Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జోన్లకు పచ్చజెండా

-7 జోన్లు, 2 మల్టీ జోన్లతో కొత్త వ్యవస్థ
-పోలీసు వ్యవస్థకు ప్రత్యేక మల్టీ జోన్లు
-ఆమోదముద్రవేసిన రాష్ట్రపతి
-గెజిట్ విడుదలచేసిన కేంద్ర ప్రభుత్వం
-తెలంగాణాకు చారిత్రక విజయం
-రాష్ట్రంలో నవశకానికి నాంది
-ఫలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి
-సాకారమైన తెలంగాణ నిరుద్యోగుల కల
-ఇక 100% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే
-అంతర్ జిల్లాల బదిలీలకూ అవకాశం
-త్వరలోనే కొత్త జోనల్ ఫలాలు

తెలంగాణ రాష్ట్రం నవశకానికి నాంది పలికింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాజనీతిని ప్రదర్శించి ప్రధానమంత్రితో నెరపిన దౌత్యం ఫలించింది. కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను వెలువరించింది. ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్నిశాఖల్లో అమలుపరచాలంటూ తెలంగాణ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇకనుంచి రాష్ట్రంలో నియామకాలన్నీ కొత్త జోనల్ విధానంలోనే జరుగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకొని ఏడు జోన్లను, రెండు మల్టీజోన్లను ఏర్పాటుచేసింది. అలాగే పోలీస్ విభాగానికి ప్రత్యేక జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేసింది. కొత్తజోనల్ వ్యవస్థలో స్థానిక కోటా కింద 95 శాతం, ఓపెన్ కోటా కింద 5 శాతం చొప్పున జరిగే నియామకాల్లో పూర్తిగా 100 శాతం ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకే దక్కనున్నాయి. ఓపెన్ కోటాలోని 5 శాతం ఉద్యోగాలకు కూడా తెలంగాణ నిరుద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు కొత్త జోనల్ వ్యవస్థ అవకాశం కలిగించింది. సమైక్య రాష్ట్రంలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘ కసరత్తుచేసి భవిష్యత్తులో అటువంటి అన్యాయాలకు ఆస్కారం లేకుండా పటిష్ఠమైన నూతన వ్యవస్థను తీసుకొచ్చారు. మా ఉద్యోగాలు మాకే అంటూ నినదించిన తెలంగాణ నిరుద్యోగుల కల సాకారమైంది. కొత్త జోనల్ వ్యవస్థలో మల్టీ జోనల్ పోస్టుల కింద గ్రూప్-1 అధికారులుగా కూడా తెలంగాణ బిడ్డలనే నియమించేందుకు మార్గం సుగమమైంది. కేవలం నియామకాలకే పరిమితంకాకుండా అంతర్ జిల్లా, అంతర్ జోనల్ బదిలీలకు కూడా కొత్త వ్యవస్థ అవకాశం కల్పించింది.

ఇకపై స్థానికతను నిర్ణయించేది ఇలా..
ఉద్యోగ నియామకాల్లో పూర్తిగా తెలంగాణ బిడ్డలకే అవకాశాలు వచ్చేవిధంగా స్థానికతను వర్గీకరించారు. 1వ తరగతి నుంచి 7వ తరగతిలోపు వరుసగా నాలుగేండ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లా స్థానికుడిగా వర్గీకరించాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. గతంలో నాలుగో తరగతి నుంచి 10వ తరగతిలోపు వరుసగా నాలుగేండ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లా స్థానికులుగా గుర్తించేవారు. అయితే మారుతున్న పరిస్థితుల కారణంగా పిల్లలను మంచి చదువుల కోసం వివిధ ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉంచి చదివించాల్సి వస్తున్నది. దీంతో గతంలో నిర్ణయించిన ప్రామాణికాన్ని తీసుకుంటే స్థానికులకు నష్టంజరిగే అవకాశం ఉన్నది. దీనిపై లోతుగా అధ్యయనం చేసి.. 1 నుంచి 7వ తరగతి వరకు పిల్లలు ఇంటివద్దనే ఉండి చదువుకుంటారని, ఇందులో వరుసగా నాలుగేండ్లు ఎక్కడ చదివితే దానిని స్థానికంగా గుర్తిస్తే న్యాయం జరుగుతుందని నిర్ణయించారు.

త్వరలోనే కొత్త జోనల్ ఫలాలు
తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలున్నాయి. వివిధ స్థాయిల్లో 50 వేలపైచిలుకు నియామకాలను చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. గ్రూప్-1 పోస్టుల్లో కూడా తెలంగాణ నిరుద్యోగులకే అవకాశం కల్పించేలా ఈ పోస్టులను మల్టీ జోనల్ పరిధిలోకి తీసుకొచ్చారు. కొత్త నోటిఫికేషన్లలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిల్లోని ఉద్యోగాల భర్తీలో 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. ఈ విధానంతో మారుమూల ప్రాంతాల నిరుద్యోగులకు లబ్ధిచేకూరుతుంది. 31 జిల్లాలవారీగా నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో ఏప్రాంతం వారు ఆ ప్రాంతంలోని నిరుద్యోగులతోనే పోటీపడతారు. గ్రామీణ యువత పట్టణాల్లోని నిరుద్యోగులతో పోటీపడాల్సిన అవసరం ఉండదు. దీంతో అందరికీ సమాన అవకాశాలు లభించి ప్రాంతాల మధ్య అసమానతలు తొలగిపోనున్నాయి. మిగిలిన 5 శాతం ఉద్యోగాలను కూడా తెలంగాణ నిరుద్యోగులతోనే భర్తీచేస్తారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే శాఖలవారీగా ఖాళీల వివరాలను సేకరించడంతోపాటు నియామకాల విధివిధానాలపై కసరత్తు ప్రారంభించాయి. దీంతో కొత్త జోనల్ వ్యవస్థ తొలి ఫలాలు త్వరలోనే తెలంగాణ యువతకు దక్కనున్నాయి.

నియామకాలు ఇలా..
నూతన జోనల్ వ్యవస్థ రాష్ట్రంలోని 31 జిల్లాల ప్రకారమే అమలవుతుంది. ఇందులో జిల్లాను స్థానిక క్యాడర్‌గా నిర్ణయించారు. స్థానిక క్యాడర్‌లో నాన్‌గెజిటెడ్ అధికారులు, జూనియర్ అసిస్టెంట్లు, మండల, జిల్లా ప్రజాపరిషత్, ప్రభుత్వ టీచర్ల వరకు నియామకాలు ఉంటాయి. పదోన్నతుల విషయంలో అన్ని స్థానిక క్యాడర్లకు సమాన అవకాశాలుంటాయి. ఒక లోకల్ క్యాడర్ నుంచి ఇంకో లోకల్ క్యాడర్‌కు బదిలీ చేసేటప్పుడు సీనియార్టీ ప్రకారం బదిలీలు జరపాల్సి ఉంటుంది. జోనల్ స్థాయిలో సూపరింటెండెంట్ క్యాటగిరీ వరకు, లేదా దానికి సమానమైన పోస్టుల వరకు నియామకం చేయాల్సి ఉంటుంది. మల్టీ జోనల్‌లో డిప్యూటీ కలెక్టర్‌స్థాయి వరకు పోస్టుల నియామకం చేసుకోవడానికి కొత్త జోనల్ వ్యవస్థలో అవకాశాలు కల్పించారు. స్థానిక క్యాడర్‌లో పోస్టులను నియమించేటప్పుడు పరిపాలన నిమిత్తం ఆ పోస్టు తప్పని సరిగా ఉండాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వయసు, సీనియార్టీ ప్రకారం లోకల్ క్యాడర్‌లో సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. లోకల్ క్యాడర్‌లో స్థానికులకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రాధాన్యమివ్వాలి. నియామక కమిటీలు స్థానిక వ్యక్తులను నియమించేలా సూచనలు చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఉత్తర్వు అందిన తర్వాత అన్యాయం జరిగిందని స్థానికుడు భావిస్తే 60 రోజుల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తిచేయాలి. స్థానిక అభ్యర్థుల నుంచి వచ్చే విజ్ఞప్తులపై సంబంధిత కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఏవ్యక్తినైనా మార్చాలనుకుంటే అతనికి అవకాశం ఇచ్చిన తరువాతనే మార్చాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అంతర్‌జిల్లా బదిలీలకూ అవకాశం
గతంలో ఉన్న విధానంలో అంతర్‌జిల్లా, అంతర్‌జోనల్ బదిలీలకు వీల్లేదు. కొత్త జోనల్‌వ్యవస్థలో ఇందుకు అవకాశమేర్పడింది. ఈ బదిలీల్లో సదరు ఉద్యోగి సీనియార్టీకి రక్షణ కల్పించారు. ప్రభుత్వ బదిలీలతోపాటు సదరు ఉద్యోగి ఇష్టప్రకారం కూడా బదిలీకి అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకిరాని సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయం, రాష్ట్రస్థాయి ఇన్‌స్టిట్యూట్‌లు, స్పెషల్ ఆఫీసర్ ఎస్టాబ్లిష్‌మెంట్ కార్యాలయాలకు ఉద్యోగులను జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానికి, హైదరాబాద్ నుంచి జిల్లాలకు బదిలీచేసే అవకాశాన్ని కల్పించారు.

కొత్తగా ఏర్పడే జోన్లు, వాటి పరిధిలోని జిల్లాలు
1. కాళేశ్వరం జోన్ (28,29,615 జనాభా): జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి 2. బాసర జోన్ (39,74,829 జనాభా): ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల 3. రాజన్న జోన్ (43,09,866 జనాభా): కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ 4. భద్రాద్రి జోన్ (50,44,844 జనాభా): భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ 5. యాదాద్రి జోన్ (40,23,800 జనాభా): సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ 6. చార్మినార్ జోన్ (1,03,57,289 జనాభా): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి 7. జోగుళాంబ జోన్ (44,63,431 జనాభా): మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్

మల్టీ జోన్లు..
1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భదాద్రి (1.61 కోట్ల జనాభా).. 2. యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ (1.88 కోట్ల జనాభా) పోలీస్ జోన్లు మల్టీ జోన్ 1
కాళేశ్వరం జోన్:- జయశంకర్ -భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, రామగుండం పోలీస్ కమిషనరేట్
బాసర జోన్:- ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, జగిత్యాల
రాజన్న జోన్:- కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్
భద్రాద్రి జోన్:- భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం పోలీస్ కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్ పోలీస్ కమిషనరేట్

మల్టీ జోన్2
యాదాద్రి జోన్:- సూర్యాపేట, నల్లగొండ, రాచకొండ పోలీస్ కమిషనరేట్
చార్మినార్ జోన్:- హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సంగారెడ్డి
జోగుళాంబ జోన్: మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్
రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు నోటిఫికేషన్

అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీచేసిన సీఎస్
ఉద్యోగాల భర్తీకి కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పరుస్తూ వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వులను అన్నిశాఖల్లో అమలుపరచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులకు విస్తృత ప్రయోజనాన్ని చేకూర్చేలా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను వర్గీకరించడంతోపాటు సర్వీసు నిబంధనలను మార్చుకొని సిద్ధంగా ఉండాలని అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ గతంలోనే మెమో జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన కొత్త జోనల్ వ్యవస్థ ముసాయిదా ప్రతిని కూడా అందజేశారు. ఈ ఆదేశాల మేరకు అన్ని శాఖలు ఇప్పటికే కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా సర్వీసు నిబంధనలను రూపొందించాయి. ఇప్పుడు వీటిని వెంటనే అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి పంచాయతీరాజ్‌శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.