Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌దే కీలక పాత్ర

-నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-మార్పు తెలంగాణ నుంచే మొదలుకావాలి
-అస్తిత్వం కోల్పోతున్న జాతీయ పార్టీలు
-దేశవ్యాప్తంగా ఆచరణాత్మకంగా మారిన కేసీఆర్ పథకాలు
-కాంగ్రెస్‌లో జోష్ లేదు.. బీజేపీలో హోష్ లేదు
-కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో మనదే కీలకపాత్ర
-ఆంధ్ర రాజకీయాల్లో మా జోక్యం ఉండదు
-ఆంధ్ర ప్రజలు చైతన్యవంతులు..
-ఎవరిని ఎన్నుకోవాలో వారికి తెలుసు

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి మెజార్టీ వచ్చే అవకాశం లేదని, ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషించడం ఖాయమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పెద్దసైజు ప్రాంతీయ పార్టీలేనన్న కేటీఆర్.. దేశాన్ని ఇన్నేండ్లు పాలించిన ఈ రెండు పార్టీలు 70 సంవత్సరాల్లో ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాలని, అది తెలంగాణ నుంచే మొదలుకావాలని ఆకాంక్షించారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను సాధించి దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ అత్యంత కీలకపాత్ర పోషిస్తుందని కేటీఆర్ స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్ విజయం ఖాయమన్న కేటీఆర్.. మెజారిటీలు పెంచుకునే లక్ష్యంతో ఉన్నామని వివరించారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహక సభల బాధ్యతలను చూస్తున్న కేటీఆర్ శనివారం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతున్నదని చెప్పారు. ఆచరణాత్మక పథకాలుగా వాటిని అనేక రాష్ర్టాలతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అమలుచేస్తున్నదని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరాన్ని, జాతీయస్థాయిలో ఎన్నికల అనంతర సమీకరణలు తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎన్నికల ప్రచారసభల్లో ప్రజలకు స్పష్టత ఇస్తారని తెలిపారు.

ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయజెండాను ఎవరు ఎగురవేయాలో నిర్ణయించే శక్తి తెలంగాణ ప్రజలకు లభించే అవకాశం వచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారానికి దూరంకావడం ఖాయమని, అక్కడి ప్రజలు టీడీపీకి వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నారని కేటీఆర్ అంచనావేశారు. దేశ రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, టీఆర్‌ఎస్ భవిష్యత్తు ప్రణాళిక గురించి కేటీఆర్ ఈ ఇంటర్వ్యూలో సమగ్రంగా వివరించారు.

జాతీయ భావనలో.. జాతి ప్రయోజనాల విషయంలో జాతీయ పార్టీలకంటే ఉన్నతంగా తామే ఆలోచిస్తున్నామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. దేశంలో జాతీయ పార్టీలని చెప్పుకొనేవి.. పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలుగా మారాయన్నారు. నిబద్ధత, విధానపరమైన స్పష్టతతో ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచనలు దేశానికి ప్రయోజనకరం కావాలని ఆకాంక్షించారు. విశాలమైన దృక్పథంతో జాతీయ ప్రయోజనాలే ఎజెండాగా లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రజల ముందుకు రాబోతున్నదని తెలిపారు. దేశంలో బీజేపీ పోతే.. కాంగ్రెస్, కాంగ్రెస్ పోతే బీజేపీ అనే పాత చింతకాయపచ్చడి రాజకీయం పోవాలని, ఒక కొత్త రాజకీయ పంథాతో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్నదే సీఎం కేసీఆర్ తపన అని అన్నారు. శనివారం నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

కాంగ్రెస్, బీజేపీలు పెద్దసైజు ప్రాంతీయపార్టీలే
దేశంలో కాంగ్రెస్, బీజేపీ పెద్దసైజు ప్రాంతీయపార్టీలే. టీఆర్‌ఎస్ చిన్నసైజు ప్రాంతీయపార్టీ. జాతీయ పార్టీలని చెప్పుకొనే అనేక పార్టీలు ఇప్పుడు సాంకేతికంగా మాత్రమే జాతీయపార్టీలు. సీపీఐ, సీపీఎం వంటివి జాతీయ పార్టీలే కానీ, వాటికి టీఆర్‌ఎస్ కన్నా ఎక్కువ సీట్లు సాధించే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీ అక్కడి ప్రాంతీయ పార్టీలకు తోకపార్టీగా మారింది. బీహార్‌లోను అంతే. వీటి కన్నా టీఆర్‌ఎస్ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించబోతున్నది. జాతీయభావన, విశాల దృక్పథంతో జాతి ప్రయోజనాలే ఎజెండాగా టీఆర్‌ఎస్ ప్రజల ముందుకు రాబోతున్నది. మా ఎజెండాను సీఎం, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల సభలో ప్రజల ముందుంచబోతున్నారు. దేశంలో రావాల్సిన గుణాత్మక మార్పు గురించి పార్టీ ప్లీనరీ వేదికగా ఎప్పుడో చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 71 సంవత్సరాలైనప్పటికీ సాధారణ ప్రజలకు మౌలిక వసతులు కూడా ఏర్పడలేదు. జాతి ఆకాంక్షలు, ప్రయోజనాలను నెరవేర్చడంలో ఇప్పటిదాకా ఉన్న పాలకులు నిర్లక్ష్యం వహించారు. మూస రాజకీయ చట్రానికే కాంగ్రెస్, బీజేపీ పరిమితమయ్యాయి. దేశంలో పార్టీలంటే కాంగ్రెస్ లేదా బీజేపీయేనా? పాత చింతకాయపచ్చడి రాజకీయం పోవాలి. గుణాత్మక మార్పు రావాలి. కొత్త రాజకీయ పంథా రావాలి. జాతీయ రాజకీయ యవనికపై మాది ఇదే నినాదం. మాకు ప్రజల ఆదరణ ఉంటుందనే భావిస్తున్నాం.

కేసీఆర్ ఆలోచన.. దేశానికి ఆచరణ
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ రెండోసారి విజయం సాధించి, కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యారు. 88 సీట్లు, 50 శాతం ఓట్లు సాధించాం. ప్రజలకు మేం ఏం చేశామో నచ్చింది. మేం ఏం చేస్తామని చెప్పామో దానిపై విశ్వాసం ఉంచారు. మా సీఎం కేసీఆర్‌పై భరోసా ఉంచారు. కేసీఆర్ రైతుబంధు పథకం తీసుకున్నప్పుడు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్, అరవింద్ సుబ్రమణ్యన్ ప్రశంసించారు. రైతుల ప్రయోజనాలు దీనితో ముడిపడి ఉన్నాయని ప్రధాని మోదీ అన్యాపదేశంగానైనా అంగీకరించక తప్పని పరిస్థితి. కేసీఆర్ ఆలోచన దేశానికి ఆచరణ అయింది. మా మీద తెల్లవారిలేస్తే దుమ్మెత్తి పోసే చంద్రబాబు కూడా అనివార్యంగా, విధిలేక పథకం పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని ఆంధ్ర రైతుకు మేలు చేసే పరిస్థితి వచ్చిందంటే అది కేసీఆర్ వల్ల కాదా? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను 11 రాష్ర్టాల ప్రభుత్వాలు అధ్యయనంచేసి తమ దగ్గర అమలు ప్రయత్నం చేస్తున్నాయి. కేసీఆర్ అమలు చేసిన పథకాలు దేశం ముందు పెడుతాం. జాతీయ ఎజెండాలో రాష్ర్టాలు బలోపేతమైతే దేశం బలోపేతమవుతుందనే నినాదంతో ముందుకుపోతాం.

తెలంగాణ బాగుండాలి..ఆంధ్ర ప్రజలు సంతోషంగా ఉండాలి
చంద్రబాబు ఐదేండ్లు సీఎంగా పనిచేశాక తాను చేసింది ఏమిటో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఫలానా పనిచేసిన.. నాకు ఓటు వేయండి అని అధికార పార్టీగా అడగాలి. ఇంకా గెలిపిస్తే ఫలానా పనిచేస్తాం అని చెప్పగలగాలి. తెలంగాణలో టీఆర్‌ఎస్ అదే పనిచేసింది. మేం ఏం పనిచేశామో చెప్పాం..మళ్లీ గెలిపిస్తే ఈ పనులు చేస్తామని ఓటు అడిగాం. చంద్రబాబు నెగెటివ్ ధోరణితో బట్టకాల్చి మీద వేసి, మసిపూసి మారేడుకాయ చేసి ఓట్లు పొందాలని నెగెటివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే.. ఆంధ్ర ప్రజలు బాగుండాలి.. తెలంగాణ ప్రజలు బాగుండాలనేది మా విధానం. గత ఐదేండ్లలో ఏపీ ప్రయోజనాల విషయంలో ఏనాడూ వారికి ఆటంకం కల్పించలేదు. భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యక్రమం చేయబోం. ఏపీ ప్రయోజనాలపై వ్యతిరేక భావం లేదు. తెలంగాణలో చంద్రబాబు ఇక్కడి సీమాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూసినా చైతన్యవంతమైన సీమాంధ్ర ప్రజలు తిరస్కరించారు. ఏపీ ప్రజలు కూడా నెగెటివ్ పాలిటిక్స్‌ను తిప్పికొడుతారని నమ్ముతున్నా. తమకు ఏ నాయకత్వం అయితే మేలు జరుగుతుంది, ఎవరి వల్ల ఏపీ ముందుకు పోతుంది అనేది ఆంధ్ర ప్రజలు ఆలోచించుకోవాలి. టీఆర్‌ఎస్‌కు ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెట్టాల్సిన అవసరం, పరిస్థితి లేదు.

నియోజకవర్గానికో సభ..
లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సభ పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు. నేటి నుంచి (ఆదివారం) సీఎం కేసీఆర్ సభలు మొదలవుతాయి. 19 నాడు నిజామాబాద్‌లో ఉంటుంది. ఇక వరుసగా సభలుంటాయి. తెలంగాణలో మా విజయం ఏకపక్షమే. మెజార్టీలు ఎంత వస్తాయన్నదానిపై దృష్టిపెట్టాం. ఇటీవల సీ ఓటర్ సర్వే చేసింది. మాకు 16 స్థానాలు వస్తాయని ప్రకటించింది. దాదాపు అన్ని సర్వే సంస్థలు ఫలితాలు ఏకపక్షమనే చెప్తున్నాయి. 40-50 లక్షల మంది ఓటర్లను సభల ద్వారా సీఎం నేరుగా కలుసుకుంటారు. టీఆర్‌ఎస్‌కు ఎందుకు 16 మంది ఎంపీలు ఉండాలి? దీనిద్వారా తెలంగాణకు ఏం సాధించుకోగలుగుతామనే దాన్ని ప్రధానంగా సభల్లో వివరిస్తారు. ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, సోషల్ మీడియాలను పార్టీ విస్తృతంగా ఉపయోగించుకుంటుంది. ఇప్పటికే పది నియోజకవర్గాల్లో పార్టీ తరపున సన్నాహక సమావేశాలు విజయవంతంగా పెట్టుకున్నాం.

విధేయతకు పట్టం
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు విధేయత, సేవా గుణం, సామాజిక సమీకరణలు, పార్టీకి చేసిన సేవ వీటన్నింటి కలబోతగా అభ్యర్థుల ఎంపిక ఉండబోతున్నది. కొన్నిచోట్ల ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల బట్టి కూడా మా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న రెండు ఎస్టీ సీట్లలో ఒకటి ఆదివాసీలకు, మరొకటి లంబాడాలకు కేటాయించే విధంగా సమతూకం ఉంటుంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకొంటారు.

మెజార్టీ పెంచుకోవడమే లక్ష్యం
శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సాధించిన ఓట్లకన్నా ఎక్కువ మెజార్టీ రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 47 శాతం ఓట్లు వచ్చాయి. ట్రక్కు గుర్తుకు మరో రెండు లక్షల ఓట్లు వచ్చాయి. వీటన్నింటినీ కలిపితే దాదాపుగా 50 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కు వచ్చాయి. ఎన్నికల తరువాత మా బలం పెరిగింది. పలువురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు. ఇతర పార్టీల నుంచి చేరికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలకంటే గణనీయమైన ఫలితాలు వస్తాయనేది నమ్మకం, అదే మా టార్గెట్.

16 మంది ఎంపీలు ఉంటే..
రాష్ట్ర విభజన చట్టాన్ని కేంద్రం అమలు చేయలేదు. హైకోర్టును ఎప్పుడో విభజించాలి. మొదటి ఆరు నెలల్లో చేసేయొచ్చు. ఆనాడు కేంద్రంలో చంద్రబాబు భాగస్వామి. ఆయన ఒత్తిడితో కేంద్రం చేయలేదు. ఎంపీలు పార్లమెంట్‌లో చేసిన పోరాటంతో చివరినిమిషం దాకా లాగి విభజించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. జాతీయ సంస్థలు ఇస్తామని ఇవ్వలేదు. కేంద్రంలోని పెద్దలు బడితె ఉన్న వాడిదే బర్రె అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ చేతిలో 16 మంది ఎంపీలు ఉంటే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్.. 16 మంది ఉంటే ఊహించని దానికంటే ఎక్కువ పనులు చేస్తారు.

అర్హులైనవారందరికీ గుర్తింపు
క్రితంసారి ప్రభుత్వం, రాష్ట్రం కొత్తది. ప్రభుత్వ నిర్వహణ కేసీఆర్‌కు కూడా కొత్త. కార్పొరేషన్ల విభజనతోపాటు అనేక చిక్కుముళ్లు ఉండె. వీటిపైనే దృష్టిపెట్టాల్సి వచ్చింది. ఈసారి కష్టపడ్డ వారిని గుర్తించాం. ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని వారికి వారి స్థాయికి అనుగుణంగా పోస్టుల భర్తీ ఉంటుంది. మే నెలాఖరుకల్లా అన్ని ఎన్నికలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జూన్ నుంచి నాలున్నరేండ్లపాటు ప్రభు త్వం, పార్టీ బలోపేతంపైన దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సమర్థులైన, విధేయులైన వారికి, క్రమశిక్షణ కలిగిన వారికి తప్పకుండా గుర్తింపు ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్‌కు ఉంది.

దేశంలోనే మంచి పార్టీగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం..
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నాలుగు నెలల్లో కొంత సంతృప్తిగా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి, వీటి తరువాత మున్సిపల్, జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఇవి పార్టీ పరంగా జరుగుతాయి. వీటి ఫలితాలు పార్టీ నాయకత్వం, పార్టీ శ్రేణుల పనితీరుకు ప్రాతిపదిక అవుతాయి. పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేశాం. సభ్యత్వ నమోదు లోక్‌సభ ఎన్నికల తరువాత జరగాలి. జూన్ నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యాలయాల నిర్మాణం చేసుకొని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకొని, దేశంలోనే మంచిపార్టీగా, క్యాడర్ బేస్డ్ పార్టీగా టీఆర్‌ఎస్‌ను తీర్చిదిద్దాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మాకు దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా జూన్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించుకుంటాం.

మంత్రులు, ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలు
లోక్‌సభ ఎన్నికల్లో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులను నియోజకవర్గానికి ఒకరు చొప్పున సీఎం కేసీఆర్ బాధ్యులుగా నిర్ణయించారు. ఇద్దరూ సమన్వయంతో పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా సమన్వయం చేయాలని నిర్దేశించారు. కొత్త మంత్రులు సత్తాను, సమర్థతను చాటుకోవడానికి ఈ ఎన్నికలు ఒక మంచి అవకాశం.

కాంగ్రెస్‌లో జోష్ లేదు.. బీజేపీలో హోష్ లేదు
ప్రజాస్వామ్యంలో పోటీ అనివార్యం. మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. ఆ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. తమ పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో జోష్ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. వాళ్ల కార్యకర్తల్లోనూ జోష్ లేదు.. బీజేపీ నేతల్లో హోష్ లేదు. రాష్ట్రంలో ఏకపక్షమైన వాతావరణం ఉన్నది. ప్రజల ఆలోచనా సరళిని గమనించినట్లయితే ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతున్నారని అర్థమవుతున్నది. కాంగ్రెస్‌లో ముఖ్యనేతలు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన నాయకులు పోటీకి వెనకడుగు వేస్తున్న పరిస్థితి. పోటీ చేయకుండా తప్పించుకుంటున్నారు. వారి పార్టీలో నైరాశ్యం అలుముకొని ఉన్నది. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు పోటీకి దిగుతున్నారు.

ప్రభుత్వ ఏర్పాటులో మనమే కీలకం కాబోతున్నాం
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే ఎన్డీయేకు 150-160 సీట్లు. యూపీఏకు 100-110 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఇద్దరు కూడా అనూహ్యంగా కలుద్దామనుకున్నా కూడా దేశంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ రాదు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల వైఖరి నచ్చని ప్రాంతీయ పార్టీలు దేశంలో బలంగా ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ (బీజేడీ), ఎస్పీ, బీఎస్పీ, వైఎసీపీ ఇలా.. అనేక ప్రాంతీయ పార్టీలు బలమైనవి. ఇవన్ని కలిసి 100-150 స్థానాలు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తున్నది. ఎర్రకోట మీద జెండా ఎవరు ఎగురవేయాలనేది తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. కేసీఆర్ ఈ పార్టీలన్నింటితో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో ఎన్నికల తరువాత ఫలితాలకు 40రోజులకు పైగా సమయం ఉన్నది. ఆ సమయంలో దాని మీద దృష్టి కేంద్రీకరిస్తారు.

మేం ఎవరికీ బీ టీం కాదు
మేం ఏ పార్టీతోని అంటకాగడంలేదు. కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో వేలుపెట్టలేదు. ప్రాంతీయ పార్టీ కోణంలో జేడీ(ఎస్) కు మద్దతు ఇవ్వాలనుకున్నాం. వారు కాంగ్రెస్, బీజేపీలకు దూరంగానే ఉన్నారు. సమాన దూరంలో ఉన్నందుకు వారి ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతు ఇవ్వాలని అనుకున్నాం. కానీ ఎన్నికల తరువాత అక్కడి పరిస్థితుల నేపథ్యంలో జేడీఎస్ కాంగ్రెస్‌తో కలిసింది. కాంగ్రెస్, బీజేపీతో కానీ అవగాహన ఉండాల్సిన అవసరం, ఖర్మ మాకు లేదు. మోదీ తెలంగాణకు వచ్చి టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు బీ టీం అంటారు.. రాహుల్ గాంధీ బీజేపీకి బీ టీం అంటారు. ఇదేం పద్ధతి. మేం ఎవ్వరి బీ టీం కాదు. మేం తెలంగాణ ప్రజలకు ఏ టీం. తెలంగాణ ప్రజలు మాకిచ్చిన సర్టిఫికెట్ టీఆర్‌ఎస్ ఏ టీం ఆఫ్ తెలంగాణ. డాటా చోరీ కేసు సందర్భంగా ఆంధ్ర నేతలు మాట్లాడిన తీరు హాస్యాస్పదం.

లోకేశ్ డాటా చోరీ జరిగిందని ఆరోపిస్తారు. చంద్రబాబు ఎలాంటి డాటా చోరీ జరుగలేదంటారు. వాళ్లలో వాళ్లకే ఎంత అయోమయం ఉన్నదో చెప్పవచ్చు. ఏపీని ఎవరు పరిపాలించాలి..? హైదరాబాద్‌ను తానే నిర్మించానని 2004, 2009, 2014, 2018లో కూడా చెప్పారు. అయినా ఇక్కడి ప్రజలు ఓడగొట్టారు. నాలుగుసార్లు ప్రజలు బుద్ధి చెప్పినా అదే పాట పాడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేస్తే ఒక సీటు వచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ, చంద్రబాబు కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేశారు. ఏమైంది? ప్రజలు ఇన్నిసార్లు తిరస్కరించిన తర్వాతనైనా తన వాదనలో పసలేదని అర్థం చేసుకొని సవరించుకుంటే ఆయనకు మంచిది. హైదరాబాద్‌ను తొమ్మిదేండ్లలో నిర్మించిన మహానాయకుడు అమరావతిని ఐదేండ్లలో ఎందుకు నిర్మించలేకపోయారో జవాబుచెప్పాలి కదా! గ్రాఫిక్స్ మాయాజాలంతో కాలం వెళ్లదీశారు. ఇలాంటి ప్రశ్నలు చంద్రబాబును అడిగితే ఆయనలోని అసహనం బయటికి వస్తుంది. ఈ మధ్యకాలంలో చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్‌లు, పత్రికా సమావేశాలు చూస్తే పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ కంటే ఎక్కువగా కేసీఆర్ పేరు చెప్తున్నారు. ఆయనలో అసహనం, నిరాశ, నిస్పృహ, నైరాశ్యం అలుముకున్న పరిస్థితికి ఇదో నిదర్శనం.

పొరుగు రాష్ర్టాలతో సఖ్యత అవసరం
తెలంగాణకు ఒకవైపు కుమారస్వామి, దేవేంద్ర ఫడ్నవిస్ మరోవైపు చంద్రబాబు ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవిస్ మనతో సామరస్యంగా ఉన్నారు. గోదావరిపై ఒప్పందం కుదుర్చుకొని, తెలంగాణ రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలకు కేసీఆర్‌కు సహకరించడంతో రెండురాష్ర్టాల మధ్య సామరస్య వాతావరణం నెలకొంది. కర్ణాటకతో కూడా సామరస్య ధోరణి ఉంటేనే కృష్ణా నది మీద కట్టుకునే ప్రాజెక్టులపై ముందుకుపోయే ఆస్కారం ఉంటుంది. టీఆర్‌ఎస్ మొదటి నుంచి అవలంభించిన విధానం ఏంటంటే మీరు బాగుండండి.. మేము బాగుంటాం (లివ్ అండ్ లెట్ లివ్) గోదావరి జలాల్లో తెలంగాణ, ఆంధ్ర కడుపునిండా వాడుకున్న తరువాత కూడా ఇంకా వృథాగా సముద్రంలోకి నీళ్లు పోయే పరిస్థితి ఉన్నది. అట్లాంటప్పుడు పంచాయతీ లేకుండా సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలనేది కేసీఆర్ విధానం. పొరుగు వారిని ప్రేమించు అనేది టీఆర్‌ఎస్ విధానం.

జాతీయ భావనలో వాళ్లకంటే పెద్ద వాళ్లం
బీజేపీ నేతలు ఒకటి ఆలోచించుకోవాలి. బీజేపీకి ఒకనాడు రెండే సీట్లు ఉండే.. రెండు సీట్ల నుంచి 283కు వచ్చారు. రేపటిరోజున వారికి ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. కాంగ్రెస్ కూడా గత లోక్‌సభ ఎన్నికల్లో గెలిచింది 44 సీట్లే. అవి తామేమో పెద్ద పార్టీలని, ఇతరులు చిన్న పార్టీలనే తిరస్కార భావనతో మాట్లాడటం సరికాదు. ప్రాంతీయపార్టీలుగా సైజులో తేడా ఉండొచ్చేమో కానీ జాతీయ భావనలో వాళ్లకంటే పెద్ద వాళ్లం. జాతీయ ప్రయోజనాల విషయంలో వాళ్లకంటే ఉన్నతమైన ఆశయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు ఉన్న వాళ్లం. నిబద్ధత, ఒక విధానం, విధానపరమైన స్పష్టత, ఆదర్శవంతమైన పరిపాలన రాష్ట్రంలో అందిస్తున్నది కేసీఆర్ నాయకత్వం. కేసీఆర్ ఆలోచన దేశానికి ఆచరణగా మారిందనేది వాస్తవం. ఆయన కార్యదక్షత, విధానాల రూపకల్పనలో ఆయన పడే తపన ఇదంతా కూడా జాతి ప్రయోజనాలకు అవసరం. .

ప్రధాని ఎవరో దేశ ప్రజలు నిర్ణయిస్తారు
ప్రధాని ఎవరో దేశ ప్రజలు నిర్ణయిస్తారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీ అని చెప్పే పరిస్థితి ఉన్నదా? ఆర్‌ఎస్‌ఎస్ ఆమోదంతో నితిన్ గడ్కరీ అయితరని ఒక ప్రచారం ఉంది. వాళ్ల పార్టీలో ఏం జరుగుతుందో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చూసుకుంటే మంచిది. లక్ష్మణ్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తొడకొట్టారు.. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఒక వార్డు కూడా గెలిపించుకోలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా హుంకారాలు చేశారు. ఆయన సొంత నియోజకవర్గంలో మా పార్టీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ 36 వేలయితే లక్ష్మణ్‌కు వచ్చిన ఓట్లే 34 వేలు. కాబట్టి నేల విడిచి సాము చేయకుండా తెలంగాణలో ఎన్ని స్థానాలు గెలుస్తారో ప్రకటించి దానికోసం ప్రయత్నిస్తే మంచిది. తెలంగాణలో రాజకీయంగా ఎదగడానికి అవకాశం లేనందునే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వలేదు. ప్రజలు వీటిని గమనిస్తున్నారు. పోటీ రాహుల్, మోదీ మధ్యలోనే ఉండాలని కాంగ్రెస్, బీజేపీలకు ఉండొచ్చు కానీ ఆ అగత్యం, ఖర్మ దేశ ప్రజలకు లేదు. దేశ ప్రజలు చాలా తెలివైనవారు, సరైన నిర్ణయం తీసుకుంటారు.

తెలంగాణకు కేసీఆర్ నాయకత్వం అవసరం
కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాలనూ ప్రభావితం చేస్తారు. తెలంగాణను ఆగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే, మరో పదేండ్లపాటు తెలంగాణకు ఆయన నాయకత్వం అవసరం. తెలంగాణలో ఉంటూనే ఢిల్లీలో కూడా నిర్ణయాత్మకమైన పాత్రను పోషించవచ్చు.

ఆంధ్ర ప్రజలు చైతన్యశీలురు
ఏపీ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పోటీ చేయడంలేదు. ఆంధ్ర రాజకీయాల్లో మా పాత్ర ఏమీలేదు. ఏపీలో త్రిముఖ పోటీ జరుగుతున్నది. టీడీపీ, వైసీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. ఆంధ్ర ప్రజలు చాలా చైతన్యవంతులు, నాకున్న అవగాహన మేరకు చంద్రబాబు నాయుడును సాగనంపే ఆలోచనలో ఉన్నారు. ఎవరిని గెలిపించాలన్నదానిపై ఆంధ్ర ప్రజలు చైతన్యవంతమైన నిర్ణయం తీసుకుంటారు.

పార్టీ మారడం అనేది సహజం
రాజకీయాల్లో పార్టీ మార్పు అనేది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. ఎక్కడా జరగని పని మేమే చేస్తున్నట్లు మాట్లాడటం అసమంజసం. అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంపీ, నలుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ప్రజాతీర్పు బేఖాతరు చేశారని, కాలరాశారని అప్పుడు మేం గగ్గోలు పెట్టలేదు. రాజకీయంగా ఎదుర్కొన్నాం. రాజకీయాల్లో ఇవన్నీ సహజం అనుకున్నాం. ఇప్పుడు మాట్లాడుతున్న వారి జ్ఞానం ఆనాడు ఎక్కడ పోయింది? పార్లమెంట్ ఎన్నికలు వచ్చినయి ఈ సమయంలో కొందరు పార్టీలు మారడం సహజం. పార్టీ మారే వారు కూడా, అవసరమైతే టీఆర్‌ఎస్ టిక్కెట్టు మీద పోటీచేస్తామని చెప్తుంటే అనైతికం ఏముంది? వారు కాంగ్రెస్‌ను ఎందుకు వీడుతున్నారు? మీ పార్టీ నాయకత్వం ఎందుకు విశ్వాసం కల్పించకపోతున్నది? కాంగ్రెస్ నేతలే ఆలోచించుకోవాలి.

అద్భుతమైన పాలనా సంస్కరణలు
జాతీయ స్థాయిలో అధికార వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది. సర్వం తన గుప్పిట్లోనే పెట్టుకొని ఢిల్లీ నుంచి నడిపిస్తామనే వ్యవహారం మారాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అద్భుతమైన పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చాం. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్‌లు, కొత్త పంచాయతీలు ఏర్పాటు చేశాం. ప్రజల వాయిస్ ఎంత పెరిగితే పరిపాలనకు అంత మంచిది. కేంద్రం ఫెడరల్ దృక్పథంతో దృష్టి పెట్టి కేంద్రం లిస్ట్, రాష్ట్ర లిస్ట్ ఉంటాయి. కంకర్డ్ లిస్ట్ ఎందుకనేది కేసీఆర్ అడుగుతున్న ప్రశ్న. విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు అంశాల్లో కేంద్రానికి స్వతహాగా తనకు నెట్‌వర్క్ ఏం లేదు. అట్లాంటప్పుడు రాష్ర్టాల మీద మీ పెత్తనం ఏంది? రాష్ర్టాలు కూడా అధికారాలు వికేంద్రీకరించడానికి సిద్ధంగా ఉండాలి. జెడ్పీలు, మండల పరిషత్‌లకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఎక్కువ అధికారాలు ఇవ్వడంద్వారా మంచి ఫలితాలు వస్తాయి. కేంద్రంలో పన్నులవాటా పెరగాలి.లిప్ సింపతీకి మాత్రమే ఫెడరలిజం పరిమితమైతే ఈ దేశంలో మనం ఆశించే మార్పు రాదు. టీఆర్‌ఎస్, తెలంగాణ ఎజెండా జాతీయస్థాయిలో అమలైతే అంతకంటే సంతృప్తి ఏముంటుంది?

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.