Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జయం మనదే

-వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపు -10 ఎంపీ సీట్లు గెలిస్తే నిధులు సాధించొచ్చు -తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం -పాలమూరు వలసలకు అడ్డుకట్టవేద్దాం -వాల్మీకులకు ఎస్టీలుగా గుర్తింపు -దళితుల అభివృద్ధికి రూ.50 వేల కోట్లు -జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగునీరు -గద్వాల బహిరంగ సభలో కేసీఆర్

KCR at Gadwal meeting 06-Mar-14

రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయాలు సాధిస్తుందని ఆ పార్టీ అధినేత, మహబూబ్‌నగర్ ఎంపీ కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. 10 మంది ఎంపీలను గెల్చుకుంటే ఢిల్లీ నుంచి కావాల్సిన నిధులను రాబట్టుకోవచ్చని అన్నారు. తాను పాలమూరు ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకావడం గర్వంగా ఉన్నదని కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలోని పాతబస్టాండ్ సర్కిల్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత మొదటిసారిగా పాలమూరు జిల్లాలో అడుగు పెట్టానన్న కేసీఆర్.. ఇక్కడి నేలకు, ప్రజలకు వందనం చేస్తున్నానని చెప్పారు. మెదక్ జిల్లా వాసినైనా తెలంగాణ ఉద్యమ సృష్టికర్త ప్రొఫెసర్ జయశంకర్ ప్రోద్బలం మేరకే తాను మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేశానన్నారు. ‘ఈ జిల్లానే కాదు మెదక్, నల్లగొండ, ఆదిలాబాద్‌తోపాటు తెలంగాణ జిల్లాలన్నీ కేసీఆర్‌కు అండగా ఉంటాయి’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఏ గడ్డనుంచి పోటీ చేసినా అక్కడి ప్రజలు ఆదుకుంటారని పాలమూరు ప్రజలు తనను గెలిపించి నిరూపించారని కేసీఆర్ అన్నారు.

చంద్రకృష్ణా, తుంగభద్ర నదులు నడిగడ్డలో ఉన్నా ఇక్కడి పొలాలకు నీరు పారడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందని, ఇక పాలమూరు అంతా పచ్చదనంతో నిండిపోతుందని చెప్పారు. పాలమూరు పచ్చబడేంత వరకూ తాను నిద్రపోనని అన్నారు. ఇంతకాలం ఈ ప్రాంతాన్ని మాయామచ్ఛీంవూదులు పాలించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ మార్పు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ‘2002లో ఆర్డీఎస్ కోసం ఈ గడ్డ మీద పాదయాత్ర చేశాను. ఆ సమయంలో రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌డ్డి ఆర్డీఎస్ తూములను బాంబులు వేసి పేల్చి వేస్తానని ఇక్కడి ప్రజలను భయకంపితులను చేశారు. ఆర్డీఎస్ పేల్చేస్తే సుంకేసులను బద్దలు కొట్టి దుమ్ముదుమ్ము రేపుతామని హెచ్చరించి.. ఈ ప్రాంత ప్రజల్లో మనోధైర్యం కలిగించాను’ అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. గతంలో ఇక్కడి పాలకులు దద్దమ్మలుకావడం వల్లే బైరెడ్డి అలా మాట్లాడారన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు సీమాంధ్ర పాలనలో మోసం జరిగిందని చెప్పారు. చంద్రబాబు జూరాల లింకు కెనాల్ ద్వారా 35 వేల ఎకరాలకు నీరిస్తానని చెప్పి పన్నెండేళ్లు గడిచినా 2000 ఎకరాలకు మాత్రమే నీరు అందిందని అన్నారు. జలయజ్ఞం పేరుతో దోచుకున్నారని విమర్శించారు.

ఈ ఎన్నికల్లో గెలిచేది టీఆర్‌ఎస్‌అన్న ఆయన.. ఏడాదిలో కేసీఆర్ దెబ్బ ఏంటో చూపిస్తానన్నారు. ‘ఆర్డీఎస్ కింద 87,500ఎకరాలకు నేను దగ్గరుండి నీరు పారిస్తా. ఎవడు అడ్డొస్తాడో చూస్తా’ అని ఆగ్రహంగా అన్నారు. గుర్రంగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మాణాన్ని ఏర్పాటు చేసి వనపర్తి, కొల్లాపూర్, గద్వాల తదితర ప్రాంతాలకు నీరు పారిస్తానన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. ఈ పథకం కింద కొందుర్గు మండలం లక్ష్మిపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తానన్నారు. మన ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 14 లక్షల ఎకరాలకు నీరు పారిస్తామని, మనం వలస వెళ్లకూడదని, మన జిల్లాకే ఇతర ప్రాంతాల వారు వలసలు రావాలన్నారు. మన రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులంటూ ఎవరూ ఉండరని కేసీఆర్ చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం చంద్రబాబు వల్లే వచ్చిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉన్నవారిని రెగ్యులరైజ్ చేస్తామని పునరుద్ఘాటించారు. 55 ఏళ్లుగా సీమాంధ్ర పార్టీలను చూస్తున్నామని, ఎన్నికల సమయంలో మనం మోసపోతే గోస పడక తప్పదన్నారు.

తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే తెలంగాణ జిల్లాలో ఉన్న వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే మొదటి జీవో తీసుకొస్తామన్నారు. ప్రజలు ఈర్ష్య, ద్వేషం, హింసను మర్చిపోవాలని, ప్రేమతో ఉంటే దేనినైనా సాధించవచ్చన్నారు. గద్వాల రాజకీయాలు మారాలని, ఇక్కడ ఫ్యాక్షన్ వ్యవస్థకు స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పంట పొలాలకు నీరందిస్తామన్నారు. ఇక్కడి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కృష్ణమోహన్‌డ్డిని ప్రకటిస్తున్నానని, ఆయనను గెలిపించేందుకు మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కృషి చేయాలని కేసీఆర్ కోరారు. ఆయనను గెలిపిస్తే భీముడికి ఎమ్మెల్సీ ఇస్తానని సభలో కేసీఆర్ ప్రకటించారు. గద్వాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ భార్యను ప్రకటించారు. భీముడి గద, కృష్ణమోహన్ బాణం ఇక్కడి దారిద్య్రం, పేదరికం మీద పోరాటం చేస్తాయన్నారు. మత్స్యకారులను బీసీ-ఏ జాబితాలోకి చేర్చడానికి కృషి చేస్తానన్నారు. మన బతుకులను మనం బాగుపర్చుకోవాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అధిక శాతంలో గెల్చుకోవాలన్నారు. దళితుల అభివృద్ధి కోసం రూ. 50వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రతి ఏడాది ప్రతి జిల్లాకు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు రాజకీయాల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. అలాగే ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు వారికి 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించడంతోపాటు మున్సిపాలిటీని గెల్చుకుంటే గద్వాల అభివృద్ధికి మరిన్ని నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు, ఎంపీ మందా జగన్నాథం, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు జితేందర్‌డ్డి, లక్ష్మారెడ్డి, నిరంజన్‌డ్డి, ఇబ్రహీం, మర్రి జనార్దన్‌డ్డి, జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావుఆర్య తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.