Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జనం పట్టించుకోని యాత్రలు

కేసీఆర్ నాయకత్వం పట్ల అన్నివర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్న సమయంలో ఆయనను గద్దె దింపుతామన్న సింగిల్ పాయింట్ అజెండా పెట్టుకొని వివిధ రూపాల్లో యాత్రలు చేస్తున్న పార్టీలకు భంగపాటు తప్ప మరెలాంటి ఫలితం ఉండదనే సత్యాన్ని గ్రహించి మసులుకుంటే కనీసం ప్రజల్లో చులకన కాకుండానైనా ఉండే అవకాశం ఉన్నది.

కాంగ్రెస్ బస్సుయాత్రలు, ఇప్పుడు బీజేపీ చేస్తున్న జనచైతన్య యాత్రల సందర్భంగా ఆ రెండు పార్టీల నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు, రాజకీయ విన్యాసాలు చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలిచ్చే విధం గా ఒక్క ప్రసంగం కూడా లేకపోవడం దురదృష్టకరం. ఈ రెండు జాతీయ పార్టీల నాయకులు ప్రతి సభలోనూ సీఎం కేసీఆర్‌ను గద్దె దింపుతామనడం తప్ప ఆయనను ఎందుకు గద్దె దింపాలో కనీసం అవగాహన లేకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నరు. ప్రజలకు దగ్గర కావడానికి ఏ ఒక్క అంశ మూ అనుకూలంగా లేని భావదారిద్రంతో ఏం చేయాలో పాలుపోక సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని నిరాధారమైన నిందల తో తిట్ల పురాణం చదువడానికి పరిమితమైన ఈ రెండు పార్టీల యాత్రలు ఓ పెద్ద ప్రహసనంగా మారాయన్న అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తున్న ది. విచిత్రమేమంటే కేసీఆర్ గద్దె దిగాలని వితండవాదం చేస్తున్న ఈ రెండు జాతీయ పార్టీల్లో ఒక పార్టీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నది. మరో పార్టీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దాదాపు 42 ఏండ్ల పాటు దేశాన్ని పాలించింది.

సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే చర్యలు ఏం తీసుకున్నాయన్న దానిపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అధికార దర్పం, రాజకీయ ఎత్తుగడలు, అణిచివేత ధోరణులు, అవినీతి కథలు తప్ప ఆ పార్టీకి ప్రజల కష్టాలు పట్టలేదు. ఇంకా ఈ దేశాన్ని పేదరికం, నిరక్షరాస్యత పట్టి పీడిస్తున్నదంటే, కనీస మౌలిక వసతుల్లేని పల్లెలు ఇంకా కోకొల్లలుగా ఉన్నాయంటే, కనీసం తాగు, సాగునీటికి, కరెంట్ వెలుగులకు నోచుకోని గ్రామాలు వేల సంఖ్యలో ఉన్నాయంటే అందుకు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనే కారణం. అందుకే ఆ పార్టీని ప్రజలు దేశవ్యాప్తంగా తిరస్కరించి ఓ మూలన కూర్చోబెట్టారు. కానీ కాంగ్రెస్‌కు భిన్నమైన పాలన అందించడం ద్వారా దేశాన్ని సగర్వంగా నిలబెడుతామని చెప్పి అధికారం చేపట్టిన బీజేపీ పాలన కూడా ప్రజలకు మింగుడుపడని విధంగా మారింది. నాలుగేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ, ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థలో ఏవైనా మార్పులు తీసుకురాగలిగారా?. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ చిత్రపటంలో భారతదేశం కొత్తగా గడించిన ఖ్యాతి ఏమిటి?. మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థి క వ్యవస్థ గాడిలో పడ్డదా?. దేశ ప్రజలందరూ మెచ్చుకునేలా ఒక్క పథకానై నా తేగలిగారా? అని అడిగితే ఏమీ జరుగలేదని సామాన్యులకు కూడా అర్థమవుతుంది.

ఇలాంటి ఈ రెండు పార్టీలు గురివింద సామెతను మర్చి యాత్రల పేరు తో ప్రజల మధ్యకు పోయి తాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయామో చెప్పలేక కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలో ఉండి కనీసం కొన్ని కార్యక్రమాలనైనా ఎందుకు అమలు చేయలేకపోతున్నామో వివరించలేక బీజేపీ నాయకులు అభాసుపాలవుతూ ప్రజలకు మరింత దూరమవుతున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని చెపుతున్న వారి మాటలను ప్రజలు విశ్వసించడం లేదనడానికి జనం లేక వెలవెలబోతున్న వారి యాత్ర లే నిదర్శనం. అసలు కేసీఆర్‌ను గద్దె దింపుతామని ఎందుకంటున్నారు?. కాంగ్రెస్, బీజేపీ పాలనకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం పరిపాలించడం లేదా?. తెలంగాణ ఉద్యమం సాగే రోజుల్లో, రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో ఎన్ని మాటలన్నారో ఇప్పటికీ మర్చిపోలేం. ఉద్యమం చేసిన వారు పరిపాలన చేయలేరని, రాజకీయ అనుభవం ఉండదని, చిన్న రాష్ర్టాల మనుగడే ప్రమాదకరమని, మత ఘర్షణలు పెచ్చరిల్లుతాయని, ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగి హింసాత్మకంగా మారుతుందని, కరెంట్ లేక కటిక చీకటవుతుందని అన్న వారి మాటలు నేడు ఏమయ్యాయి?

కేసీఆర్ సీఎం అయిన తొలి రోజుల్లో అన్నీ ప్రతికూల పరిస్థితులే. అధికా రం కోల్పోయి ప్రతిపక్షంలోకి పోయిన కాంగ్రెస్ నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా అన్నీ అడ్డంకులే కలిగించడం చూశాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాని ది కూడా రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమే. ఇవ్వాల్సిన నిధులే సక్రమంగా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రం పైగా తెలంగాణ ప్రజల మనసు బాధపడే విధంగా అనేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి ఏడు మండలాలను రాత్రికిరాత్రే ఏపీలో కలిపి దెబ్బతీసింది. కొత్తరాష్ట్రంలో కరెంట్ ఇబ్బందులు తీవ్రంగా ఉన్న సమయంలో కేంద్రం సహకరించకపోగా కీలకమైన సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా ఏపీకి ధారాదత్తం చేశారు. విభజ న చట్టం ప్రకారం కృష్ణపట్నం నుంచి మనకు రావాల్సిన కరెంట్ ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం తొండి చేసినప్పుడు కూడా కేంద్రం ఏపీకి వత్తాసు పలికింది తప్ప తెలంగాణ గోడు పట్టించుకోలేదు. హైకోర్టు విభజన చేయకుండా ఇప్పటికీ తాత్సారం చేస్తూనే ఉన్నారు. విభజన చటంలోని లేనేక అంశాలు పరిష్కారం కాక ఇప్పటికీ టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తనే ఉన్నరు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సీఎం కేసీఆర్ మడ మ తిప్పలేదు. అపారమైన రాజకీయ అనుభవం, ఉద్యమ సమయంలో ప్రజల సమస్య లు ప్రత్యక్షంగా చూసిన అవగాహన, రైతులకు ఏదో చేయాల న్న తపన వెరసి కేసీఆర్ స్ఫూర్తిదాయకమైన పాలనకు బాట వేసుకున్నారు. ఉన్న వనరులతోనే పరిపాలన సాగిస్తూ నాలుగేండ్లలోనే తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దారు. కేసీఆర్ ముం దుచూపుతో తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల పట్టణం, గ్రామీణం అన్న తేడా లేకుండా ప్రజల కొనుగోలుశక్తి గణనీయంగా పెరిగింది.

ఈ విషయాలను నేను చెప్పడం కాదు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వరంగ అధ్యయన సంస్థలే ప్రభుత్వానికి కితాబివ్వడం జరిగింది. అభివృద్ధితో పాటు ఆర్థిక చక్రాలను కూడా కేసీఆర్ ఉరుకులు పెట్టించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రం స్థిరమైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కేవలం నాలుగేండ్లలోనే సగటున 17.2 శాతం వృద్ధి రేటును సాధించింది. కాగ్ వెల్లడించిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు భిన్నంగా కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన సాగించకుంటే తెలంగాణ అన్నిరంగాల్లో తొలి స్థానంలో ఎందుకు నిలుస్తుంది. ఇది ప్రజల హృదయాలను తాకే పాలనే కాకుంటే రాష్ట్రానికి  అనేకరంగాలలో ఎందుకు అవార్డులు, రివార్డులు వస్తాయి. పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రభుత్వ పథకాలను పదేపదే అభినందిస్తున్నారంటే పరిపాలన అద్భుతంగా ఉందనే అర్థం కదా. కేసీఆర్ నాయకత్వం పట్ల అన్నివర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్న సమయంలో ఆయనను గద్దె దింపుతామన్న సింగిల్ పాయింట్ అజెండా పెట్టుకొని వివిధ రూపాల్లో యాత్రలు చేస్తున్న పార్టీలకు భంగపాటు తప్ప మరెలాంటి ఫలితం ఉండదనే సత్యాన్ని గ్రహించి మసులుకుంటే కనీసం ప్రజల్లో చులకన కాకుండానైనా ఉండే అవకాశం ఉన్నది. (వ్యాసకర్త: శాసన మండలి సభ్యులు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.