-వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నివాళులు -తెలంగాణభవన్‌లో జయశంకర్ విగ్రహానికి పుష్పాంజలి -తెలంగాణభవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి -నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ -కొత్త జిల్లాకు జయశంకర్‌సార్ పేరు: మంత్రి కేటీఆర్

తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి కృషిచేసిన ప్రొఫెసర్ జయశంకర్.. తెలంగాణ జాతి యావత్ కలకాలం గుర్తుంచుకునే మహోన్నత వ్యక్తి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ నాలుగోవర్ధంతి సందర్భగా ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులు అర్పించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కలిగే లాభాలను కూడా ప్రొఫెసర్ జయశంకర్ విడమరిచి చెప్పారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరుగుతున్న అభివృద్ధి ఆయన ఆత్మకు శాంతి చేకూరుస్తుందని పేర్కొన్నారు. జయశంకర్ స్పూర్తితో పనిచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ నాలుగో వర్ధంతిని తెలంగాణభవన్‌లో ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉదయం తెలంగాణభవన్‌కు విచ్చేసి.. తొలుత భవన్ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జయశంకర్‌సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కే తారకరామారావు, నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, జోగు రామన్న, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, బీ వెంకటేశ్వర్లు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, వీ ప్రకాశ్ నివాళులర్పించారు.
జయశంకర్‌సార్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు..: మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల్లో వరంగల్ పరిధిలోని కొత్త జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించాలనే ఆశయం కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి జయశంకర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సంవత్సర కాలంలో ఎప్పుడు, ఏ ఆనంద సమయం వచ్చినా కచ్చితంగా ఆయనను స్మరించుకుంటున్నామని చెప్పారు.
సార్ యాదిలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ పేరు కూడా పెట్టామన్నారు. జయశంకర్ బతికి ఉన్నంత కాలం ఎప్పుడూ.. ఏదైనా శాసించి సాధించాలేగానీ యాచించి కాదనేవారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆయన చూపిన బాటలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్.. తెలంగాణ రాజకీయ వ్యవస్థను శాసించి ముందుకు పోతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, జయశంకర్ ఆశయాలకు అనుగుణంగానే అభివృద్ధి చెందుతున్నందున ఆయన ఆత్మ శాంతిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఓటుకు నోటు వ్యవహారాన్ని విలేకరులు ప్రస్తావించినపుడు.. ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చట్టానికి అనుగుణంగానే వ్యవహరిస్తుందన్నారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ… ప్రొఫెసర్ జయశంకర్‌ను ఎవరూ మరచిపోలేరని, ప్రాధాన్యం ఉన్న ప్రాంతంలో సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.
జయశంకర్ ఆశయాలే దిక్సూచి -ప్రభుత్వాన్ని నడపడంలో కేసీఆర్ రాటుదేలారు -హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగానే టీఆర్ఎస్ మ్యానిఫెస్టోను రూపొందించామని, ఆయన ఆలోచనలు, ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. జయశంకర్ నాలుగో వర్ధంతి సందర్భంగా తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయనకు నివాళులర్పించిన అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి నాయిని మాట్లాడారు. టీఆర్ఎస్కు, తెలంగాణ ఉద్యమానికి జయశంకర్‌సార్ మార్గనిర్దేశం చేశారని, ఉపాధ్యాయుడి నుంచి ప్రొఫెసర్‌గా ఎదిగిన గొప్ప వ్యక్తి ఆయన అని కొనియాడారు. జయశంకర్ ఆలోచనలు టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వానికి దిక్సూచి లాంటివన్నారు.
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను ఎన్నింటినో అమలు చేస్తుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అంటే సీఎం కేసీఆర్‌కు అమితమైన గౌరవమని, కేసీఆర్ ఆయనను గురువుగా భావించి పాదాభివందనం చేసేవారని నాయిని పేర్కొన్నారు. జయశంకర్ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో పాలన చూస్తుంటే.. కేసీఆర్ ఉద్యమాన్ని నడపడంలోనే కాకుండా ప్రభుత్వాన్ని నడపడంలోనూ రాటుదేలినట్లుగా స్పష్టమవుతుందన్నారు.