Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జుమ్లా.. లేదంటే హమ్లా!

-ఇదే బీజేపీ నాయకుల విధానం
-అమిత్‌షాజీ.. నువ్వేంటి ఐటీ హబ్‌ చేసేది
-హైదరాబాద్‌ ఎప్పుడో ఐటీ హబ్‌ అయింది
-రూపాయి ఇయ్యలే.. పైగా రుబాబ్‌ చేస్తున్నరు
-అన్ని కంపెనీలు అమ్ముకుంటూ వస్తున్న మోదీ
-రాష్ట్రంలో ఇన్వర్టర్లు పోయి ఇన్వెస్టర్లు వచ్చారు
-మేం నిర్మిస్తామంటే.. వాళ్లు కూలుస్తమంటున్నరు
-మా నినాదం విశ్వనగరం.. వాళ్లది విద్వేషనగరం
-హైదరాబాదీలు ఓటేసే ముందు ఆలోచించండి
-జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్‌

అయితే అబద్ధపు వాగ్దానాలియ్యాలి లేకుండా దాడులకు దిగాలి (జుమ్లా నైతో హమ్లా) అనేదే బీజేపీ విధానమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చుపెట్టి ఓట్లు దండుకొనేందుకు యత్నిస్తున్న మత పిచ్చోళ్లను ఓటుతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌కు మంజూరైన ఐటీఐఆర్‌ను రద్దుచేసి ఇక్కడి యువత నోట్లో మట్టికొట్టి.. ఇప్పుడు హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మారుస్తామని అమిత్‌షా చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. మతత్వపార్టీల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకొనేందుకు ప్రతిఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం చివరిరోజైన ఆదివారం గోషామహల్‌, సనత్‌నగర్‌ నియోజకవర్గం పాటిగడ్డ, సికింద్రాబాద్‌ల్లో ఏర్పాటుచేసిన రోడ్‌షోలలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

గతంలో హైదరాబాద్‌లో షాపులు, ఇండ్లు అనే తేడా లేకుండా ఇన్వర్టర్లు ఉండేవి. అపార్ట్‌మెంట్లు, పరిశ్రమల యజమానులు జనరేటర్లకోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ, కేసీఆర్‌ సీఎం అయ్యాక ఆవాసాలు, ఆపార్ట్‌మెంట్లు, పరిశ్రమలు అనేతేడా లేకుండా 24 గంటల కరెంట్‌ సరఫరా జరుగుతున్నది. దీంతో ఇన్వర్టర్లు పోయి ఇన్వెస్టర్లు తరలివస్తున్నారు. జనరేటర్లు పోయి నగరం ఎల్‌ఈడీ దీపాల వెలుగులో జిగేల్‌మంటున్నది. నగరంలో తాగునీరు, కరెంటు సమస్య లేకుండా చేశాం. 20 వేల లీటర్ల వరకు నల్లా బిల్లులను శాశ్వతంగా మాఫీ చేస్తున్నం. ఆడబిడ్డలకు త్వరలోనే 24 గంటల మంచినీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆరేండ్లుగా అల్లర్లు, కర్ఫ్యూలు లేకుండా.. నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పినం. మెట్రోరైలు నిర్మించుకున్నాం.. బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు కట్టుకున్నం. రోడ్లు బాగు చేసుకున్నం. చెత్తతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నం. ఒక్కొక్కటీ చేసుకుంటూ ముందుకెళుతున్నం. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పేదలందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటామని మీ దగ్గరికొచ్చి ఓటడిగనం. ఒళ్లు వంచి హైదరాబాద్‌ అభివృద్ధికి కష్టపడతాం అని చెప్పాం. అదే రీతిన చేసినం. ఈ ఐదేండ్లలో ఎంత అభివృద్ధి చేసినమో మీ ముందే ఉంచినం.

అమిత్‌షాజీ తెలుసుకోండి!
అయ్యా అమిత్‌షాజీ.. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మాది నిజాం సంస్కృతి కాదు. నీ గుజరాత్‌ నుంచే వచ్చిన జాతిపిత మహత్మాగాంధీ 1920లోనే ‘మీ హైదరాబాద్‌లో ఉన్న గంగా జమునా తెహజీబ్‌ సంస్కృతి భారతదేశం మొత్తానికి ఆదర్శం’ అని అన్నారు. చరిత్ర తెలుసుకో. జూఠా మాటలు.. జుమ్లాలు ఇక్కడ నడవదు. జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని 2014లో మోదీ చెప్పిండు. ఈ విషయంపై అమిత్‌షాను అడిగితే ‘ఓతో జుమ్లాథా.. ఖాన్‌మే ఫూల్‌ రఖ్‌దియా’ అని అన్నడట. ఇప్పుడు మళ్ల రూ.20 లక్షలకోట్లు ఇస్తామని కొత్తది మొదలు పెట్టిండ్రు. పదిహేను రోజుల నుంచి దుర్భిణి పెట్టి మరీ వెతుకుతున్న. కనీసం 20 మందికైనా డబ్బులు వచ్చాయా అని! మళ్ల రూ.25 వేలు ఇస్తామంటూ ఇంకొక జుమ్లా. అంటే అయితే జుమ్లా లేదంటే హమ్లా (సర్జికల్‌ స్ట్రైక్‌). ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలేవని అడిగితే.. హిందూ-ముస్లిం, ఇండియా-పాకిస్థాన్‌ అంటూ డబ్బాలో రాళ్లువేసి కొట్టినట్టు ఒకటే ముచ్చట చెప్తరు.

కరోనాకు భయపడకుండా కంటైన్‌మెంట్‌ జోన్లలో తిరిగినం. వందేండ్లలో లేనివిధంగా వరదలొస్తే మోకాలు లోతు నీళ్లలో తిరిగి ప్రజలకు ధైర్యం చెప్పినం. 6.64 లక్షల కుటుంబాలకు రూ.664 కోట్ల వరద సాయమందించాం. డిసెంబర్‌ 7 నుంచి మిగిలివారందరికీ రూ.10వేలు పంపిణీ చేస్తాం. అందుకే చెప్తున్నా.. మీ కష్టంలో ఉన్నది మేము.. కన్నీళ్లలో ఉన్నది మేము.. రేపు మళ్లా కష్టమొచ్చినా మీ వెంట ఉండేది మేమే.

ఆడబిడ్డ జోలికొస్తే ఏం జరుగుతదో చూసిండ్రు
నిన్న యూపీ నుంచి కాషాయ వస్ర్తాలతో యోగి అంట వచ్చిండు. ఆయన రాష్ట్రం హథ్రాస్‌లో ఆడబిడ్డమీద అఘాయిత్యం జరిగితే.. ఆమె శవాన్ని కుటుంబానికి కూడా చూపించకుండా అర్ధరాత్రి తీసుకెళ్లి కాల్చిన కుసంస్కారం ఆయన ప్రభుత్వానిది. అలాంటి ఆడబిడ్డపై తెలంగాణలో అఘాయిత్యం చేస్తే ఏం జరిగిందో ఏడాది కింద మీరంతా చూసిండ్రు. గదీ.. దమ్మున్న నాయకుడి ప్రభుత్వం ఉంటే ఇలాగే ఉంటది. యోగి నువ్వా వచ్చి మాకు చెప్పేది? జోగిజోగి రాసుకుంటే ఏం రాల్తదో.. ఈయనతోనే అదే అయితది. మన తెలంగాణ నుంచి వసూలుచేసే పైసలు ఇగో గిసోంటి యోగీ, బోగీ కాడికే పోతున్నయి.

ఐటీఐఆర్‌ను రద్దుచేసిందే మోదీ ప్రభుత్వం
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాల్లో వస్తున్నరు. మూటలేమైనా తెస్తరేమో అనుకున్నం. అమరావతికి కనీసం తట్టెడు మట్టి.. లోటెడు నీళ్లు తీసుకుపోయిండ్రట. ఇక్కడకు అదికూడా తేలేదు. ఉత్త చేతులతో ఊపుకుంటూ ఇయ్యాల వచ్చిన అమిత్‌షా హైదరాబాద్‌ను ఐటీహబ్‌ చేస్తామని చెప్తున్నరు. అప్పటికే ఉన్న ఐటీఐఆర్‌ను రద్దుచేసి తెలంగాణ యువత నోట్లో మట్టికొట్టి.. మళ్ల వచ్చి ఐటీ హబ్‌ చేస్తామంటే నమ్మడానికి ఇక్కడ ఎవరూ చెవిలో పూలు పెట్టుకొని లేరు. ఐటీ హబ్‌ నువ్వు చేసేదేంది? పోయిన ఐదేండ్లలో అమెజాన్‌, ఫేస్‌బుక్‌, ఆపి ల్‌ వంటివి ఎన్నో తెచ్చుకున్నం. ఇది నీ అహ్మదాబాద్‌ కాదు.. హుషార్‌ హైదరాబాద్‌ అని యాదిపెట్టుకో.

ఇండ్లు, పరిశ్రమల్లో ఇన్వర్టర్లు పోయి ఇన్వెస్టర్లు తరలివస్తున్నరు. జనరేటర్లు పోయి నగరం ఎల్‌ఈడీ దీపాలతో జిగేల్‌మంటున్నది. మెట్రోరైలు నిర్మించుకున్నాం.. బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు కట్టుకున్నం. రోడ్లు బాగు చేసుకున్నం. చెత్తతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నం. 24 గంటల నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. అడబిడ్డలకు 5 నుంచే డబుల్‌ బెడ్‌రూంలు అందిస్తాం.

మత పిచ్చోళ్లను తరిమికొట్టండి
హైదరాబాద్‌ నగరం ఆరేండ్లలో ప్రశాంతంగా ఉన్నది. అంతా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్నరు. రాజకీయస్థిరత్వం ఉన్నది. అనేక ప్రపంచస్థాయి కంపెనీలు వస్తున్నయ్‌.. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నయ్‌. అందరం కలిసిఉంటే ఓట్లురావు కాబట్టి ఏదో ఒక చిచ్చు పెట్టాలె అని కొందరు కొత్త పిచ్చోళ్లు మోపయిండ్రు. ఒక పిచ్చోడు ఎన్టీఆర్‌, పీవీ సమాధులు కూలగొడుతా అంటడు. ఇంకోడు శత్రుదేశంపై చేసే సర్జికల్‌ స్ట్రైక్‌లు హైదరాబాద్‌పై చేస్తానంటడు. మేమేమో డ్రైనేజీలు కడుతం, రోడ్లు వేస్తాం.. చెరువులు బాగు చేస్తాం అని నిర్మాణాత్మకంగా మాట్లాడుతుంటే.. వాళ్లేమో కూలగొడుతాం అంటున్నరు. అందుకే ఆ పిచ్చోళ్ల చేతిలో హైదరాబాద్‌ను పెట్టకండి. ఆ ఇద్దరు మత పిచ్చోళ్లను తరిమితరిమి కొట్టండి. రాష్ర్టాన్ని ప్రగతిపథాన తీసుకెళుతున్న కేసీఆర్‌కే హైదరాబాద్‌ను మరొకసారి అప్పజెప్పండి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు ఒక్కొక్కటిగా అమ్ముకుంట వస్తున్నది. రైల్వేస్‌, ఎన్టీపీసీ, మహారత్న కంపెనీలు, బీఎస్‌ఎన్‌ఎల్‌, బీహెచ్‌ఈఎల్‌ ఇట్లా అన్నీ అమ్ముతున్నడు. వాళ్లు జీహెచ్‌ఎంసీలో గెలిస్తే దాన్ని కూడా ప్రైవేటీకరిస్తారు. నష్టాల్లో ఉన్నదని జీహెచ్‌ఎంసీని కూడా అమ్మేస్తరు. అంతా ఆలోచించుకోవాలి.

బీజేపీ మార్కెట్లకు కొత్తగా ఒకాయన వచ్చిండు. బండిపోతే బండి ఫ్రీ.. కారుపోతే కారు ఫ్రీ.. మనిషిపోతే మనిషి ఫ్రీ.. అని చెప్తుండు. అవన్నీ ఎట్లిస్తరని మన ప్రెస్‌వాళ్లు అడిగితే.. ఇన్సురెన్స్‌ ఉంటదికదా? అని సమాధానం చెప్పిండు. అసలు ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడా? ఇన్సూరెన్స్‌ ఏజెంటా? చలాన్లు కట్టేటందుకా జీహెచ్‌ఎంసీ ఉన్నది?

హిందూ ముస్లిం లొల్లితో లాభమెవరికి?
మాకింద ఉన్న ఏ నగరంలో మతకల్లోలాలు అయినయ్‌ అని అమిత్‌షా అంటున్నరు. మీ కింద కాదు.. మీరున్న ఢిల్లీలోనే ట్రంప్‌ వచ్చి హైదరాబాద్‌హౌస్‌లో బిర్యానీ తింటుంటే అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో లొల్లి జరిగింది మీ హయాంలో కాదా? హైదరాబాద్‌నూ అట్లనే చేస్తరా. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి. మా నినాదం విశ్వనగరం.. వాళ్ల విధానం విద్వేష నగరం. కలిసిఉందాం అని మేం అంటుంటే… కొట్టుకోవాలే, తన్నుకోవాలే అని వాళ్లంటున్నరు.

అందరూ ఓటింగ్‌లో పాల్గొనండి
చాలామంది పోలింగ్‌ రోజు అంటే హాలిడే అని ఇండ్లలోనే ఉంటుంటరు. అది మంచి ఆలోచన కాదు. ఊర్లలో 90% పోలింగ్‌ అయితుంది. హైదరాబాద్‌లో 40 నుంచి 42 శాతం మాత్రమే అయితుంది. హైదరాబాద్‌ మత పిచ్చోళ్ల మధ్య నలిగిపోకుండా చూసుకొనేందుకు, నగరాన్ని కాపాడుకొనేందుకు బయటకు వచ్చి ఓటేయాలని హైదరాబాద్‌లో యువతను, అందర్నీ కోరుతున్నా. ఓటు అనే వజ్రాయుధంతో తిరుగులేని సమాధానం చెప్పాలని కోరుతున్నా.

మాది నిజాం సంస్కృతి కాదు. నీ గుజరాత్‌ నుంచే వచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ 1920లోనే ‘మీ హైదరాబాద్‌లో ఉన్న గంగాజమునా తెహజీబ్‌ సంస్కృతి భారత్‌ మొత్తానికి ఆదర్శం’ అన్నారు. చరిత్ర తెలుసుకో. ఝూఠా మాటలు.. జుమ్లాలు ఇక్కడ నడవది. ఇది అహ్మదాబాద్‌ కాదు.. హుషార్‌ హైదరాబాద్‌.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.