Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జయహో కేసీఆర్

-రాష్ట్ర మంతటా గులాబీ ప్రభంజనం
-అసాధ్యాలు ఎరుగని నేతకు అఖండ విజయం
-కారు స్పీడుకు కూటమి తుత్తునియలు
-ప్రజలు గెలిచారు.. తెలంగాణ నిలిచింది -టీఆర్‌ఎస్‌కే పట్టంగట్టిన ప్రజలు
-సంక్షేమ పథకాలకు జైకొట్టిన ఓటరు
-జగిత్యాల నుంచి జైత్రయాత్ర మొదలు
-అపవిత్ర కలయికకు ప్రజల గుణపాఠం
-చంద్రబాబు అండ్‌కోకు చెంపదెబ్బ
-బీజేపీకి కలిసిరాని మోదీ ప్రచారం

ఇది కేసీఆర్ సునామీ! ఇది గులాబీ ప్రభంజనం! ఇదీ తెలంగాణ ఆత్మగౌరవం! జయహో కేసీఆర్!! ఇది యావత్ తెలంగాణం ఉప్పొంగిన గుండెలతో చేసిన నినాదం! తెలంగాణ వార్ వన్‌సైడే.. ఆ మాటకొస్తే.. టీఆర్‌ఎస్‌పై యుద్ధానికి వచ్చినవారెవరూ లేరు! వచ్చి నిలిచినవారూ లేరు!బంగారు తెలంగాణ నిర్మాణ సారథ్యం టీఆర్‌ఎస్‌కే అప్పగిస్తూ తెలంగాణ ఓటరు ఇచ్చిన తీర్పు!వలసాధిపత్య శక్తుల పీచమణుస్తూ.. నిలిచి గెలిచిన తెలంగాణ ఆత్మగౌరవం! వెరసి.. ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శిస్తూ.. తెలంగాణ ప్రజ గెలిచింది!

ఈ గడ్డను ఏలే సత్తా.. ఏలాల్సిన బాధ్యత.. టీఆర్‌ఎస్‌కే ఉన్నాయని దిక్కులు పిక్కటిల్లేలా చాటిచెప్పింది! నిశ్శబ్ద విప్లవమనుకున్నచోట.. విప్లవం విస్ఫోటం చెందిన వేళ.. కుట్రకత్తులు విరిగిపోయాయి! ప్రతిరథచక్రం ఆగొద్దని తీర్మానించుకున్న ప్రజల అచంచలమైన విశ్వాసం ముందు.. చేష్టలుడిగి కూలబడిపోయాయి! బంగారు తెలంగాణ సాధనకు అలుపే ఎరుగని యజ్ఞం చేస్తున్న కేసీఆర్‌కే తమ మద్దతని తెలంగాణ ఓటర్లు ఓటు గుద్ది మరీ తేల్చి చెప్పారు! కూటమి నేతలు కుప్పలు తెప్పలుగా హామీలిచ్చినా.. చేతలనే నమ్మిన ప్రజలు.. తిరుగులేని మెజారిటీతో తెలంగాణ రాష్ట్ర సమితిని సగౌరవంగా.. సమున్నతంగా.. మళ్లీ అధికార పీఠంపై అధిష్ఠించారు! కేసీఆర్ ముందస్తు వినతికి విజయోస్తు.. అంటూ దీవించారు! పచ్చి అవకాశవాద రాజకీయంతో కట్టిన కూటమి దవడలను ఎడాపెడా వాయించిపారేశారు! అడ్డదారిలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన సీమాంధ్ర నేతలు, వారి తైనాతీల ఆశలపై నీళ్లు కుమ్మరించారు! ఆఖరునిమిషంలో కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా.. మహామహులు రంగంలోకి దిగినా.. లొంగని ప్రజలు.. కాంగ్రెస్, టీడీపీకి కర్రు కాల్చి వాతపెట్టారు! అపనమ్మకాలను పటాపంచలు చేస్తూ.. కేసీఆర్ నాయకత్వానికే జై కొట్టారు. తాను అమలుచేసిన సంక్షేమ పథకాలు, ప్రజల జీవితాల్లో తాను తెచ్చిన మార్పు ఫలితాలనిస్తుందనే కేసీఆర్ నమ్మకాన్ని ప్రజలు నిజంచేశారు! ఇది తెలంగాణ ప్రజలపై కేసీఆర్‌కు ఉన్న ధీమా! ఇది.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై ఉన్న విశ్వాసం!! ఇక అమరవీరుల త్యాగాలు తెలంగాణ గడ్డపై అభివృద్ధి మొక్కలై పుష్పిస్తాయి! ఉద్యమ ఆకాంక్షలు ఎలాంటి అడ్డంకుల్లేకుండా సాకారం కానున్నాయి! ఒక స్వర్గం నిర్మించాలని.. మన స్వప్నం పండించాలని తపనపడుతున్న తెలంగాణ మహర్షి సంకల్పానికి మరింత బలాన్నిస్తాయి!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి 88 స్థానాలు గెలుచుకుని విజయఢంకా మోగించింది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత కొద్దిసేపటికే టీఆర్‌ఎస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండు రౌండుకూ మెజార్టీ పెంచుకుంటూ విజేతలుగా నిలిచారు. జగిత్యాల నుంచి ప్రారంభమైన టీఆర్‌ఎస్ జైత్రయాత్ర తుంగతుర్తి నియోజకవర్గం కైవసంతో సేదదీరింది. టీఆర్‌ఎస్ ఒకవైపు నిలువగా.. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఒక జట్టుగా పోటీపడిన ఈ ఎన్నికల్లో.. గులాబీదళానిదే పైచేయి అయింది. మొత్తం పోలైన ఓట్లలో 47శాతానికిపైగా ఓట్లు సాధించి సత్తాచాటిన టీఆర్‌ఎస్.. రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధంచేసుకుంటున్నది. అధిక స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీలు నమోదుచేశారు. దేశంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీని మంత్రి టీ హరీశ్‌రావు సాధించారు. ఆయనకు సిద్దిపేటలో 1,18,699 మెజార్టీ లభించింది. వర్ధన్నపేటలో ఆరూరి రమేశ్ 99,670, సిరిసిల్లలో మంత్రి కే తారకరామారావు 89,009 మెజార్టీ సాధించారు. జగిత్యాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్ అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై 60,763 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, జీ జగదీశ్‌రెడ్డి, జోగురామన్న, మాజీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, బాల్కసుమన్, నోముల నర్సింహయ్య, కంచర్ల భూపాలరెడ్డి, చంటి క్రాంతికిరణ్ తదితరులు విజయబావుటాలు ఎగరేశారు. ఇక చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ 80,263 మెజార్టీతో గెలుపొందారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమలక్ష్యాలకు అనుగుణంగా సాగుతున్న పాలనకు విపక్షం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రజాకోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ సెప్టెంబర్ ఆరున అసెంబ్లీని రద్దుచేసి.. ఎన్నికల సమరశంఖం పూరించిన సంగతి తెలిసిందే. పదవీకాలాన్ని త్యాగం చేసి.. ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు సంపూర్ణంగా సమర్ధించారని ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. టీఆర్‌ఎస్ విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పండుగవాతావరణం నెలకొంది. ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు పటాకులు కాల్చి.. గులాల్ చల్లుకుని.. మిఠాయిలు పంచుకున్నారు. శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు గులాబీ విజేతలు బుధవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణభవన్‌లో సమావేశంకానున్నారు.

చరిత్ర సృష్టించిన కేసీఆర్..
పూర్తికాలం కాకుండానే ముందస్తుకు వెళ్లిన సంఘటనలు దేశంలో పలుమార్లు చోటుచేసుకున్నాయి. కానీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముందస్తుకు వెళ్లి గెలిచిన సందర్భాలు లేవు. తెలంగాణలో మొదటిసారి ఆ ఘనతను సాధించటం ద్వారా కేసీఆర్ చరిత్ర సృష్టించారు. సాధారణంగా భయంతో ముందస్తుకు వెళుతారనే అభిప్రాయం ఉంది.. కానీ.. కేసీఆర్ బాధ్యతతో, నమ్మకంతో తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారని తాజా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ముందస్తయినా.. నిర్ణీతకాలానికే ఎన్నికలు జరిగినా.. సంక్షేమం గురించి ఆలోచించేవారికే ప్రజలు పట్టంగడుతారని కేసీఆర్ రుజువుచేశారు. దశాబ్దాల పోరాటాల అనంతరం రాష్ట్రం సాధించుకున్న వేళ ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉన్న 2014 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ఒకింత తక్కువ సీట్లకే పరిమితమైనా.. నాలుగున్నరేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైన, దాని సారథి కేసీఆర్‌పైన ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి.

మట్టికరిచిన కాంగ్రెస్ దిగ్గజాలు
మహాకూటమిగా బరిలో నిలిచి.. పనికిమాలిన ఆరోపణలు, దుష్ప్రచారాలతో అధికారం చేపట్టాలని కలలుగన్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కౌంటింగ్ సందర్భంగా ఏ ఒక్క దశలోనూ ప్రజలను ఆకట్టుకున్నట్టు కనిపించలేదు. మహామహులుగా చెప్పుకొనే కాంగ్రెస్ నేతలు మట్టికరిచారు. జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి, బలరాం నాయక్, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మల్లు రవి, చిన్నారెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్య, కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ వంటి ముఖ్యనేతలకు పరాభవం తప్పలేదు.

మోదీసహా మహామహుల ప్రచారాన్ని నమ్మని ప్రజలు
ఎలాగైనా టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్ నాయకత్వాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతో కూటమికట్టిన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ మహామహులను ప్రచారం బరిలోకి దించాయి. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలంగాణను తానే ఇచ్చినట్టుగా సన్నాయి నొక్కులు నొక్కిన సోనియాగాంధీ, గులాంనబీ ఆజాద్‌లాంటివారు ప్రచారం చేశారు. టీడీపీ తరఫున ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ తరఫున సాక్షాత్తు ప్రధాని మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్ నేతలు నితిన్‌గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, హన్స్‌రాజ్ గంగారాం, ప్రకాశ్‌జవదేకర్ లాంటి సీనియర్లు, ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్‌చౌహాన్‌వంటి సీఎంలు ప్రచారం చేసినా.. బీజేపీ కనీస ఫలితాలను సాధించలేకపోయింది. విజయశాంతి, ఖుష్బూలాంటి సినీసువాసనలను కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు. మాయావతి, సిద్ధూలాంటి దురంధరులు తెలంగాణ ప్రజల సంకల్పాన్ని మార్చలేకపోయారు.

కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, జేడీఎస్ నాయకుడు, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తదితరులు ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు.

మరోమారు ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు. కేసీఆర్ గారిపై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న భరోసాకు ధన్య వాదాలు. ఈ విజయానికి రుణపడి ఉన్నాం. వినమ్రతతో మీకు కృతజ్ఞతలు.
-కే తారకరామారావు, ఐటీశాఖమంత్రి

ప్రతిక్షణం తెలంగాణ ప్రజలకోసం పనిచేసిన కేసీఆర్‌పై ప్రజలు అభిమానం చూపారు. నాలుగేండ్ల కేసీఆర్ కఠోరశ్రమ ఫలితమే టీఆర్‌ఎస్ విజ యం. ఇంతటి విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజల సంక్షేమానికి కేసీఆర్ ఆధ్వర్యంలో తప్పకుండా అభివృద్ధి పనులు జరుగుతాయి. తెలంగాణ ప్రజల దీవెనలతో జాతీయస్థాయిలో కూడా కేసీఆర్ రాజకీయంగా సేవలు అందిస్తారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తెలంగాణ ప్రజలు ఎప్పు డూ అండగా ఉంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది.
-కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ ఎంపీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును మా పార్టీ గౌరవిస్తుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ అభినందనలు. దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనపడుతుందనడానికి ఈ ఎన్నికలే నిదర్శనం. బీజేపీకి వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా నిలుస్తున్నారు.
-చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం

చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు వికటించింది. చంద్రబాబుతో కాంగ్రెస్ చేతులు కలుపడాన్ని ప్రజలు స్వాగతించలేదు. రాష్ట్ర నాయకత్వం, ఏఐసీసీ ఇంచార్జి వ్యూహాత్మక తప్పిదమది. గాల్లో తిరుగుతూ పొరపాట్లు చేశారు. తెలంగాణ సెంటిమెంట్‌పై వచ్చిన రాష్ట్రంలో చంద్రబాబుతో చేతులు కలుపడం కొంపముంచింది.
– పొంగులేటి సుధాకర్‌రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష ఉపనేత

తెలంగాణ ప్రజానీకం తిరుగులేని తీర్పుతో సైకిల్‌కు ముందు చక్రం ఊడిపోయింది. నాయుడుబాబుకు చావుతప్పి కన్నులొట్టబోయింది. సైకిల్ వెనుక చక్రం కూడా పీకి చంద్రబాబు పీడను ఎంత త్వరగా ఒదిలించుకోవాలా అని ఆంధ్ర ప్రజలు కసిగా ఎదురుచూస్తున్నారు.
– విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ

తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను ప్రజలు ఆమోదించారు. చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అతి పెద్ద తప్పిదం. బాబు రాకతో ఎన్నికలు తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాల మధ్య యుద్ధంలా మారాయి. బీజేపీయేతర కూటమికి కన్వీనర్‌గా చంద్రబాబు ఎక్కువ రోజులు ఉండలేరు.
-బర్ఖా దత్, ప్రముఖ జర్నలిస్టు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.