Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటం

-వారి త్యాగం, శ్రమతోనే ఈ స్థాయికి పార్టీ
-టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి

టీ కాంగ్రెస్‌, టీ బీజేపీ అధ్యక్షులుగా పదవులు వచ్చాయంటే టీఆర్‌ఎస్‌ పుణ్యమే. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే గుర్తింపు వచ్చింది.. లేకపోతే మిమ్ముల్ని కానినోడు ఎవరూలేరు. సీఎం కేసీఆర్‌పై మాట్లాడేముందు బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.

– టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్

ఉద్యమనేత కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను స్థాపించిన ముహూర్తం చాలా మంచిదని, ముహూర్త బలం, కార్యకర్తల అండతో వందేండ్లయినా చెక్కు చెదరకుండా ఉంటుందని పార్టీవర్కింగ్‌ ప్రెసిడెంట్‌,మంత్రి కేటీఆర్ అన్నారు. కార్యకర్తల త్యాగం, కష్టంతోనే ఈ స్థాయికి చేరుకున్నామని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. కార్యకర్తల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తామని పేర్కొన్నారు. శనివారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు 2020-21 ప్రమాద బీమాకు సంబంధించిన రూ.16.11 కోట్ల చెక్కును వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీకి అందజేశారు. పార్టీ సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే అతడి కుటుంబానికి ఇన్సూరెన్స్‌ కంపెనీ రూ.2 లక్షలు చెల్లిస్తుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యం వేదికగా పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి, మంచి ఉద్దేశం, లక్ష్యంతో ఉద్యమనేతగా కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను స్థాపించారని చెప్పారు. ఆ ముహూర్తం ఎంత బలమైనదంటే 100 ఏండ్లపాటు పార్టీ చెక్కు చెదరకుండా నిలబడుతుందని, అంత గొప్పగా నిర్మాణం సాగుతున్నదని అన్నారు. పురుడుపోసుకున్న జలదృశ్యం నుంచి టీఆర్‌ఎస్‌ను నాటి సీఎం చంద్రబాబునాయుడు కుట్రపూరితంగా, కేసీఆర్‌ హైదరాబాద్‌లోలేని సమయం చూసి రోడ్డున పడేశారని గుర్తుచేశారు. కానీ, ముహూర్త బలం, సంకల్పం గొప్పగా ఉంటే పార్టీ ఎలా ఎదుగుతుందనేది చెప్పడానికి టీఆర్‌ఎస్‌ ఒక నిదర్శమని అన్నారు. లక్షలమంది కార్యకర్తల త్యాగాలు, కష్టం రంగరిస్తేనే ఇంతదాకా వచ్చిందని చెప్పారు. రోడ్డునపడిన పరిస్థితి నుంచి తెలంగాణ నడిబొడ్డున రాచఠీవి స్థాయికి టీఆర్‌ఎస్‌ ఎదిగిందని పేర్కొన్నారు.

కార్యకర్తల కుటుంబాలకు 47 కోట్లు

ప్రమాద బీమా ప్రారంభమైన నాటినుంచి కార్యకర్తల కుటుంబాలకు రూ.47.65కోట్లు చెల్లించామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఇంకా కొత్త కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నామని, దీనిపై సీఎం కేసీఆర్‌ సమాలోచనలు చేస్తున్నారని చెప్పారు. కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని చెప్పడానికి గర్వపడుతున్నానని, తెలంగాణ బిడ్డగా సంబురపడుతున్నానని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ చెప్పినట్టుగా టీఆర్‌ఎస్‌ అన్నిపార్టీల్లాగా కాదని.. ఉద్యమపార్టీగా అవతరించి, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, అవమానాలు, కుట్రలను భరించి ఎదిగిందని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రజలకు, రాష్ట్రప్రయోజనాలకు సంబంధించి స్వీయ రాజకీయ అస్తిత్వతమే శ్రీరామరక్ష అని చెప్పారు. ఇతర పార్టీలకు 29 రాష్ర్టాలు, 100 ఎజెండాలు ఉండొచ్చు కానీ, టీఆర్‌ఎస్‌కు మాత్రం ఒకటే రాష్ట్రం, ఒకటే ఎజెండా, ఒకటే లక్ష్యమని తెలిపారు. తెలంగాణ బాగోగులు, సర్వతోముఖాభివృద్ధి సాధించడమే ఏకైక లక్ష్యమని చెప్పారు. కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాగా ఉండాలని సూచించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలకు రక్షణ కవచం, శ్రీరామరక్ష టీఆర్‌ఎస్‌ పార్టీయేనని అన్నారు. దేశంలో ఏ పార్టీకీ లేనంత పటిష్టమైన యంత్రాంగం టీఆర్‌ఎస్‌కు ఉన్నదని, జాతీయపార్టీలతో పోటీ పడుతూ అజేయశక్తిగా ఎదిగిందని చెప్పారు. విమర్శకులుసైతం టీఆర్‌ఎస్‌ను అజేయమైనశక్తిగా ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు అని అనేక సందర్భాల్లో రుజువైందని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే కాదు.. తిరుగులేని రాజకీయ శక్తి అనేస్థాయికి చేరుకున్నామన్నారు. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు 90% పూర్తయ్యాయని కేటీఆర్‌ చెప్పారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు సుశిక్షితులైన సైనికులుగా శిక్షణ ఇస్తామని, ఈ ఏడాదే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినా.. కరోనా సంక్షోభంతో తాత్కాలికంగా వాయిదావేసుకున్నామని తెలిపారు. కరోనా సంక్షోభంలో ప్రజలను ఆదుకోవాలని, అండగా నిలబడాలని కార్యకర్తలకు విజ్ఞప్తిచేశారు. తన పుట్టినరోజు సందర్భంగా వ్యక్తిగతంగా ఆరు అంబులెన్స్‌లు ఇద్దామనుకుంటున్నానని చెప్పగానే ఇతర నాయకులు తక్షణమే స్పందించి దాదాపు 100 అంబులెన్స్‌లు ఇవ్వడానికి ముందుకొచ్చారని.. ఇది పార్టీ కమిట్‌మెంట్‌ అని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్నారంటూ వారిని కేటీఆర్‌ అభినందించారు.

మీ పదవులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల పుణ్యమే

టీ కాంగ్రెస్‌, టీ బీజేపీ అధ్యక్షులుగా పదవులు వచ్చాయంటే టీఆర్‌ఎస్‌ పుణ్యమేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే గుర్తింపు వచ్చిందని, లేకపోతే మి మ్ముల్ని కానినోడు ఎవరూలేరని ఎద్దేవాచేశారు. కేసీఆర్‌పై మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు హితవు పలికారు. కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌, రైతు బంధుసమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మండలి చీఫ్‌ విప్‌ బీ వెంకటేశ్వ ర్లు, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, గువ్వల బాలరాజు, ఎంపీ పీ రాములు, ఎమ్మెల్సీలు శ్రీ నివాస్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్‌, నారదాసు లక్ష్మణ్‌రావు, ఫరీదుద్దీన్‌, పార్టీ బీమా విభాగం ఇంచార్జి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీని పట్టించుకోవద్దు

-కాంగ్రెస్‌ విమర్శల్ని తిప్పికొట్టండి -పార్టీ కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలి -టీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపు

బీజేపీ నేతల ఆరోపణలను, విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులతో చెప్పినట్టు తెలిసింది. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ ఒక్కటే ప్రత్యర్థి అని, ఆ పార్టీ చేసే విమర్శలను అన్నిస్థాయిల్లో తిప్పికొట్టాలని పిలుపునిచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్‌ నేతల ఆరోపణలను జిల్లా స్థాయిలోనే సమర్థంగా తిప్పికొట్టాలని సూచించినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. శనివారం తెలంగాణభవన్‌లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పలు పురపాలక సంస్థల పాలకవర్గాల సమయం ముగుస్తున్నందున, వాటిపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో వాయిదాపడిన పార్టీ కమిటీల ఎన్నికలను వెంటనే పూర్తిచేయాలని నిర్ణయించారు. దీనికి ఆయా జిల్లాల ఇంచార్జి ప్రధాన కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలని కేటీఆర్‌ సూచించారు. నాలుగైదు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తయిందని, వాటిన్నింటినీ సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని వివరించారు. కొన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను మోడల్‌గా తీర్చిదిద్దారని, వాటిని మిగిలిన జిల్లాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటివరకు 103 అంబులెన్స్‌లు ఇవ్వడానికి దాతలు ముందుకొచ్చారని, ఇంకా ఎవరైనా ఉంటేవారిని ప్రోత్సహించాలని సూచించినట్టు సమాచారం. రైతు వేదికల నిర్మాణానికి ముందుకొచ్చే దాతలను కూడా ప్రోత్సహించాలని కేటీఆర్‌ సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.