Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాళేశ్వరం చారిత్రాత్మకం

-కేసీఆర్ దార్శనికతకు ఇది నిదర్శనం
-సెప్టెంబర్‌లోగా నిర్మాణ పనులు పూర్తి
-కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు
-సమైక్యాంధ్రలో రైతులకు అన్యాయం
-141 టీఎంసీలకు నీటి స్టోరేజీ పెంపు
-సాగునీటిరంగానికి ఏటా 25 వేల కోట్లు
-సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీలోని టన్నెల్ సందర్శన

గోదావరి, కృష్ణానదులపై నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయని సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. సమైక్యపాలనలో జరిగిన అన్యాయాలను సరిదిద్దుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. చైనా, జపాన్‌లలో అద్భుతాలు జరుగుతున్నాయని వింటున్నామని, కానీ అటువంటి అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో మన వద్దే నిర్మాణమవుతున్నదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సెప్టెంబర్‌లోగా పూర్తవుతుందని, దానితోపాటే కోనరావుపేట టన్నెల్, పంపుహౌస్‌ల నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయని స్పష్టంచేశారు. తెలంగాణలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు దూరమవుతాయని, రైతుల కలలు తప్పకుండా నెరవేరుతాయన్న నమ్మకం కాళేశ్వరం ప్రాజెక్టులో అధికారులు, సిబ్బంది పనితీరు చూస్తే కలుగుతున్నదని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సిరిసిల్లలో ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న కేటీఆర్ మానేరులోని గంగాభవానీ, సిరిసిల్ల పట్టణ శివారులోని రామప్ప జాతర ఉత్సవాలకు హాజరయ్యారు. అనంతరం సిరిసిల్ల బైపాస్‌లోని కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీలో నిర్మిస్తున్న టన్నెల్‌ను పరిశీలించారు.

అక్కడి నుంచి కోనరావుపేట మండలంలోని మల్కపేట టన్నెల్‌ను ఇంచార్జి కలెక్టర్ యాస్మిన్‌బాషా, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సందర్శించారు. టన్నెల్ నుంచి బయటకు వచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్రలో అనాదిగా నష్టపోయిన చిన్న నీటి వనరులైన చెరువులు, కుంటలను భారీ ప్రాజెక్టులకు అనుసంధానం చేసుకొని నింపే అద్భుతమైన వ్యవస్థకు సీఎం కేసీఆర్ ఆలోచన చేశారన్నారు. గోదావరి, కృష్ణానదుల నుంచి రావాల్సిన వాటాను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని తెలంగాణలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరందించే బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టినట్టు చెప్పారు. రైతుల కండ్లల్లో సంతోషం చూడాలన్న సంకల్పంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సాగునీటిరంగానికి ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో రూ.25వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. అప్పర్ మానేరు, మధ్యమానేరు ప్రాజెక్టుల్లో రెండుసార్లు భూములు కోల్పోయిన కుటుంబాలు తమవని కేటీఆర్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా భూనిర్వాసితుడైనందున రైతులకు న్యాయంగా రావాల్సిన పరిహారాన్ని అందజేస్తూనే, ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

పెరిగిన నీటి నిల్వ సామర్థ్యం
గతంలో ప్రాణహిత- చేవెళ్ల డిజైన్ చేసినపుడు పెద్ద ప్రాజెక్టులు లేవని కేటీఆర్ చెప్పారు. గతంలో 11 టీఎంసీల స్టోరేజీ ఉంటే.. దానిని 141 టీఎంసీలకు పెంచి అదనంగా బరాజ్‌లు, పంపుహౌస్‌ల నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో రైతులకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును కాలంతో పోటీపడుతూ పరుగులు పెట్టిస్తున్న అపర భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద, చారిత్రాత్మకమైన ప్రాజెక్టు కాళేశ్వరమని చెప్తూ.. దీని నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్క ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది నైపుణ్యాన్ని అభినందించారు. చైనాలో, జపాన్‌లో అద్భుతాలు జరుగుతున్నాయని విన్నామని, నేడు స్వయంగా చూస్తే తప్ప ఈ అనుభవాన్ని వర్ణించలేమన్న కేటీఆర్.. ఇంత క్లిష్టతరమైన ప్రాజెక్టును సకాలంలో పూర్తయ్యేలా పనిచేస్తున్నారంటూ ప్రశంసించారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, రైతు సమన్వయ సమితి జిల్లా సంస్థ అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, సెస్‌చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, వైస్‌చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, న్యాలకొండ రాఘవరెడ్డి పాల్గొన్నారు.

గంగాభవానీ, రామప్పను దర్శించుకున్న కేటీఆర్
మాఘ అమావాస్యను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం జాతర ఉత్సవాలకు భక్తజనం పోటెత్తింది. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లోని పలు ఆలయాల్లో ఉత్సవాలు కన్నుల పండువగా సాగాయి. వేలసంఖ్యలో భక్తులు దేవతలకు ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని మానేరు నదిలో ఉన్న గంగాభవానీ, మడేలేశ్వరస్వామి, సిరిసిల్ల శివారులోని రామప్ప ఆలయాలను ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. రామప్ప ఆలయకమిటీ సభ్యులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయనతోపాటు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్స య్య, సెస్‌చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.