-పలు సందర్భాల్లో దీని ప్రాధాన్యాన్ని సీఎం కేసీఆర్ చెప్పారు -కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత బిల్లు అన్నిరకాల నీటి సమస్యలను పరిష్కరించదు -కాళేశ్వరంతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నాం -లోక్‌సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు

నీటి అవసరాలు తీర్చేందుకు జాతీయ జలవిధానం తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు చెప్పారు. జాతీయ జలవిధానం ప్రాధాన్యాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పలు సందర్భాల్లో చెప్పారని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అయిన కాళేశ్వరం ప్రాజెక్టును తాగు, సాగునీటి అవసరాల కోసం నిర్మించారని, దీనిద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు తెలిపారు. బుధవారం లోక్‌సభలో అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల సవరణ బిల్లు-2019పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిస్తున్నట్టు చెప్పారు. దేశానికి ఈ బిల్లు అవసరం ఉన్నదని, అయితే ఇది దేశంలోని నదీజలాల సమస్యలను పూర్తిగా పరిష్కరించేంతగా లేదన్నారు.
సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం దేశంలో ఏటా 70వేల టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తున్నదని, ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా ఇంకా తాగు, సాగునీరు కష్టాలను తీర్చలేకపోతున్నారన్నారు. దేశంలో 40వేల టీఎంసీల నీరు వ్యవసాయానికి సరిపోతాయి, 10 వేల టీఎంసీల నీరు తాగు, పారిశ్రామిక అవసరాలకు సరిపోతాయి, అయితే సరై న ప్రణాళిక లేకపోవడంవల్ల అంతకు రెండింతల నీరు సముద్రంలో కలుస్తున్నదని చెప్పారు. ఈ విషయమై సరైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. నీటి అవసరాలు తీర్చేందుకు జాతీయ జలవిధానం తీసుకురావాలని పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
33 ఏండ్ల నాటి సమస్యను మూడేండ్లలో.. తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమయిన కాళేశ్వరం ప్రాజెక్టును తాగు, సాగునీటి అవసరాలు తీర్చటానికి నిర్మించారని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను పలుమార్లు కలిసి అంతర్రాష్ట్ర జలవివాదాన్ని పరిష్కరించారని చెప్పారు. 33 ఏండ్లుగా ఉన్న సమస్యను మూడేండ్లలో పరిష్కరించి చూపటమే కాకుండా.. ముగ్గురు సీఎంలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారని తెలిపారు. తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ తన మొదటి ప్రసంగంలోనే నదులపై ప్రాజెక్టులు కట్టి సమస్యలు తీర్చాలని సూచించారన్నారు.
ఈ విషయమై మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం కూడా నదులను అనుసంధానం చేయాలని సూచించారని నామా పేర్కొన్నారు. 17 వ లోక్‌సభ సమావేశాల్లో రాష్ట్రపతి తన ప్రసంగం సందర్భంగా కూడా 21వ శతాబ్దంలో నీటి కొరత ఏర్పడనున్నదని హెచ్చరించారని, ఏకంగా రాష్ట్రపతులు సూచించినా నీటికష్టాలు తీర్చలేకపోయారని చెప్పారు. అంతర్రాష్ట్ర నదీ వివాదాల పరిష్కారానికి కేంద్రం అజమాయిషీ, రాష్ర్టాలకు ప్రాతినిధ్యం కల్పించడంతోపాటు రాష్ర్టాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.