-కొలువుల భర్తీకి సత్వరమే వివరాలివ్వాలి -అన్ని శాఖలు టీఎస్పీఎస్సీకి అందజేయాలి -సీఎస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం

ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం వేగంగా ముందడుగు వేస్తున్నప్పటికీ పలుశాఖలు క్రియాశీలకంగా వ్యవహరించని తీరుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టిసారించారు. నియామక సంస్థ అయిన టీఎస్పీఎస్సీకి వివరాలివ్వడంలో జాప్యంచేస్తున్న శాఖలు సత్వరమే సమగ్ర వివరాలు అందించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారని సమాచారం. త్వరలో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు సంబంధించి ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రణాళికను ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలోనూ ప్రభుత్వం వేల కొలువుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. వాటికి ఆర్థిక శాఖ అనుమతులూ వచ్చాయి.
కానీ నియామక సంస్థ టీఎస్పీఎస్సీ నుంచి ఆశించిన ఉద్యోగ ప్రకటనలు వెలువడలేదు. ఈ విషయంలో జాప్యం గురించి సీఎం ఆరాతీయగా.. పలుశాఖలు సమాచారం ఇవ్వకపోవడం, అసమగ్ర వివరాలు ఇవ్వడం కారణంగా నోటిఫికేషన్లు విడుదల చేయలేదని టీఎస్పీఎస్సీ వివరించినట్టు తెలిసింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి మార్గదర్శకాలు, రోస్టర్లు తదితర వివరాలను సదరు శాఖలు టీఎస్పీఎస్సీకి అందించాల్సి ఉంది. ఈ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీనిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. వివరాలు ఇవ్వడంలో తాత్సారం చేస్తున్న శాఖల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి సూచించారని తెలిసింది.