-పనిలేకుంటే మరో శాఖలోకి వెళ్లండి -భూగర్భజల విభాగం ఇంజినీర్ల పనితీరుపై మంత్రి హరీశ్‌రావు అసంతృప్తి -ఫ్రెండ్లీ గవర్నమెంట్‌లో టీంవర్క్‌గా పనిచేద్దామని పిలుపు

భూగర్భజల విభాగం ఇంజినీర్ల పనితీరుపై మంత్రి హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విభాగంలో పని లేకపోతే మరో విభాగానికి వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అందరం కలిసి టీంవర్క్‌గా పనిచేసి రైతుల ఇబ్బందులను తొలగిద్దామని పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని చింతల్‌బస్తీలో భూగర్భజల విభాగం పనులు, పథకాలపై మంత్రి రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఏడుగురు అసిస్టెంట్ ఇంజినీర్లు (మెకానికల్ ఇంజినీర్లు) ఏం పని చేస్తున్నారు? వీళ్లు చేసే పని జియాలజిస్ట్, జియోఫిజిస్ట్, హైడ్రాలజిస్ట్‌లు చేస్తారు కదా.. ఎందుకు ఈ శాఖలో ఉన్నారు? ఈ శాఖలో పని లేనప్పుడు జీహెచ్‌ఎంసీకి, ఇరిగేషన్‌శాఖకు వెళ్లి పని చేయొచ్చుగా.. సీనియర్ అధికారులకు చేతినిండా పని ఉండాలే కానీ ఇలా ఖాళీగా కూర్చొంటూ జీతాలు తీసుకుంటున్నామంటే ఎలా? నీటి వనరులను అభివృద్ధి చేసుకోకుంటే ఎందుకు? రాష్ట్రం గుక్కెడు నీటికోసం అల్లాడుతుంటే కీలకమైనశాఖలో ఉండి మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? ఇది మంచి పద్ధతి కాదు అని అన్నారు.
శాఖకు ఇచ్చే బడ్జెట్ ఉద్యోగుల జీతాలు, ల్యాబ్‌లకే పరిమితం చేయడం విడ్డూరమన్నారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని మాటల్లోనే కాకుండా చేతల్లో చూపించామని, కొత్త రాష్ట్రంలో అందరం టీంవర్క్‌గా పనిచేసి అటు రైతులకు, ఇటు ప్రజలకు నీటి కష్టాలు తీర్చుదామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఇకనుంచి పనితీరులో మార్పు కనిపించాలని సూచించారు. ఈ శాఖలో మెకానికల్ ఇంజినీర్లకు పెద్దగా పనిలేనట్లు తెలుస్తున్నదని, శాఖలోని మూడు విభాగాల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు.. ఇంకా ఎంతమంది అవసరం.. పని లేకుండా ఉన్నవారిని ఏం చేద్దాం.. అన్న అంశాలపై ముగ్గురుతో కలిసి కమిటీ వేసుకుని, రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు.
శాఖలో ఉద్యోగులకు హక్కులు, సమస్యలు ఎలా పరిష్కారించాలో.. అంతేస్థాయిలో శిక్షలు ఎలా ఉండాలన్నదానిపై నివేదికలో పొందుపర్చాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, రాష్ట్రంలో అత్యధిక బోరు బావులున్న గ్రామాలను గుర్తించి అక్కడ వాటర్‌షెడ్‌లు, చెక్‌డ్యాంలను నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, ఖమ్మం, భువనగిరి, సిద్దిపేట, గజ్వేల్ లాంటి ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉంటుందని, ఇటువంటి ప్రాంతాల్లో 600-700మీటర్లకు వెళితే కానీ బోరు పడే పరిస్థితి ఉండదని, అంతలోతున పడే నీళ్లతోనూ ప్రమాదం ఉండే అవకాశం ఉందని, ఈ విషయంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న దిశగా ప్రణాళికలు రూపొందించాలని భూగర్భజల శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని వెల్లడించారు. హైడ్రాలిక్-3 ప్రాజెక్టు కింద రూ.240కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రి ఉమాభారతిని కోరామని, ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్‌లో భూగర్భజలశాఖకు అధికశాతం నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూగర్భజలశాఖ డైరెక్టర్ సాంబయ్య, పది జిల్లాల డిప్యూటీ డైరెక్టర్లు, ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీవో నగరశాఖ అధ్యక్షుడు నర్సింహులు, భూగర్భజల శాఖ టీఎన్జీవో సెంట్రల్‌ఫోరం అధ్యక్షుడు మున్నూరు అంజయ్య, టీజీవో సెంట్రల్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సలీముద్దీన్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావును సన్మానించారు.