-కాంగ్రెస్ మరో 20 ఏండ్లు పాలించినా అభివృద్ధి సాధ్యమవుతుండెనా?
-దరఖాస్తులు పెట్టటం తప్ప కాంగ్రెస్‌వాళ్లకు ఏమీ చేతకాలేదు
-వారికి కుర్చీ మీద సోయి తప్ప.. జనం మీద లేదు: మంత్రి హరీశ్‌రావు
-కాంగ్రెస్ పాలనలో నల్లగొండ ఆగమైంది: మంత్రి జీ జగదీశ్‌రెడ్డి
-నల్లగొండ జిల్లాలో నిమ్మ, బత్తాయి మార్కెట్లు ప్రారంభం
కరంటు చాలక.. ధరలు రాక.. దళారుల మోసాలు భరించలేక.. కన్నబిడ్డల్లాగా పెంచుకున్న బత్తాయి, నిమ్మతోటలను నల్లగొండ జిల్లా రైతులు నరికేసుకున్నా గత కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదని నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఉద్యమనేత సీఎం కేసీఆర్ నాయకత్వంలో మన రైతుల కష్టాలు తీర్చటం కోసం నకిరేకల్‌లో నిమ్మ, నల్లగొండలో బత్తాయి మార్కెట్లు ఏర్పాటుచేశామని తెలిపారు. ఆదివారం నకిరేకల్‌లో రూ. 3.7 కోట్లతో ఏర్పాటుచేసిన నిమ్మ మార్కెట్‌తో పాటు పీఏసీఎస్ భవనాన్ని, నల్లగొండలో రూ. రెండు కోట్లతో ఏర్పాటుచేసిన బత్తాయి మార్కెట్‌ను విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి జీ జగదీశ్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం నల్లగొండ వ్యవసాయమార్కెట్ కమిటీ పాలకవర్గంతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నకిరేకల్, నల్లగొండల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ పెద్దలకు, ఇక్కడి ఆంధ్రా ముఖ్యమంత్రులకు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా పనులు కావటం లేదని కాంగ్రెస్ నేతలు చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయని.. అలాంటివారు ఇంకో 20 ఏండ్లు పాలించినా అభివృద్ధి సాధ్యమవుతుండెనా? అని ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్కో కాంగ్రెస్ నాయకుడిని ఏడుసార్లు, ఐదుసార్లు, నాలుగుసార్లు గెలిపిస్తే నల్లగొండను ముంచుతూ పులిచింతలను కట్టారని, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు పొక్కపొడిచి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి జై కొడుతూ అనంతపురం పోయి కాంగ్రెస్ నేతలు హారతులు పట్టారని ఘాటుగా విమర్శించారు. గత పాలకులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులను కూడా పట్టించుకోలేదని, ఏడేండ్ల కాంగ్రెస్‌పాలనలో వారు రూ. 600 కోట్లు ఖర్చు చేస్తే, తాము నాలుగేండ్లలోనే రూ. 1200 కోట్లు ఖర్చుచేసి చివరి భూములకు సైతం నీళ్లిచ్చామని తెలిపారు.

ఏది అడిగినా దరఖాస్తులు పెట్టినం అని చెప్పే జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఏ ప్రాజెక్టునూ ముందుకు తీసుకెళ్లలేదని, టీఆర్‌ఎస్ పాలనలోనే సాగర్ వరదకాల్వ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగాయని స్పష్టంచేశారు. గత పాలకులు మోటర్లు తెచ్చి కట్ట మీద పెట్టేవారని, పంప్‌హౌజ్‌ల నిర్మాణం పక్కనపడేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎగరేసుకుపోయారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశించిన రోజే మూసీ కాల్వల ఆధునీకరణకు రూ.280 కోట్లు, తూట్లు పడ్డ మూసీ గేట్ల మరమ్మతులకు రూ. 17 కోట్లు కేటాయించామని తెలిపారు. రూ. 60 కోట్లతో కాల్వల ఆధునీకరణ చేపట్టామని చెప్పారు. తమ ప్రభుత్వం చొరవతోనే డిండి ప్రాజెక్టులో, ఎస్సెల్బీసీ పనుల్లో వేగం పెరిగిందన్నారు. కాళేశ్వరం నీళ్లతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకే తొలి ఫలితం అందుతుందని, వచ్చే యాసంగి నాటికి యాదాద్రి సహా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.
పత్తి, మొక్కజొన్న, కందులు సహా కాంగ్రెస్ హయాంలో ఐదేండ్లలో కొన్నవాటికంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేండ్లలోనే మూడింతలు అధికంగా సేకరించిందని లెక్కలతో సహా వివరించారు. గడ్డం పెంచినంత మాత్రాన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం కాలేడని, లావుగా ఉన్నోళ్లంతా పెద్దనాయకులు కాలేరని కాంగ్రెస్ నేతలే పరస్పర విమర్శలకు దిగారన్నారు. ఉత్తమ్ తన భార్య టికెట్ కోసం ఢిల్లీలో నెలరోజులు తిష్ఠవేసి లాబీయింగ్ చేశారన్నారు. ముఖ్యమంత్రి పదవికి తానే అర్హుడినని జానారెడ్డి.. సీఎం పదవి తప్ప వేరే పదవి ఏదీవద్దని రేవంత్‌రెడ్డి ఇలా కాంగ్రెస్ నేతలు వారిలో వారే కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కుర్చీ సోయి తప్ప, జనం సోయిలేదని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉదయం ఓ మాట, సాయంత్రం మరో మాట మాట్లాడుతారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నల్లగొండ జిల్లాకు అదృష్టమని, దేశంలోనే రెండు మెడికల్ కాలేజీలు, ఒక ఎయిమ్స్ ఉన్న ఏకైక జిల్లా నల్లగొండ మాత్రమేనని కొనియాడారు. నిమ్మ మార్కెటింగ్ కోసం కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటు చేస్తామని చెప్పిన మంత్రి..నిమ్మ, బత్తాయి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ప్రకటించారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైంది: మంత్రి జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ నేతల పాలనలో రాష్ట్రంసహా నల్లగొండ జిల్లా ఆగమైందని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అంటే తమ కోసమేనని, మంత్రులు, ఎమ్మెల్యేలు తమలో ఒకరిగా పనిచేస్తారని తెలంగాణ ప్రజానీకానికి అర్థమయ్యేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈ నాలుగేండ్లపాలన సాగిందని చెప్పారు. లాఠీచార్జీ చేయకుండా ఏనాడూ విత్తనాలు, ఎరువులు ఇవ్వడం కాంగ్రెస్‌కు చేతకాలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ హాయాంలోని ఈ నాలుగేండ్ల సమయంలో ఏనాడైనా రైతులు ఎరువుల కోసం లైన్లో నిలబడ్డారా..? అని ప్రశ్నించారు. డెడ్‌స్టోరేజీలోనూ తెలంగాణకు నీళ్లు తెచ్చిన ఘనత తమదేనని చెప్పారు.
సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని రాజవరం తొలి మేజర్‌కు ఇన్నేండ్లలో ఎన్నడూ రాని నీళ్లు.. ఈ ఏడాది ఎలా వచ్చాయని అక్కడి రైతాంగం అడుగుతున్న ప్రశ్నలకు జానారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. ఢిల్లీలో కూర్చొని దేశ నాయకులం అనుకునే కొందరు కాంగ్రెస్ నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీలో ఐదారుగురిని కూడా గెలిపించుకోలేని నేతలు సీఎం పదవి కోసం పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలకులు ఎదిగినట్టుగా వాళ్ల పాలనలో ఫ్లోరోసిస్ ఒక ఊరి నుంచి వెయ్యి ఊర్లకు పాకిందని విమర్శించారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాకు రూ. తొమ్మిది వేల కోట్లు తీసుకుపోతుంటే.. నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్ ప్రాంతాలకు వెయ్యి కోట్లు కూడా తేలేని దద్దమ్మలు కాంగ్రెస్ పాలకులు అని మండిపడ్డారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా అద్భుతపాలన అందిస్తున్న కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసమున్నదని, హంసల మాదిరిగా ఏవి నీళ్లో? ఏవి పాలో? తేల్చి మరీ స్పష్టమైన తీర్పు ఇస్తారని చెప్పారు.
నకిరేకల్ సభకు ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండసభకు నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇంచార్జి కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ బహిరంగసభల్లో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, రమావత్ రవీందర్‌కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అటవీ అభివృద్ధిసంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, నోముల నర్సింహయ్య తదితరులు పాల్గొన్నారు.