సాగునీటి శాఖకు నూతన జవసత్వాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. కొత్త సంవత్సరం ప్రారంభంతోనే ఈ నూతన వ్యవస్థ అమల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. నిజానికి గత సంవత్సరం అంతా ముఖ్యమంత్రి సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణపై శాఖ అధికారులతో అనేకసార్లు కూలంకషమైన చర్చ సాగించారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నారు. అన్నిటిని మరొక్కసారి సమీక్షించుకొని పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను 2020 డిసెంబర్ 28న కొలిక్కి తీసుకువచ్చారు. అదేరోజు పునర్వ్యవస్థీకరణ జీవో విడుదలయ్యింది.

పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా ఈఎన్సీ, సీఈ, ఎస్ఈ, ఈఈ పోస్టులకు పదోన్నతులు, నియామకాల ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. జనవరి 2 నుంచి కొత్త వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం సాగునీటి కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చిన సంగతి ఎరుకే. ఈ ఆరేండ్లలో సాగునీటి శాఖ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. వృథాగా సముద్రం పాలవుతున్న గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించడానికి చర్యలు తీసుకున్నది. రాష్ట్రం మొత్తంలో సుమారు 125 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని, గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని మార్గాల ద్వారా కనీసం ఒక లక్ష ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగించాలని సంకల్పించింది. ఈ ఆరేండ్లలో అనేక భారీ మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తిచేసింది. రీ ఇంజినీరింగ్‌లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లలోనే పూర్తయి రైతాంగానికి సాగునీరు అందించే స్థితికి చేరుకున్నది. శతాబ్దాలుగా తెలంగాణ గ్రామీణ సామాజిక, ఆర్థిక వ్యవస్థకు ఆదరువులుగా ఉన్న గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్ధరించింది. మిషన్ కాకతీయ నాలుగు దశల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో రూ.9155.97 కోట్లతో 27,625 చెరువులను పునరుద్ధరించడం జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ వ్యవసాయ రంగంలో అసాధారణమైన అభివృద్ధికి దోహదం చేసింది. సాగు విస్తీర్ణం వానకాలం, యాసంగి మొత్తం 2016-17లో 47.78 లక్షల ఎకరాలుంటే 2020-21 నాటికి అది 89.46 లక్షల ఎకరాలకు పెరిగింది.
ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తికావడంతో సాగునీటి వ్యవస్థ భారీగా పెరిగింది. గతంలో సాగునీటి ప్రాజెక్టులు భారీ, మధ్యతరహా, చిన్నతరహా, లిఫ్ట్‌లు తదితర విభాగాల కింద ఉండేవి. వాటి నిర్వహణ వేరు వేరుగా ఉండేది. రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గంలో ఉన్న సాగునీటి సమస్యలపై వివిధ విభాగాల ఇంజినీర్లను సంప్రదించేవారు. ఇది ఇబ్బందికరంగా మారిన అనుభవం. ఇంజినీర్లకు నిధులను వెచ్చించే అధికారం లేకపోవడంతో ప్రతి చిన్న అత్యవసర పనులకు ప్రభుత్వానికి నివేదించేవారు. అనవసరపు జాప్యం కారణంగా మరమ్మతు పనులు ఆలస్యమై కాలువల, చెరువుల నిర్వహణ లోపభూయిష్టంగా మారింది. సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. దీనికితోడు ఈ ఆరేండ్లలో అనేక కొత్త నిర్మాణాలు జరిగాయి. బ్యారేజీలు, భారీ పంపులు, మోటర్లు వెలిశాయి. సాగునీటి శాఖ పనితీరు పైననే వ్యవసాయం, తాగునీరు, పారిశ్రామికాభివృద్ధి, చేపల పెంపకం, పర్యాటకం.. తదితర రంగాల అభివృద్ధి ఆధారపడి ఉన్నది. భవిష్యత్తులో సాగునీటి వ్యవస్థల సమర్థ నిర్వహణపైననే రాష్ట్ర సమగ్రాభివృద్ధి ఆధారపడి ఉన్నదని ముఖ్యమంత్రి భావించారు. సాగునీటిశాఖ ఒక ప్రచండమైన (వైబ్రంట్) శాఖగా మారాలని ఆయన కల. అది పునర్వ్యవస్థీకరణ వల్లనే సాధ్యం అవుతుందని భావించారు.
రాష్ట్రంలో గత 60 ఏండ్లుగా వివిధ అవసరాల కోసం సేకరించిన భూములు, ఇతర ఆస్తుల వివరాలను ఇటీవల సాగునీటి శాఖ ఇంజినీర్లు క్రోడీకరించారు. సుమారు 12.80 లక్షల ఎకరాలను రెవెన్యూ శాఖ సాగునీటిశాఖకు బదలాయించింది. రాష్ట్రంలో 125 జలాశయాలు, 866 కిలోమీటర్ల ప్రధాన కాలువలు, 13,373 కి.మీ. ఉపకాలువలు, 17,721 కి.మీ. మైనర్లు, 910 కి.మీ. పైపులు, 125 భారీ ఎత్తిపోతలు, 20 మధ్యతరహా ఎత్తిపోతలు, 13 చిన్న తరహా ఎత్తిపోతలు, 38,510 చెరువులు, కుంటలు, 8021 చెక్ డ్యాంలు, ఆనకట్టలు, 175 కి.మీ. సొరంగాలు, కాలువల మీద 1,26,477 స్ట్రక్చర్లు, 108 విద్యుత్ సబ్ స్టేషన్లు, 64 రెయిన్ గేజులు, 21 రివర్ గేజులు ఉన్నాయని ఇన్వెంటరీలో పేర్కొన్నారు. వీటి సమర్థ నిర్వహణకు ఈ పునర్వ్యవస్థీకరణ అవసరమయ్యింది.
సాగునీటిశాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ర్టాన్ని మొత్తం 19 ప్రాదేశిక ప్రాంతాలుగా విభజించారు. ప్రతి ప్రాదేశిక ప్రాంతానికి ఒక చీఫ్ ఇంజినీర్‌ను నియమించారు. ఆ ప్రాదేశిక ప్రాంతంలో ఉన్న సాగునీటి వ్యవస్థలు.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యాంలు, ఆనకట్టలు, కత్వాలు, చిన్నా పెద్దా లిఫ్ట్ స్కీములన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. వీటి అన్నిటి నిర్వహణ బాధ్యత ఆ ప్రాదేశిక చీఫ్ ఇంజినీర్‌దే. ఈయన కింద అవసరమైన మేరకు ఎస్ఈలు, ఈఈలు, డీఈఈ, ఏఈఈలు ఉంటారు. వారికి సహకరించడానికి వర్క్ ఇన్స్పెక్టర్లు, టెక్నికల్ ఆఫీసర్లు, లస్కర్లు ఇతర సహాయక సిబ్బంది ఉంటారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, సంగారెడ్డి, గజ్వేల్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేటలో ప్రాదేశిక చీఫ్ ఇంజినీర్ల కార్యాలయాలు నెలకొల్పారు. వీరికి పై స్థాయిలో ముగ్గురు ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు ఉంటారు. గతంలో ఉన్న ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఇరిగేషన్) ఇప్పుడు ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్)గా మారారు. ఇంజినీర్ ఇన్ చీఫ్ (పరిపాలన) యథాతథంగా ఉంది. ఇక మూడవది ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఓఎం). ఇది ముఖ్యమంత్రి స్వయంగా ముందు చూపుతో సృష్టించిన పదవి. ఇవికాక మరో ఆరుగురు చీఫ్ ఇంజినీర్లు డిజైన్స్, క్వాలిటీ కంట్రోల్, వాలంతారీ, ఎంక్వైరీలు, సచివాలయంలో సెక్రెటరీ (టెక్నికల్), విజిలెన్స్ తదితర పనుల కోసం హైదరాబాద్‌లో ఉంటారు. 19 మంది ప్రాదేశిక చీఫ్ ఇంజినీర్లలో ముగ్గురికి వారి అర్హతను, సీనియారిటీని బట్టి ఇంజినీర్ ఇన్ చీఫ్ హోదా కల్పిస్తారు. మొత్తం 28 మంది అత్యున్నత హోదా కలిగిన అధికారులు ముఖ్యమంత్రి, సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యక్ష పర్యవేక్షణలో సాగునీటి శాఖకు నాయకత్వం వహిస్తారు. ఈ పునర్వ్యవస్థీకరణతో సాగునీటి శాఖలో అన్ని స్థాయిల్లో మొత్తం 945 కొత్త పోస్టులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
పునర్వ్యవస్థీకరణలో భాగంగా ముఖ్యమంత్రి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఈఈ స్థాయి నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ స్థాయి వరకు అత్యవసర పనులు చేపట్టడానికి ఆర్థిక అధికారాలను దఖలుపరచారు. ఆ ప్రకారం.. డీఈఈ ఒక్కొక్క పనికి 2 లక్షలు మించకుండా సంవత్సరానికి 5 లక్షల వరకు; ఈఈ ఒక్కొక్క పనికి 5 లక్షలు మించకుండా సంవత్సరానికి 25 లక్షల వరకు; ఎస్ఈ ఒక్కొక్క పనికి 25 లక్షలు మించకుండా సంవత్సరానికి 2 కోట్ల వరకు; సీఈ ఒక్కొక్క పనికి 50 లక్షలు మించకుండా సంవత్సరానికి 5 కోట్ల వరకు; ఈఎన్సీ ఒక్కొక్క పనికి 1 కోటి మించకుండా సంవత్సరానికి 25 కోట్ల వరకు పనుల కోసం ఆర్థిక అధికారాలను వినియోగించుకోవచ్చు. ఇకనుంచి అత్యవసర పనులు చేపట్టడానికి ప్రతిసారీ ప్రభుత్వానికి నివేదించి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. ప్రభుత్వం సంవత్సరానికి 280 కోట్లు సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి వద్ద ఉంచుతుంది. ఆయన నిధులు విడుదల చేస్తారు. ఇది ఒక విప్లవాత్మక చర్య అని భావిస్తున్నారు. ఇది సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణకు, ఇంజినీర్లలో జవాబుదారీతనం పెరుగడానికి దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. సాగునీటి శాఖకు జవసత్వాలు సమకూర్చే ఈ పునర్వ్యవస్థీకరణను అందరూ స్వాగతిస్తున్నారు. దీని ఫలితాలు కొద్దిరోజుల్లోనే అనుభవంలోకి రానున్నాయి.
పునర్వ్యవస్థీకరణలో భాగంగా ముఖ్యమంత్రి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఈఈ స్థాయి నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ స్థాయి వరకు అత్యవసర పనులు చేపట్టడానికి ఆర్థిక అధికారాలను దఖలుపరచారు. ప్రభుత్వం సంవత్సరానికి 280 కోట్లు సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి వద్ద ఉంచుతుంది. ఆయన నిధులు విడుదల చేస్తారు. ఇది ఒక విప్లవాత్మక చర్య అని భావిస్తున్నారు.
-శ్రీధర్‌రావు దేశ్‌పాండే