Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జయహో కేసీఆర్

-హమ్ తుమారే సాథ్ హై -జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించండి -మీ నాయకత్వంతోనే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యం -ఫోన్ చేసిన బెంగాల్ సీఎం మమతాబెనర్జీ -తోడుగా నిలుస్తామన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ -సంఘీభావం పలికిన ఆరుగురు మహారాష్ట్ర ఎంపీలు -మూడో ఫ్రంట్‌కు కేసీఆర్ నాయకత్వానికి మద్దతు: పవన్‌కల్యాణ్ -జాతీయస్థాయి ప్రత్యామ్నాయాన్ని స్వాగతిస్తాం:ఏపీ మాజీ మంత్రి కొణతాల -కేసీఆర్‌కు దేశం నలుమూలల నుంచి ఫోన్లు -తృతీయ ఫ్రంట్ ఏర్పాటుపై దేశవ్యాప్తంగా చర్చ -ప్రగతిభవన్‌కు భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు -ఆశీర్వదించిన వివిధ మతాల పెద్దలు, ప్రముఖులు -ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెల్లువెత్తుతున్న మద్దతు

దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ కూడగట్టేందుకు, అవసరమైతే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనకు దేశం నలుమూలల నుంచి విశేష మద్దతు వెల్లువెత్తుతున్నది. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పటిష్ఠమైన మూడో కూటమి ఏర్పాటు అంశంపై ఆశావహ దృక్పథంతో చర్చ మొదలైంది. పద్నాల్గేండ్లు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నిర్వహించి, గమ్యాన్ని ముద్దాడిన కేసీఆర్.. సాధించుకున్న రాష్ట్రంలో సబ్బండ వర్ణాల సంక్షేమానికి అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్న తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న సంగతి తెలిసిందే. బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషిచేస్తున్న కేసీఆర్‌కు దేశ ప్రజల జీవితాల్లో కూడా మార్పు తేగల సామర్థ్యం ఉన్నదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో కూటమి ఏర్పాటుచేయగల సత్తా కేసీఆర్‌కే ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్‌తో కలిసి నడిచేందుకు వివిధ రాష్ర్టాల నాయకులు సుముఖత వ్యక్తంచేస్తున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన, దేశంలోనే కీలకమైన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. తమ్ముడూ.. చంద్రశేఖర్! మీరు ముందుకు వెళ్లండి మీ వెంట మేం ఉంటాం అని చెప్పారు. త్వరలోనే సమావేశమవుదామని అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తీసుకురావాల్సిన మార్పులపై వీరిరువురూ చర్చించినట్టు సమాచారం. దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ వాదనకు మమత మద్దతుగా నిలిచారు. కేసీఆర్ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ.. హమ్ ఆప్ సే ఎక్‌మత్ హై. ఆప్ కే సాథ్ రహేంగే (మేము మీతో ఏకీభవిస్తున్నాం. మీతో కలిసి పనిచేస్తాం) అని చెప్పారు.

దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. రాబోయే ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషించనున్నాయని, ఇందులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధాన భూమిక పోషించనున్నారని అన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ కూడా కేసీఆర్‌కు ఫోన్‌చేసి సంఘీభావం ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్న ఇతర రాష్ట్రాల్లోని వారితో కూడా సంప్రదించి అందరం కలిసి ముందుకుసాగుదామన్నారు. మహారాష్ట్రకు చెందిన ఆరేడుగురు ఎంపీలు కేసీఆర్‌కు స్వయంగా ఫోన్ చేసి తమ హర్షం వ్యక్తంచేశారు. అభినందనలు తెలిపారు. తమ పదవులకు రాజీనామా చేయడానికి సైతం ముందుకుస్తామని ఉత్సాహంగా ప్రకటించారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా వివిధ పార్టీల ప్రతినిధులు పలువురు ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు.

కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడే మూడో ఫ్రంట్‌కు మద్దతు ఇస్తానని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. రాజకీయాల్లో కొత్త రక్తం రావాలంటే థర్డ్ ఫ్రంట్ అవసరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా తృతీయ ప్రత్యామ్నాయం ఆవశ్యకతను స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అవసరం ఎంతగానో ఉందని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. జాతీయ రాజకీయాలకు దిశానిర్దేశం చేయగల సత్తా ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఉన్నదని చెప్పారు. మరోవైపు తెలంగాణ ఉద్యమం సమయంలో దేశంలోని 36 రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి, తెలంగాణకు అనుకూలంగా లేఖలు తీసుకున్న పరిచయాలతో జాతీయస్థాయి రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడానికి ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లుగా సమాచారం. కేసీఆర్ ప్రకటనపై తృతీయ ఫ్రంట్ విషయంలో జాతీయస్థాయిలో చర్చ మొదలైనందున రాబోయే రోజుల్లో మరికొన్ని పార్టీలు కేసీఆర్‌తో కలిసి వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రత్యేక రాష్ట్రానికి పూర్తిగా మద్దతు తెలిపింది. ఇదే చొరవతో దేశ రాజకీయాల్లో మార్పులు తీసుకరావడానికి కేసీఆర్‌కు సహకరించాలని జేఎంఎం నిర్ణయించినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్దతు పలుకుతూ పెద్ద సంఖ్యలో అభిమానులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులు ఆదివారం ప్రగతిభవన్‌కు పోటెత్తారు. దేశ్ కా నేత కేసీఆర్ అంటూ పెద్ద పెట్టున నినదించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.