Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జోనల్ వ్యవస్థకు సవరణలు

-జోనల్ వ్యవస్థకు సవరణలు -అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు -కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులివ్వాలి.. నేనే ఢిల్లీ వెళ్తా -కొత్త జిల్లాల ప్రాతిపదికన డీఎస్సీ -ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ -ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్

జోనల్ వ్యవస్థను కొనసాగించటానికే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నది. మారిన పరిస్థితులకు అనుగుణంగా మరికొన్ని జోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. జోనల్ వ్యవస్థలో చేపట్టాల్సిన సమూల మార్పులపై అధ్యయనం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేస్తూ జారీచేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను (371 డీ) సవరించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం కోసం తిరిగి కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. ఉద్యోగ నియామకాలు, జోనల్ వ్యవస్థ, రాష్ట్రపతి ఉత్తర్వులు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కొత్త జిల్లాల ప్రాతిపదికనే ఇవ్వాలని స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీచేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ నియామకాలన్నీ రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే చేపట్టాలన్నారు. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో అధికారుల భవన సముదాయాల నిర్మాణానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11న శంకుస్థాపనలు చేయాలని నిర్ణయించారు.

జిల్లా, స్టేట్ క్యాడర్‌తో ఇబ్బందులే కొత్త ఉద్యోగాల నియామకం ఏ ప్రాతిపదికన జరుగాలి? జోనల్ వ్యవస్థ ఉండాలా? రద్దు చేయాలా? జోన్లు ఉంటే ఎన్ని ఉండాలి? ఎన్ని క్యాడర్లు ఉండాలి? ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు కొత్తగా ఏర్పడిన తెలంగాణకు ఎట్లా అన్వయించుకోవాలి? పదోన్నతుల విషయంలో వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలి? డీఎస్సీ కొత్త జిల్లాల ప్రాతిపదికన వేయాలా? పాత జిల్లాల ప్రాతిపదికనా? తదితర అంశాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు. జోన్ల వ్యవస్థకు స్వస్తిపలికి కేవలం జిల్లా, స్టేట్ క్యాడర్ మాత్రమే ఉంచి నియామకాలు చేపట్టాలా? జోన్ల వ్యవస్థను కొనసాగించాలా? అనే అంశంపై ఉన్నతాధికారులంతా అభిప్రాయాలు వ్యక్తంచేశారు. కేవలం జిల్లా, స్టేట్ క్యాడర్ మాత్రమే ఉండటం వల్ల ప్రయోజనాలకన్నా ఇబ్బందులే ఎక్కువ ఉంటాయని మంత్రులు, అధికారులు ముక్తకంఠంతో అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగార్థులకు, పరిపాలనకు అనువుగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్, స్టేట్ క్యాడర్ పోస్టులు ఉండాలని అభిప్రాయపడ్డారు. అడ్వకేట్ జనరల్, లా సెక్రటరీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. కొత్త జోన్ల ఏర్పాటు అనివార్యమైన నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల స్థానంలో కొత్త ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని అడ్వకేట్ జనరల్ ప్రకాశ్‌రెడ్డి సూచించారు. దీన్ని ముఖ్యమంత్రి సహా మంత్రులు ఆమోదించారు.

మంత్రులు, అధికారులతో కమిటీ ఉమ్మడి రాష్ట్రంలో స్థానికులకు అన్యాయం జరుగవద్దనే ఉద్దేశంతో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు. జోన్ల వ్యవస్థ ఏర్పాటుచేశారు. ఏ జోన్ పరిధిలో ఏ జిల్లాలు వస్తాయో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఇదే పద్ధతిన ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొత్తగా 21 జిల్లాలు వచ్చాయి. రాష్ట్ర స్వరూపం మారింది. పాత జోన్లలోకి ఏ జిల్లాలు (కొత్తవి) వస్తాయో నిర్ధారించాలి. ఇందుకు మంత్రులు, అధికారులతో కూడిన కమిటీని నియమిస్తున్నాం. వారు పూర్తిస్థాయిలో అధ్యయనంచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. కమిటీ సిఫారసుల ఆధారంగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై తీర్మానిస్తుంది. నూతన రాష్ట్రం కోసం కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాలని ప్రతిపాదిస్తాం. నేనే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖతో మాట్లాడి వీలైనంత తొందరలో కొత్త ఉత్తర్వులు వచ్చేలా ప్రయత్నిస్తా అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రతి నియామకం రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, పోస్టింగుల్లో తెలంగాణవారికి తీరని అన్యాయం జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వులున్నా వాటిని అమలు చేయకుండా అక్రమమార్గాలు వెతికారు. రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రాకుండా కొత్త వ్యవస్థలు సృష్టించారు. వారికి అనుకూలంగా నియామకాలు, పదోన్నతులు, పోస్టింగులు ఇచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అలా జరుగటానికి వీలులేదు. ప్రభుత్వం ద్వారా జరిగే ప్రతి నియామకం కచ్చితంగా రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే ఉండాలి. విద్యుత్, సింగరేణి, ఆర్టీసీలాంటి ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాలు కూడా వాటి పరిధిలోకి రావాలి. ఏ క్యాడర్ కింద ఏ పోస్టు ఉన్నదో ముందే స్పష్టంగా తెలియాలి. పదోన్నతుల విషయంలో స్పష్టత రావాలి. దీనిపై సమగ్ర అధ్యయనం జరుగాలి. ఏ పోస్టు ఏ క్యాడర్ కిందకు వస్తుంది? జోనల్ వ్యవస్థ ఎలా ఉండాలి? మల్టీ జోనల్, స్టేట్ లెవల్ పోస్టులను ఎలా నిర్ధారించాలి? తదితర అంశాలను కమిటీ సమగ్రంగా పరిశీలించాలి. అన్నిశాఖల కార్యదర్శులతో, కలెక్టర్లతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ సంఘాలతో కూడా మాట్లాడాలి. కొత్త ఉత్తర్వుల కోసం ఉన్నతమైన విధానాన్ని ప్రతిపాదించాలి. రాష్ట్రపతి కొత్తగా ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా పోస్టులను భర్తీచేయాలి. స్థానికతను నిర్ధారించే విషయంలో కూడా శాస్త్రీయ పద్ధతి కావాలి. కేవలం ఎక్కడ చదువుకున్నారు అనే అంశమే స్థానికతకు ప్రామాణికం కావటం వల్ల సమస్యలు వస్తున్నాయి. కొంతమంది స్థానికులు నష్టపోవాల్సి వస్తున్నది. ఈ విషయంలో కూడా మార్పులు అవసరం. ఇవన్నీ లోతుగా అధ్యయనంచేసి కమిటీ ప్రతిపాదనలు ఇవ్వాలి. కొత్త విధానం రూపొందించాలి. అధికారులు తమ అనుభవాన్ని, పరిణతిని రంగరించి కొత్త విధానానికి రూపకల్పన చేయాలి. వివాదాలకు తావులేని విధంగా కొత్తగా తెచ్చే విధానం భవిష్యత్ తెలంగాణకు బాట చూపాలి అని ముఖ్యమంత్రి సూచించారు.

జిల్లా క్యాడర్ పోస్టులకు కొత్త జిల్లాలే ప్రాతిపదిక జిల్లా క్యాడర్ పోస్టులను కొత్త జిల్లాల ప్రాతిపదికనే నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా కొత్త జిల్లాలవారీగా జారీచేయాలని నిర్ణయించారు. కొత్త జిల్లాలు ఏర్పాటుచేసిందే స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో కాబట్టి, కచ్చితంగా కొత్త జిల్లాల ప్రాతిపదికనే జిల్లా క్యాడర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

కడియం నేతృత్వంలో కమిటీ కొత్తగా జారీచేయాల్సిన రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన ముసాయిదా రూపొందించటానికి, అధ్యయనం చేయటానికి మంత్రులు, అధికారులతో కూడిన కమిటీని ముఖ్యమంత్రి నియమించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా ఉండే కమిటీలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అధర్‌సిన్హా మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మంత్రులు టీ హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఎస్కే జోషి, సురేశ్‌చందా, అజయ్ మిశ్రా, బీఆర్ మీనా, రాజీవ్‌రంజన్ ఆచార్య, డీజీపీ అనురాగ్‌శర్మ సభ్యులుగా ఉంటారు.

11న కొత్త జిల్లా కేంద్రాల్లో శంకుస్థాపనలు కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో అధికారుల కార్యాలయ భవన సముదాయాల నిర్మాణానికి ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా శంకుస్థాపనలు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. నిరుడు అక్టోబర్ 11న దసరా సందర్భంగా కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. తిరిగి అదేరోజు కొత్త జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నారు. 11న సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, మిగిలిన చోట్ల మంత్రులు శంకుస్థాపన చేస్తారు. సూర్యాపేటలో 12న సీఎం కేసీఆర్ కొత్త జిల్లా భవన సముదాయానికి శంకుస్థాపన చేస్తారు.

ఏ జిల్లాలో ఏ మంత్రి.. జనగామ జిల్లా కార్యాలయానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వనపర్తి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, గద్వాలలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి, నాగర్‌కర్నూలులో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆసిఫాబాద్‌లో అటవీశాఖ మంత్రి జోగురామన్న, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మేడ్చల్‌లో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రంగారెడ్డిలో ఎైక్సెజ్‌శాఖ మంత్రి పద్మారావు, వికారాబాద్‌లో రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి, జగిత్యాలలో ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, కామారెడ్డిలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, భూపాలపల్లిలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కొత్త కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేస్తారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.