Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాల్చిచంపినవారా.. కరంటు ఇచ్చినవారా?

-తెలంగాణ అభివృద్ధికి.. ఆంధ్రా పెత్తందారులకు మధ్యే ఎన్నికలు
-సీల్డు కవర్ సీఎంలతో తెలంగాణకు నష్టం
-గెలిచేది టీఆర్‌ఎస్.. సీఎం అయ్యేది కేసీఆర్
-కారు ఆగొద్దు.. డ్రైవరు మారొద్దు
-ఆదాయం పెంచుతాం.. పేదలకు పంచుతాం
-సమైక్య పాలనలో పాలమూరు నోట్ల మట్టి కొట్టిండ్రు
-మక్తల్, అచ్చంపేట ప్రజాదీవెన సభల్లో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
-పాలమూరుకు నీళ్లిచ్చినవారా?.. నిర్లక్ష్యంతో ఎడారిగా మార్చినవారా?
-ఎవరు కావాలో ప్రజలు తేల్చుకోవాలి: మంత్రి కేటీఆర్

సమైక్యపాలనలో కరంటు అడిగితే కాల్చిచంపిన చరిత్ర కూటమిలోని పార్టీలదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. మరోవైపు రాష్ట్ర రైతులకు ఉచితంగా కరంటు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. ఓ సినిమాలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో హీరో పాడిన పాటను మంత్రి కేటీఆర్ ప్రస్తావిస్తూ.. ఈ గట్టున 24 గంటలు కరంటు ఇచ్చిన కేసీఆర్ ఉన్నారు. ఆ గట్టున కరంటు అడిగితే కాల్చి చంపిన దుర్మార్గులు ఉన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మంజూరుచేసిన కేసీఆర్ ఈ గట్టున ఉన్నారు. 67 ఏండ్లు నీళ్లివ్వకుండా, పాలమూరు ప్రజలను వలసపోయేలా చేసి, ఈ జిల్లాను ఎడారి చేసినవాళ్లంతా ఆ గట్టున ఉన్నారు. ఈ గట్టున కేసీఆర్, బాలరాజుతోపాటు పాలమూరును పచ్చబడేలా చేయాలని పట్టుబట్టి, రాజీలేని పోరాటంచేసే నాయకులమంతా ఉన్నాం.

చంద్రబాబు చేతికి జుట్టందించి, ఢిల్లీకి గులాములుగా చేసే దౌర్భాగ్యులు ఆ గట్టున ఉన్నారు. ఏ గట్టున ఉంటారో పాలమూరు ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. గడిచిన నాలుగున్నరేండ్ల పాలనలో అనేక అభివృద్ధి పథకాలను చేపట్టి పాలమూరు కరువును పారద్రోలి పచ్చని పంటలు పండించేందుకు అవకాశం కల్పించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మరోసారి విజయం అందించాలని కోరారు. జోరుగా సాగుతున్న కారు ఆగొద్దని, డ్రైవరు మారొద్దని అన్నారు.

సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని మక్తల్, అచ్చంపేట నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ప్రజాదీవెన సభల్లో మంత్రి కేటీఆర్‌తోపాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎంపీ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధ్యక్షతన జరిగిన సభల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సమైక్యరాష్ట్ర చివరి సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి.. తెలంగాణ ఏర్పాటైతే రాష్ట్రం చిమ్మచీకటవుతుందని భయపెట్టారన్నారు. అయితే, దేశంలోనే నేడు రైతులకు 24 గంటల ఉచిత త్రీఫేస్ విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. రైతును రాజు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని, అందులో భాగంగానే రైతుబంధు పథకం అమలుచేస్తున్నారని తెలిపారు.

అరవైఏండ్ల పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల నోట్లో కాంగ్రెస్, టీడీపీ మట్టికొట్టాయని మంత్రి విమర్శించారు. కూటమికి అధికారం కట్టబెడితే పాలమూరు ప్రజల నోట్లో మళ్లీ మట్టికొట్టడం ఖాయమన్నారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ కోసం ఏర్పాటుచేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను అడ్డుకునేలా కోర్టుల్లో కేసులువేసిన కాంగ్రెస్ నాయకుల వ్యవహారాన్ని గుర్తుచేశారు. ఇంతకాలం పాలమూరు ప్రజలపై కత్తికట్టిన చంద్రబాబు పార్టీ తెలంగాణలో ఉండటం ఇంకా అవసరమా? ఒకసారి ఆలోచించాలని మంత్రి కోరారు. సింహంలాంటి సీఎం కేసీఆర్ మనకు ఉండగా, ఢిల్లీలో డిజైన్‌చేసే సీల్డ్‌కవర్ ముఖ్యమంత్రులు వద్దని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో గెలిచేది టీఆర్‌ఎస్.. సీఎం అయ్యేది కేసీఆర్. ఈ విషయాన్ని చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు అన్నారు.

అభివృద్ధి నిరోధకులు సమైక్య పాలకులు
సమైక్యపాలకులు తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా పాలన సాగించారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది పాలమూరు జిల్లాయేనని గుర్తుచేశారు. వనరులుండి కూడా ఆంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేస్తుంటే వాటిని సమర్థించినట్లుగానే ఇక్కడి నాయకుల తీరు కొనసాగిందన్నారు. ఫలితంగా కరువుకు, వలసలకు కేంద్రంగా పాలమూరు జిల్లా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో అప్పర్‌కృష్ణ ప్రాజెక్టును ప్రతిపాదనల్లోనే అంధ్రా పాలకులు అడ్డుకున్నారని, ఆ ప్రాజెక్టును చేపట్టి ఉంటే 174 టీఎంసీలతో జిల్లాలోని 17 లక్షల ఎకరాలకు సాగునీరందేదని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీలకు పాలమూరుకు సాగునీరివ్వాలని లేదని, అందుకే జిల్లాను విస్మరించి, వలసలు, కరువుకు నిలయం చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు వివిధ ప్రాజెక్టులద్వారా సాగునీరందించామని, ఫలితంగా వసలు వాపస్ వస్తున్నాయని చెప్పారు.

మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్న కాలంలోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారని, పాలమూరు జిల్లాకు శాశ్వతంగా రుణపడి ఉంటామని అన్నారు. పాలమూరు ప్రయోజనాలకోసం సీఎం కేసీఆర్ ఆఖరుకు దేవుడితోనైనా కొట్లాడుతారని చెప్పారు. పాలమూరు రుణం తీర్చుకోవాలనే రూ.36వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకం చేపడితే.. ఈ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు హర్షవర్ధన్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి కేసులు వేశారని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల ఆపాలంటూ చంద్రబాబు కేంద్రానికి 30 ఉత్తరాలు రాశారని, పొరపాటున అధికార పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉంటే ఈ పథకాన్ని ఆపి రైతుల నోట్లో మళ్లీ మట్టిగొడతారని హెచ్చరించారు. అప్పుడు మళ్లీ నీటి కష్టాలు తప్పవని చెప్పారు. టీడీపీ నేతలు ఏం ముఖం పెట్టుకుని ఓట్లుడుగుతారని నిలదీశారు.

పెంచిన ఆదాయం ప్రజలకు పంచుతాం
రాష్ట్రంలో ఆదాయవనరులను పెంచి వాటిద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలతో పేద ప్రజలకు ఆదాయాన్ని పంచిపెడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గడచిన నాలుగున్నరేండ్లలో అనేక సంక్షేమ పథకాలను అమలుచేశామని, ఈ ఎన్నికల తర్వాత ప్రస్తుతం అమలుచేస్తున్న ఆసరా పింఛన్ రూ.2016కు, దివ్యాంగుల పింఛన్ రూ.3016 రూపాయలకు పెంచుతామని, రైతుబంధు కింద ఎకరాకు ఐదువేల చొప్పున పెట్టుబడి అందిస్తామని తెలిపారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీతోపాటు.. నిరుద్యోగులకు మూడు వేల భృతి అందిస్తామన్నారు.

పార్టీలకతీతంగా ఏకం కావాలి: మంత్రి లకా్ష్మరెడ్డి
ఎన్నికల్లో పార్టీలకతీతంగా ప్రజలు ఏకంకావాలని మంత్రి లకా్ష్మరెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించి సీఎం కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలువాలని కోరారు. నాలుగేండ్లలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సీఎం అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, మెడికల్ కాలేజీ మంజూరుతోపాటు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలలాంటి భారీప్రాజెక్టులు చేపట్టారని గుర్తుచేశారు. జిల్లాలోని నాలుగు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరందించామని చెప్పారు. కరువుకు, వలసలకు నిలయంగా మారిన జిల్లాను సాగునీటితో సస్యశ్యామలం చేశామని పేర్కొన్నారు.

పాలమూరు దశ మారుతున్నది: ఎంపీ జితేందర్‌రెడ్డి
నాలుగున్నరేండ్లుగా ఉమ్మడిజిల్లా దశ మారుతున్నదని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరందించడంవల్ల భారీమార్పులు చోటుచేసుకున్నాయన్నారు. గతంలో 30 వేల టన్నుల వరిధాన్యం పండించే ఉమ్మడి పాలమూరు జిల్లా నేడు 60 వేల టన్నులు పండిస్తుండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దీంతోపాటు పెద్దపెద్ద కంపెనీలు, పరిశ్రమలు పాలమూరుకు తరలొస్తున్నాయని, కోట్ల రూపాయల వ్యాపారాలు, ఉపాధి మార్గాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.

అచ్చంపేటలో మళ్లీ గులాబీ జెండా: గువ్వల బాలరాజు
అచ్చంపేటకు సాగునీరు అందకుండా కోర్టులలో కేసులు వేసి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేయకుండా అడ్డుపడ్డది కాంగ్రెస్ పార్టీయేనని టీఆర్‌ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు విమర్శించారు. ఈ ఎన్నికలలో మహాకూటమిని బొందపెట్టి, అచ్చంపేటలో మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. అచ్చంపేట అభివృద్ధి ఆగిపోకుడదంటే టీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపించాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి రాములు కోరారు. ఆయా సభల్లో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, గట్టు తిమ్మప్ప, దేవర మల్లప్ప, బాద్మి శివకుమార్, టీఆర్‌ఎస్ నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్ అభ్యర్థులు రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ మోసం చేసేందుకే జట్టుకట్టారు
తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు మరోసారి కాంగ్రెస్, టీడీపీలు కూటమి పేరుతో జతకట్టాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ ఎన్నికలు తెలంగాణ అభివృద్ధికి, ఆంధ్రా పెత్తందారులకు మధ్య జరుగుతున్నవని చెప్పారు. మన తలరాతలు మార్చి వేసేలా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణకు అడ్డంపడ్డ రెండు గడ్డాలు పొత్తులతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, పాలమూరు ప్రజలు వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీడీపీకి ఇక్కడ ఓటు వేస్తే ఏం జరుగుతుంది? ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ ఎమ్మెల్యే పనిచేస్తాడా? చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడడం తప్ప మరొకటి లేదు అని కేటీఆర్ చెప్పారు. కూటమి మాయమాటలకు లొంగితే తీవ్రంగా నష్టపోయేది పాలమూరు జిల్లాయే అన్నారు. ఈ కూటమితో పాలమూరు ఏ మాత్రం ఉపయోగం లేదని స్పష్టంచేశారు. మోసపూరితంగా జతకట్టిన కూటమి నుంచి 40 మంది వరకు సీఎం అభ్యర్థులున్నారని, ఇందులో పాలమూరు నుంచే ఐదుగురు పోటీలో ఉన్నారని, ఈ లెక్కన నెలకు ఒక సీఎం చొప్పున మారుతారని మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు. 60 ఏండ్లకుపైగా సాగిన సమైక్యపాలనలో అనేక సందర్భాల్లో సీల్డుకవరు సీఎంల పాలన చూశామని, మళ్లీ సీల్డ్‌కవర్ సీఎంల వ్యవస్థను తెలంగాణకు తెచ్చుకుంటే తీరని నష్టం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే టికెట్లను సైతం ఢిల్లీ నుంచి కేటాయించుకునే దిగజారిన వ్యవస్థ కాంగ్రెస్‌లో ఉందని మంత్రి దుయ్యబట్టారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.