Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జీవ చైతన్య నగరం హైదరాబాద్‌

ప్రపంచపు మేటి నగరాల్లో మన హైదరాబాద్‌ ఒకటిగా నిలవడం గర్వకారణం. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి నిరూపమానం. 2014 నుంచి నేటివరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అమితంగా కష్టపడుతూ.. హైదరాబాద్‌ నగరం అన్నిరంగాల్లో మేటిగా నిలిచేందుకు అద్భుత కౌశలాన్ని ప్రదర్శించారు. ఒక దేశం రాజధానికి కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు హైదరాబాద్‌లో మెండుగా ఉన్నాయి. అటు అభివృద్ధికి, ఇటు ప్రజల జీవనానికి అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనదైన తరహాలో ముందుకు పోతున్నది. అందుకే హైదరాబాద్‌ నివసించడానికి మెరుగైన నగరంగా వివిధ అధ్యయనాల్లో ఎంపికవుతున్నది.

హైదరాబాద్‌ అన్నిరంగాల్లో ముందుకు దూసుకెళ్తూ జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఔషధ రంగానికి రాజధానిగా వెలుగొందుతున్నది. ఫార్మా, లైఫ్‌ సైన్స్‌ రంగాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. జీనోమ్‌ వ్యాలీ, దేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల పార్క్‌, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ హైదరాబాద్‌ ఫార్మాసిటీ వంటి ప్రాజెక్టులతో ఈ నగరం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. కొవిడ్‌-19 వైరస్‌ను నిర్మూలించే మందును కనుగొనడంలో ముందుకు సాగుతున్నది. ప్రపంచంలో తయారయ్యే మొత్తం వ్యాక్సిన్లలో సుమారు 30 శాతానికి పైగా హైదరాబాద్‌ నగరం నుంచే ఉత్పత్తి కావడం తెలంగాణకు గర్వకారణం. భారత్‌ బయోటెక్‌ వంటి కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీలో ముందు వరుసలో ఉన్నాయి.

హైదరాబాద్‌ అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది ఐటీ రంగం. ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి ఐటీ సంస్థలైన గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, సేల్స్‌ ఫోర్స్‌ తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉన్నదో అర్థమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం 2016లో గ్రామీణ, పట్టణ యువతను ప్రోత్సహించే విధంగా ఐటీ పాలసీని రూపుదిద్దింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.66,276 కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటే 2019-20 నాటికి అవి రెట్టింపయ్యాయి. రూ.1,28,807 కోట్లకు ఎగుమతులు పెరిగాయి. కరోనా సమయంలో ఐటీ ఎగుమతుల జాతీయ సగటు 8.09 శాతం ఉంటే తెలంగాణలో 18 శాతం వృద్ధి నమోదైంది.

ప్రభుత్వం తీసుకువచ్చిన పారిశ్రామిక విధానం ఆకర్షణీయంగా మారింది. కేంద్రం ప్రకటించిన సులభతర వాణిజ్యంలో తెలంగాణ ముందుంటున్నది. పరిశ్రమలకు అనుమతులిచ్చేందుకు పూర్తి పారదర్శక, సరళమైన, అవినీతి రహితమైన విధానాలను తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నది. అందుకే తెలంగాణకు పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఐటీ, ఫార్మా, పవర్‌, ప్లాస్టిక్‌, ఇంజినీరింగ్‌, అగ్రోబేస్డ్‌, గ్రానైట్‌ స్టోన్‌ క్రషింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, పేపర్‌, ప్రింటింగ్‌, టెక్స్‌టైల్స్‌, సిమెంట్‌, ఏరోస్పేస్‌, సోలార్‌, ఆటోమొబైల్‌ రంగాలు హైదరాబాద్‌లో విస్తరించాయి. జనవరి 2020 నాటికి రూ.2,04,000 కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి రావడం వెనుకు మంత్రి కేటీఆర్‌ కృషి ఎంతగానో ఉంది. పెట్టుబడుల ఆకర్షణలో దేశవ్యాప్త సగటు వృద్ధిరేటు 20.8 శాతంగా ఉంటే తెలంగాణ 79 శాతం సాధించింది. 2017లో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచస్థాయి పారిశ్రామిక సదస్సు విజయవంతమైంది.

ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడంలోనూ దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఆదర్శంగా నిలుస్తున్నది. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో 12 చోట్ల రూ.448 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. లాక్‌డౌన్‌ కాలాన్ని సద్వినియోగం చేసుకొని రోడ్ల అభివృద్ధి పనులు పూర్తిచేశారు. మంత్రి కేటీఆర్‌ సారథ్యంలో అధికార యంత్రాంగం కదిలివచ్చి హైదరాబాద్‌ నగరాన్ని ముస్తాబు చేస్తున్నది. రహదారులు, పై వంతెనలు, అండర్‌ పాస్‌లు, నాలాల విస్తరణ పనులపై ప్రభుత్వం దృష్టిసారించింది. రూ.23 వేల కోట్లు అంచనా వ్యయంతో వ్యూహాత్మకంగా రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే రూ.3 వేల కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. మరో రూ.4 వేల కోట్ల పనులు ప్రారంభం కానున్నాయి. 54 జంక్షన్లలో ఫ్లై ఓవర్లు నిర్మించి ప్రజల ట్రాఫిక్‌ కష్టాలను తీర్చనున్నారు.

నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి రూ.120 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నాలాలు, రోడ్లు, పార్కులు, ఫుట్‌పాత్‌లు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌ నగరం చుట్టూ మణిహారంలా ఉండే ఔటర్‌ను పచ్చని తోరణంగా మార్చేందుకు ఎన్నో రకాల మొక్కలను నాటారు. వాయు, ధ్వని కాలుష్యాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు. హరితహారంలో భాగంగా నగరమంతా 5 కోట్ల మొక్కలను నాటి పచ్చదనంతో తీర్చిదిద్దారు. మల్టీజెన్‌ థీమ్‌ పార్కులు, 320 పార్కులు, 50 థీమ్‌ పార్కులు, 120 జంక్షన్ల రూపుమారుతున్నది. ప్రజాసమస్యలు తీర్చే దిశగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోనే ప్రజాసమస్యలు తీర్చే దిశగా ప్రభుత్వం రూ.232 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. గతంలో ఏ చిన్న రోగమొచ్చినా.. పెద్దాసుపత్రులకు పరుగులు పెట్టేవారు. బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అవసరమైనచోట, అనువైన ప్రదేశాల్లో కార్పొరేట్‌ దవాఖానలకు దీటుగా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తూ ఆదరాభిమానాలు చూరగొన్నాయి.

హైదరాబాద్‌ నగరం అన్నివర్గాల ప్రజలకు నివాసయోగ్యమైన ప్రాంతంగా అభివృద్ధి చెందింది. హిందూ, ముస్లింలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉంటారని చెప్పడానికి మన హైదరాబాద్‌ నగరాన్ని ఉదాహరణగా చూపించవచ్చు. చార్మినార్‌, గోల్కొండ వంటి చారిత్రత్మాక కట్టడాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడి ప్రజల్లో పరోపకార సేవాగుణం మెండుగా ఉంటుంది. ఇతర నగరాల మాదిరిగా హైదరాబాద్‌ అంటే కేవలం ఓ భౌగోళిక ప్రాంతం కాదు. ప్రజారంజకమైన ప్రాంతానికి దిక్సూచి. హైదరాబాద్‌ మానవ జీవ చైతన్యానికి ప్రతీక.

(వ్యాసకర్త: జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే)
మాగంటి గోపీనాథ్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.