Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జీవధారల తెలంగాణ

-వచ్చే ఏడాదికి ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పూర్తిచేస్తాం – కాళేశ్వరం నీళ్లతో శ్రీరాంసాగర్ నింపుతాం – ఆరునూరైనా 45 లక్షల ఆయకట్టుకు సాగునీరందిస్తాం – ఈ కట్టపై నాటి ఆవేదనే నా రాష్ట్రసాధన ఉద్యమం – నేడు సొంత రాష్ట్రంలో ఎస్సారెస్పీ పునర్జీవ పథకం – జన్మధన్యమైందన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు – తాను మోతె గ్రామం పెట్టిన మొగ్గ అని వ్యాఖ్య -ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పైలాన్ ఆవిష్కరించిన సీఎం -స్వయంగా మట్టి తవ్వి పనులకు ప్రారంభం -ప్రాజెక్టులు అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ను నిలదీయండి -కాంగ్రెస్ దుర్నీతికి నిదర్శనం కొండపోచమ్మపై కేసులు -4600 ఎకరాల భూసేకరణకు 90 ఎకరాలు ఆపారు -సినిమా షూటింగ్‌లు జరిగేలా ఎస్సారెస్పీని తీర్చిదిద్దుతాం -భవిష్యత్తులో ప్రాజెక్టు నుంచి బాసరకు లాంచీ -ఆడబిడ్డలకు వడ్డీలేని రుణాల ప్రతిపాదనను పరిశీలిస్తాం -పోచంపాడ్ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మరో సువర్ణాధ్యాయం పుటలు తెరుచుకున్నది. యావత్ తెలంగాణ లోని కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పంలో ఒకే ప్రాజెక్టు నుంచి దాదాపు 40-45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర లక్ష్యానికి నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ వద్ద అంకురార్పణ జరిగింది. ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఆచరణలో కూడా అద్భుత వనరుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన పునర్జీవ పథకానికి లక్షలమంది రైతులు, ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం శంకుస్థాపన చేశారు. రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ సాధన ఉద్యమానికి తనను పురికొల్పిన ఎస్సారెస్పీ కట్టపైనే రాష్ట్ర సాధన ఫలితాన్ని చాటిన ముఖ్యమంత్రి.. ఏడాదిలోపు పూర్తయ్యే ఈ పథకం సృష్టించే నాలుగు జలధారలతో తెలంగాణ రైతు మొగులుకు ముఖం పెట్టి చూడాల్సిన దుస్థితి తొలిగిపోనుందని ప్రకటించారు!

తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి న్యాయంచేస్తానని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కట్ట మీద 1996లో చెప్పిన తాను.. ఇప్పుడు సాధించుకున్న రాష్ట్రంలో సీఎం హోదాలో ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి శంకుస్థాపన చేశానని, దీనితో తన జన్మధన్యమైందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లో గురువారం ఆయన శంకుస్థాపనచేశారు. స్వయంగా మట్టి తవ్వి.. పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తనలాంటి అదృష్టవంతులు చాలా తక్కువమంది ఉంటారన్న సీఎం.. తనకంటే గొప్ప అదృష్టవంతులు ఈ భూమ్మీద ఉండరని సంతోషాన్ని వ్యక్తంచేశారు. రెండు, మూడు నెలలు అటుఇటుగా వచ్చే ఏడాది ఎస్సారెస్పీని కాళేశ్వరం నీళ్లతోటి నింపడం ఖాయమని ప్రకటించారు. 40- 45 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పారు. ఒక్కసారి ఎస్సారెస్పీ నింపుకొన్నమంటె ఇటు నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల అటు జగిత్యాల రైతాంగానికి రెండు పంటలు పండించుకునే అదృష్టం వస్తదన్నారు. ప్రజల ఆశీర్వాదం, అండదండలు ఉన్నంతకాలం బ్రహ్మాండంగా ముందుకుపోతామన్న ఆయన.. సాగునీటి ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఇలా సాగింది.

తెలంగాణతోటే పునర్నిర్మాణం ————————– 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత జల సాధన ఉద్యమం చేసినం. అందులో నేను మాట్లాడిన క్యాసెట్‌లో ఇచ్చంపల్లి ఇచ్చగానిపల్లి పాల్జేసినారు.. నిజాంసాగర్ ఒట్టిపోయింది.. మెదక్ జిల్లా ఘనపురం నాశనమైంది.. అప్పర్ మానేరు అడుగంటింది.. డిండిలో బండలు తేలినయి.. కోయిల్‌సాగర్‌ను కొంగలెత్తుకుపోయినయి.. చెరువులన్నీ తాంబాళాలై నాశనమైపోయినవి అని చెప్పిన. పదిహేనేండ్ల సుదీర్ఘ పోరాటంలో అనేక బలిదానాలు, జైళ్లు, లాఠీలు, తూటాలు, కేసులు అనేక ఇబ్బందుల తర్వాత తెలంగాణ సాధించుకున్నం. తెలంగాణ వచ్చే నాటికి పరిస్థితి చూస్తే.. తెలంగాణకు ఇచ్చినం, తెలంగాణకు చేస్తం అని చెప్పినవన్నీ కూడా మోసపూరిత ప్రాజెక్టులు. మనకు నీళ్లు వచ్చేవి కావు, తెచ్చేవి కావు. నీళ్లిచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్టులు కావు. దానికోసం మొదటి దశలో చెరువులన్నీ బాగు చేసుకుందామని సంకల్పించాం. సులభంగా చేసుకునేది, డిజైన్లు అవసరంలేనిది కాబట్టి మిషన్ కాకతీయ రూపంలో ఆ కార్యక్రమాన్ని ముమ్మరంగా ప్రారంభం చేసుకున్నం. ఒక ఆర్నెల్లు, ఎనిమిది నెలలు అవిరళమైన కృషిచేసి, రాత్రింబవళ్లు కష్టపడి, గోదావరి, కృష్ణా నదులనుంచి ఏ రకంగా నీళ్లు తీసుకోవాల్నో ఆలోచన చేసినం.

ఇదే కట్ట మీద చెప్పిన.. ——————– నిర్మల్ నియోజకవర్గంలో 1996లో ఒక ఉపఎన్నిక జరిగింది. మిత్రుడు వేణుగోపాలాచారి కేంద్రమంత్రి అయినందున ఆనాడు రాజీనామా చేస్తే వచ్చిన ఆ ఉపఎన్నికలో అభ్యర్థిని గెలిపించడానికి నేను, ఇప్పటి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిర్మల్‌కు వచ్చినం. ఒకరోజు సమయం దొరికినపుడు మన ప్రాజెక్టు అనే ప్రేమతో నిర్మల్ నుంచి ఎస్సారెస్పీ కట్టమీదకొచ్చినం. అక్కడ గేట్లకు గ్రీసు లేదు, ఆయిలింగ్ లేదు. సిలుం పట్టినయి. ప్రాజెక్టు కట్టమీద ఉండే రోడ్డు గజం గజంలోతు గుంతలు. ఒక దగ్గర కూలబడినపుడు చెప్పిన.. ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోయే నాగార్జునసాగర్ వైష్ణవాలయంలాగ ధగధగలాడుతున్నది. ఇది తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి అయ్యకు పట్టది.. అమ్మకు పట్టది.. అందుకే శివాలయంలాగ ఉన్నది అని చెప్పిన. ఆనాడు నాతోపాటు కట్టమీద ఉన్న నిర్మల్ మండలాధ్యక్షుడు సత్యనారాయణగౌడ్‌తో అప్పుడే చెప్పిన.. ఆంధ్రప్రదేశ్ ఉన్నన్ని రోజులు ఎవ్వులంకూడా ఏం జేయలేం.. మన ఖర్మ ఇంతేనని చెప్పిన. గంటసేపు చెప్పిన. మరి ఏమైతది సర్ తెలంగాణ గతి అని ఆయన అడిగిండు. నేను చెప్పిన.. అన్యాయం ఎక్కువైనచోట భగవంతుడు కూడా సహించడు. ప్రజలు అస్సలు సహించరు.. తిరుగుబాటు వస్తది.. మళ్లా తెలంగాణ ఉద్యమం వచ్చి తీరుతదని చెప్పిన. అంతేకాదు.. నేను బతికి ఉంటే, నా ఆరోగ్యం సహకరిస్తే ఈసారి తెలంగాణ ఉద్యమం నేనే ప్రారంభిస్త, నేనే చివరిదాకా కొట్లాడుతానని చెప్పిన. ఇదే శ్రీరాంసాగర్ కట్ట మీద 1996లో నేను స్వయంగా చెప్పిన. ఈ రోజు నిజంగా నా లాంటి అదృష్టవంతులు చాలా తక్కువ మంది ఉంటరు. ఏ శ్రీరాంసాగర్ కట్టమీద నేను ఉద్యమం చేస్త.. తెలంగాణ సాధిస్త.. తెలంగాణకు న్యాయం చేస్త.. అని చెప్పిన్నో.. అదే మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం సాధించి.. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో శ్రీరాంసాగర్ పునర్జీవ పథకానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన.. నా జన్మ ధన్యమైంది.

ఎస్సారెస్పీ బాగు కోసమే ఈ పథకం.. ——————————- ఆంధ్రావాళ్లు ఎన్నడూ మనకు నీళ్లియ్యాలని ఏ ప్రాజెక్టు పెట్టలె. ఎస్సారెస్పీదీ అదే పరిస్థితి. శ్రీరాంసాగర్ 14 లక్షల ఎకరాలకు నీళ్లిస్తమని చెప్తే ఎన్నడూ ఐదున్నర లక్షలు దాటలె. కొస కాల్వలకు పోనేలేదు. అక్కడ చెట్లు మొలిచినయి. నల్లగొండ జిల్లాలో కాల్వలు తవ్వి కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుపోయినరు. కానీ అక్కడికి నీళ్లు పోలె, నీళ్లు కండ్ల చూడలె. పోయినేడాది మనం కష్టపడి కొంతమేర నీళ్లు తీసుకుపోగలిగినం. ఎస్సారెస్పీ ఆయకట్టు బ్రహ్మాండంగా బాగుపడాలె. లక్ష్మీకాల్వ, సరస్వతికాల్వ బ్రహ్మాండంగా బాగుపడాలని పథకం రూపకల్పన చేశాం.

ఇక మొగులు ముఖం చూసేది లేదు… ——————————— ఎస్సారెస్పీలో ఇప్పుడు ఎనిమిది టీఎంసీలు ఉన్నయి. ఈ సంవత్సరం ఒక్క చుక్క నీళ్లు రాలె. ఇదే పరిస్థితి ఉంటె మన గతి ఏం కావాలి? దానికోసం ఆలోచించి బ్రహ్మాండంగా ఈ పథకాన్ని రూపకల్పన చేసినం. అతితక్కువ కాలంలో అంటే సంవత్సరం కాలంలో నీళ్లు తెచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నం. ఇక్కడ ఉన్నది గోదావరే.. కాళేశ్వరం దగ్గర ఉన్నది కూడా గోదావరే. అందుకే కాళేశ్వరం దాటిన తర్వాత మేడిగడ్డ వద్ద ఒక బరాజ్ కట్టుకొని, దాని తర్వాత అనేక బరాజ్‌లద్వారా వరద కాల్వలో నీళ్లు పోసుకొని శ్రీరాంసాగర్ నింపుకొనే కార్యక్రమాన్ని చేపడుతున్నం. ఎస్సారెస్పీలో ఎనిమిది టీఎంసీలు గతంలోనివే ఉంటే ఈ సంవత్సరం ఒక్క టీఎంసీ రాలేదు. కానీ కాళేశ్వరం మేడిగడ్డ వద్ద జూన్‌లో వర్షాకాలం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు 250 టీఎంసీల నీళ్లు గంగలో కలిసిపోయినయి.. సముద్రానికి పోయినయి. అదే.. సిస్టం తయారై ఉంటే మనం శ్రీరాంసాగర్ నింపుకొనేవాళ్లం. మొగులుకు ముఖం చూసేవాళ్లం కాదు. మొట్టమొదట నేను నిజామాబాద్ వచ్చినప్పుడు నన్ను మొగ్గ తొడిగి ఇచ్చింది మోతె. వాళ్లిచ్చిన ధైర్యంతోనే పోయినం. ఆనాడు మోతెలో మట్టి ముడుపుగట్టుకోని పోయి, మళ్లీ తెలంగాణ సాధించి, అదే మోతె మట్టిని మళ్లీ తీసుకెళ్లి గ్రామస్థులకు అప్పగించిన. అట్ల జరిగిన ఉద్యమంలో ఇయ్యాల బ్రహ్మాండంగా మనం ముందుకు పోతాఉన్నం. వచ్చే సంవత్సరంనాటికి రెండు మూడు నెలలు అటూఇటూ కావచ్చు.. కానీ.. ఎస్సారెస్పీని కాళేశ్వరం నీటితో నింపడం ఖాయం. మీ బిడ్డగా నేను ఆ పని చేసి చూపిస్త. ఒక్కసారి ఎస్సారెస్పీని నింపుకొన్నమంటే ఇటు నిజామాబాద్ జిల్లాగానీ, నిర్మల్ జిల్లాగానీ, కిందికి మంచిర్యాల జిల్లా, జగిత్యాల జిల్లా రైతాంగానికి రెండు పంటలు పండించుకునే అదృష్టం వస్తది. బ్రహ్మాండంగా పంటలు పండిచుకొని ముందుకు పోతం.

అన్యాయాన్ని సరిచేస్తున్నం.. ———————— ఎస్సారెస్పీకి జవహర్‌లాల్ నెహ్రూ పునాది రాయి వేసి 54 ఏడ్లు గడిచిపోయింది. నాగార్జునసాగర్ మొదలుపెట్టంగనే 12 ఏండ్లలో పూర్తిచేసినరు. నెహ్రూ శంకుస్థాపనచేస్తే ఇందిరాగాంధీ ప్రారంభించినరు. కానీ 54 ఏండ్ల తర్వాతకూడా ఎస్సారెస్పీ స్టేజ్-1, 2 కంప్లీట్ కాదు. స్టేజ్-3కి పోయే పరిస్థితి లేదు. వరద కాల్వ దుస్థితి అట్లనే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ తెచ్చుకున్నం. వీటన్నింటినీ ఆగమేఘాల మీద పూర్తిచేసి నీళ్లియ్యాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నం. శ్రీరాంసాగర్ నింపే పరిస్థితి.. చాలామందికి దానిపై అవగాహన లేదు. ఎప్పుడో జూన్‌లోనో జూలైలోనో నింపుకోవడం కాదు.. రాబోయే రోజుల్లో ఒక్కసారి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్‌లు పూర్తయితే ఎస్సారెస్పీని మే నెలకు ముందే.. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే పూర్తిస్థాయిలో 90 టీఎంసీలు నింపి పెట్టుకుంటం. మొగులుకు మనం ముఖం పెట్టి చూసే అవసరం ఉండదు. అందరూ లాభపడతరు. బాల్కొండ, మెట్‌పల్లి, వేములవాడ, కొంత మానకొండూరు నియోజకవర్గాల నుంచి పోయే వరద కాల్వ 110 కిలోమీటర్ల దూరం 365 రోజులూ నిండుగా ఉంటది. దాని ద్వారా అద్భుతమైన చేపలు పెరుగతయి.. చెట్లు, గడ్డి పెరుగుతుంది. నేలలో తేమశాతం పెరుగుతది. ఒక అపురూపమైనటువంటి దృశ్యాన్ని చూడబోతున్నాం.

వచ్చే యాసంగి నుంచి 24 గంటల కరెంటు.. ———————————— టీడీపీ, కాంగ్రెస్ 30 ఏండ్లు మనల్ని కరెంటుకోసం ఏడిపించినయి. మాట్లాడితే మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయేవి. ఎన్ని బాధలు పడ్డమో మీరందరు చూసినరు. కానీ ఇప్పుడు కరెంటు బాధల్లేవు. మొండిపట్టు పట్టి, రాత్రింబవళ్లు పనిచేసి కరెంటు బాధలు లేకుండ చేసుకున్నం. ఇయ్యాల మోటరు కాల్తలేదు, ట్రాన్స్‌ఫార్మరు కాల్తలేదు. రేపు యాసంగి నుంచి 24 గంటల కరెంటు ఇయ్యబోతున్నం. మూడు జిల్లాల్లో ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఇస్తున్నరు. వచ్చే యాసంగినుంచి అంతటా 24 గంటల త్రీఫేజ్ కరెంటు ఇస్తం. ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు, కృష్ణాపై పాలమూరు-రంగారెడ్డితో తెలంగాణను సస్యశ్యామలం చేస్తం. ఎస్సారెస్పీ ద్వారా 40-45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు మడమ తిప్పకుండా ప్రయత్నం చేస్తం.

ఎస్సారెస్పీలో ఇప్పుడు ఎనిమిది టీఎంసీలు ఉన్నయి. ఈ సంవత్సరం ఒక్క చుక్క రాలె. ఇదే పరిస్థితి ఉంటె మన గతి ఏం కావాలె? దానికోసం బ్రహ్మాండంగా ఆలోచించి సంవత్సర కాలంలో నీళ్లు తెచ్చే ప్లాన్ చేసినం. ఇక్కడ ఉన్నది గోదావరే.. కాళేశ్వరం దగ్గర ఉన్నది కూడా గోదావరే. అందుకే కాళేశ్వరం దాటిన తర్వాత మేడిగడ్డ వద్ద ఒక బరాజ్ కట్టుకొని, దాని తర్వాత అనేక బరాజ్‌ల ద్వారా వరద కాల్వలో నీళ్లు పోసుకొని శ్రీరాంసాగర్ నింపుకొనే కార్యక్రమాన్ని చేపడుతున్నం.కొట్లాట నా ఒక్కనిదే కాదు. ప్రభుత్వానిది మాత్రమే కాదు. మనందరి తెలంగాణ రైతుల బతుకుదెరువు. ఎందుకు మీరు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నరు? అని ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయాలె. మౌనం పాటిస్తే నష్టపోయే ప్రమాదమున్నది. మీ దురాగతాలు మంచివి కావు.. తెలంగాణను అభివృద్ధి కానీయండి.. ప్రాజెక్టులు రానీయండి అని కాంగ్రెస్ నాయకులకు చెప్పండి.

ఉత్తర తెలంగాణలో నాలుగు జీవధారలు.. ———————————– హైదరాబాద్ నుంచి ఉత్తరం వైపు నిలబడి ఉత్తర తెలంగాణ చూస్తే ఏం తెలంగాణ తయారుకాబోతున్నదో తెలుస్తది. హైదరాబాద్ నుంచి ఉత్తరంవైపు చూస్తే ఆదిలాబాద్ జిల్లా కనబడుతది. కాశ్మీర్‌లాగ ఉండే పాత ఆదిలాబాద్ ఇప్పుడు నాలుగు జిల్లాలైంది. ఆ జిల్లాలో భగవంతుడు ఇచ్చిన 12 ఇంచుల వర్షపాతం ఉంది. సుద్దవాగు, స్వర్ణవాగు, మట్టివాగు, గొల్లవాగు, నీల్వాయి వాగు వంటివి అనేకం ఉన్నయి. లోయర్ పెనుగంగ ఉంది. అంతకుముందు లోయర్ పెనుగంగ ఇగ వచ్చె, అగ వచ్చె అని మోసం చేసినరు. 35 ఏండ్లు ఓట్లు అడిగినరు.. తప్ప చేయలె. కానీ ఈరోజు ఆదిలాబాద్ మీడియం ఇరిగేషన్ వ్యవస్థను బాగుచేస్తున్నం. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు ఎత్తిపోసి నిర్మల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తం. మంచిర్యాల జిల్లాకు కూడా నీళ్లొస్తయి. అట్ల ఎత్తిపోతలు, వర్షపాతం, వాగులద్వారా ఆదిలాబాద్ జిల్లా ఒక జీవధారగా కనిపిస్తది. -రెండో జలధార.. గోదావరి నది మీద తుపాకులగూడెం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, సదర్‌మాట్ వద్ద బరాజ్‌లు కట్టుకుంటున్నం. గోదావరి నదిలోనే దాదాపు 70-80 టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడవునా నిండి ఉంటయి. 200 కిలోమీటర్ల గోదావరి ఎల్లపుడూ నీటితో నిండి ఉంటది. గోదావరి నది తనకు తానుగా ఒక జీవధారగా ఉంటది. -మూడో జీవధార.. గోదావరిదాటి ముందుకొస్తే వరద కాల్వ. దీనితోటి శ్రీరాంసాగర్, శ్రీరాంసాగర్‌ద్వారా నిజామాబాద్, నిర్మల్, కాకతీయ కాల్వ, లోయర్, మిడ్ మానేరు డ్యాంలు.. ఇలా వరంగల్, మహబూబాబాద్ దాటి సూర్యాపేట, తుంగతుర్తి దాకా ఒక జీవధారగా ఉంటది. -నాలుగో జీవధార.. మిడ్ మానేరు నుంచి పంప్ చేసిన తర్వాత మధ్యలో అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్.. ఆపైకి నింపుకొనే సింగూరు, నిజాంసాగర్, బస్వాపూర్, గంధంమల్ల, హైదరాబాద్‌ను దాదాపు ఆనుకొని నాలుగో జీవధార తయారైతది.

ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ను నిలదీయండి —————————- టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు రావొద్దని ప్రజలకు నీళ్లు రావొద్దనే కాంగ్రెస్ నాయకులు దుర్మార్గాలు చేస్తున్నరు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 96 కేసులు పెట్టినారు. సుందిల్ల కాడ, అన్నారం కాడ, గోలివాడ కాడ, మల్లన్నసాగర్ కాడ, కొండపోచమ్మ కాడ పంచాయితీ! ఇదీ కాంగ్రెసోళ్ల నీతి. ఇదే కాళేశ్వరంలో భాగంగా కొండపోచమ్మ రిజర్వాయర్ కడుతున్నం. అది నేను ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్‌లోకే వస్తది. దానికి 4600 ఎకరాల జాగ అవసరం. రైతాంగం ముందుకొచ్చి, ధర తీసుకొని 4500 ఎకరాలు ఇచ్చినరు. ఇంకా వందెకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంది. ఆ వందెకరాలు కాంగ్రెస్ ఎంపీపీ, నలుగురు ఆ పార్టీ కార్యకర్తలది. హైదరాబాద్‌లో ఉన్న కాంగ్రెసోళ్లు వాళ్లకు ఫోన్‌చేసి మీరు డబ్బులు తీసుకోవద్దు, ప్రాజెక్టును కానీయొద్దు, మన పార్టీకి లాభం జరుగదు.. అని చెప్పి వాళ్లతో హైకోర్టులో కేసులు వేయించినరు. 4600 ఎకరాల్లో 4510 భూసేకరణ అయిపోయింది.. 90 ఎకరాలు ఆపి ప్రాజెక్టును ఆపాలని ప్రయత్నంచేస్తున్నరు. అడుగడుగునా కోర్టులకు పోవడం.. ఇరువై రోజుల్లోనే ఆరు కేసులు వేసినరు. ఇంటికి ఒక యువకుడిని ఇవ్వండి.. తెలంగాణ తెచ్చి చూపిస్త అని 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్ జలదృశ్యంలో చెప్పిన. తెలంగాణ తెచ్చియ్యకున్నా, ఉద్యమాన్ని ఆపి వెనుకకు పోయినా.. నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ సాధించి మీ ముందు పెట్టిన. ఈరోజు మళ్లీ మనవి చేస్తున్న.. కొట్లాట నా ఒక్కనిదే కాదు. ప్రభుత్వానిది మాత్రమే కాదు. మనందరి తెలంగాణ రైతుల బతుకుదెరువు. ఎందుకు మీరు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నరు? అని ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. మౌనం పాటిస్తే నష్టపోయే ప్రమాదమున్నది. మీ దురాగతాలు మంచివి కావు.. తెలంగాణను అభివృద్ధి కానీయండి.. ప్రాజెక్టులు రానీయండి అని కాంగ్రెస్ నాయకులకు చెప్పండి.

పునర్జీవానికి కర్త కర్మ క్రియ.. కేసీఆరే -ఇది ఉత్తర తెలంగాణ రైతాంగానికి ఊపిరి పోసే ప్రాజెక్టు -12 నెలల్లో ప్రాజెక్టు పూర్తిచేసి ప్రజల రుణం తీర్చుకుంటాం -నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి కర్త, కర్మ, క్రియ.. అన్నీ ముఖ్యమంత్రి కేసీఆరేనని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అభివర్ణించారు. ఒక సీఎంగానే కాకుండా, రైతుగా, ఇంజినీర్‌గా, ఉద్యమకారుడిగా కేసీఆర్ ఆలోచించి, ఈ పథకానికి రూపకల్పన చేశారని, జీవంపోశారని చెప్పారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే ఏమొస్తదని కొంతమంది అన్నారు. తెలంగాణ వచ్చింది గనుకనే ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని అయిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకం రూపొందించాగలిగాం. ఉత్తర తెలంగాణ రైతాంగం ఊపిరి నిలిపేది ఎస్సారెస్పీ పునర్జీవ పథకం అని చెప్పారు. ఒక ఊరు, ఒక ఇల్లు మునుగకుండా, అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా రూపొందించడం ఈ పథకం ప్రత్యేకతని హరీశ్ అన్నారు. ఆంధ్ర ప్రాంతంలో ధవళేశ్వరంవద్ద అనకట్ట నీళ్లు ఇచ్చుకున్నారు. కృష్ణాపై బరాజ్ నిర్మించారు, సుంకేశుల వద్ద బరాజ్ కట్టి, కేసీ కెనాల్‌కు నీరందిస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఆదిలాబాద్ జిల్లాలో సదర్‌మాట్ ఆనికట్‌పై బరాజ్ నిర్మించారు ఆ రైతాంగాన్ని ఆదుకున్నారు. పోచంపాడ్‌ద్వారా వరద కాల్వనే రిజర్వాయర్‌గా మార్చి, రెండు పంటలకు నీళ్లు అందించేలా చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమకాల్వద్వారా ఖమ్మంజిల్లా ఆయకట్టుకు నీరందించేలా సీతారామ ఎత్తిపోతల నిర్మించారు.

ఆర్డీఎస్ ఆయకట్టుకు ఏండ్లతరబడి నీళ్లు రాలేదు.. అయినా గత కాంగ్రెస్ పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ సీఎం కేసీఆర్ ఆ రైతుల గురించి ఆలోచించి, తుమ్మిళ్ల ఎత్తిపోతలను చేపట్టారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ నాయకులే కదా పాలించింది.. కృష్ణా, గోదావరి నదిపై కట్టిన ప్రాజెక్టుల గురించి ఆలోచించారా? పైగా ఇంత చక్కటి ప్రాజెక్టును కేసీఆర్ రూపొందించి, రీడిజైన్‌ద్వారా సస్యశ్యామలం చేయాలని ఆలోచించడం కాంగ్రెస్ నాయకులకు రుచించడం లేదు. ఈ ప్రాజెక్టును ప్రజలు మెచ్చారు కాబట్టే 40 డిగ్రీల మండుటెండలోనూ తరలివచ్చారు. ఇదే సాక్ష్యం. తమ బతుకులు బాగుపడుతాయని, బాధలు తప్పుతాయని ప్రజలు ఆలోచిస్తున్నారు. గోదావరి నీళ్లతో ఎస్సారెస్పీద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంచేస్తాం. దానికి మీరే సాక్ష్యం. సీఎం కేసీఆర్ మాకు ఒకటే ఆదేశం ఇచ్చారు.. మూడు షిఫ్ట్‌లు పనిచేయాలని, రాత్రింబవళ్లు ఉద్యమస్ఫూర్తితో పనిచేసి, కాళేశ్వరం, పునర్జీవ పథకం పూర్తిచేయాలని ఆదేశించారు. ఆయన ఆదేశం మేరకు 12 నెలల్లో పూర్తిచేస్తాం. వారి ఆదేశాలు మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తాం. ఏడాదిలో ప్రాజెక్టును పూర్తిచేసి, ప్రజల రుణం తీర్చుకుంటాం అని హరీశ్‌రావు చెప్పారు. లాంచీపై బాసరకు.. బాసర అమ్మవారి దగ్గరికి పోవాలంటే బ్రిడ్జి దాటి పోవాలె. చాలా దూరం పోవాలి. కానీ ఎస్సారెస్పీలో 365 రోజులూ నీళ్లు ఉంటయి కాబట్టి ఇక్కడినుంచే లాంచీమీద పోయేలా భవిష్యత్తులో ఏర్పాటయితది. నేను 1996లో చూసిన లెక్కనే ఇప్పుడు పరిస్థితి ఉన్నది. ఎస్సారెస్పీ ఒక పోరంబోకు ప్రాజెక్టు. దీనిని అద్భుతంగ పెట్టుకోవచ్చు. ఇక్కడ వందల కోట్లు మంజూరుచేసి, అద్భుత పర్యాటక కేంద్రంగా మార్చాలి. సినిమావాళ్లు ఇక్కడ షూటింగులు చేసుకునేటట్లు తీర్చిదిద్దాలి. దీనిపై ఇప్పుడే గెస్ట్ హౌజ్‌లో అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. శ్రీరాంసాగర్ వరద కాల్వ ఒక వరప్రదాయినిగా తయారుకాబోతున్నది. దాదాపు 46 గ్రామాలు సస్యశ్యామలం అవుతయి. కాకతీయ-వరద కాల్వ మధ్య ఉండే జాగా అంతా నీళ్లు వస్తయి. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు. తాగు, సాగునీటికి శాశ్వతంగా ప్రయోజనం నెరవేరడానికి సిన్సియర్‌గా ప్రయత్నం చేస్తున్నం. ఆడబిడ్డలకు వడ్డీలేని రుణాలు ఇయ్యాలని మంత్రులు చెప్పినరు.. కచ్చితంగా దానిని సానుభూతితో పరిశీలిస్తం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.