపితే సహకరించారు. బూర్గుల రామకృష్ణారావు ఢిల్లీకి పోయివచ్చినంక ఏమయిందయ్యా? అంటే.. పెద్దాయన. నెహ్రూకు ఏం చెప్తం? అన్నడు. లాగులు తడిసినయ్ నెహ్రూను చూడంగనే. తెలంగాణను ఆంధ్రాకు అప్పగించిండ్లు. ఆరోజు మునిగినం. ఎంతో కొట్లాడినం. నడుమన అడిగితే ఇందిరాగాంధీ 400 మందిని చంపింది. ఆ తర్వాత ఎన్ని అవమానాలు చేసినా, మనం 14 ఏండ్లు మొండిగ నిలబడి తెలంగాణ తెచ్చుకున్నం. నేను చావు నోట్లో తలకాయ పెట్టిన. వచ్చిన తెలంగాణను మళ్ల ఆంధ్రోల్లకు అప్పగించాలట. చంద్రబాబుకు అప్పగించాలంటరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. చంద్రబాబు వస్తే ఏం చేస్తడు? పాలమూరు బంద్ అంటడు. భగీరథకు నీళ్లు ఉండయి అంటడు. ఇది కావాలా మనకు?

గోల్‌మాల్ చేసేందుకు డూప్లికేట్ సర్వే
చంద్రబాబు చమత్కారాలు తెలుసు కదా! ఇయాల ఒక డూప్లికేట్ సర్వే ఇస్తరు చూడుర్రి. మనకు సీట్లురావని చెప్తరు.. మిమ్ముల గోల్‌మాల్ తిప్పేతందుకు! అదొక లంగ సర్వే.. బూటకపు సర్వే. ఏ మాత్రం పట్టించుకునే అవసరం లేదు. అటువంటి గోల్‌మాల్.. గజకర్ణ.. గోకర్ణ.. టక్కుటమార విద్యలుచేసి.. డబ్బుల సంచులు తెస్తా ఉన్నరు. నిన్న వరంగల్ పోలీసులు రూ.6 కోట్లు పట్టుకున్నరు. ఖమ్మంల చంద్రబాబు బాధ చెప్పతరంకాదు. ఇవుతల తెలంగాణ.. అవుతల ఆంధ్రా. వీళ్లందరినీ పట్కపోయి అవుతల యాటలుకోసి, పైసలు పంచి.. పైసలు ఈడ్నే దాసుకోండ్లి.. ఎలక్షన్ల తెల్లారి పట్కపోదురని చెప్పి! గిన్ని మెరమెచ్చుకాలా? ఎందుకింత లాలూచీ? చంద్రబాబుకు అక్కడ వ్యవసాయం లేదా? రాష్ట్రం లేదా?

సంక్షేమం ఎలా ఉన్నదో చూడండి
టీడీపీ, కాంగ్రెస్ పాలనలో ఏవిధమైన సంక్షేమం ఉన్నది? ఈ రోజు ఎలా ఉన్నది? ఆనాడు ఇచ్చిన పెన్షన్ ఎంత.. ఈరోజు ఎంత? ఆనాడు ఇచ్చిన బియ్యం ఎన్ని, ఈరోజు ఎన్ని? దివ్యాంగులకు ఆనాడు రూ.500 ఇస్తే నేడు రూ.1500 ఇస్తున్నం. కల్యాణలక్ష్మి కింద పేదింటి అమ్మాయి పెండ్లికి లక్షానూటపదహార్లు ఇస్తమని జిందగీల అనుకున్నమా? ఇండియాలో ఏ రాష్ట్రంలోనన్న ఇస్తున్నరా? మహిళలు ప్రసవానికి వస్తే పైసలు ఖర్చు అయ్యేది బంద్ అయిపోయి.. గవర్నమెంటే ఉల్టా అమ్మాయి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలతోపాటు కేసీఆర్‌కిట్ కూడ ఇచ్చి, అమ్మఒడి వాహనంలో ఇంటికాడ దించుతున్నది. నేను చెప్పేవన్నీ మీ గ్రామంలో అమలవుతున్నవి. వాస్తవాలు గమనించమని కోరుతున్న. ఈసారి మీరు దీవించి టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఆసరా పెన్షన్లన్నీ రూ.1000 నుంచి రూ.2016కు చేస్తం. దివ్యాంగులకు ఇచ్చే రూ.1500ను రూ.3016కు పెంచుతం. అర్హులైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.3016 భృతి అందజేస్తం.

నిరంతర విద్యుత్ తమాషకు రాదు
కరంటు సప్లయ్ ఎట్ల ఉందో మీకు తెలుసు. గతంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలో కరంటు సప్లయ్ ఎట్ల ఉందో అదిగూడ మీకు తెలుసు. గతంలో కరంటు ఎప్పుడొస్తదో.. ఎప్పుడు వోతదో దేవునికెరుక. ఇయ్యాల అట్లలేదు. కరంటు మంచిగ వస్తంది. ఊరికెనే తమాషకు రాదు. కష్టం జెయ్యాలె. నా సెల్‌ఫోన్లో, ఐపాడ్‌లో విద్యుత్ ప్రవాహ అని యాప్ ఉంటది. ఎక్కడ ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది? ఎంత సప్లయ్ అవుతున్నది? కరెక్టుగా ఉందా.. లేదా! పొద్దుకు నాలుగుమాట్లు తెలుసుకొని మానిటర్‌చేస్తే మీకు కరంటు బాగా వస్తున్నది. సంతోషం.. ఇయ్యాల మోటర్లు కాలిపోతలేవు. ట్రాన్స్‌ఫార్మర్లు పేల్తలేవు. మంచిగా 24గంటలపాటు కరంటు ఉంది. భారతదేశంలో విద్యుత్ తలసరి వినియోగం ఎక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని భారత విద్యుత్ ప్రాధికార సంస్థ వాళ్లు ప్రకటించిండ్రు. కాంగ్రెస్‌ను గెలిపించినారనుకో మళ్లా కిందిమీదయితది. జాగ్రత్త చెప్పడం నా బాధ్యతకాబట్టి చెప్తున్న.

అబద్ధాలు మాట్లాడే ప్రధాని ఉండటం మన ఖర్మ
మన ఖర్మ ఏందంటే 70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడే ప్రధాని కూడ ఉన్నరు. మొన్న నరేంద్రమోదీ నిజామాబాద్ వచ్చి తెలంగాణల కరంటు బాగలేదన్నడు. కరంటు బాగుందా.. లేదా? ప్రజలే చెప్పాలి. అర్ధగంట ఆగు.. హెలికాప్టర్ల వచ్చి మాట్లాడతా అన్న.. ఆడ ఉండకుండవోయిండు. దేశ ప్రధాని అబద్ధాలు మాట్లాడితే ఏంబాగుంటది చెప్పండి!

చంద్రబాబూ.. నువ్వొక ముఖ్యమంత్రివా?
ఢిల్లీలో జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో తుమ్మిళ్ల లిఫ్టు ఎలా కడుతారంటూ కేంద్రమంత్రి ఉమాభారతి ముందు చంద్రబాబు మాట్లాడిండు. చంద్రబాబూ.. నీకు సిగ్గుశరం ఉందా? నువ్వు మనిషివేనా? నువ్వొక ముఖ్యమంత్రివా? ముఖ్యమంత్రిలా మాట్లాడుతున్నవా? నేను పాదయాత్ర చేసినప్పుడు.. జూరాల లింక్ కెనాల్ అని ఒక డ్రామా కొట్టిండు. అంటే, మన చెయ్యిలు మన నెత్తిమీద పెట్టుకోవాలె. జూరాల, ఆర్డీఎస్ రైతులు తన్నుకుని చావాలె. ఆ జూరాల కూడా గింతంత.. చిన్నగా పెట్టిండు. అంటే, శాశ్వత పరిష్కారం కావాలి. బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర నుంచి కేటాయించిన మన హక్కు వాటా రావాలని పోరాటంచేసినం. తెలంగాణ వచ్చింది. జోగులాంబ అమ్మ దయతలిచింది. ఇయ్యాల తుమ్మిళ్ల పథకం ప్రారంభమైంది.

పాలమూరు పాలిట దరిద్రులను వదిలేయండి
ఉమ్మడి పాలమూరు జిల్లాకు శత్రువులు ఇక్కడనే ఉన్నరు. కేసీఆర్ ఎంతమందితోని కొట్లాడాలి? ఎన్ని రాకాసులతోని కొట్లాడాలి? పాలమూరు కరువు జిల్లా. ఇప్పుడు నేను చూసుకుంటూనే వచ్చిన, కొండలు, బండలు, గుట్టలు, రాళ్లు! మధ్యమధ్యలో ఎక్కడనో చిన్న పొలం మడులు! ప్రొఫెసర్ జయశంకర్‌గారు, నేను ఉద్యమ సమయంలో వస్తేకూడ చాలా బాధపడి, కండ్ల నీళ్లు తీసుకునేవాళ్లం. ఈరోజు కొడంగల్ ప్రాంతానికి నీళ్లు తేవాలని పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినం. రూ.35 వేల కోట్లు మంజూరుచేసినం. ఈ పథకం పూర్తయితే కొండగల్, నారాయణపేట సహా పాలమూరు జిల్లా మొత్తం 20 లక్షల ఎకరాలు పారుతుంది. ఆకుపచ్చని పాలమూరుగా మారిపోతది. మంత్రి హరీశ్‌రావు కష్టపడి నదిమీద అక్విడక్టు కట్టి నెట్టెంపాడు పూర్తిచేశారు. బీమా, కల్వకుర్తి కంప్లీట్‌చేసినం. పాలమూరు జిల్లాలో 8.50 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతున్నయి. 1500 నుంచి 2000 చెరువులు నింపుతున్నం. ప్రజలు పండుగ చేసుకుంటున్నరు. పది పన్నెండు లక్షల ఎకరాలకు పాలమూరు ఎత్తిపోతల ద్వారా ఇచ్చి మొత్తం 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారాలి.

ఈ ప్రయత్నం చేస్తున్నం. దీన్ని అడ్డుకునేవాడు చంద్రబాబు. కేసులు పెడుతడు.. కేంద్ర ప్రభుత్వంలో షికాయత్ చేస్తడు. ఈ ప్రాజెక్టు కట్టవద్దని 35 లేఖలురాసిండు. అటువంటి చంద్రబాబును సిగ్గు, చీమునెత్తురు లేని కాంగ్రెస్‌పార్టీ తన నెత్తిమీద, భుజం మీద మోసుకొని తీసుకువస్తున్నది. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే.. నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ నుంచి నాగర్‌కర్నూల్‌లో పోటీచేస్తున్నడు.. ఇంకొకాయన దేవరకద్రలో, ఇంకొకాయన కొల్లాపూర్‌లో పోటీచేస్తున్నరు. ఈ ముగ్గురు పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టవద్దని కోర్టులో కేసువేశారు. హైకోర్టు వాళ్ల చెంప మీద ఛెళ్లుమని కొట్టింది. ఎంత బుద్ధిలేదు? లంగా కేసులు ఇవి! రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవంటూ న్యాయస్థానాలు చెంప పగులగొట్టి బుద్ధిచెప్పినవి. మీరు టీవీలల్లో, పేపర్లల్లో చూసినారు. బైటోడు చంద్రబాబుతోని కొట్లాడాలె. ఆయన ప్రాజెక్టులు వద్దంటడు! మన దరిద్రులు కూడ కేసులువేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తరు. ఇటువంటివాళ్లు ఈ జిల్లాలో పుట్టిండ్రు కాబట్టే కొండలు, బండలు.. ఈ దరిద్రమంతా మనకున్నది. పాలమూరు దరిద్రం వదలాలంటే దయచేసి ఈ దరిద్రులను వదిలేయాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.