Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జూన్ 2 లోపు రైతుబంధు పూర్తి

-రైతులందరికీ చెక్కులు, బుక్కులు అందాలి -జూన్ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం -మిగిలిన చెక్కులు, పాస్‌బుక్కులను రైతులు తహసీల్దార్ కార్యాలయాల్లో తీసుకోవాలి -సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ -కొన్నిచోట్ల అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి -నేడు మంత్రులు, జిల్లా కలెక్టర్లతో అత్యవసర సమావేశం

రాష్ట్రంలో పట్టాదార్ పాస్‌పుస్తకాలు, చెక్కులు అందుకోని రైతులు మిగులకూడదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రస్తుతం పంపిణీ చేయగా మిగిలిన ప్రతి ఒక్కరికీ జూన్ రెండులోగా చెక్కులు, బుక్కులు అందించాలని చెప్పారు. జూన్ రెండునుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలుకానున్నందున ఎలాంటి సమస్యలున్నా ఆలోపు పరిష్కరించి, అందరికీ పాస్‌పుస్తకాలు, చెక్కులు అందించి, ఎట్టిపరిస్థితుల్లోనూ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని అధికారులకు స్పష్టంచేశారు. పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమంపై ప్రగతిభవన్‌లో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాన్ని సమీక్షించడంతోపాటు మిగిలినవారికి పాస్‌పుస్తకాలు, చెక్కులు అందించడానికి అవసరమైన వ్యూహం ఖరారుచేసేందుకు మంత్రులు, కలెక్టర్లతో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అందరికీ సమాచారం పంపించి, సమావేశానికి కావాల్సిన ఏ ర్పాట్లుచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామాల్లో జరిగిన పంపిణీలో హాజరుకాలేకపోయిన రైతులంతా తహసీల్దార్ కార్యాలయంలో పాస్‌పుస్తకాలు, చెక్కులు తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.

బుక్కులు, చెక్కుల పంపిణీ వందశాతం పూర్తిచేయాలి సాంకేతిక కారణాలవల్ల కొన్నిచోట్ల కొందరికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు రాలేదని, మరికొందరికి చెక్కులు అందలేదని ప్రభుత్వానికి సమాచారం అందిందని సీఎం కేసీఆర్ అధికారులకు తెలిపారు. కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వడంపట్ల, పంట పెట్టుబడిసాయం అందివ్వడంపట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నదని అన్నారు. దేశంలో మరే ప్రభుత్వ కార్యక్రమానికీ రానంత గొప్ప స్పందన రైతుబంధుకు వస్తున్నదని సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి మిగతా రైతులకు కూడా వాటిని పంపిణీ చేయాలని సీఎం పిలుపునిచ్చారు.

భూ యాజమాన్య హక్కుల స్పష్టతపై సంతోషం రైతుల సంక్షేమానికి మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి మరోటి లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. అందుకే వ్యవసాయరంగానికి ఎక్కువ నిధులిస్తున్నామని తెలిపారు. రైతులకు మేలు చేయగలిగితేనే సాధించిన తెలంగాణకు సార్థకత. రూ.12వేల కోట్లతో రైతుబంధు కార్యక్రమం అమలుచేద్దామంటే చాలామంది భయపడ్డారు. కానీ, రైతులకు నేరుగా మేలుచేసే కార్యక్రమం కాబట్టి మొండి పట్టుదలతో ముందుకుపోయాం. పంట పెట్టుబడికోసం ప్రభుత్వం అందించిన సాయం చేతికందిన తర్వాత రైతుల్లో చెప్పలేని ఆనందం వెల్లివిరుస్తున్నది. అప్పుల బాధలు తప్పాయని ఊరట చెందుతున్నారు అని సీఎం చెప్పారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, ఎక్కడికి తిరుగకుండా భూ యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చినందుకు రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇంత పెద్ద పనిచేసిన రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రభుత్వం ప్రజలకోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నది. ఎన్నో పథకాలు తెస్తున్నది. కానీ పంట పెట్టుబడి పథకానికి వచ్చినంత గొప్ప స్పందన మరే కార్యక్రమానికి రాలేదు. దేశవ్యాప్తంగా దీనికి ప్రశంసలు లభిస్తున్నాయి అని అన్నారు. కొన్నిచోట్ల అధికారుల నిర్లక్ష్యం ఆధార్‌కార్డు అనుసంధానం కాకపోవడంతోపాటు ఇతర కారణాల వల్ల కొన్నిచోట్ల రైతులకు పాస్‌పుస్తకాలు అందలేదు. చెక్కులు చేతికి రాలేదు. కొన్నిచోట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగానూ వ్యవహరించారు. భూ రికార్డులు సరిచేసే కార్యక్రమాన్ని కూడా కొన్నిచోట్ల సరిగా నిర్వహించలేదని తెలుస్తున్నది. ప్రభుత్వం రైతుల కోసం ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నా అధికారులు కొన్నిచోట్ల అందుకు అనుగుణంగా విధులు నిర్వహించకపోవడం అసంతృప్తి కలిగిస్తున్నది అని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగాలి. ఏ ఒక్క రైతు కూడా మిగులకుండా అందరికీ పట్టాదార్ పాస్‌పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేయాలి. జూన్ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తుంది. అప్పటికి అందరి వద్ద కొత్త పాస్‌పుస్తకాలుండాలి. రికార్డులన్నీ అప్‌డేట్ అయి ఉండాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో అసెం బ్లీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్ నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎంపీలు జే సంతోష్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధిసంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు సలీం, శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ అధికారులు ఎస్ నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, రాజేశ్వర్‌తివారి, శాంతికుమారి, వికాస్‌రాజ్, జగన్మోహన్, వెంకట్రామ్‌రెడ్డి, సందీప్ సుల్తానియా, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

నేడు జిల్లా కలెక్టర్లతో అత్యవసర సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రులు, కలెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహిస్తారు. మంగళవారం వరకు జరిగిన చెక్కుల పంపిణీని సమీక్షించడంతోపాటు, జూన్ 2 నాటికి మొత్తం కార్యక్రమాన్ని ముగించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఆయా జిల్లాల్లో ఇప్పటివరకు ఎంతమంది రైతులకు పాస్‌పుస్తకాలు, చెక్కులు అందించారు? ఇంకా ఎన్ని మిగిలాయి? ఎందుకు మిగిలాయి? వారికి పాస్‌పుస్తకాలు, చెక్కులు ఎప్పుడిస్తారు? అసలు ఏ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి? తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. జూన్ 2లోగా పంపిణీ కార్యక్రమం పూర్తి కావడానికి అవసరమైన వ్యూహం ఖరారుచేస్తారు. రైతులకు జీవిత బీమా పథకం, కంటి వెలుగు, రాష్ట్ర అవతరణ వేడుకలు, పంచాయితీరాజ్ ఎన్నికల ఏర్పాట్లు అంశాలపై కూడా చర్చిస్తారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.