Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జిల్లా కమిటీల ఎన్నికలకు టీఆర్‌ఎస్ సిద్ధం

-15, 16 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు -ఎన్నికల అధికారులుగా రాష్ట్ర మంత్రులు -15న ఆదిలాబాద్ తూర్పు, ఆదిలాబాద్ పశ్చిమ, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి ఎన్నిక -16న మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ ఎన్నిక -జూన్, జూలైలో విద్యార్థి విభాగం ఎన్నికలు

TRS

జిల్లా కమిటీల ఎన్నికలకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లా కమిటీల ఎన్నిక జరుగుతుందని పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జి పర్యాద కృష్ణమూర్తి ప్రకటించారు. ఒక్కో రోజు ఐదేసి జిల్లాల చొప్పున రెండు రోజుల్లో అన్ని జిల్లాల్లో పన్నెండు జిల్లా కార్యవర్గ, అనుబంధ సంఘాల ఎన్నికలను పూర్తి చేస్తామని తెలిపారు.

ఎన్నికల అధికారులుగా రాష్ట్ర మంత్రులు వ్యవహరించనున్నారని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈనెల 15న ఆదిలాబాద్ తూర్పు, ఆదిలాబాద్ పశ్చిమ, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో, 16న మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని కృష్ణమూర్తి తెలిపారు. ఆదిలాబాద్ పశ్చిమ ఎన్నికలకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆదిలాబాద్ తూర్పునకు ఎంపీ బూర నర్సయ్యగౌడ్, కరీంనగర్‌కు హరీష్‌రావు, నల్లగొండకు జూపల్లి కృష్ణారావు, ఖమ్మంకు పద్మారావు, రంగారెడ్డికి నాయిని నర్సింహారెడ్డి, మెదక్‌కు ఇంద్రకరణ్‌రెడ్డి, నిజామాబాద్‌కు తుమ్మల నాగేశ్వర్‌రావు, హైదరాబాద్‌కు మహేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌కు ఈటెల రాజేందర్, వరంగల్ పట్టణ, గ్రామీణకు జగదీశ్‌రెడ్డి ఎన్నికల అధికారులగా వ్యవహరిస్తారన్నారు.

సాధారణ సభ ద్వారా ఎన్నికలు… జిల్లా కార్యవర్గ ఎన్నికలను సాధారణ సభ ద్వారా నిర్వహించాలని నిర్ణయించామని పర్యాద కృష్ణమూర్తి తెలిపారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పాల సరఫరా సహకార సంస్థల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి ప్రభుత్వ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, మండలస్థాయి నుంచి ఆపై ఏదేని ప్రభుత్వ సంస్థలు లేదా పార్టీ పదవుల్లో ఉన్నవారు, మాజీలు సాధారణ సభలో సభ్యులు కొనసాగుతారని వివరించారు.

ఎన్నికల్లో భాగంగా ముందుగా కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారని తెలిపారు. సాధారణ సభ్యులు నలుగురు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళలు ఇద్దరు చొప్పున ఎన్నుకుంటారని తెలిపారు. వీరంతా పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారై ఉండాలని తెలిపారు. ఈ ప్రక్రియ తర్వాత జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని చెప్పారు. ఒక్కో పదవికి విడివిడిగా నామినేషన్లు స్వీకరించి… నిర్ణీత వ్యవధులు నిర్ణయించి ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలన్నారు. జిల్లా కార్యవర్గంతో పాటు అనుబంధంగా రైతు, యువత, మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కార్మిక, విద్యార్థి విభాగాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణ తర్వాత ఫలితాలు ప్రకటించి.. రాష్ట్ర కార్యాలయానికి వివరాలు సమర్పించాల్సిందిగా కోరారు.

ఫిబ్రవరిలో మొదలైన ప్రక్రియ… తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రక్రియ ఈ ఏడాది ఫిబ్రవరి మూడో తేదీన కొంపల్లిలోని ఆర్డీ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంతో మొదలైంది. సంస్థాగత నిర్మాణంలో భాగంగా గత నెల 24వ తేదీ నుంచి ఈనెల రెండో తేదీ వరకు గ్రామ, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈనెల ఆరో తేదీ నుంచి 12వ తేదీ వరకు మండల, అనుబంధ కమిటీల ఏర్పాటు కూడా పూర్తయింది.

సీఎం ఆదేశంతో స్పల్ప మార్పులు తొలుత పది జిల్లాలకు సంబంధించి షెడ్యూలు ప్రకటించగా.. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పలు మార్పులు సూచించారు. ఈ మేరకు రాజేశ్వర్‌రెడ్డి ఆ వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్‌లో తూర్పు, పశ్చిమ, వరంగల్ జిల్లాలో పట్టణ, గ్రామీణ జిల్లాలుగా జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో మాత్రం జిల్లా కార్యవర్గ సభ్యుల సంఖ్య 51 ఉంటుందని, అన్ని జిల్లాల్లో 33గా ఉంటుందని చెప్పారు. మహబూబ్‌నగర్‌ లాంటి పెద్ద జిల్లాలో 42 మందిని ఎన్నుకునేందుకు పార్టీ అధినేత వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు.

జిల్లా కార్యవర్గాలతో పాటు అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటారని, విద్యార్థి విభాగాలను మాత్రం జూన్, జులైలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కార్మిక విభాగ ఎన్నికలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో నిర్దిష్ట కార్యాచరణ ప్రకటిస్తామని పల్లా తెలిపారు.

జిల్లా కార్యవర్గ స్వరూపమిది.. జిల్లా కార్యవర్గ ఎన్నికల ప్రక్రియలో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ముగ్గురు కార్యదర్శులు, ముగ్గురు ఆర్గనైజింగ్ కార్యదర్శులు, ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు ప్రచార కార్యదర్శులు, ఒక కార్యాలయ కార్యదర్శి, ఒక కోశాధికారి, 17 మంది కార్యవర్గసభ్యుల ఎన్నిక జరుగుతుందని కృష్ణమూర్తి చెప్పారు.

జిల్లా కార్యవర్గ ఎన్నికలను ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనే వివరాలతో జిల్లా శాఖల ఎన్నికల అధికారి, జిల్లా పరిశీలకులు అందరికీ సమాచార నిమిత్తం ముందుగానే పత్రికాముఖంగా ప్రకటిస్తారని చెప్పారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, ఇతర ముఖ్యులు పార్టీలో ఐక్యతను కాపాడేందుకుగాను సమన్వయం చేసుకొని, సామరస్యపూర్వకంగా ఏకగీవ్ర ఎన్నికలకు కృషి చేయాలన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.