Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జయహో టీఆర్‌ఎస్‌

-నాగార్జునసాగర్‌లో భగత్‌ ఘన విజయం
-18,872 ఓట్ల మెజార్టీ
-మట్టి కరిచిన జానారెడ్డి
-డిపాజిట్‌ దక్కని బీజేపీ

ఆయన వయసు 74 ఏండ్లు.. 43 ఏండ్ల రాజకీయ అనుభవం. గతంలో ఏడు సార్లు గెలిచిన చరిత్ర. ఆ పిల్లగాడి వయసు 38. రాజకీయాలకు కొత్త. ప్రత్యర్థి రాజకీయ అనుభవమంత లేదు ఇతడి వయసు. అయితేనేం కాకలుతీరిన యోధుడినంటూ బీరాలు పలికిన జానారెడ్డిని సునాయాసంగా ఓడించాడు భగత్‌. తన తండ్రి నోముల నర్సింహయ్య కంటే రెండున్నర రెట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు.

జయహో టీఆర్‌ఎస్‌
పార్టీ ఏదన్నది కాదు.. ప్రత్యర్థి ఎవరన్నదీ లెక్కలేదు. ఎన్నిక ఏదైనా ఎప్పుడైనా తెలంగాణలో విజయం టీఆర్‌ఎస్‌దే. వికసించేది గులాబీలే. పదే పదే అదే ఫలితం.. తెలంగాణ నేలలో ఆ మూల నుంచి ఈ మూలదాకా మేమంతా టీఆర్‌ఎస్‌ వెంటేనని సాగర్‌ ఫలితంతో జనం మరోసారి చాటిచెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటే తమ బాట అని ఘనంగా నినదించారు. నాగార్జున సాగర్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. కొడిగడుతున్న కాంగ్రెస్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదని ఈ ఎన్నిక చాటిచెప్పింది. అబద్ధాల ప్రచారంతో, తిట్లూ శాపనార్థాలతో పేట్రేగిపోతున్న బీజేపీని బండకేసి ఉతికి భగాయించింది. డిపాజిట్‌ దక్కకుండా దెబ్బకొట్టింది.

ఏ ఎన్నికైనా టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని మరోసారి రుజువైంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాలనకు సాగర్‌ ప్రజలు జై కొట్టారు. ఈ అసెంబ్లీ స్థానం కోసం జరిగిన ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ 18,872 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థి, సీనియర్‌ నేత జానారెడ్డిపై ఘన విజయం సాధించారు. 2018 ఎన్నికలతో పోలిస్తే దాదాపు మూడింతల అధిక మెజార్టీతో భగత్‌ గెలుపొందారు. భగత్‌ 89,804 ఓట్లు సాధించగా, జానారెడ్డి 70,392 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.

బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ రవినాయక్‌ కేవలం 7,676 ఓట్లతో సరిపెట్టుకొని డిపాజిట్‌ కోల్పోయారు. మొత్తం 26 రౌండ్లలో లెక్కింపు జరగగా.. రెండు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలోనూ టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. పోస్టల్‌ బ్యాలెట్లలోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. తుది ఫలితాల అనంతరం రిటర్నింగ్‌ అధికారి రోహిత్‌సింగ్‌, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ఎన్నికల పరిశీలకులు సజ్జన్‌ ఆర్‌ చవాన్‌ల చేతులమీదుగా నోముల భగత్‌ గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకొన్నారు. ఆయనవెంట రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌నాయక్‌ ఉన్నారు.

మొదటి నుంచి టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం
నల్లగొండ జిల్లా కేంద్రంలో పటిష్ఠ భద్రత నడుమ లెక్కింపు చేపట్టారు. ఉదయం 8 గంటలకు ఒకేసారి పోస్టల్‌ బ్యాలెట్లతోపాటు ఈవీఎంల లెక్కింపును ప్రారంభించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మొత్తం 346 పోలింగ్‌స్టేషన్లు ఉండగా.. ఒక్కో రౌండ్‌లో 14 టేబుళ్లపై మొత్తం 26 రౌండ్లలో ఓట్లను లెక్కించారు. మధ్యాహ్నం మూడు గంటలకే పూర్తిస్థాయి ఫలితం వెల్లడైంది. బీజేపీ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. కౌంటింగ్‌ ప్రారంభంలో బీజేపీ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి కంటే కూడా వెనుకబడిపోయారు.

అనుముల మినహా అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. గుర్రంపోడులో 3,457 ఓట్లు, పెద్దవూరలో 4,654, తిరుమలగిరి (సాగర్‌)లో 2,250, నిడమనూరులో 5,642, మాడ్గులపల్లిలో 452, త్రిపురారం 2,441 ఓట్లతో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్‌ బలమున్న మాడ్గులపల్లి, త్రిపురారం, పెద్దవూర మండలాల్లో టీఆర్‌ఎస్‌ మంచి మెజార్టీ తెచ్చుకోవడంతో కాంగ్రెస్‌ నేతలు కంగుతిన్నారు. పోస్టల్‌ బ్యాలెట్లలోనూ టీఆర్‌ఎస్‌కు 393 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మొత్తం 1,384 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలవ్వగా.. 51 ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగతా ఓట్లలో టీఆర్‌ఎస్‌కు 822, కాంగ్రెస్‌కు 428, బీజేపీకి 30, టీడీపీకి ఆరు ఓట్లు పోలయ్యాయి. సాగర్‌ విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా గులాబీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు.

జయహో టీఆర్‌ఎస్‌
-బీజేపీ డిపాజిట్‌ గల్లంతు
సాగర్‌లో ఫలితాల్లో బీజేపీ బొక్కబోర్లా పడింది. ప్రచారంలో ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలకు ప్రజలు ఇచ్చిన తీర్పుకు పొంతనే లేకుండాపోయింది. బీజేపీ నేతలకు సాగర్‌ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు. 7,676 ఓట్లు సాధించిన బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. పోలైన ఓట్లలో 6% ఓట్లు సాధిస్తేనే డిపాజిట్‌ దక్కుతుంది. అంటే 11,386 ఓట్లు సాధించాలి. ఈ సంఖ్య దరిదాపుల్లోకి కూడా బీజేపీ రాలేదు.

టీఆర్‌ఎస్‌ వెంటే గిరి‘జనం’
హాలియా: 35 వేలకు పైగా గిరిజన ఓట్లున్నాయని ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపినా లాభం లేకపోయింది. సాగర్‌లో గిరిజనులు టీఆర్‌ఎస్‌ వైపే నిలిచారు. బీజేపీ అభ్యర్థి పానుగోతు రవినాయక్‌ను తిరస్కరించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గంలోని 60 తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. సాగర్‌ ప్రాజెక్టు వెంట ఉన్న కృష్ణపట్టె ప్రాంతంలో బీడు భూములకు సాగు నీరిచ్చేందుకు సీఎం రెండు నెలల క్రితం నెల్లికల్లు లిఫ్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతుగా నిలిచారు.

నాలుగు దశాబ్దాల తర్వాత సాగర్‌కు యువ ఎమ్మెల్యే
నిడమనూరు: నాలుగు దశాబ్దాల సాగర్‌ నియోజకవర్గ చరిత్రలోనే మొదటిసారి యువ నాయకత్వానికి ప్రజలు జై కొట్టారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఆయన తనయుడు భగత్‌కు సీఎం కేసీఆర్‌ అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ నాయకత్వంపై ఉన్న విశ్వాసంతో ప్రజలు భగత్‌కు పట్టంకట్టారు. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన భరోసాతో ‘సారు వెంటే సాగరోళ్లం’ అని నిరూపించారు.

టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు
టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు. ప్రజలు సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. సాగర్‌ గడ్డపై మళ్లీ టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరింది. ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. -ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి

రాష్ట్రంలో బీజేపీకి చోటు లేదు
రాష్ట్రంలో బీజేపీకి చోటు లేదు. ఆ పార్టీ ఎప్పటికీ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాదు. కాంగ్రెస్‌కు ఈ ప్రాంతంలో ఉనికే లేదు. సాగర్‌లో ప్రజలు టీఆర్‌ఎస్‌ వెన్నంటి నిలిచారు.
– అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ, పర్యావణశాఖ మంత్రి

సాగర్‌ ఓటర్లకు కృతజ్ఞతలు
ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, తాజాగా సాగర్‌ ఫలితంతో తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే ఉన్నదని స్పష్టమైంది. సాగర్‌ ఓటర్లకు కృతజ్ఞతలు.
-సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

పనితీరుకు నిదర్శనం
సాగర్‌లో విజయం సీఎం కేసీఆర్‌ పనితీరుకు నిదర్శనం. సంక్షేమానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. బీజేపీకి సరైన గుణపాఠం చెప్పారు. నోముల భగత్‌కు అభినందనలు.
గంగుల కమలాకర్‌, బీసీ సంక్షేమశాఖ మంత్రి

ప్రగతే తారకమంత్రం
సీఎం కేసీఆర్‌ నాయకత్వానికి పట్టంకట్టిన సాగర్‌ ప్రజలకు కృతజ్ఞతలు. బీజేపీకి ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధే తమకు తారకమంత్రమని నిరూపించారు.
సత్యవతి రాథోడ్‌, గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి

కాంగ్రెస్‌, బీజేపీ బుద్ధి తెచ్చుకోవాలి
ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను దూషించిన కాంగ్రెస్‌, బీజేపీలకు సాగర్‌ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా ఆ పార్టీలు ప్రజల పక్షాన ఉండేందుకు ప్రయత్నించాలి.
-కొప్పుల ఈశ్వర్‌, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ మంత్రి

అద్భుతమైన తీర్పు
ఎన్నిక ఏదైనా ప్రతి మది నిండా కేసీఆర్‌ గులాబీ జెండానే. సాగర్‌ ప్రజలిచ్చిన అద్భుతమైన తీర్పుతో ఇది అర్థమవుతుంది. కేసీఆర్‌ను విమర్శించే కాంగ్రెస్‌, బీజేపీకి ఈ తీర్పు చెంపపెట్టు.
-వేముల ప్రశాంత్‌రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి

అభివృద్ధిపై నమ్మకమే గెలిపించింది
కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి ధన్యవాదాలు.
-జీ రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.