Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాలికి బలపం..బుల్లెట్ వేగం.

-అవ్వా బాగున్నవా..? పింఛనొస్తుందా.. రేషన్ బియ్యం నెలనెలా అందుతున్నయా..? -ఖేడ్ ప్రచారంలో మంత్రి హరీశ్ దూకుడు -అభ్యర్థితో కలిసి రోజూ 15 గ్రామాల పర్యటన.. -ఇంటింటికీ వెళుతూ ఆప్యాయ పలకరింపు… -సంక్షేమ పథకాల అమలుపై ఆరా… -దత్తతతో దశమారుస్తానంటూ హామీ.. -కేసీఆర్ సారున్నడు.. మంచి రోజులొచ్చాయని భరోసా -మంగళహారతులతో స్వాగతం పలుకుతున్న ప్రజానీకం -అదే బాటలో ఎంపీ, ఎమ్మెల్యేలు, గులాబీ బలగాలు.. -పల్లెల్లో హోరెత్తుతున్న టీఆర్‌ఎస్ ప్రచారం -కాంగ్రెస్‌వి దింపుడు కళ్లం ఆశలు -తెలంగాణలో పంక్చరైన సైకిల్ -ఓట్లు మీవి.. సంపాదన వాళ్లది -హైరాన్‌ఖేడ్‌ను నారాయణఖేడ్‌గా మారుస్తాం -ఖేడ్ ఉప ఎన్నిక ప్రచారంలోమంత్రి హరీశ్‌రావు

Harish-rao-participated-in-election-campaign-at-hangirga-narayankhed01

-బాపూ నన్ను గుర్తుపట్టినవా..? అంతా కులాసేనా…ఊరు బాగుందా..? ఏవైనా ఇబ్బందులున్నయా..? తాతా నేను హరీశ్‌రావును వచ్చిన..! గుర్తుపట్టినవా..! ఓట్లొచ్చినయి.. ఏ పార్టీకి ఓటేస్తవ్..? మీ కాలంలో మంచిగున్న చెరువులు నాశనమయినయ్..! ఇప్పుడు కేసీఆర్ సారు బాగచేస్తున్నడు తెలుసు కదా..! ఇదీ రాష్ర భారి  నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఖేడ్ నియోజకవర్గంలో చేస్తున్న ఇంటింటి ప్రచారం. ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో గులాబీ బలగాలు ప్రచార వేగం పెంచాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామ గ్రామాన జోరుగా పర్యటిస్తున్నారు. అభ్యర్థితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రతిరోజూ 15గ్రామాలను చుట్టి వస్తూ నేను మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నా… అభివృద్ధి చేసే బాధ్యత నాదంటూ భరోసా ఇస్తున్నారు.

కాంగ్రెస్ నాయకులు కార్చే మొసలి కన్నీరు కావల్నో.. ఇంటింటికీ మంజీరా నీళ్లందించే టీఆర్‌ఎస్ పార్టీని ఎన్నుకుంటారో ప్రజలే తేల్చుకోవాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. గత అరవై ఏళ్లుగా కాంగ్రెస్ నాయకులకు ఓట్లు వేస్తే ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని పెద్ద ఎత్తున ఆస్తులను కూడగట్టుకున్నారే తప్పా.. ఖేడ్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. సినిమా టాకీసులు, ప్రైవేట్ దవాఖానలు, కాలేజీలు, రైస్ మిల్లులు, గుత్తేదారు పనులు, పెట్రోల్ బంకులు ఇలా ఒకటేమిటీ, లెక్కకు మించిన ఆస్తులను మాత్రం సంపాదించుకుని అభివృద్ధిని మరచి ప్రజలను కేసుల్లో ఇరికించి పోలీస్‌స్టేషన్‌లు, కోర్టుల చుట్టూ తింపిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అన్నిరకాలుగా జనాన్ని అణచివేసి నారాయణఖేడ్‌ను హైరాన్‌ఖేడ్‌గా మార్చి వేశారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నారాయణఖేడ్ మండల పరిధిలోని జి.హుక్రానా, అబ్బెంద, నాగాపూర్ తండా, అల్లాపూర్, హంగిర్గ(బి), హంగిర్గ(కె), చాప్టా(కె), చాప్టా(కె) తండా, ఉజలంపాడ్ తదితర గ్రామాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి తరఫున ఉపఎన్నిక ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేటతో పాటు రెండో కన్నుగా భావించి ఖేడ్‌కు అభివృద్ధి పనులను మంజూరు చేయించి ప్రగతిపథం వైపు తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తుంటే, గిట్టని కాంగ్రెసోళ్లు అవాకులు చెవాక్కులు పేలుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. 60 ఏళ్లలో గత ప్రభుత్వాలు ఈ నియోజకవర్గంలో 20 సబ్‌స్టేషన్‌లు నిర్మిస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం 60 రోజుల్లోనే 11 సబ్‌స్టేషన్‌లు కేటాయించిందని, పనులు ప్రగతి పథంలో ఉండగా పొద్దంతా గ్రామాల్లో కరెంటు ఉంటుందని గుర్తు చేశారు. అదే విధంగా తారు రోడ్ల నిర్మాణాలకు కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. రానున్న ఏడాది లోపల అన్ని గ్రామాలలో ఇంటింటికీ మంజీరా నీరును తెచ్చి ప్రతీ ఆడబిడ్డ మంచినీటి గోసను తీర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు మీ బతుకులను ఆగం చేసిన గత పాలకుల పుణ్యమాని ఇక్కడి యువకులు హైదరాబాద్‌లో గప్‌చుప్ బండ్ల కాడ, మేస్త్రీల కాడ పనుల్లో కుదురుకుంటే, గిరిజనులు చెరుకు ఫ్యాక్టరీల్లో ఉపాధి కోసం వలస వెలుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పాలించిన పాలకులేమో పదవులను, సంపాదనలను పంచుకుని బంగ్లాలు కట్టుకున్నారని ఆరోపించారు. మరి మీ జీవితాలు అన్ని విధాలుగా బాగుపడాలంటే సంక్షేమాన్ని చేపడుతున్న టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ది దింపుడు కళ్లం ఆశ .. ఏళ్ల తరబడిగా అణగదొక్కి ప్రజల బాగును పట్టించుకోలేదని, ఇప్పుడు మాత్రం దింపుడు కళ్లం ఆశతో మీ ముందుకు వస్తుందని మంత్రి ఎద్దేవా చేశారు. మాకే ఓట్లేయ్యిండని కాంగ్రెస్ అభ్యర్థి పెట్టే మొసలి కన్నీరుకు కరిగితే మళ్లీ మీ వీపుల మీద వాళ్లు గుద్దుతరనే విషయాన్ని మరచి పోకూడదన్నారు. సాన్పు లు జల్లినట్లు డాంబర్ వేస్తే వానలకు లేసి పోయేంత మంచిగా తారు రోడ్లను వేయించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని విమర్శించారు. పదవుల కోసం కాగితాలు రాసుకున్న చరిత్ర కూడా వారిదేనన్నారు. అన్నినియోజక వరాల్గ మాదిరి అభివృద్ధి ఖేడ్ విషయంలో ఎందుకు జరగలేదనేది ఆలోచించాలని సూచించారు. మనం మారాలే. మన బతుకులు మారాలే. అంటే ప్రజారంజకంగా పాలిస్తున్న టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని మంత్రి కోరారు.

పంక్చరైన సైకిల్.. తెలంగాణలో పంక్చరైన సైకిల్ పార్టీ గురించి మాట్లాడడం అనవసరమని హరీశ్‌రావు తెలిపారు. ఆ పార్టీకి పెద్ద దిక్కైన బాబు ఆంధ్రకు అన్నీ సర్దుకు పోయిండని ఇంకా దాని గురించి చర్చించేదేమీ లేదని చెప్పారు. వరంగల్ నుంచి వచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డిల మాటలు ఇక్కడ ఎవ్వరూ నమ్మరన్నారు. ఇప్పటికీ అభివృద్ధిపై తాము చెప్పిన విధంగా చర్చకు సిద్ధంగానే ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.

అభివృద్ధి బాధ్యత మాది అన్నింటా వెనక బడి ఉన్న ఖేడ్‌ను పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత తనదని, అందుకే ఖేడ్‌ను తాను దత్తత తీసుకున్నానని మంత్రి పునరుద్ఘాటించారు. అరవై రోజుల్లో తాము చేపట్టిన అభివృద్ధి అందరి కళ్లకు కనపడుతుందని ,ఈ ఎన్నికల్లో అఖండ మెజారిటీని అందించి మరో మూడేళ్లలో జగన్నాథ ప్రగతి రథ చక్రాలకు సారథులు మీరే కావాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి తమ విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఖేడ్‌కు ప్రగతి బాటలు : ఎంపీ బీబీ పాటిల్ ఇప్పటి వరకు అంధకారంలో ఉన్న ఖేడ్ నియోజకవర్గం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల చొరవ వల్ల ప్రగతికి బాటలు వేసుకుంటుందని ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. మార్కెట్‌యార్డులు, సబ్‌స్టేషన్లు, రోడ్ల కోసం కోట్లాది నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. అభివృద్ధి కేవలం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. ప్రజా సేవే పరమావధిగా కృషి చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఎంపీ కోరారు.

-కష్ట సుఖాల్లో మీ వెంటే ఉంటాం – జూకల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే తమదే వెనుకబడిన ప్రాంతమని తాము భావించేవారమని పూర్తిగా తమకంటే ఖేడ్ వెనుకబడి ఉందని జూకల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల అలక్ష్యం వల్లే ఈ ప్రాంతం రూపు రేఖలు మారలేదని విమర్శించారు. మంత్రి హరీశ్‌రావు నిద్రాహారాలు మానుకుని ఖేడ్‌ను మరో సిద్దిపేటగా మార్చేందుకు కంకణబద్ధుడై పని చేస్తున్నారని పేర్కొన్నారు. పాలిచ్చే ఆవు లాంటి టీఆర్‌ఎస్‌ను ఆదరించి, కాంగ్రెస్, టీడీపీలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.

-కష్టం కలగకుండా కాపాడుకుంటా – టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి కష్టం కలగకుండా కాపాడుకునే బాధ్యత తనదేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి హామీనిచ్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరగని అభివృద్ధి పనులు ప్రస్తుతం టీఆర్‌ఎస్ పాలనలో కొనసాగుతున్నాయన్నారు. తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసి ఖేడ్ ప్రాంత దాహార్తిని తీర్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. అన్నిరంగాల్లో ఈ ప్రాంతం ముందుకెళ్లాలంటే అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. తనకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, రాష్ట్ర వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షుడు బిడకన్నె హన్మంతు, రాష్ట్ర గీతా పారిశ్రామిక మాజీ చైర్మన్ విగ్రాం రామాగౌడ్, మాజీ ఎంపీపీలు శ్రీనివాస్‌గౌడ్, జీవులా నాయక్, జిల్లా గొర్రెకాపరుల సంఘం అధ్యక్షుడు మల్‌శెట్టి యాదవ్, ఎంపీటీసీ మల్లన్న, జడ్పీటీసీ రవికుమార్, నాయకులు ఉమాకాంత్ పాటిల్, నర్సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, హన్మంతు, విశ్వనాథ్, సర్పంచ్ పార్వతి అనంత్, మారుతీ నాయక్, నాగిశెట్టి, చిరంజీవి, వంశీచంద్‌రెడ్డి, మారుతీ పటేల్, చెన్‌బసప్ప, రవినాయక్, నారాయణరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ ప్రచారానికి బ్రహ్మరథం

ఖేడ్, కంగ్టి మండలాల్లో గురువారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రచారానికి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్‌రెడ్డి తరఫున మంత్రి హరీశ్‌రావు చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఊరూరా మంత్రి, నాయకులకు డప్పుచప్పుళ్లు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. టపాసులు పేల్చుతూ యువకులు సందడి చేయడంతో గ్రామాల్లో విజయోత్స వ సంబురాలను తలపించాయి. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో హాజరై మంత్రి ప్రసంగాలను ఆలకించారు. చేపట్టిన అభివృద్ధిపై మంత్రి వివరిస్తున్నప్పుడు సానుకూలంగా తమ స్పందనను తెలియజేస్తూ యువకులు ఈలలు వేసి జై తెలంగాణ నినాదాలు చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.