-రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు, కండ్లద్దాల పంపిణీ
-కేసీఆర్ నిర్ణయం.. అధికారులకు ఆదేశాలు
-కంటిచూపు మందగించినా దవాఖానకు పోలేక అంధకారంలో మగ్గుతున్న పేద వృద్ధులను మళ్లీ కంటివెలుగుతో ఆదుకొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అవసరమైన వారందరికీ శస్త్రచికిత్సతోపాటు కండ్లద్దాలను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చే జనవరిలో శిబిరాలను నిర్వహించనున్నది.
రానున్న సంక్రాంతి ‘నేత్ర’పర్వం కానున్నది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి మరోవిడత కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గతంలో చేపట్టిన ఈ కార్యక్రమం లక్షల మంది పేద వృద్ధులకు కంటివెలుగును అందించింది. ఊరూరా ఉచితంగా నేత్రపరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.. అవసరమైన వారికి కండ్లజోళ్లనూ అందించింది.
ఈ నేపథ్యంలో మరోసారి కంటివెలుగు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కంటివెలుగు కార్యక్రమం అమలుతీరు, నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు, ప్రజారోగ్యం తదితర అంశాలపై గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘గతంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. ముఖ్యంగా కంటిచూపు కోల్పోయిన పేదలైన వృద్ధులకు ఈ పథకం ద్వారా కంటిచూపు అందింది.
రాష్ట్రప్రభుత్వం ఉచితంగా పరీక్షలు నిర్వహించి, కండ్లజోళ్లను అందించింది. పేదలకన్నుల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం. మరోసారి రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు పథకం ద్వారా నేత్రపరీక్షలు నిర్వహించి కావాల్సిన వారందరికీ ఉచితంగా కండ్లద్దాలను అందిస్తాం’ అని సీఎం తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, కంచర్ల భూపాల్‌రెడ్డి, జీ విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్వేతా మహంతి, తదితరులు పాల్గొన్నారు.
తొలివిడత కంటివెలుగులో..
పరీక్షలు చేయించుకున్నవారు- 1,54,72,849
అద్దాలు పొందినవారు: 44,08,483
కంటి సమస్యలపై రెఫరల్: 6,30,836
పూర్తయిన కంటి ఆపరేషన్లు: 3,10,638
ప్రభుత్వం వెచ్చించినది: రూ.200 కోట్లు